‘నీకు మతిపోయిందా? దెయ్యం హత్య చేయడం ఏమిటి?’ కసిరాడు సీఐ మహంకాళి. ‘అలా కొట్టిపారేయకండి సర్. నా మాట కాస్త వినండి. ఈ ఫైల్ చూడండి.. నా కష్టం మీకే తెలుస్తుంది! ముమ్మాటికీ అది హత్యే. అయితే ఆ పని దెయ్యం కాకుండా వేరెవరూ చేసినట్లు ఆధారాలు లేవు. విదేశాల్లో అనేక అన్‌సాల్వ్‌డ్ కేసుల విషయంలో, కొన్ని హత్యలు దెయ్యాలే చేసి ఉండవచ్చుననే అభిప్రాయాలూ ఉన్నాయి. 1999లో బోస్టన్‌లో ఇలాంటి కేసే...’ అని ఎస్సై అంబరీష్ చెప్పబోతుండగా, అడ్డుతగిలి, ..
‘ఆ పుక్కిటి పురాణాల గురించి చెప్పొద్దు. ఇప్పుడు మొదటి నుంచి వివరంగా చెప్పు’ అన్నాడు సీఐ మహంకాళి. ‘హత్యకు గురైన ముకుందం, అతని భార్య శ్రావణి, చాలా ఏళ్లుగా లండన్‌లో ఉంటూ, ఆరు నెలల కిందటే ఇండియా వచ్చారు. ముకుందం తాతగారు, వందేళ్ళ క్రితం కట్టించిన ‘వేట బంగళా’లో నివాసం ఉంటున్నారు. ఆ బంగాళాలో ముందు మనం అడుగుపెట్టేది, పెద్ద హాల్లోకి. హాల్లోంచే పైకి మెట్లున్నాయి. హాలుని ఆనుకొని, డైనింగ్ రూమ్, దాని పక్కన కిచెన్ ఉన్నాయి. పై అంతస్తులోని గదే ముకుందం, శ్రావణిల బెడ్‌రూమ్.
అప్పటికి ఆ బంగాళా ఊరికి దూరంగా, అడవికి దగ్గరగా ఉండేది. ఇప్పుడు అక్కడంతా బాగా డెవలప్ అయిపోయింది. గత ఆరేళ్లుగా ఆ బంగాళా పోషణను చూస్తున్న రాములు, కమల అక్కడే అవుట్ హౌస్‌లో ఉంటున్నారు. గత ఏడాదిగా ఆ బంగళాలో దెయ్యం తిరుగుతున్నట్లు .. వాళ్ళు ముకుందానికి ముందుగానే చెప్పినా అతను పట్టించుకోలేదట’ వివరించాడు అంబరీష్. ‘అక్కడ దెయ్యం తిరుగుతుందని వాళ్లకు ఎలా తెలిసిందట?’ అని అడిగాడు మహంకాళి.
‘పగలు ఏ హడావిడీ ఉండేది కాదట. రాత్రుళ్లు మాత్రం లైట్లు వెలిగి ఆరుతూ ఉండడం, ఎవరో మసలుతున్నట్లు నీడ కనిపించడం, శబ్దాలు వినిపించడం జరిగేదట. నలుగురైదుగుర్ని తోడు తీసుకొని లోపలికి వెళ్లి చూస్తే, ఏమీ కనిపించేది కాదట. అలా మూడు నాలుగు సార్లు చేసి, ఆ ఇంట్లో దెయ్యం ఉందని, నిర్ధారణకు వచ్చేశారట’ అని అంబరీష్ అనగానే, ‘అంతా ట్రాష్. ఆ పనులు మనుషులు కూడా చెయ్యొచ్చు కదా?’ అన్నాడు మహంకాళి.
