
ఐదంతస్తుల దియా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ అది. సెకండ్ ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్ లో రాత్రి దొంగలు పడి నగలు, నగదు, వెండిసామాను, పట్టుచీరలు వగైరాలు ఎత్తుకుపోయారు. ఆ ఫ్లాట్ లో నివసించే కుటుంబం గత సాయంత్రం ఓ ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్ళి, తెల్లవారు జామున తిరిగివచ్చేసరికి ఆ దొంగతనం జరిగింది.
యథావిధిగా పోలీసులు రంగప్రవేశం చేశారు. వారితోపాటే పోలీసుకుక్క కూడా. ఫోరెన్సిక్ నిపుణులు వేలిముద్రల కోసం వెదుకుతూంటే పోలీసుకుక్క ఇల్లంతా వాసనచూస్తూ మెట్ల మీదుగా సెల్లార్‌కి దారి తీసింది. అక్కడంతా తిరిగి వెనుక పక్కనున్న ప్రహరీగోడ దగ్గర ఆగిపోయింది. దొంగలు ఆ గోడ దూకి పారిపోయి ఉంటారని గ్రహించారు పోలీసులు. గోడబైటకు వెళ్ళారు. నేలపైన బూట్ల జాడలు, త్రిచక్ర వాహనపు టైర్ల జాడలూ అస్పష్టంగా గోచరించాయి.
కాంప్లెక్స్ వాచ్ మేన్ కథనం ప్రకారం– రాత్రి తొమ్మిది గంటలకు ఫ్లోర్స్ అన్నీ తిరిగి వచ్చాడు అతను రోజూలాగే. తరువాత కొంతసేపటికి సెకండ్ ఫ్లోర్‌లో ఎవరో ఆర్డర్ చేశారంటూ పిజ్జా బాయ్ వచ్చాడు. మరో పావుగంటకు థర్డ్ ఫ్లోర్ కంటూ మరో ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాడు. ఇద్దరూ యూనిఫామ్స్‌లో ఉన్నారు. అక్కడది సామాన్యమే కావడంతో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తరువాత తను వాష్‌రూమ్‌కి వెళ్ళాననీ, డెలివరీ బాయ్స్ తిరిగివెళ్ళడం చూడలేదనీ చెప్పాడు. అయితే ఆ రాత్రి సెకండ్, థర్డ్ ఫ్లోర్స్‌లోని వాళ్ళెవరూ పిజ్జాకానీ, ఫుడ్ కానీ ఆర్డర్ చేయలేదని విచారణలో తేలింది. డెలివరీ బాయ్స్ రూపంలో వచ్చింది దొంగలేనని తేల్చారు పోలీసులు.
నెలరోజులుగా నగరంలోని కాంప్లెక్స్‌లలో పదిహేను చోరీలు జరిగాయి. దొంగల టార్గెట్ – తాళం వేసున్న ఫ్లాట్స్. పోలీసుల నైట్ పెట్రోల్ ముమ్మరమయింది. అయినా పరిస్థితి మెరుగుకాలేదు. ఒక్క కేసులోనూ ‘బ్రేక్ త్రూ’ లేకపోవడంతో పోలీసులు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. ఇటు ప్రజల నుంచి, అటు ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో పోలీస్ కమీషనర్ ఆ కేసులను క్రై మ్‌బ్రాంచ్ కి అప్పగించాడు.
దియా కాంప్లెక్స్‌లో దొంగతనం జరిగిన రెండోరోజున పోలీస్ స్టేషన్ కి వచ్చాడు నలభయ్యేళ్ళ అంబయ్య. అక్కడికి నాలుగు వీధులవతలనున్న సృజనా కాంప్లెక్స్‌లో వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు.
సెంట్రీ దగ్గరకు వెళ్ళి, ‘‘సార్! రెండురోజుల క్రితం దియా కాంప్లెక్స్‌లో జరిగిన దొంగతనం నేనే చేశాను’’ అన్నాడు. సెంట్రీ వాడివంక ఎగాదిగా చూసాడు. దొంగ తనంతట తానుగా వచ్చి కన్ఫెస్ చేయడం వింతే మరి!
అదే సమయంలో లోపలి నుంచి బైటకు వచ్చిన ఏఎస్సై విషయం ఆలకించి, ‘‘వీణ్ణి లాకప్‌లో పడెయ్. నేను తిరిగొచ్చాక చూద్దాం’’ అన్నాడు బైక్ దగ్గరకు నడుస్తూ. ఏదో కేసు విషయంలో ఎంక్వైరీకి బయలుదేరాడు అతను.
