మరణానికి ముందే శ్రద్ధాంజలి ప్రకటన | Sakshi Funday Crime Story | Sakshi
Sakshi News home page

మరణానికి ముందే శ్రద్ధాంజలి ప్రకటన

Published Sun, Jun 30 2019 10:14 AM | Last Updated on Sun, Jun 30 2019 10:14 AM

Sakshi Funday Crime Story

పొద్దుటే బాల్కనీలో కూర్చుని కాఫీ త్రాగుతూ దినపత్రికను తిరగేస్తూన్న గుర్నాథం, ఆబిచ్యువరీ పేజీలోని ఆ ప్రకటనను చూసి ఉలిక్కిపడ్డాడు – శ్రద్ధాంజలి!
‘‘ప్రముఖ వ్యాపారవేత్త దివంగత శ్రీ విన్నబోయిన గుర్నాథం గారి సంతాప సభ ఎల్లుండి (ఆదివారం) సాయంత్రం టౌన్‌హాల్‌లో జరుగుతుందని తెలియపరచడమయినది.
ఇట్లు – కుటుంబసభ్యులు’’
అందులో అతని ఫొటో కూడా ఉంది! 
పక్కనే ఉన్న భార్య అది చూసి తెల్లబోతూ, ‘‘ఇదేం అన్యాయమండీ? ఇలాంటి ప్రకటన వేయించుకున్నారేమిటీ?’’ అంది నొసలు చిట్లిస్తూ.
‘‘ఇవాళ ఏప్రిల్‌ ఫస్ట్‌ కదా! నన్ను ఫూల్‌ చేయడానికి నా ఫ్రెండ్స్‌ చేసిన ప్రాంక్‌ అయ్యుంటుంది’’ అన్నాడు గుర్నాథం.
‘‘ఎంత స్నేహితులైతే మాత్రం, ఇలాంటి అమంగళకరపు ప్రాంక్స్‌ ఏమిటీ?’’ అందామె కోపంగా. 
గుర్నాథం నగరంలోని ప్రముఖ న్యాపారవేత్తలలో ఒకడు. మిత్రులకు ఫోన్‌ చేశాడు. ఆ ప్రకటన తాము వేయలేదన్నారంతా. పత్రిక కార్యాలయానికి ఫోన్‌ చేసి, ఆ ప్రకటనను ఇచ్చినవారి వివరాలు తీసుకుని విచారిస్తే ఆ వ్యక్తి, ఫామ్‌లో పేర్కొన్న చిరునామా నకిలీ అని తేలింది. 
అయితే – ఆ రాత్రి స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ ఆఫీసు నుంచి తిరిగివస్తూన్న గుర్నాథం కారు బ్రేకులు ఫెయిలయ్యి అదుపుతప్పి రోడ్‌ డివైడర్‌ ని గుద్దుకోవడము, అతను అక్కడికక్కడే మరణించడమూ విశేషం!!

రెండు వారాల తరువాత నగరంలో అలాంటిదే మరో సంఘటన జరిగింది. ఈసారి ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ దయాకర్‌ ‘మృతి’ కి ‘శ్రద్ధాంజలి’ ప్రకటన ప్రచురితమైంది! 
అంతకు మునుపులాగే, ఈసారీ ప్రకటన ఇచ్చిన వ్యక్తీ, చిరునామా ఫేక్‌ అని తేలింది.
‘‘తన శ్రద్ధాంజలి ప్రకటనే బుర్రలో మెదులుతూండడంతో గుర్నాథం భయంతో చచ్చుంటాడు. నాకు అలాంటి భయంలేదు. ఎందుకంటే, నేను తొంభయ్‌ ఏళ్ళు బతుకుతానని జ్యోతిష్కుడు చెప్పాడు’’ అన్నాడు దయాకర్‌ భార్యతో. అయితే, అదే రోజు రాత్రి నిదట్లోనే చనిపోయాడు అతను!!
అప్పుడప్పుడు నిద్ర పట్టకపోతే మాత్రలు వేసుకోవడం అలవాటు అతనికి. ఆ రోజు పొరపాటున డోస్‌ ఎక్కువ తీసుకోవడంతో మరణం సంభవించినట్టు తేలింది!