‘అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేయకండి. శ్రావణి స్టేట్‌మెంట్ కూడా వినండి మరి. ఆ ఇంట్లో దిగాక, మేడమీద పడుకున్న ఆ దంపతులకు కూడా అర్ధరాత్రి వేళ శబ్దాలు వినిపించేవట. ముకుందానికి ధైర్యం ఎక్కువే కాబట్టి, అతను కిందకువెళ్లి చూస్తే, ఎవరూ కనిపించేవారు కాదట. దిగువన, హాల్లో ఉంచిన గాగుల్స్, ఇయర్ ఫోన్స్, వాచీ, ఐపాడ్, సెల్‌ఫోన్ లాంటి కాస్టీ›్ల వస్తువులు మాయమయ్యేవట. డైనింగ్ టేబ్‌ల్ మీదున్న ఆహారపదార్థాలతో పాటు, ఫ్రిజ్‌లో పెట్టిన పదార్థాలు కూడా మాయమవుతూ ఉండేవట. ‘ఇదేదో దొంగల పనే’ అని భావించిన ముకుందం దంపతులు ఎంతగా గాలించినా ఏ ఆధారమూ దొరకలేదట.
ఒకరాత్రి, ఆ శబ్దాల సంగతి ఏమిటో తేల్చేద్దామని, భార్య ఎంత వారించినా వినకుండా టార్చి పట్టుకొని కిందకు దిగాడట ముకుందం. చేసేదేమీ లేక ఆమె కూడా అతన్ని అనుసరించిందట. కిచెన్ లోపల శబ్దాలు గట్టిగా వినిపించేసరికి ముందుకు అడుగు వేసిన ముకుందానికి నల్లని రూపమేదో కనిపించేసరికి, జడుసుకొని గబగబా వెనక్కి పరిగెత్తాడట. వెంటనే భార్యాభర్తలిద్దరూ రూమ్‌లోకి దూరి తలుపేసుకున్నారట. కాస్సేపటికి తలుపు దగ్గర కూడా ఎవరో తచ్చాడుతున్నట్లు అనిపించేసరికి మరింత భయపడిపోయారట. అలా ప్రతిరాత్రి భయపడుతూనే గడిపారట.
దుర్భేద్యమయిన ఆ ఇంట్లో ఎవరూ దూరే అవకాశమే లేదు. తలుపులు, కిటికీలు మూసి ఉన్నా, వస్తువులు ఎలా మాయమవుతున్నాయో వాళ్లకు అర్థంకాక, ‘ఇది దెయ్యం పనే అయి ఉంటుంది’ అనే నిర్ధారణకు వచ్చేసి, ‘త్వరలోనే ఇల్లు మారిపోదాం’ అనుకుంటుండగానే ఈ ఘోరం జరిగిపోయింది’ ఆపాడు అంబరీష్.
‘సరే ముకుందం మరణం గురించి వివరాలు చెప్పు’ అన్నాడు కాళి.
‘ఆరోజు ఉదయం నిద్రలేచిన శ్రావణి, పక్కనే భర్త లేకపోవడంతో, అతని కోసం గదిలోంచి బయటకు వచ్చి, హాల్లో మెట్ల దగ్గర శవమై పడున్న భర్తను చూసి కేకలు పెట్టింది. వెంటనే రాములు, కమల వచ్చి, మన స్టేషన్‌కి ఫోన్ చేశారు. ముకుందం మెట్ల మీద నుంచి జారి పడ్డాడని, అదొక యాక్సిడెంట్ అని మొదట నేనూ అనుకున్నాను. అయితే అది యాక్సిడెంట్ కాదు. దెయ్యమే మెట్లమీద నుంచి తోసేసింది. మావారికి అరవై ఏళ్ళు వచ్చినా, చాలా యాక్టివ్‌గా ఉంటారు. రోజూ ఆరేడుసార్లయినా మెట్లెక్కి దిగుతూ ఉంటారు. జారిపడే ప్రసక్తి లేదు.
