ఉదయిస్తున్న సూర్యుడి నులివెచ్చటి కిరణాలు భూమిని తాకుతున్న వేళ.
నేలపై రక్తపు మడుగుల్లో పడి ఉన్న భార్య శవాన్ని ఒళ్లోకి తీసుకున్నాడతను. గుండె బద్ధలయ్యే బాధను పంటి బిగువన నొక్కిపట్టి, గట్టిగా భార్య శవాన్ని గుండెలకు హత్తుకున్నాడు. ‘‘నిన్ను నా నుంచి దూరం చేసిన వాళ్లను వదిలిపెట్టను! వదిలిపెట్టను!!’’ అతడి అరుపులతో ఆ ప్రాంతం మార్మోగింది.
‘‘కట్!.. షాట్ ఓకే!’’ అన్న అరుపు వినపడగానే కెమెరా ముందు నుంచి పక్కకు వచ్చాడు అనురాగ్.
‘‘షాట్ అద్భుతంగా వచ్చింది. వెల్‌డన్ అనురాగ్!’’ మెచ్చుకోలుగా అన్నాడు డైరక్టర్ సురేంద్ర. అనురాగ్ చిరునవ్వుతో అక్కడ నుంచి పక్కకు వచ్చి, సెల్‌ఫోన్‌లోకి తల దూర్చాడు.
’’ఏం కొత్త పెళ్లికొడుకా!’’ అన్న మాటలు వినపడగానే తలపైకెత్తి చూశాడు. ఎదురుగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవీంద్ర నిల్చుని ఉన్నాడు. ఇద్దరిదీ పదేళ్ల స్నేహం! ఒరేయ్! అని పిలుచుకునే చనువు.
‘‘పెళ్లై ఆరునెలలు దాటింది! ఇంకా కొత్తపెళ్లి కొడుకునేనా?’’ నవ్వుతూ అడిగాడు అనురాగ్.
‘‘కాదా మరి!... ఎంతైనా నీలాంటి భర్త దొరకటం నీ భార్య నిశిత అదృష్టంరా!’’
‘‘ఏం? ఎందుకు?’’
‘‘పెళ్లైన నెల రోజులకే భార్యల నుంచి దూరంగా పరిగెత్తే మొగుళ్లను చాలామందిని చూశాను. నువ్వు అలా కాదు! పెద్ద పెద్ద ఆఫర్లను కాదని, భార్యతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నావ్. పెళ్లైన తర్వాత అసలు కొత్త సినిమాలకు సైన్ చేయటమే మానేశావు. మొత్తానికి భార్య కొంగుచాటు కృష్ణుడివయ్యావు’’ అన్నాడు రవీంద్ర. అనురాగ్ నవ్వుతూ ‘‘భార్యంటే వస్తువు కాదు! వాడుకుని, అవసరం తీరాక దూరంగా పడేయటానికి! కన్నవాళ్లను వదిలి, మనల్ని నమ్మి వచ్చిన భార్య మన నుంచి ఆశించేది విలువైన బహుమతులు కాదు, ప్రేమగా నాలుగు మాటలు.. ఆమెతో సరదాగా గడపటానికి నాలుగు నిమిషాలు. అదే నేను చేస్తున్నాను’’ అన్నాడు.
ఇంతలో ఫోన్ రింగ్ అవటంతో లిఫ్ట్ చేసి, ‘హలో..’ అన్నాడు. ఆవతలి వ్యక్తి చెప్పిన విషయం వినగానే నిశ్చేష్టుడయ్యాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని, ‘‘ఎప్పుడు జరిగింది? ఎలా? సరే నేను వస్తున్నాను’’ అంటూ కళ్లనిండా నీళ్లతో హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరాడు. అనురాగ్ ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. అతడలా ఇంట్లోకి నడుచుకుంటూ వెళుతుంటే అందరూ అతని వైపే జాలిగా చూస్తున్నారు. అనురాగ్ భయం భయంగా బెడ్ రూమ్‌లోకి అడుగుపెట్టాడు. రక్తపు మడుగులో అచేతనంగా పడిఉన్న భార్యను చూసిన వెంటనే గుండెలు బాదుకున్నాడు.
∙∙
హత్య జరిగిన మరుసటి రోజు..