ఆనందవర్మ రేసుగుర్రాల యజమాని.  గత నెల్లాళ్లుగా కుటుంబంతో యూరప్‌ టూర్‌లో ఉన్న ఆనందవర్మ వారం క్రితమే స్వదేశానికి తిరిగి వచ్చాడు. గుర్నాథం, దయాకర్‌ల మృతిని గురించి, చావుకు ముందే వారి శ్రద్ధాంజలి ప్రకటనలు వెలువడటం గురించి ఆలకించి నివ్వెరపోయాడు. 
ఆ రోజు ఉదయం దినపత్రికలో సెక్రెటరీ చూపించిన ప్రకటనను చూసి బిగుసుకుపోయాడు ఆనందవర్మ. అది అతని ‘శ్రద్ధాంజలి’ ప్రకటన!  
వెరిఫై చేయకుండా ఆ ప్రకటనను అంగీకరించి, ప్రచురించినందుకుగాను ఆ దినపత్రికపై పరువునష్టం దావా వేస్తానంటూ ఫోన్‌ లోనే చిందులు తొక్కాడు  అతను ప్రతి ఆదివారం సాయంత్రం స్విమ్మింగ్‌ పూల్‌కి వెళతాడతను. ఆ రోజు ఆదివారం కావడంతో ఎప్పటిలాగే స్విమ్మింగ్‌ పూల్‌కి వెళ్ళాడు. ఈతకొడుతూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. బ్యాక్‌స్ట్రోక్‌ చేస్తూంటే ఉన్నట్టుండి ఎవరో కాలు పట్టి లాగినట్టు నీటిలోకి జారిపోయాడు. 
ఆనందవర్మ శవం స్విమ్మింగ్‌ పూల్‌లో తేలింది!!... ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయినట్టు పోలీస్‌ పంచనామాలో నమోదు చేయబడింది. 

బతికుండగానే ‘శ్రద్ధాంజలి’ ప్రకటింపబడ్డవాళ్లంతా ఇరవై నాలుగ్గంటలలో మృతి చెందుతున్నారన్న వార్త దావానలంలా పాకడంతో, నగరంలో గొప్ప సంచలనం రేగింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు.
క్రైమ్‌బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ శివరామ్‌ పరిశోధనకు పూనుకున్నాడు. గుర్నాథం, దయాకర్, ఆనందవర్మల ఇళ్లకు వెళ్లాడు. వారి కుటుంబాలను, సంబంధిత డాక్టర్స్‌ను కలుసుకుని మాట్లాడాడు.
గుర్నాథం కారు కొత్తది. సడెన్‌గా బ్రేకులు ఫెయిలయ్యే అవకాశం తక్కువ. ఎవరో కావాలనే వాటిని ట్యాంపర్‌ చేస్తే తప్ప! దయాకర్‌కి నిద్రమాత్రలు అతని భార్యే అతని బెడ్‌ పక్కన పెట్టింది. సీసాలో మాత్రలు సగం వరకు ఉండాలనీ, అతను పత్రికలో వచ్చిన ప్రకటన గురించే ఆలోచిస్తూ పొరపాటున ఎక్సెస్‌ డోసేజ్‌ తీసుకుని వుంటాడనుకున్నామనీ చెప్పింది ఆవిడ. ఇకపోతే, ఆనందవర్మ ఎక్స్‌పర్ట్‌ స్విమ్మర్‌. అంత సులభంగా నీటిలో మునిగిపోతాడంటే నమ్మలేకపోతున్నారు ఎవరూను. అలాగని, ఫౌల్‌ ప్లేని కూడా అనుమానించలేకపోతున్నారు.
పత్రికలో ప్రకటన వెలువడిన అనంతరమే మరణాలు సంభవించినా, అవి సహజంగానో లేదా ప్రమాదవశాత్తూనో సంభవించినవిగా మెడికల్‌ సర్టిఫికేట్స్‌ చెబుతున్నాయి. ఎవరినీ అనుమానించడానికి అవకాశంలేదు. ప్రకటనల సోర్స్‌ని కనిపెట్టగలిగితే ఆ మిస్టరీ వీడొచ్చును అనుకున్నాడు శివరామ్‌.

