ఆక్సిజన్ బదులు నైట్రస్ ఆక్సైడ్ ఎక్కించి..
ఇండోర్: మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆస్పత్రి నిర్లక్ష్య నిర్వాకంతో ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆక్సిజన్కు బదులు అతడికి నైట్రస్ ఆక్సైడ్ ఎక్కించడంతో ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. ఇండోర్లోని మహారాజా యశ్వంత్రావ్ ఆస్పత్రిలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. దీంతో ఆపరేషన్ థియేటర్ను మూసివేసిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదుచేశారు. ఈ శుక్రవారం ఆయూష్ (8), రజ్ వీర్ (18 నెలలు) అనే చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. ఒకరు అనస్తీషియా పేషెంట్ కాగా, ఆయూష్ శ్వాస సంబంధమైన రోగి.
అయితే, ఆపరేషన్థియేటర్లో అప్పటికే ఉన్న ఆక్సిజన్, నైట్రస్ ఆక్సైడ్ సిలిండర్లలో పొరపాటున అనస్తీషియాకు ఉపయోగించే నైట్రస్ ఆక్సైడ్ను ఆయుష్కు పెట్టారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే, వైద్యులు మాత్రం రెండు సిలిండర్లను గుర్తించేలా వేర్వేరు పైపులు వాటికి అమర్చామని అయితే, ఈ పొరపాటుకు కారణం వాటికి పైపులు బిగించే కాంట్రక్టరు అయి ఉండొచ్చని చెప్పడంతో అతడి అరెస్టుకు దారి తీసింది. కాగా, ఆ కాంట్రాక్టరు మాత్రం ఈ విషయంలో తనను బలిపశువును చేశారని, పైపులు బిగించడమే తన విధి తప్ప దేనికి ఎలాంటి పైపును ఉపయోగించుకుంటారో అనే విషయం ఆస్పత్రిదే బాధ్యత అని వాపోయాడు.