ప్రముఖ నటుడి భార్య దారుణ హత్య
‘‘చూశారా సార్! ఫ్రంట్ పేజీ, రెండు కాలాల వార్త, అదృష్టవంతురాలు. మనం ఎంతమంది క్రిమినల్స్‌ను పట్టుకుని ఉంటాం. ఏనాడైనా మన గురించి సింగిల్ కాలమ్ వార్త రాశారా. పాస్‌పోర్టు సైజ్ ఫోటోయైనా వేశారా? దేనికైనా పెట్టిపుట్టుండాలి సార్!’’ వార్తా పత్రికను ఎస్‌ఐ అంజన్‌కు చూపిస్తూ.. తన గోడు వెళ్లబోసుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం. ఎస్‌ఐ అంజన్ పేపరువైపు ఒక్కక్షణం చూసి, గట్టిగా ‘‘భద్రం..’’ అనగానే గమ్మునుండిపోయాడు అతను. అంజన్ కారు నడుపుతున్నా! అతడి ఆలోచనలు మాత్రం నిశిత హత్య కేసు మీదే ఉన్నాయి.
ఎస్‌ఐ అంజన్‌కు.. పోస్టుమార్టమ్ రిపోర్టు రాకముందే చాలా కేసులను ఛేదించిన అనుభవం ఉంది. ఎటువంటి కేసునైనా నెలరోజుల్లోగా సాల్వ్ చేయగలడని డిపార్ట్‌మెంట్‌లో మంచి పేరుంది. ఈ కేసును కూడా వీలైనంత తొందరగా ముగించేయాలన్న ఆలోచనలో ఉన్నాడతను. కొద్దిసేపట్లోనే వాళ్లు ప్రయాణిస్తున్న కారు అనురాగ్ ఇంటి ముందు ఆగింది. ఇద్దరూ ఇంటి లోపలికి నడిచారు. సోఫాలో కూర్చుని, ఇంగ్లీష్ పేపరు చదువుతున్నాడు అనురాగ్. అడుగుల చప్పుడు వినపడి, పేపరులోంచి తల పైకెత్తి చూశాడు. ఎదురుగా పోలీసులు కన్పించటంతో పైకి లేచాడు.
‘‘ఇక పాయింట్‌కు వద్దాం మిస్టర్ అనురాగ్! మీ భార్య హత్య జరిగిన రోజు రాత్రి మీరెక్కడున్నారు?’’ ప్రశ్నించాడు అంజన్. అతడలా సూటిగా ప్రశ్నించే సరికి మొదట కంగారుపడినా, సర్దుకుని, ‘‘ఆ రోజు, అంతకు క్రితం రోజు నేను ఇంట్లో లేను, షూటింగులతో బిజీగా ఉండి ఇంటి వైపు రావటమే కుదరలేదు’’ చెప్పాడతను.
‘‘ఈ నెంబరు ప్లేటు గల కారు మీదేనా?’’ ప్రశ్నించాడు వీరభద్రం.
‘‘ఆ! నాదే, ఏమైంది?’’ అమాయకంగా తిరిగి ప్రశ్నించాడు అనురాగ్.
‘‘హత్య జరిగిన రాత్రి నువ్వు కారులో ఈ ఏరియాలోకి రావటం వీధి చివరన ఉన్న సీసీ కెమరాల్లో రికార్డైంది. నీ సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా నువ్వు ఆ రాత్రి ఈ ఏరియాలోనే ఉన్నావని చెబుతున్నాయి. అంటే ఆ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావు. మర్యాదగా ఆ రోజు ఏం జరిగిందో చెప్పు! లేదంటే మా స్టైల్లో విచారించాల్సి ఉంటుంది. జాగ్రత్త!’’ హెచ్చరిస్తున్నట్లు అన్నాడు అంజన్.
‘‘నా భార్యంటే నాకు ప్రాణం. అలాంటిది తనను నేనెందుకు చంపుతాను’’ అన్నాడు.