ఆనాటి దినపత్రికలో మాజీ ఎంపీ కనకరాజు ‘శ్రద్ధాంజలి’ ప్రకటన వెలువడింది. క్రైమ్‌బ్రాంచ్‌కి పరుగెత్తాడు కనకరాజు. ‘‘ఇన్‌స్పెక్టర్‌! ప్రజాసేవకులను కాపాడవలసిన బాధ్యత మీ పోలీసులదే. నేను ప్రజాసేవకుణ్ణి!’’ అన్నాడు. 
‘‘ఇది ప్రాంక్‌ అయ్యుండవచ్చునేమో ఆలోచించారా?’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ శివరామ్,
‘‘నీ బండ పడ! ఇది ప్రాంకూ కాదు, ప్రాక్టికల్‌ జోకూ కాదయ్యా బాబూ!’’ కనకరాజు చిన్నగా నుదురు బాదుకున్నాడు. ‘‘ఆ సంఘటనలన్నీ నా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌లోనే జరుగుతున్నాయి మరి!’’.
ఆశ్చర్యపోయాడు శివరామ్‌. ‘‘మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారా?’’. 
‘‘ఎవరిని అనుమానించాలో తెలిసి చావడంలేదే!’’ అన్నాడు కనకరాజు సాలోచనగా. ‘‘ఐ వాంట్‌ పోలీస్‌ ప్రొటెక్షన్‌’’.

కనకరాజు చెప్పిన క్లోజ్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ గురించి ఆరా తీసాడు ఇన్స్‌ పెక్టర్‌ శివరామ్‌.  
గుర్నాథం ఓ బిజినెస్‌ మేన్‌. దయాకర్‌ ఓ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌. ఆనందవర్మకు రేసుగుర్రాలు ఉన్నాయి. సన్యాసిరావుది రియల్‌ ఎస్టేట్‌. కనకరాజు ప్రతిపక్షానికి చెందిన మాజీ ఎంపీ. అందరూ నలభయ్యో పడిలోనివారే. వీకెండ్స్‌లో సికిందరాబాద్‌లో ఉన్న ఓ క్లబ్‌లో కలుసుకుంటారు. 
కనకరాజు అనుమానిస్తున్నట్టు ఆ ఆబిచ్యువరీ ప్రకటనలకు, వారి చావులకు నిజంగానే సంబంధం ఉన్నట్లయితే, వాళ్ళెవరో ఆ ప్రకటనల ద్వారా ముందుగానే చెప్పి మరీ చంపుతున్నట్టు అర్థమవుతోంది! అందుకు పెద్ద ‘మోటివ్‌’ ఏదో ఉండాలనిపించింది.
ఏడాది కిందట స్నేహితులు ఐదుగురూ కలసి బిజినెస్‌ టూర్‌ అంటూ మలేషియా వెళ్లారనీ, ఫ్యామిలీస్‌ని తీసుకువెళ్ళలేదనీ ఎంక్వైరీలో తెలిసింది. వారి మలేషియా ట్రిప్‌కీ ఆ చావులకూ ఏదైనా లింక్‌ ఉందా అనిపించింది. వాళ్ల మలేషియా ట్రిప్‌కి ఏర్పాటు చేసిన ట్రావెల్‌ ఏజెంట్‌ వివరాలు, వారి ద్వారా టూర్‌ కి సంబంధించిన వివరాలూ సేకరించాడు.
శివరామ్‌కి డిటెక్టివ్‌ భగీరథ గుర్తుకొచ్చాడు. హాలిడేయింగ్‌కి అసిస్టెంట్‌ భావనతో కలసి రెండు రోజుల కిందట సింగపూర్‌ వెళ్ళాడతను. ఆ కేసులో అతని సాయం తీసుకోవాలనుకున్నాడు. ఆ కేసు పూర్వాపరాలను వివరిస్తూ, తాను సంపాదించిన మిత్రుల జాయింట్‌ ఫోటోగ్రాఫ్‌ని జతచేసి భగీరథకు మెయిల్‌ పంపించాడు. అక్కడ ఆ మిత్రబృందం యాక్టివిటీస్‌ గురించి విచారించి తెలియపరచవలసిందిగా కోరాడు.