మా ఇంట్లో దెయ్యం ఉంది. ఇది దాని పనే’ అని వాదించింది శ్రావణి. బాగా పరిశీలించి చూస్తే, అతను మెట్లమీద నుంచి జారిపడలేదని తెలిసింది. పాతకాలపు చెక్క మెట్లమీద నుంచి జారిపడితే, పెద్ద శబ్దమే వస్తుంది. ఆ శబ్దానికి శ్రావణి లేచి ఉండేది. ముకుందానిది భారీ శరీరం కాబట్టి, చెక్కమెట్లు గానీ, రెయిలింగ్ గానీ కొద్దిగానయినా డామేజ్ అయి ఉండాలి. అదేమీ లేదు. తలపై ఎవరో గట్టిగా కొట్టడం వల్లనే చనిపోయాడని నిర్ధారణకు వచ్చాను కానీ, హంతకుడెవరనేది తెలియలేదు. ఎంత పరిశోధించినా క్లూ దొరకలేదు. అందుకే శ్రావణి చెప్పినట్లు ..’అని అంబరీష్ అంటుండగా పెద్ద పెట్టున నవ్వాడు మహంకాళి. ‘దెయ్యమే చంపింది అని నిర్ధారణ చేసేశావన్నమాట. పిచ్చోడా? నీకు శ్రావణి మీద అనుమానం రాలేదా?’ అడిగాడు కాళి.
‘ఆ కోణంలోనూ ఆలోచించాను సర్.. శ్రావణిని చూశారు కదా? సన్నగా రివటలా ఉంటుంది. ఆమె ఎలా చంపుతుంది? వేరే అవకాశాల గురించి కూడా ఆలోచించాను. హత్య వేరే ఎవరయినా చేసి ఉండొచ్చని, శ్రావణి అతనికి సహకరించి ఉండవచ్చని, ఆమే తలుపు తీసి ఉండవచ్చని, అలా లోపలికి వచ్చిన వ్యక్తి హత్య చేసి ఉండొచ్చునని ... అలా చాలా రకాలుగా ఆలోచించి, ఆ దిశలో దర్యాప్తూ చేశాను. ఆమెను అనుమానించదగ్గ ఆధారాలేవీ దొరకలేదు’ అన్నాడు అంబరీష్.. తను సేకరించిన వివరాల ఫైల్‌ను అందిస్తూ.‘వెరీ గుడ్. చాలా బాగుంది నీ పరిశోధన. కానీ దెయ్యం హత్య చేసిందంటేనే నమ్మలేకపోతున్నాను’ అన్నాడు మహంకాళి.
ఎన్నో కేసులను చాకచక్యంగా సాల్వ్ చేసిన మహంకాళికి, ఈ కేసు ఒక పెద్ద సవాల్ అయింది. దెయ్యాలే హత్య చేశాయి అని తేల్చేసిన కేసుల వివరాలను అంబరీష్ అందించాక, అదే నిజమేమోనన్న అభిప్రాయమూ బలపడుతున్న సమయంలో కేసు మలుపు తిరిగింది. కారణం ముకుందం శవాన్ని పోస్ట్‌మార్టమ్ చేసిన డా. త్రివేది అసిస్టెంట్ డా. సరిత. ఆమె కోరినట్లు, ఆమెను రహస్యంగా కలిశారు సీఐ, ఎస్సైలు. ‘డాక్టర్ త్రివేది.. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌ని, మార్చి మీకు రేపు సబ్‌మిట్ చేయబోతున్నారు’ అనగానే.. ఇద్దరూ షాకయ్యారు.