‘‘నీది నంది అవార్డు నటనని మాకు తెలుసు! మేము ఇక్కడికి వచ్చే ముందు నిశిత తల్లిదండ్రులు మా స్టేషన్‌కు వచ్చారు. నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ల కూతుర్ని తరుచూ హింసించే వాడివని, కన్నవాళ్లతో మాట్లాడటానికి కూడా ఫోన్ ఇచ్చేవాడివి కాదని, నువ్వో అనుమానపు పిశాచివి.. కలియుగ కీచకుడివని, నిశితను నువ్వే చంపుంటావని ఆ కంప్లైంట్ సారాంశం’’ వెటకారంగా అన్నాడు వీరభద్రం.
ఇక తప్పించుకోవటానికి ఎటూ దారిలేని పరిస్థితుల్లో చేసిన నేరం ఒప్పుకున్నాడు అనురాగ్. ఏం జరిగిందో చెప్పటం ప్రారంభించాడు..
‘‘నిశితకు ఎఫైర్ ఉందని, పెళ్లిచూపుల టైమ్‌లోనే తెలిసినా డబ్బు కోసం తనను పెళ్లి చేసుకున్నాను. పెళ్లైన తర్వాతైనా మారుతుందని అనుకున్నాను. కానీ ఏ మార్పు రాలేదు! మరీ బరితెగించింది. నేను ఇంట్లో లేని సమయంలో ఆమె ప్రియుడు ఇంటికి వచ్చిపోతున్నాడనిపించింది. అందుకే షూటింగులు మానుకుని మరీ! ఇంటి దగ్గర ఉండేవాణ్ని. ఈ మధ్య నా భార్య నిశిత ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నా మీద ఎప్పుడులేని ప్రేమ ఒలకబోస్తోంది. ఓ రోజు ఉదయం ఇంటి బయట ఎవరితోనో నవ్వుతూ మాట్లాడటం చూసి, నిలదీస్తే! అలాంటిదేమీ లేదని బుకాయించింది. అందుకే మరుసటి రోజు రాత్రి ఫుల్లుగా మందు కొట్టివచ్చి! నిశితను కసితీరా పొడిచినప్పుడు ఏదో తెలియని ఆనందం కలిగింది నాకు...’’
∙∙
రెండవ రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్‌లో..
తన చాంబర్‌లో కూర్చుని, విశ్రాంతిగా క్రైమ్ మ్యాగజైన్ చదువుతున్నాడు అంజన్. ఇంతలో వీరభద్రం! ఓ సీల్డ్ కవర్ తెచ్చిచ్చాడతనికి. కవర్‌లో ఉన్న కాగితాలు బయటకు తీసి, అంజన్ చదవటం ప్రారంభించాడు. కొద్దిసేపటికే అతడి ముఖం తెల్లగా పాలిపోయింది. అంజన్ ముఖంలో చోటు చేసుకున్న మార్పులను గమనించిన వీరభద్రం ‘‘ఏంటి సార్! ఏమైంది’’ అని అడిగాడు కంగారుగా. అంజన్ ఆ కాగితాలను అతడి చేతికందించాడు. కొద్దిసేపటి తర్వాత అతడి పరిస్థితి కూడా అదే! బుర్ర గోక్కుంటూ ‘‘ఇదేంటి సార్! పోస్టుమార్టమ్ రిపోర్టు ఇలా వచ్చింది’’ అన్నాడు.
ఊహించని ట్విస్ట్‌తో ఆలోచనల్లో పడ్డ అంజన్ పోస్టుమార్టమ్ రిపోర్టు ప్రకారం అనురాగ్! నిశితను హత్య చేయలేదు. ఆమెను ఇంకెవరో గొంతు నులిమి చంపేశారు. అనురాగ్! నిశితను.. అదే ఆమె డెడ్‌బాడీని పొడిచింది రాత్రి 8గంటల ప్రాంతంలో.. కానీ! ఆ హత్య అంతకు 5 గంటలముందు.. అంటే! మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగినట్లు రిపోర్టు చెబుతోంది. నిశిత గొంతుపై హంతకుడి 9 వేలి ముద్రలే దొరికాయి. ఎడమ చేతి బొటనవేలి ముద్రలు దొరకలేదు. దానర్థం ఆ హంతకుడికి ఎడమ చేతి బొటన వేలు లేకుండా అన్న ఉండాలి లేదా బొటన వేలి ముద్రలు పడక పోవడానికి వేరే కారణమేదైనా ఉండాలి. ఎవరా హంతకుడు?’’ అంటూ భద్రం వైపు చూశాడు.