కనకరాజు భయంతో ఆ రోజంతా ఇల్లు కదల్లేదు. అతని ఇంటి ముందు మఫ్టీలో కానిస్టేబుల్స్‌ కాపలా ఉన్నారు. అదేరోజు బంధువుల ఇంట్లో ఏదో ఫంక్షన్‌ ఉంది. బయటకు వెళ్లడానికి ధైర్యం చాలని కనకరాజు, కుటుంబాన్ని పంపించి తాను ఇంట్లోనే ఉండిపోయాడు. రాత్రికి పిజ్జా ఆర్డర్‌ చేసుకున్నాడు. పిజ్జా డెలివరీ బాయ్‌ని ఆపి చెక్‌ చేసి లోపలికి పంపించారు మఫ్టీలోని కానిస్టేబుల్స్‌. పిజ్జా తిని, మంచినీళ్లు తాగి పడుకున్నాడు కనకరాజు. తెల్లవారేసరికి చనిపోయి ఉన్నాడు!! 
నిద్దర్లోనే మాసివ్‌ హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చనిపోయినట్టు డాక్టర్‌ సర్టిఫై చేశాడు. కనకరాజు భయాలు నిజమైనందుకు ఇన్‌స్పెక్టర్‌ విచారించాడు. కుటుంబసభ్యులు అభ్యంతరం చెబుతున్నా లెక్కచేయకుండా, ‘అనుమానాస్పదపు మృతి’ అంటూ కనకరాజు శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించాడు. 
ఆ రిపోర్టులోని విషయం శివరామ్‌ని నిర్ఘాంతపరచింది. ‘గతరాత్రి కనకరాజు తిన్న ఆహారంలో ‘ఆంఫెటామైన్స్‌’ డ్రగ్‌ హెవీ డోస్‌ కలసింది. అతను హైపర్‌ టెన్షన్‌ పేషెంట్‌ కావడంతో, అది హార్ట్‌ ఎటాక్‌ని ఇండ్యూస్‌ చేసుంటుంది’!