సెంట్రీ అంబయ్యను లాకప్‌లోకి తోసి తలుపు మూస్తూంటే, ‘‘మరి మందు ఎప్పుడు పోయిస్తారు నాకు?’’ అనడిగాడు అంబయ్య. వాడి చెంపమీద ఒకటి ఇచ్చుకున్నాడు సెంట్రీ.
మొగుణ్ణి లాకప్‌లో పెట్టారని ఆలకించి పరుగెత్తుకొచ్చింది అంబయ్య పెళ్ళాం గౌరమ్మ.
‘‘నామొగుడు తాగుబోతే కానీ దొంగనాయాల కాదు సారూ! మందు పడకపోతే బుర్ర గీరెక్కిపోద్ది ఈడికి. రెండురోజులుగా మందుకు డబ్బుల్లేక ఒడ్డునపడ్డ చేపపిల్లలా గిలగిలా కొట్టుకుంటూ తిక్కతిక్కగా ప్రవర్తిస్తున్నాడు’’ అంటూ మొత్తుకుంది.
మొగుడు పనిచేస్తున్న కాంప్లెక్స్‌లోని ఇళ్ళలో పనిచేస్తుందామె. తన జీతమంతా తాగుడుకు పోసేసి, మందుకు డబ్బులు ఇవ్వమంటూ పెళ్ళాన్ని వేధిస్తుంటాడు అంబయ్య. గౌరమ్మ డబ్బులివ్వకపోవడంతో రెండురోజులుగా మందు బంద్ అయిపోయింది వాడికి.
‘‘మొన్నామధ్య పోలీసోళ్ళు స్టేషన్‌కి తీసుకెళ్ళి మందు పోయించి పంపారని మస్తాన్ చెప్పాడు. అందుకే’’ అన్నాడు అంబయ్య.
రెండువారాల క్రితం తన సెల్ ఫోన్ పోయిందని కస్టమర్ ఒకడు కంప్లెయింట్ ఇవ్వడంతో అనుమానం మీద మటన్ కొట్లో పనిచేసే మస్తాన్‌ను తీసుకొచ్చి ఒళ్ళంతా కుళ్ళబొడిచారు పోలీసులు. చివరికి అతను నిర్దోషి అని తేలడంతో ఒళ్ళునొప్పులు తగ్గడానికి ఫూటుగా మందు కొట్టించి ఇంటికి పంపేసారు. అదీ కథ!
గౌరమ్మతోపాటు వచ్చిన సృజనా కాంప్లెక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలీసులతో మాట్లాడి అంబయ్యను విడిపించాడు.
‘‘ఇంకోసారి ఇలా స్టేషన్‌కి వచ్చి పోలీసులతో ఆడుకున్నావంటే ఎన్‌కౌంటర్ చేసిపడేస్తాం, జాగ్రత్త!’’ అంటూ స్టేషన్ రైటర్ వార్నింగ్ ఇచ్చాడు.
‘‘ఎన్ కౌంటర్ చేశాక మందు పోయిస్తారా సార్?’’ అనడిగాడు అంబయ్య ఆశగా.
గౌరమ్మకు ఒళ్ళు మండిపోయింది. ‘‘నీకు శ్రాద్ధం పెడతారు! పద, తాగుబోతు సచ్చినోడా!’’ అంటూ రెండు తగిలించి మొగుణ్ణి బైటకు తోసుకుపోయింది.
బాబీకి పదేళ్ళుంటాయి. అయిదవ తరగతి చదువుతున్నాడు. సజనా కాంప్లెక్స్ లో ఉంటాడు.
రాత్రి భోజనాల దగ్గర స్కూలు విశేషాలు, స్నేహితుల కబుర్లూ చెబుతూ గలగల మాట్లాడే బాబీ ఆ రోజు మౌనంగా ఉండడం చిత్రంగా అనిపించింది వాడి తల్లిదండ్రులకు.
‘‘ఏరా బాబీ, ఈరోజు విశేషాలేవీ లేవా?’’ నవ్వుతూ అడిగాడు తండ్రి భాస్కర్రావు.