‘వ్వాట్.. నిజమా?’ ప్రశ్నల వర్షం కురిపించాడు మహంకాళి. ‘నూటికినూరు శాతం నిజం. రెండేళ్ల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. పోస్ట్‌మార్టమ్ చేస్తున్నప్పుడు నేనూ ఉన్నాను. అప్పటికి ఆ రిపోర్ట్ మార్చాలనే ఐడియా లేదనుకుంటాను. ఉన్నదున్నట్లే నాతో డిస్కస్ చేశాడు. ముకుందం మెట్లమీద నుంచి జారిపడిపోవడం వల్ల చనిపోలేదు. ఎవరో దేనితోనో తలపై కొట్టడం వల్ల మరణించాడు. కానీ, ఇవాళ తయారుచేసిన కొత్త రిపోర్టులో ‘మెట్లమీద నుంచి పడిపోవడం వల్లనే ముకుందం మరణించాడని, అతని ఒంటి మీదున్న కముకు దెబ్బలు.. మెట్లతాకిడి వల్ల తగిలాయని మార్చి రాశాడు.
ఆ కొత్త రిపోర్ట్ నాకు కనబడకుండా దాచినప్పుడే నాకు అనుమానం కలిగింది. కానీ, అతనికి తెలియకుండా చాటుగా ఆ రిపోర్ట్‌ను చదివాను. ఇదే కాదు చాలా కీలకమైన విషయాన్ని కూడా దాచి పెట్టాడు’ అని చెప్పింది డా. సరిత. ఇద్దరూ ఒకేసారి ‘ఏమిటి? ఏమిటి?’అని ఆత్రుతగా ప్రశ్నించారు.‘ముకుందం పంటి మీద రక్తపు మరక కనిపించింది. దాని శాంపిల్‌ని ఫోరెన్సిక్ లాబ్‌కి పంపి, పరీక్ష చేయిస్తే, ఆ రక్తం అతనిది కాదని, వేరే ఎవరిదోనని తెలిసింది’ అని చెప్పింది ఆమె. ఆ మాట విని ఇద్దరూ నోరెళ్లబెట్టారు.
‘ఇప్పుడా విషయాన్ని దాచేసి, ఆ రిపోర్ట్ మాయం చేసేశాడు. చాలాకాలంగా అతని లైంగిక వేధింపులతో నరకం అనుభవిస్తున్నాను. ఇప్పుడు అతని పీడ వదిలిపోతుంది’ అంది కసిగా. సరితతో మరికాస్త సేపు మాట్లాడాక కేసుకు కావలసిన కొత్త విషయాలు కూడా తెలియడంతో కేసు సాల్వ్ చేయడానికి మార్గం సుగమం అయింది.
వారం రోజుల తర్వాత, వేటబంగాళా ముందు పోలీసు జీపులు ఆగాయి. పోలీసులు నేరుగా కిచెన్‌లోకి వెళ్ళారు. కిచెన్‌లోని అటక వైపు చూస్తూ, ‘ఒరేయ్ నరసింహం నీ ఆట కట్టించేశాం. కిందకు దిగిరా. నీ అంతట నువ్వు వస్తే మంచిది. లేకపోతే, మా తూటాలతో అటకంతా ముక్కలు ముక్కలు అయిపోతుంది. నీకు రెండు నిమిషాల టైమ్ ఇస్తున్నాను’ హెచ్చరించాడు మహంకాళి. భయపడి, తాడు సహాయంతో కిందకు దిగాడు నరసింహం. బేడీలు వేశాడు అంబరీష్. కేసు వివరాలు తెలుసుకోవడానికి మర్నాడు స్టేషన్‌కి రమ్మని శ్రావణికి చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు.
మర్నాడు చెప్పడం మొదలుపెట్టాడు, మహంకాళి.. ‘మీ వారిని చంపింది, దెయ్యంలా భయపెట్టింది ఇతనే. ఈ నరసింహం పెద్ద కేడీ. కిందటేడాది జైలు నుంచి తప్పించుకుపోయి, మీ ఇంట్లో దూరాడు. ఆ రోజుల్లో కట్టిన పెద్ద అటక, పెద్ద జాగాలో ఉన్న మీ ఖాళీ బంగాళా ఇతనికి బాగా కలసి వచ్చాయి. ఇంట్లో దెయ్యాలు ఉన్నట్లు నాటకం ఆడితే, సేఫ్‌గా ఉండొచ్చు అని ప్లాన్ వేశాడు.