‘‘సార్! నిశితకు ఓ లవర్ ఉన్నాడని అనురాగ్ చెప్పాడుగా! బహుశా అతడే ఈ హత్య చేసుంటాడేమో!’’ అనుమానం వ్యక్తం చేశాడు వీరభద్రం.
∙∙∙
‘‘ఎంబీఏ చదువుతున్నపుడు నేను, నిశిత ప్రేమించుకున్న మాట నిజం! కానీ పెద్దలు మా పెళ్లికి ఒప్పుకోకపోవటంతో మేము కూడా స్నేహపూర్వకంగానే విడిపోయాము. తర్వాత కొద్దిరోజులకు ఆమెకు పెళ్లైందని తెలిసింది. ఈలోగా నేను ఈ రెడ్ అండ్ రెడ్ రెస్టారెంట్‌లో ఉద్యోగంలో చేరాను. పని ఒత్తిడిలో ఆమె సంగతే మర్చిపోయాను. మొన్న ఓ రోజు అనుకోకుండా రోడ్డుమీద కనిపిస్తే దగ్గరకెళ్లి పలకరించాను. కొద్దిసేపు మాట్లాడుకున్నాం. తర్వాత నేనే తనను కారులో ఇంటిదగ్గర దింపాను. అర్జంట్ ఫంక్షన్ ఉండటంతో ఆ ఇంట్లోకి కూడా వెళ్లకుండా రెస్టారెంట్‌కు వచ్చేశాను. బర్త్‌డే ఫంక్షన్ ఈవెంట్ పనుల్లో బిజీగా ఉండటంతో నేను ఆ పనిలో మునిగిపోయాను. రాత్రి పది వరకు రెస్టారెంట్లోనే ఉన్నాను. ఆ రాత్రే తను హత్యకు గురైంది! ఆ విషయం ఉదయం పేపర్లో చదివి తెలుకున్నాను. మీకు నా మీద అంత అనుమానం ఉంటే మా కోలీగ్స్‌ను నా గురించి విచారించుకోండి’’ ధీమాగా అన్నాడు సంజయ్.
సంజయ్ మాట్లాడుతున్నంతసేపు ఇద్దరూ అతడి ఎడమచేతివైపే పరిశీలనగా చూస్తున్నారు. అతడు మాట్లాడుతూ ఎడమ చేత్తో జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను తీసి, టేబుల్ మీద పెట్డాడు. అతడి ఎడమ చేతి బొటనవేలు స్పష్టంగా కనపడుతోంది. అప్పుడప్పుడూ బొటనవేలితో ముఖంపై ఉన్న చింతపిక్కంత పుట్టుమచ్చను స్టైల్‌గా గోక్కుంటున్నాడు. పైగా అతడి మాటల్లో ఎలాంటి బెరుకూ, తప్పుచేశానన్న భయం లేదు. అంజన్‌కు.. ఇక అతన్ని విచారించటం వృథా అనిపించింది. ఓ కన్ఫర్మేషన్‌కోసం వీరభద్రాన్ని అతని వెంట పంపి, అతడు రెస్టారెంట్ బయటకు వచ్చేశాడు.
కాసేపట్లో తిరిగొచ్చిన వీరభద్రం! సంజయ్ చెబుతున్నది నిజమేనని ధ్రువపరిచాడు.
∙∙
కేసు మళ్లీ మొదటికొచ్చింది...
ఇరవై రోజులు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది కేసు పరిస్థితి. కేసును ముందుకు నడిపించే బలమైన ఆధారమేదీ దొరకటం లేదు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ విచారిస్తున్నారు. వారం రోజుల నుంచి హత్య జరిగిన ఇంటి ముందు గస్తీ కాస్తున్నారు. ఓ రోజు మధ్యాహ్నం అనురాగ్ ఇంటి దగ్గరలో అంజన్! వీరభద్రం మఫ్టీలో నిల్చుని ఉండగా ఓ ముసలి బిచ్చగాడి ప్రవర్తన ఆశ్చర్యంగా తోచింది. ఆ ఇంటి దగ్గర కొచ్చిన బిచ్చగాడు దాదాపు 15 నిమిషాలు అక్కడే కదలకుండా నిలబడ్డాడు. ఇంటివైపు చూస్తూ ఏడవటం ప్రారంభించాడు. దీంతో అనుమానం వచ్చిన అంజన్, వీరభద్రం అతణ్ణి విచారించారు.