బాబీ బదులు ఇవ్వలేదు. ఏదో కారణం ఉన్నదని గ్రహించిన శకుంతల, ‘‘ఏరా కన్నా! ఇవాళ అదోలా ఉన్నావెందుకు?’’ అనడిగింది కొడుకును.
‘‘మమ్మీ! రాత్రి నా ఫ్రెండ్ సతీష్ ఇంట్లో దొంగలు పడ్డారట. బంధువుల ఇంట్లో బర్త్ డే పార్టీకి వెళ్ళొచ్చేలోపున అన్నీ ఎత్తుకుపోయారట’’ చెప్పాడు బాబీ విచారంగా.
‘‘ఈ మధ్య సిటీలో దొంగలబెడద ఎక్కువయిపోయింది. బైటకు వెళ్ళేప్పుడు కాస్త చూసుకోమని పక్కింటివాళ్ళకు చెప్పుండాల్సింది’’ అంది శకుంతల.
‘‘పోలీసులు దొంగల్ని పట్టుకోలేరా, డాడీ?’’ అడిగాడు బాబీ.
‘‘ఎందుకు పట్టుకోరూ? కాకపోతే కొంత టైమ్ పడుతుందంతే’’ అన్నాడు భాస్కర్రావు.
‘‘మనింట్లో కూడా దొంగలు పడతారా, డాడీ?’’ కొడుకు హఠాత్తుగా అడగడంతో చిన్నగా ఉలిక్కిపడ్డాడు అతను. ‘‘ఛ ఛ... మనింట్లో ఎందుకు పడతారు? మనం ఇల్లు వదలి ఎక్కడికీ వెళ్ళం కదా! తాళం వేసిన ఇళ్ళనే దోచుకుంటారు దొంగలు’’ అన్నాడు.
అయితే తన ఆలోచన ఎంత తప్పో తెలుసుకునే పరిస్థితి త్వరలోనే ఎదురవబోతోందన్న సంగతి ఎరుగడు అతను!
తెల్లవారు జామున మూడు గంటలకు డోర్ బెల్ మోగడంతో, ఎవరు వచ్చారా అనుకుంటూ, నిద్రకళ్ళ తోనే వెళ్ళి తలుపు తెరిచాడు భాస్కర్రావు. ముఖాలకు ముసుగులు, చేతులకు గ్లవ్సూ ఉన్న ఆగంతకులు ఇద్దరు లోపలకు చొరబడ్డారు. వారి చేతుల్లో కత్తులు ఉన్నాయి.
నిద్రపోతూన్న శకుంతలను, బాబీనీ కూడా లేపి, ముగ్గురినీ కుర్చీలకు కట్టేసి. నోళ్ళలో గుడ్డలు కుక్కేసారు వాళ్ళు. కత్తులతో బెదిరించి బీరువా, లాకర్ల తాళపుచెవులను తీసుకుని నగలు, డబ్బు, వెండిసామానూ దోచుకుపోయారు. ఆ ఆపరేషన్ అంతా పావుగంటలో పూర్తయిపోయింది. పోతూ పోతూ వీధి తలుపులు బయట గెడపెట్టేసారు.
ఉదయం ఆరుగంటలకు పాలప్యాకెట్స్ తెచ్చే కుర్రాడు వచ్చినప్పుడు కానీ, ఆ దొంగతనం బైటపడలేదు. ఆ కుర్రాడి కేకలకు ఇరుగుపొరుగులు పరుగెత్తుకు రావడం, ఆ కుటుంబసభ్యులను బంధవిముక్తులను చేయడం, పోలీసులకు ఫోన్ చేయడం జరిగాయి.
అరగంట తరువాత క్రై మ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శివరామ్ సిబ్బందితో వచ్చాడు. యథావిధిగా దర్యాప్తు తతంగం ఆరంభమయింది. దంపతులను ఏవేవో ప్రశ్నలు వేశాడు ఇన్‌స్పెక్టర్. చివరగా, ‘‘దొంగలను మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలరా?’’ అనడిగాడు. వారి ముఖాలకు ముసుగులు ఉన్నందున సాధ్యంకాదని చెప్పారు వాళ్ళు. వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనాసరే గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించమనీ, రెండురోజుల్లో ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటుచేస్తాననీ చెప్పాడు ఇన్‌స్పెక్టర్ గుమ్మంవైపు నడుస్తూ.
‘‘అంకుల్! ఆగండి’’ అని అరిచాడు బాబీ హఠాత్తుగా.