మూడు రోజుల తరువాత డిటెక్టివ్‌ భగీరథ పంపించిన రిపోర్ట్‌ అందింది ఇన్‌స్పెక్టర్‌కి. శివరామ్‌ అభ్యర్థన అందగానే సింగపూర్‌ నుంచి మలేషియాకి వెళ్ళారు డిటెక్టివ్స్‌. అక్కడ తమ పరిశోధనలో వెలుగులోకి వచ్చిన విషయాలను అతనికి మెయిల్‌ చేశారు.
ఆ నివేదిక సారాంశం ఇది – ‘మిత్రపంచకం కౌలాలంపూర్‌లో పెట్రినాస్‌ ట్విన్‌ టవర్స్‌కి చేరువలోనున్న మాండరిన్‌ ఓరియంటల్‌ హోటల్లో బస చేశారు. ఒరిజినల్‌ బుకింగ్‌ రెండు వారాలకైనా, ఐదు రోజులకే ఖాళీచేసేశారు. మలేషియాలోని ‘బాటూ కేవ్స్‌’ వద్దనున్న 140 అడుగుల ‘మురుగన్‌’ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తయినది. అక్కడే పరిచయమయింది కుముదం వారికి. ఆమె ఓ అరవపిల్ల. తెలుగు మాట్లాడుతుంది. ఇరవయ్‌ మూడేళ్ళ అందగత్తె. టూరిస్ట్‌ గైడ్‌.
ఆమె అందానికి ఫ్లాట్‌ అయిపోయిన మిత్రబృందం ఆమెను తమ గైడ్‌ గా నియమించుకున్నారు. ఆమెతో ‘రెడాంగ్‌’ ఐలెండ్‌ కి వెళ్ళారు. తొమ్మిది దీవుల సముదాయం అది. ఆహ్లాదకరమైన బీచ్‌ రిసార్ట్‌. కోరల్స్‌తో రమణీయంగా ఉండే రెడాంగ్‌లో స్నార్కెలింగ్, డైవింగ్, క్లిస్టర్‌ క్లియర్‌ వాటర్స్‌ ప్రధాన ఆకర్షణలు. అక్కడ ఏర్‌పోర్ట్‌ కూడా ఉండడం వల్ల ఇటు కౌలాలంపూర్‌ లోని ‘సుబాంగ్‌’ ఏర్‌పోర్ట్‌ నుంచి, అటు సింగపూర్‌లోని ‘చాంగీ’ ఏర్‌ పోర్ట్‌ నుంచి డెయిలీ ఫ్లైట్స్‌ ఉన్నాయి. 
ఆ దీవిలో రోజంతా సరదాగా గడిపిన మిత్రపంచకం, ఆ రాత్రి తప్పతాగి కుముదంపైన అత్యాచారం జరిపింది. ఆమె చనిపోవడంతో శవాన్ని సముద్రంలో పడేశారు. కౌలాలంపూర్‌ తిరిగి వెళ్లి, హడావిడిగా రూమ్స్‌ ఖాళీ చేసేసి ఇండియాకి చెక్కేశారు.

కుముదం బాయ్‌ ఫ్రెండు, ఫియాన్స్‌ నిఖిల్‌ తెలుగు కుర్రాడు. ఇరవయ్‌ ఎనిమిదేళ్లుంటాయి. సింగపూర్‌కి చెందిన ఓ మర్చెంట్‌ షిప్‌లో పనిచేస్తున్నాడు. త్వరలో వారి వివాహం జరుగనుంది. 
మూడు నెలల కిందట అతని షిప్‌ సింగపూర్‌కి తిరిగి వచ్చింది. తరచు తనకు ఫోన్‌ చేసే కుముదం నుంచి ఫోన్‌ కాల్స్‌ ఆగిపోవడంతో ఆందోళనకు గురైన నిఖిల్‌ మలేషియా వెళ్ళాడు. కుముదం కొన్ని నెలలుగా కనిపించడంలేదని తెలిసింది. ఆమె ఇండియన్‌ టూరిస్టులతో రెడాంగ్‌ వెళ్లిందనీ, ఆ తరువాత కాంటాక్ట్‌లో లేదనీ ఆమె స్నేహితురాళ్ల ద్వారా తెలిసింది. రెడాంగ్‌ ఐలెండ్‌కి వెళ్లాడతను. అక్కడ వారికి బీర్‌ బాటిల్సవీ సప్లయ్‌ చేసిన పన్నెండేళ్ళ ఫిషర్‌ మెన్‌ కుర్రాడి ద్వారా ఆమెకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాడు. రెండు రోజుల తరువాత కుముదం శవం ఒడ్డుకు కొట్టుకువచ్చిందనీ, తాను భయపడి ఆ సంఘటన గురించి ఎవరితోనూ చెప్పలేదనీ అన్నాడు ఆ కుర్రాడు. వారితో కలిసి తీసుకున్న ‘సెల్ఫీ’ ని చూపించాడు. నిఖిల్‌ దాని కాపీ తీసుకుని కౌలాలంపూర్‌ వెళ్ళాడు. మిత్రపంచకం బసచేసిన హోటల్‌ని కనిపెట్టి, దాని రిజిస్టర్‌ నుంచి వారి వివరాలను, ఇండియాలోని వారి అడ్రెస్‌లనూ సంపాదించాడు. ఆ మర్నాడే అతను ఇండియాకి ఫ్లైట్‌ ఎక్కాడు.’ 
ఇన్‌స్పెక్టర్‌ శివరాం నివ్వెరపోయాడు. సమాజంలో పెద్దమనుషుల్లా చలామణీ అవుతూ విదేశంలో అంతటి ఘాతుకానికి పాల్పడ్డ ఆ మిత్రపంచకం పట్ల ఆగ్రహం, అసహ్యం కలిగాయి. ఆ దుర్మార్గులను వెదుక్కుంటూ ఇండియాకి వచ్చిన నిఖిల్‌ వారిని కనిపెట్టి ‘శ్రద్ధాంజలి’ ప్రకటనలతో హెచ్చరించి మరీ వారిని తుదముట్టిస్తున్నాడని అర్థమయింది. ఎవరి సహకారమూ లేకుండా ఆ చావులను సహజమైనవిగా, ప్రమాదాలుగా ఎలా సృష్టించగలిగాడా అని అచ్చెరువందాడు. వారిలో మిగిలి ఉన్నది రియాల్టర్‌ సన్యాసిరావు ఒక్కడే.