ఆ ముసలి బిచ్చగాడు తరుచూ ఆ వీధిలోకి అడుక్కోవటానికి వచ్చేవాడు. ఎవరు అన్నంపెట్టినా పెట్టకపోయినా అనురాగ్ భార్య నిశిత తప్పక పెట్టేది. పండగరోజు ఇంట్లో చేసుకున్న వంటకాలన్నీ అతడికి పెట్టేది. ఆరోగ్యం బాగాలేకపోతే డబ్బు సహాయం చేసిన రోజులున్నాయి. హత్య జరిగిన రోజు మధ్యాహ్నం బిచ్చగాడు ఇంటి బయట నిలబడి, చాలాసార్లు నిశితను పిలిచాడు. ఆమె రాలేదు! కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి కంగారుగా, చెమటలు పట్టి తడిసిన బట్టలతో ఇంట్లో నుంచి బయటకు రావటం అతడు చూశాడు. అదే సంగతి వాళ్లకు చెప్పాడు.
‘‘తాతా! నువ్వు ఆ వ్యక్తిని చూస్తే గుర్తుపట్టగలవా?’’ అడిగాడు అంజన్
‘‘ఖచ్చితంగా!.. బాబు! ఆ మనిషి ఫోటో ఇందాకే పేపర్లో చూశాను’’ అన్నాడు ముసలాయన. నిమిషాల మీద అతడు చెప్పిన పేపర్ తెప్పించారు. ఆ ముసలాయన! ఆ రోజు తను చూసిన మనిషి ఇతనేనంటూ ఓ వ్యక్తి ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూడగానే అంజన్, వీరభద్రాల కళ్లు పెద్దవయ్యాయి.
అతడు అనురాగ్ మిత్రుడు, ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ రవీంద్ర.
బిచ్చగాడు ఇచ్చిన సమాచారంతో సినిమా షూటింగ్ కోసం దుబాయ్ వెళుతున్న రవీంద్రను ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు.ఇంటరాగేషన్ సెల్‌లోని కుర్చీలో కూర్చుని ఉన్నాడు రవీంద్ర. అతడి ముందు నిలబడి ఉన్న అంజన్! రవీంద్ర ఎడమ చేతి బొటనవేలికి కట్టి ఉన్న బ్యాండేజీని చూస్తూ ‘‘ఆ వేలికి ఏమైంది?’’ అని ప్రశ్నించాడు. ‘‘నెల రోజుల క్రితం షూటింగ్‌లో ప్రమాదం జరిగి, వేలు బాగా చితికిపోయింది. అందుకే ఇది’’ వేలు పైకి చూపిస్తూ సమాధానమిచ్చాడు రవీంద్ర.
అంజన్! నిశిత ప్రస్తావన తేగానే అప్పటి వరకు మామూలుగా ఉన్న అతను కంగారుపడ్డాడు. మెల్లగా చెమటలు పట్టడం ప్రారంభమైంది. మొదట నిశిత తనకు అనురాగ్ భార్యగానే పరిచయమన్నాడు. ఆమెను ఎప్పుడూ పర్సనల్‌గా కలవలేదని, అలాంటిది ఆమెను చంపాల్సిన అవసరం తనకు ఏముంటుందని ఎదురు ప్రశ్నించాడు. గట్టిగా నాలుగు తగిలించేసరికి అసలు ఏం జరిగిందో చెప్పటం ప్రారంభించాడు. ‘‘చాలా రోజులుగా నాకు నిశిత మీద కన్నుంది. ఎలాగైనా ఆమెను నాదాన్ని చేసుకోవాలనుకున్నాను. అందుకే అనురాగ్ ఇంట్లోలేని సమయంలో ఆమె దగ్గరకు వెళ్లేవాణ్ని. ఆమెను మంచి చేసుకోవటానికి శతవిధాలా ప్రయత్నించేవాణ్ని. ఆ రోజు మధ్యాహ్నం కూడా అక్కడికి వెళ్లాను. అప్పటికే ఆమె చనిపోయి ఉంది. నాకు భయం వేసింది! హత్యానేరం నామీద కొస్తుందని భావించి వెంటనే అక్కడి నుంచి వచ్చేశాను’’ అన్నాడు రవీంద్ర.