బాబీ క్లోజ్ ఫ్రెండ్ రాజు ఇల్లు సృజనా కాంప్లెక్స్‌కి పక్కవీధిలోనే ఉంది. ఇద్దరూ ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళి ఆడుకుంటుంటారు. ఒక్కోసారి రాజు బాబాయి జార్జ్ వారితో చేరతాడు. జార్జ్ బ్యాచిలర్. ఉద్యోగం చేస్తున్నాడు.
రాబోయే ఈస్టర్ పండుగకు బాబీకి ‘ఈస్టర్ ఎగ్’ గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పాడు రాజు. ఈస్టర్ ఎగ్ ఎలా ఉంటుందని అడిగాడు బాబీ కుతూహలంతో. అది ‘సర్‌ప్రైజ్’ అన్నాడు రాజు. జార్జ్ ని అడిగాడు బాబీ.
‘ఈస్టర్’ పండుగకు క్రై స్తవ సోదరులు కోడిగ్రుడ్డును రంగులతో డెకొరేట్ చేసి బంధుమిత్రులకు బహూకరించడం కద్దు. దాన్నే ‘ఈస్టర్ ఎగ్’ అనీ వ్యవహరిస్తారు.
జార్జ్ ఆ సంగతులు చెప్పబోతే, రాజు చెప్పొద్దని సైగచేసాడు బాబాయికి.
అది గమనించిన బాబీ, ‘‘ప్లీజ్, అంకుల్! చెప్పండి’’ అన్నాడు.
‘‘నీ ఫ్రెండ్ నిన్ను సర్‌ప్రైజ్ చేయాలనుకుంటున్నాడు. కనుక నువ్వు ఈస్టర్ వరకు ఆగవలసిందే’’ నవ్వుతూ అన్నాడు అక్కడే ఉన్న దేవా. జార్జ్ ఫ్రెండ్ అతను. ఇంచుమించు జార్జ్ వయసే వుంటుంది. ఎప్పుడూ ఖరీదైన దుస్తులు ధరిస్తూ స్టైలిష్ గా ఉంటాడు. పల్సర్ బైక్ లో వస్తాడు.
కించిత్తు నిరుత్సాహం చెందాడు బాబీ. ఆ తరువాత దాని సంగతే మరచిపోయాడు.
‘‘అంకుల్! దొంగల్లో ఒకణ్ణి నేను గుర్తుపట్టగలను’’ అన్న బాబీ వంక ఇన్‌స్పెక్టర్ ఉత్సాహంతో చూస్తే, వాడి తల్లిదండ్రులు తెల్లబోయి చూశారు.
బాబీ మదిలో దోపిడీ ఘటన మెదిలింది. దొంగలు దోపిడీ సొమ్ములతో నిష్క్రమిస్తూండగా, వారిలో ఒకడు వెనక్కి తిరిగి బాబీ దగ్గరకు వచ్చాడు. ‘‘హే! ఈస్టర్ ఎగ్ బోసిపోయిన మీ బీరువా లాకర్‌లా ఉంటుంది!’’ అని ఫకాలున నవ్వి వెళ్ళిపోయాడు.
తన ఫ్రెండ్ రాజు తనకు ఈస్టర్ ఎగ్ ని ప్రెజెంట్ చేస్తాననడం, దాని గురించి తాను అతని బాబాయిని అడగడం మొదలుకుని, దొంగల్లో ఒకడు వెళుతూ చేసిన కామెంట్ వరకు వివరంగా ఇన్‌స్పెక్టర్‌తో చెప్పాడు బాబీ. ఇన్‌స్పెక్టర్‌కి తీగ దొరికింది. ‘‘వెల్ డన్, మై బాయ్!’’ అంటూ బాబీని మెచ్చుకుని బైటకు నడిచాడు, డొంకను కదలించడానికి.
ఇన్‌స్పెక్టర్ శివరామ్ కన్‌ఫ్రంట్ చేయడంతో కంగారుపడ్డ జార్జ్ దొంగతనాల గురించి తనకేమీ తెలియదని మొత్తుకున్నాడు. అతని గురించి రహస్యంగా ఎంక్వైరీ చేసిన శివరామ్‌కి అతని మాటలపై నమ్మకం కలిగింది. బాబీ ఈస్టర్ ఎగ్ గురించి అడిగినప్పుడు వున్న తన స్నేహితుడు దేవా ఏడాది క్రితం తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడనీ, అతని గురించి పెద్దగా వివరాలేవీ తెలియవనీ చెప్పాడు జార్జ్.