డిటెక్టివ్‌ పంపిన ఆధారాలతో సన్యాసిరావును అరెస్ట్‌ చేయాలనుకున్నాడు ఇన్‌స్పెక్టర్‌. అందువల్ల కుముదానికి జరిగిన అన్యాయానికి అతనికి శిక్ష పడేలా చూడడమేకాక, ‘శ్రద్ధాంజలి’ ఎఫెక్ట్‌ నుంచి కాపాడాలన్న ఆలోచన కూడాను. కోర్టు నుంచి వారెంట్‌ తీసుకునే ముందు అతనితో మాట్లాడాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. సన్యాసిరావును గూర్చిన ‘శ్రద్ధాంజలి’ ప్రకటనను గురించి తెలుగు దినపత్రికలను అలెర్ట్‌ చేసివుంచాడు. 
అయితే, వారం తిరక్కుండానే సన్యాసిరావు ‘శ్రద్ధాంజలి’ ప్రకటన ఓ ఆంగ్ల దినపత్రికలో వెలువడింది!
ఎప్పటిలాగే ఆ ప్రకటనదారుడి పేరు, చిరునామా ఫేక్‌ అని తేలింది.
సన్యాసిరావు ఇంటికి వెళ్ళాడు శివరామ్‌. అతను బయటకు వెళ్లాడనీ, ఎక్కడికి వెళ్లిందీ తెలియదనీ చెప్పారు. స్వయంగా డ్రైవ్‌ చేసుకుని వెళ్లినట్టు తెలిసింది. సన్యాసిరావు ఆఫీసుకు వెళ్ళిన ఇన్‌స్పెక్టర్, అతనికి వికారాబాద్‌ లో ఓ ఫామ్‌హౌస్‌ ఉందనీ, అప్పుడప్పుడు అక్కడికి వెళుతూంటాడనీ తెలుసుకున్నాడు.
శివరామ్‌ వికారాబాద్‌ పోలీసులకు ఫోన్‌ చేసి సన్యాసిరావు ఫామ్‌హౌస్‌ గురించి చెప్పి, వెంటనే మఫ్టీలో మనుషులను అక్కడికి పంపి అతనికి రక్షణ కల్పించవలసినదిగా కోరాడు. హైదరాబాదు నుంచి వికారాబాద్‌ కు కారులో రెండు గంటల ప్రయాణం. వెంటనే బైలుదేరాడు. ఊరు సమీపిస్తూండగా పోలీసుల నుంచి మెసేజ్‌ వచ్చింది, సన్యాసిరావు ఫామ్‌హౌసుకు రాలేదని. 