కొద్దిసేపటి తర్వాత ఇంటరాగేషన్ సెల్‌లోకి వచ్చిన వీరభద్రం! రవీంద్ర వేలి ముద్రలు హంతకుడి వేలిముద్రలతో మ్యాచ్ అవ్వలేదని అంజన్‌తో చెప్పాడు. ఆ వార్త వినగానే అంజన్ దిమ్మ తిరిగిపోయింది. కేసును ఎలా దర్యాప్తు చేయాలో అర్థంకాక తల పట్టుకున్నాడు. ఓ రోజు సాయంత్రం అంజన్ స్టేషన్‌లో ఉన్న సమయంలో అనురాగ్ అక్కడికి వచ్చాడు. అతడు నిన్న ఉదయమే బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. మళ్లీ పోలీస్ స్టేషన్ వైపు ఎందుకొస్తున్నాడా అని అంజన్ ఆలోచనల్లో పడ్డాడు. పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తున్న సమయంలో తనకు పొదల మధ్య ఓ వస్తువు దొరికిందని, అది తప్పకుండా హంతకుడిదే అయ్యుంటుందని, తన భార్యను హత్య చేసిన వాణ్ని ఎలాగైనా పట్టుకోండని చెప్పి, ఓ కవర్ అంజన్ చేతిలోపెట్టి వెళ్లిపోయాడతను.
అనురాగ్ ఉద్దేశంలో హంతకుడిని పట్టుకోవటం అంటే భార్యకు అక్రమ సంబంధం ఉందని నిరూపించటం. ఇన్‌డైరక్టుగా నిశితను అతడు చంపాలనుకోవటం తప్పుకాదని చెప్పటం. అనురాగ్ ఇచ్చిన కవర్‌లో ఓ కీచైన్ ఉంది. దానికి బైక్ తాళం చెవి బిగించి ఉంది. ఆ కీచైన్‌కు ఉన్న పొడవాటి ప్లాస్టిక్ దబ్బపై ఓ వైపు లవ్ యూ గీత అని, మరో వైపు ఓ ఫోన్ నంబర్ అచ్చువేసి ఉంది. ఫోన్ నంబర్ ఆధారంగా అడ్రస్ సేకరించి, వీరభద్రాన్ని వెంటబెట్టుకుని అక్కడికి బయలుదేరాడు అంజన్. అడ్రస్‌లో ఉన్న ఇంటి వద్దకు చేరుకున్నారిద్దరూ. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇంటికి ఎదురుగా కొద్ది దూరంలో నిల్చున్నారు. కొద్దిసేపటి తర్వాత ఓ కుర్రాడు ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు. పోలీస్ డ్రస్‌లో ఉన్న ఇద్దరినీ చూసి, పరుగు లంకించుకున్నాడు. ఆ కుర్రాడిని వెంబడించి పట్టుకోవటానికి అంజన్, వీరభద్రాలకు తల ప్రాణం తోకలోకి వచ్చింది.
అప్పటికే సగం బిక్కచచ్చిపోయి ఉన్న ఆ కుర్రాడు! అంజన్ గట్టిగా గదమాయించేసరికి ఏడ్చుకుంటూ ‘‘సార్! నాపేరు ప్రేమ్‌సాగర్. బీటేక్ ఫైనలియర్ చదువుతున్నాను. అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాను. కొన్ని రోజులు ఆ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాక, ఇంట్లో ఎవరూ లేరని తెలిసి, ఆ రోజు మధ్యాహ్నం దొంగతనానికి వెళ్లాను. బెడ్‌రూమ్‌లోని బీరువాను ఓపెన్ చేస్తుండగా చప్పుడై పక్కనే ఉన్న బాత్‌రూంలో దాక్కున్నాను. తలుపు సందులోనుంచి బయట ఏం జరగుతుందో చూస్తుండగా.. ఓ ఆడమనిషి లోపలికి వచ్చింది! ఆ వెంటనే ఓ మగమనిషి వచ్చి, ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ మగమనిషి వెళ్లిపోగానే నేను పారిపోయి వచ్చేశాను’’ చెప్పాడతను.
‘‘అతను ఎలా ఉంటాడో కొంచెం చెప్పగలవా?’’ ఆ కుర్రాడిని అడిగాడు అంజన్
‘‘సార్! అతడి ఎడమ చేతి బొటన వేలు సగం కట్‌అయి ఉంది... ఆ!! అతడి ముఖంపై చింత పిక్కంత పుట్టుమచ్చ ఉంది సార్!’’
‘‘చింతపిక్కంత పుట్టుమచ్చా!!’’ అంజన్ భృకుటి ముడిపడింది.
హత్య జరిగిన 30వ రోజు
అర్ధరాత్రి పోలీసు జీపు ఓ ఇంటి ముందు ఆగింది. అంజన్, వీరభద్రం, ఆ కుర్రాడు గేటు తీసుకుని ఇంట్లోకి నడిచారు. ఇంటి తలుపు తట్టగానే బయటకు వచ్చిన అతను! వాళ్ల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ఏంటి సార్! మళ్లీ వచ్చారు. నా మీద అనుమానం వచ్చిందా ఏంటి?’’ అన్నాడు నవ్వుతూ. అతడిని చూడగానే ఆ కుర్రాడు ‘‘ఆ!! ఈయనే సార్! ఆమె గొంతు నులిమి చంపింది. ఈయనే!’’ అన్నాడు అరుస్తూ. ‘‘చెప్పు సంజయ్! నిశితను ఎందుకు హత్య చేశావ్? తప్పించుకోవాలని చూడకు. నువ్వు హత్యచేయటం ఈ కుర్రాడు కళ్లారా చూశాడు. చేసిన నేరం మర్యాదగా ఒప్పుకుంటే మంచిది! దెబ్బలైనా తప్పుతాయ్’’ బూతులు తిడుతూ ఊగిపోయాడు అంజన్.
‘‘అవును నిశితను నేనే చంపాను. డబ్బుకోసమే నేను తనను ప్రేమించాను. కోట్ల ఆస్తి నా సొంతం అవుతుందని కలలు కన్నాను. మా పెళ్లికి వాళ్ల పెద్దవాళ్లు ఒప్పుకోలేదు! లేచిపోయి పెళ్లిచేసుకుందాం అన్నాను. తను ఒప్పుకోలేదు. కన్నవాళ్లను కష్టపెట్టలేనని ఓ డైలాగ్ చెప్పి, వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వెళ్లిపోయింది. తర్వాత నా ఫోనుక్కూడా దొరకలేదు. ఆ రోజు మధ్యాహ్నం రెస్టారెంట్‌కు వెళుతున్న దారిలో తను రోడ్డుపై కనిపించింది. నిశితను చూడగానే నాలో నిద్రపోతున్న రాక్షసుడు మేల్కొన్నాడు. నేనే తన దగ్గరకు వెళ్లి పలకరించాను. ఇద్దరం కొద్దిసేపు అలా రోడ్డుపై నడుస్తూ మాట్లాడుకున్నాం. మా ప్రేమ సంగతులేవీ గుర్తులేనట్లు మాట్లాడింది. నా కోపం రెట్టింపైంది. నన్ను తన ఇంటికి తీసుకెళ్లేలా కన్విన్స్ చేసి, ఇంట్లోకి వెళ్లాక గొంతునులిమి చంపేశాను’’ అంజన్ ఆవేశాన్ని గుర్తించిన సంజయ్ నిజం చెప్పక తప్పలేదు.
‘‘మరి ఆ బొటనవేలు సంగతి’’ అడిగాడు వీరభద్రం.
బొటనవేలు తీసి, వీరభద్రం చేతిలో పడేస్తూ ‘‘ప్రాస్థటిక్ ఫింగర్.. హత్య చేసిన తర్వాత కొన్నా’’ చెప్పాడు సంజయ్.
♦ బండారు వెంకటేశ్వర్లు(వెబ్ డెస్క్)
Comments
Please login to add a commentAdd a comment