పోలీసులు దేవాని పికప్ చేసుకోవడానికి వారం రోజులు పట్టింది. అదీ – చెన్నయ్ లో!
థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్ చవిచూశాకగానీ దేవా నేరం ఒప్పుకోలేదు. బీటెక్ డ్రాపవుట్‌ననీ, ఉద్యోగం లేదనీ, గాళ్ ఫ్రెండ్స్, పబ్‌లు, పార్టీలతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్టు చెప్పాడు. రహీం అనే ఆటోడ్రైవర్ తనకు పార్ట్‌నర్‌గా ఉన్నాడనీ, ఫేస్ బుక్ పరిచయమనీ కూడా చెప్పాడు. తన ‘అత్యుత్సాహమే’ బాబీకి తనను పట్టియిచ్చిందని చింతించాడు.
ఇటీవల నగరంలో సంచలనం కలిగించిన దొంగతనాలలో చాలమటుకు తామిద్దరూ కలసి చేసినవేనని ఒప్పుకున్నాడు దేవా. దొంగిలించిన సొత్తును అమ్మడానికీ చెన్నయ్ వెళ్ళినట్టు చెప్పాడు. రెండురోజుల తరువాత రహీం కూడా అరెస్ట్ అయ్యాడు.
క్రైమ్ సీన్‌ని రీక్రియేట్ చేయడం కోసమని నిందితుల్ని సృజనా కాంప్లెక్స్‌కి తీసుకువెళ్ళారు పోలీసులు. దేవాని చూసి పరుగెత్తుకొచ్చాడు వాచ్‌మేన్ అంబయ్య. ‘‘ఏం సార్? ఎప్పుడు కనిపించినా అడక్కుండానే మందుకు డబ్బులిచ్చేవారు. ఆ రోజు నేను వెంటపడ్డా చూడనట్టు వెళ్ళిపోయారేం మీరు?’’ అనడిగాడు. ‘‘ఇతను నీకు తెలుసా?’’ అంటూ ఆరా తీశాడు ఇన్‌స్పెక్టర్ శివరామ్.
ఎప్పుడైనా బాబీ చెబితే రాజును పిలుచుకురావడానికి వాళ్ళింటికి వెళ్ళేవాడు అంబయ్య. అక్కడ దేవా కనిపించేవాడు. మందుకు డబ్బులు ఇచ్చేవాడు. బాబీ ఇంట్లో దొంగతనం జరిగిన రోజు తెల్లవారు జామున సృజనా కాంప్లెక్స్ బైట సూట్ కేసుతో వెళుతూన్న దేవాని గుర్తించి డబ్బులు అడుగుదామని వెంటపడ్డాడు అంబయ్య. దేవా పట్టించుకోకుండా రోడ్ అవతల ఆగి ఉన్న ఆటోలో ఎక్కి వెళ్ళిపోయాడు. అంబయ్య అదే చెప్పాడు ఇన్‌స్పెక్టర్‌తో. అంబయ్య మాటలు బాబీ సాక్ష్యాన్ని బలపరచాయి.
దేవా, రహీంల సాయంతో దొంగసొత్తును విక్రయించిన షాపులు, వ్యక్తులపైన దాడి చేసి సొత్తును రికవర్ చేసుకుని వారిపైన కేసులు పెట్టారు పోలీసులు.
ఫేస్‌బుక్ పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలంటూ జార్జ్‌కి క్లాస్ తీసుకున్నాడు ఇన్‌స్పెక్టర్ శివరామ్. నగరంలో వరుసగా జరుగుతున్న దొంగతనాల సూత్రధారులకు సంబంధించిన క్లూ అందించడంలో కీలకపాత్ర వహించిన బాబీని అభినందించి వాడికి తగు బహుమతి ఇవ్వవలసిందిగా డిపార్ట్‌మెంట్‌కు సిఫారసు చేశాడు.
‘‘ఈస్టర్ ఎగ్ దొంగల్ని కూడా పట్టిస్తుందన్నమాట!’’ అన్న జార్జ్ పలుకులకు ఫక్కున నవ్వారు రాజు, బాబీలు.
Comments
Please login to add a commentAdd a comment