ఉదయం ‘శ్రద్ధాంజలి’ ప్రకటనను చూడడంతో సన్యాసిరావుకు భయం పట్టుకుంది. వికారాబాద్‌ లోని ఫామ్‌ హౌస్‌కి బయల్దేరాడు ఎవరికీ చెప్పకుండా. తీరా టౌన్‌లో ప్రవేశించాక, అనంతగిరి హిల్స్‌కి వెళ్లి శ్రీ అనంత పద్మనాభస్వామికి అర్చన చేయించుదామనిపించింది. తిన్నగా ఆలయానికి వెళ్లాడు. ఆరోజు గుళ్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందడంతో చాలా సమయమే పట్టిందక్కడ. అర్చనానంతరం తీర్థప్రసాదాలు తీసుకుని ఫామ్‌హౌస్‌కి వెళ్ళాడు.
తలుపులు తెరిచే వున్నాయి. కేర్‌ టేకర్‌ కనిపించలేదు. తాను వస్తున్నట్టు ముందస్తు సమాచారం అందినట్టైతే కారుకు ఎదురొచ్చేవాడతను. హాల్లోంచే ‘సాయీ!’ అని పిలుస్తూ, మేడమీదున్న తన గదికి వెళ్ళిపోయాడు సన్యాసిరావు. దుస్తులు మార్చుకుని, టీవీ ఆన్‌ చేస్తూంటే గుమ్మం దగ్గర అలికిడయింది.
‘‘వచ్చావా, సాయీ!’’ అంటూ వెనుదిరిగిన సన్యాసిరావు, ఆగంతకుణ్ణి చూసి అదిరిపడ్డాడు.
ఆ వ్యక్తి చేతిలో పిస్టల్‌ ఉంది. అది సన్యాసిరావుకు గురిపెట్టబడింది!

ఫామ్‌ హౌస్‌ చేరుకున్న ఇన్‌స్పెక్టర్‌ శివరామ్, సన్యాసిరావు కారును చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. గబగబా లోపలికి పరుగెత్తాడు. అదే సమయంలో వినవచ్చాయి రెండు పిస్టల్‌ షాట్స్‌! ఉలికిపడి, అవి పైనుంచి వచ్చినట్టు గ్రహించి మేడమీదకు పరుగెత్తాడు. 
గదిలో కనిపించిన దృశ్యం అతన్ని నిర్ఘాంతపరచిందిం గది మధ్యగా సన్యాసిరావు, గుమ్మం దగ్గర ఓ ఆగంతకుడూ నెత్తురుమడుగులో పడున్నారు!!
సన్యాసిరావు గుండెలో బులెట్‌ దూరితే, ఆగంతకుడి కుడి కణతలో గుండు దూరింది. ఆగంతకుడి కుడిచేతిలో పిస్టలూ, ఎడమచేతిలో సెల్‌ఫోనూ ఉన్నాయి. ప్రాణాలు కోల్పోయారు ఇద్దరూ.
సెల్‌ ఫోన్‌ని తీసి చూశాడు శివరామ్‌. వీడియో ఆన్‌లో ఉంది. దాన్ని రీప్లే చేశాడు –
‘‘నా పేరు నిఖిల్‌. మలేషియాలోని రెడాంగ్‌ ఐలెండులో నా ఫియాన్సీ కుముదంపైన మూకుమ్మడి అత్యాచారం జరిపి అతి దారుణంగా చంపేశారు సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అవుతూన్న గుర్నాథం, దయాకర్, ఆనందవర్మ, కనకరాజు, సన్యాసిరావులు. ‘శ్రద్ధాంజలి’ ప్రకటనలతో హెచ్చరించి మరీ చంపేశాను వాళ్ళను. కుముదానికి జరిగిన అన్యాయం గురించి ఆలకించి ఆ దుష్టపంచకం పైన అసహ్యంతో, మామీద సానుభూతితో వారి సన్నిహితులు కొందరు నా మిషన్‌లో సహకరించడం విశేషం. వారందరికీ నా కృతజ్ఞతాభివందనాలు. కుముదం నా ప్రాణం. తాను లేని జీవితాన్ని ఊహించుకోలేను. అందుకే నేనూ తన దగ్గరకు వెళ్లిపోతున్నాను.’’
- తిరుమలశ్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement