
అర్ధరాత్రి పన్నెండు కావస్తోంది. మాలతి ఆందోళనగా కూతురు కోసం ఎదురు చూస్తోంది. రోజూ రాత్రి పది గంటలకల్లా ఇంటికి చేరుకునే పరిమళ ఈ రోజు అర్ధరాత్రి అవుతున్నా ఇంటికి రాలేదు. ఆమె నంబరుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ అనే వినిపిస్తోంది. మాలతికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. మాలతి ఇల్లు నగరం పొలిమేరల్లోని బృందావన్ కాలనీలో ఉంది. పరిమళ నగరం నడిబొడ్డున ఉన్న ఒక బట్టల షాపులో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. రోజూ ఉదయం ఎనిమిది గంటలకే లంచ్‌బాక్స్ తీసుకుని ఇంట్లోంచి బయలుదేరి పక్కనే ఉన్న హైవేలో షేరింగ్ ఆటో ఎక్కుతుంది. పదిహేను నిమిషాల తర్వాత మెట్రో స్టేషన్ వద్ద ఆటో దిగి మెట్రోరైలు ఎక్కుతుంది. ఇరవై నిమిషాల తర్వాత గాంధీనగర్ వద్ద మెట్రో దిగి పది నిమిషాలు నడిచి తను పనిచేసే బట్టల దుకాణానికి చేరుకుంటుంది.
ఈ ఉద్యోగం మానేసి చీకటి పడేలోగా ఇంటికి చేరుకునే మరేదైనా ఉద్యోగం చూసుకోమని మాలతి చాలాసార్లు కూతురికి చెప్పింది. కాని బట్టలషాపు వారు ఇచ్చే జీతం ఆకర్షణీయంగా ఉండటంతో ఆమె ఆ ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఇరవైరెండేళ్ల పరిమళ చూడటానికి హీరోయిన్‌లా అందంగా ఉంటుంది. అందమైన సేల్స్‌గర్ల్ ఉంటే గిరాకీ పెరుగుతుందనే ఆశతోనే ఆ బట్టలషాపు వారు పరిమళకు మంచి జీతం ఇస్తున్నారు. పరిమళ కూడా ఆ జీతానికి ఆశపడి రాకపోకలకు కష్టమవుతున్నా ఆ ఉద్యోగాన్ని వదులుకోలేక పోయింది. మాలతికి పరిమళ ఏకైక సంతానం. ఐదేళ్ల కిందట మాలతి భర్త హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. మాలతి ఇంట్లోనే బట్టలు కుడుతూ, ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ కష్టపడి కూతురిని డిగ్రీ వరకు చదివించింది. అవసరార్థం కొన్ని అప్పులు చేసింది. ఇప్పుడు పరిమళ ఉద్యోగం చేస్తూ ఆ అప్పులు తీరుస్తోంది.
హఠాత్తుగా టేబుల్‌పై పెట్టిన సెల్‌ఫోన్ మోగడంతో మాలతి ఉలిక్కిపడి ఫోన్ అందుకుంది. స్క్రీన్‌పై ఏదో కొత్త నంబరు కనిపించడంతో కంగారుగా ఫోన్ ఆన్‌చేసి ‘హలో’ అంది. అవతలి వైపు పరిమళ భోరున ఏడవటం వినిపించింది. భయంతో మాలతి గుండె ఆగినంత పనైంది. ‘‘ఏమైందమ్మా? ఎందుకేడుస్తున్నావ్?’’ కంగారుగా అడిగింది. ‘‘మమ్మీ! నేను ప్రమాదంలో చిక్కుకున్నాను. నేను ఆటోలో వస్తుంటే దారిలో ఆటో డ్రైవర్ సడన్‌గా ఆటో ఆపి నా మొహమ్మీద ఏదో మత్తుమందు స్ప్రే చేశాడు. నాకు వెంటనే స్పృహతప్పింది. స్పృహ వచ్చాక చూస్తే నేనొక చీకటి గదిలో ఉన్నాను. నన్ను తాళ్లతో కుర్చీకి కట్టేసి నోటికి గుడ్డ చుట్టారు. నా సెల్‌ఫోన్ ఉన్న హ్యాండ్‌బ్యాగ్ కూడా కనబడలేదు. గది బయట ఆ ఆటోడ్రైవర్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడటం వినిపించింది.
వాడి మాటలను బట్టి వాడు ఆడపిల్లలను కిడ్నాప్ చేసి ఎవరికో అమ్ముతాడని అర్థమైంది. వాడితో ఫోన్‌లో మాట్లాడినవారు వాణ్ణి తమ దగ్గరకు పిలిచారు కాబోలు. వాడు ఇప్పుడే వస్తున్నాను అంటూ ఇంకేదో మాట్లాడుతుండగా సడన్‌గా బ్యాటరీ డౌన్ కావడంతో ఫోన్ స్విచాఫ్ అయింది. వాడు ఫోన్‌ని కిటికీలో పెట్టి గది బయటి నుంచి తాళం వేసి హడావుడిగా ఆటో స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. నేను నాకు కట్టిన తాళ్లు విప్పుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు కుడిచేతికి కట్టిన తాడు కొద్దిగా వదులైంది. నేను తలకాయ వంచి ఎలాగోలా నోటికి కట్టిన గుడ్డను కొద్దిగా పక్కకు జరపగలిగాను. తర్వాత కుర్చీతో సహా నేలపై కొద్ది కొద్దిగా జరుగుతూ కిటికీ దగ్గరకు చేరుకున్నాను. బయట చీకటిగా ఉంది. సాయం కోసం ఎన్ని కేకలేసినా ఎవరూ రాలేదు. అప్పుడే ఆటోవాడు కిటికీలో పెట్టి మర్చిపోయిన సెల్‌ఫోన్ కనిపించింది. కుడిచేత్తో ఎలాగోలా దాన్ని అందుకుని ఆన్‌చేసి నీతో మాట్లాడుతున్నాను. నువ్వు వెంటనే పోలీసులను పిలుచుకొచ్చి నన్ను విడిపించు’’ అంది.
‘‘నువ్వు ఎక్కడున్నావో చెప్పు. ఇప్పుడే పోలీసులను పిలుచుకొస్తాను’’ ఆత్రంగా అంది మాలతి.
‘‘నేనెక్కడున్నానో నాకే తెలీదు మమ్మీ. పోలీసులకు ఈ ఫోన్ నంబరిస్తే వాళ్లు లొకేషన్ తెలుసుకుని ఇక్కడికొస్తారు. నువ్వు వెంటనే..’’ పరిమళ మాటలు ముగియకుండానే బ్యాటరీ డౌన్ కావడంతో ఫోన్ స్విచాఫ్ అయిపోయింది.
మాలతి ‘‘హలో.. హలో..’’ అంటూ ఫోన్ పట్టుకుని పిచ్చిదానిలా అరవసాగింది. ఆమె అరుపులు విని పక్కింటి సుబ్బారావు పరుగెత్తుకొచ్చాడు. ‘‘ఏమైంది మాలతిగారు?’ అని అడిగాడు.
మాలతి ఏడుస్తూ జరిగినదంతా చెప్పింది. ఆయన వెంటనే మాలతిని తన బైకుపై పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లాడు. నైట్ డ్యూటీలో ఉన్న ఎస్సై విజయ్‌కుమార్ మాలతి చెప్పినదంతా విన్నాడు. వెంటనే టెక్నికల్ ఎక్స్‌పర్ట్ ద్వారా మాలతికి వచ్చిన ఫోన్ నంబర్ లొకేషన్ ట్రేస్ చేయడానికి ప్రయత్నించాడు. సాంకేతిక సమస్య వల్ల లొకేషన్ తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిసింది.
‘‘ఆలస్యమైతే ప్రమాదం. మీ అమ్మాయి తనను బంధించిన ప్రాంతం గురించి చూచాయగా కూడా చెప్పలేదా?’’ మాలతిని అడిగాడు విజయ్.
‘‘ఒక నిర్జన ప్రాంతంలో చీకటి గదిలో ఉన్నానని మాత్రమే చెప్పింది’’ అంటున్న మాలతి ఉన్నట్టుండి ఏదో గుర్తువచ్చి ‘‘నా ఫోన్‌లో అన్ని కాల్స్ రికార్డవుతాయి. పరిమళ కాల్ కూడా రికార్డయి ఉంటుంది’’ అని చెప్పి‘‘మీరు కూడా వినొచ్చు’’ అంటూ తన ఫోన్‌లోని పరిమళ కాల్ రికార్డింగ్‌ను వినిపించింది. విజయ్ దాన్ని సావధానంగా విన్నాడు. రెండోసారి కూడా విన్నాడు.
అతని భృకుటి ముడిపడింది. ‘‘మీ అమ్మాయి క్లూ ఇవ్వకపోయినా ఈ ఫోన్ మాకు క్లూ ఇచ్చింది. ఒకటి కాదు, రెండు క్లూస్! మీ అమ్మాయి ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు లీలగా ఒక శబ్దం వినిపించింది. అది ట్రైన్ వెళుతున్న శబ్దం. అంటే మీ అమ్మాయి ఉన్న చోటుకు దగ్గర్లో రైల్వే ట్రాక్ ఉందని తెలుస్తోంది. తర్వాత ఎక్కడో గంటలు మోగుతున్న చప్పుడు కూడా వినిపించింది. నేను లెక్కపెట్టాను. సరిగ్గా పన్నెండుసార్లు గంటలు మోగాయి. అప్పుడు సమయం కూడా సరిగ్గా పన్నెండు గంటలు. మామూలుగా ఇలాంటి గంటలు చర్చిల్లో మోగుతాయి. అంటే మీ అమ్మాయి ఉన్న ప్రాంతంలో ఒక చర్చి కూడా ఉందని తెలుస్తోంది’’ విజయ్ మాటలు విని కానిస్టేబుల్ కిరణ్ ఆత్రంగా లేచి నిల్చున్నాడు.
‘‘సార్! ఈ ప్రాంతం ఎక్కడుందో నాకు తెలుసు. హైవేలోంచి కుడిపక్క ఫర్లాంగు దూరం లోపలికి వెళితే ఒక క్రైస్తవుల శ్మశానం వస్తుంది. దాని పక్కన ఒక చర్చి ఉంది. ఇంకాస్త దూరంలో రైల్వే ట్రాక్ కూడా ఉంది’’ అన్నాడు కిరణ్ ఉత్సాహంగా. ‘‘వెరీగుడ్! మనం వెంటనే అక్కడికెళ్లాలి’’ అంటూ విజయ్ లేచి నిల్చున్నాడు. మాలతి, సుబ్బారావులను అక్కడే ఉండమని చెప్పి కిరణ్‌తో కలసి మోటార్‌బైకుపై హైవే వైపు దూసుకెళ్లాడు. ఆగమేఘాల మీద శ్మశానం దగ్గరకు చేరుకున్నాడు. చర్చి దాటి ముందుకెళ్లాక పాడుబడిన ఎన్నో బిల్డింగులు కనిపించాయి. పరమిళను ఏ బిల్డింగులో బంధించారో కనుక్కోవడం కష్టమనిపించింది. అంతలో హైవే వైపు నుంచి ఒక ఆటో వస్తున్న శబ్దం వినిపించింది. విజయ్ వెంటనే బైకును ఒక గోడచాటున నిలబెట్టి, కిరణ్‌తో కలసి చీకట్లో నక్కి ఆటో కోసం ఎదురు చూడసాగాడు. కాసేపట్లో ఆటో అక్కడికొచ్చింది. ఒక పెద్ద బిల్డింగ్ ముందు గేటులోంచి లోపలకు వెళ్లింది. విజయ్, కిరణ్‌లు చప్పుడు కాకుండా నడుస్తూ ఆటోని అనుసరించారు. లోపల ఖాళీ స్థలంలో వరుసగా కొన్ని గదులు ఉన్నాయి. తాళం వేసి ఉన్న ఒక గది ముందు ఆటో ఆగింది. డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కిందకు దిగారు. అందరూ తాగి వచ్చారని వారి మాటల బట్టి తెలుస్తోంది.
‘‘ఈసారి నేను పట్టుకొచ్చిన పిల్ల హీరోయిన్‌లా ఉంది. బ్లూఫిల్మ్ తీసి బెదిరిస్తే చాలు, మనం కోరినప్పుడల్లా వచ్చి మన కోరిక తీరుస్తుంది’’ హుషారుగా అన్నాడు ఆటో డ్రైవర్. అతను జేబులోంచి తాళంచెవి తీసి గది తాళం తెరవగానే విజయ్ హఠాత్తుగా వారిపై టార్చి వెలిగించి ‘‘ఖబడ్దార్! కదిలితే కాల్చేస్తాం. మిమ్మల్ని పోలీసులు చుట్టుముట్టారు. మర్యాదగా లొంగిపోండి’’ అని హెచ్చరిస్తూ రివాల్వర్ తీసి గాల్లోకి పేల్చాడు. నలుగురూ అదిరిపడ్డారు. డ్రైవర్ హఠాత్తుగా పారిపోవాలని ప్రయత్నించాడు. విజయ్ వెంటనే రివాల్వర్ పేల్చాడు. తూటా కాలికి తగలడంతో డ్రైవర్ విరుచుకుపడ్డాడు. అది చూసి మిగతా ముగ్గురూ ప్రాణభయంతో చేతులు పైకెత్తారు. కానిస్టేబుల్ కిరణ్ వెంటనే వారికి బేడీలు వేశాడు.
‘‘మీ మేలు జన్మలో మర్చిపోలేం సార్! మా అమ్మాయి బతుకు బజారుపాలు కాకుండా కాపాడారు’’ పరిమళను క్షేమంగా అప్పగించిన విజయ్‌కు చేతులు జోడిస్తూ అంది మాలతి.
‘‘మా డ్యూటీ మేం చేశాం. మీ అమ్మాయి చేసిన కాల్ మీరు రికార్డు చెయ్యడం వల్లనే ఇదంతా సాధ్యమైంది’’ అంటూ విజయ్ అంతలోనే ఏదో గుర్తొచ్చి ‘‘నువ్వు స్విచాఫ్ అయిన ఫోన్‌లో ఎలా మాట్లాడగలిగావమ్మా?’’ అని పరిమళను అడిగాడు.
‘‘ప్రతి సెల్‌ఫోన్ బ్యాటరీలోనూ కొంత రిజర్వ్ బ్యాటరీ ఉంటుందని నాకు తెలుసు సార్. స్టార్ త్రీత్రీ సెవెన్ జీరో హ్యాష్ కొడితే బ్యాటరీ కొద్దిగా చార్జ్ అవుతుంది. అప్పుడు కొద్ది నిమిషాలు ఫోన్‌లో మాట్లాడవచ్చు. నేను అలాగే చేసి అమ్మతో ఫోన్‌లో మాట్లాడాను’’ చెప్పింది పరిమళ.
‘‘చాలా మంచిపని చేశావు. అయితే ముందుగా మా హెల్ప్‌లైన్‌కి ఫోన్‌చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఏదేమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఆడపిల్ల ధైర్యం కోల్పోకుండా అందుబాటులో ఉన్న ఏదో ఒక సాధనాన్ని వాడుకుని పోలీసుల సాయం పొందే ప్రయత్నం చెయ్యాలి. చిన్న క్లూ దొరికినా చాలు.. మేం మిమ్మల్ని కాపాడతాం’’ అన్నాడు ఎస్సై విజయ్.
Comments
Please login to add a commentAdd a comment