దెయ్యాలకు భయపడి మీ బంగళాలో ఎవరూ దిగరు అనే ధీమాతో ఉన్నాడు. కానీ దెయ్యాలు, భూతాలు ట్రాష్ అనుకునే మీ దంపతులిద్దరూ ఇంట్లో దిగిపోయారు. ఎప్పటి నుంచో మీ బంగళాను కొని, పెద్ద అపార్ట్‌మెంట్ కట్టాలనే ఆశతో ఉన్న ‘బిల్డర్ పోతరాజు’.. బంగాళా అమ్మమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాడని, భోజనం చేస్తున్నప్పుడు మీవారు మీకు చెప్పడం నరసింహం చెవిన పడింది. వీలు చూసుకొని పోతరాజుని కలసి, మిమ్మల్ని దెయ్యంలా భయపెట్టి, ఇల్లు అమ్మేసేలా చేస్తానని బేరం కుదుర్చుకున్నాడు.
హత్య జరిగిన రాత్రి, సహజంగా ధైర్యవంతుడయిన ముకుందం, తెగించి కిందకు దిగివచ్చినపుడు, నరసింహం దొరికిపోయాడు. వెంటనే నరసింహం.. చేతికి దొరికిన గిన్నెతో మీవారి తల మీద కొట్టాడు. ఆయన కింద పడిపోయారు. మెట్ల దగ్గర పడేస్తే, జారి పడ్డాడని అనుకుంటారని, ఆయన్ని మెట్ల దగ్గరకు ఈడ్చుకుంటూ వస్తున్నప్పుడు ముకుందంగారికి తెలివి రావడంతో, వాడి చేతిని కొరికారు. వాడు మళ్ళీ తలమీద బలంగా కొట్టి చంపేశాడు. హత్యకు ఉపయోగించిన గిన్నెను అటక మీద దాచేశాడు.
ఇవేమీ తెలియని మేము కేసును ఎలా సాల్వ్ చేయాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న సమయంలో మాకు కీలకమైన ఆధారం దొరికింది. ముకుందంగారి బాడీని పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్ త్రివేది, తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని, అతని దగ్గర పనిచేసే జూనియర్ డాక్టర్ సరిత మాకు చెప్పింది. ముకుందంగారి పంటికి ఎవరిదో రక్తం అంటిందన్న విషయం ఒరిజినల్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో ఉంది. హత్య జరిగాక, ఒక కొత్త వ్యక్తి త్రివేదిని కలవడానికి వచ్చేవాడని, వాళ్ళిద్దరూ రహస్యంగా మాట్లాడుకొనేవారని ఆమె చెప్పింది. ఆమె చెప్పిన గుర్తుల ఆధారంగా, బిల్డర్ పోతరాజుని పట్టుకోగలిగాం. త్రివేదిని, పోతరాజుని కస్టడీలోకి తీసుకొని, మా పద్ధతిలో విచారణ జరిపేసరికి, అన్ని విషయాలూ బయటపడ్డాయి.
ముకుందంగారి పంటి మీద ఉన్నది మానవ రక్తం అని తెలిసిపోతే, ఆ హత్య దెయ్యం పనికాదని కనిపెట్టేస్తామని, ఆ రిపోర్ట్ మార్పించేశాడు పోతరాజు, త్రివేదికి డబ్బాశ చూపించి. ఎప్పుడయితే దెయ్యమే హత్య చేసిందని అందరూ నమ్మేస్తారో, అప్పుడే తన పని సులువు అయిపోతుందని మీ బంగళాను చవకగా కొట్టేసి కోట్లు సంపాదించాలనుకున్నాడు పోతరాజు. పాపం ఇప్పుడు నరసింహంతో కలసి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు’ అంటూ ముగించాడు కాళి.
-కొయిలాడ రామ్మోహన్ రావు
Comments
Please login to add a commentAdd a comment