తెల్లవారుఝాము నాలుగు కావస్తోంది. ఊరంతా లేచి వ్యవసాయ పనుల్లో తలదూర్చడానికి సమాయత్తమవుతోంది. ఇంతలో రాంసింగ్ ఇంట్లో నుండి ఏడ్పులు, పెడబొబ్బలు వినరావడంతో జనమంతా అటువైపు పరుగులు తీశారు. రాంసింగ్ నేల మీద నిద్ర పోతున్నట్లు పడిపోయి ఉన్నాడు. అతని గుండెలమీద తల వాల్చి అడ్డంగా అచేతనంగా పడివుంది అతని అర్ధాంగి జానకమ్మ. బహుశా రాత్రి నిద్దట్లోనే ఇద్దరి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయి ఉంటాయని.. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వెలిబుచ్చసాగారు. అక్కడి దృశ్యం చూస్తుంటే రాంసింగ్ చనిపోగానే, జానకమ్మ గుండె హఠాత్తుగా ఆగిపోయి ఉండవచ్చనే నిర్ణయం అందరిలో బలపడింది.
మద్దనపల్లి గిరిజన తాండా. రాంసింగ్ ఊళ్ళో ఎవరికీ ఎలాంటి కష్టమొచ్చినా ఆదుకుంటాడు.
రాంసింగ్, జానకమ్మలకు ఒక కుమారుడు ధరంసింగ్. ఒక కూతురు యమునాబాయి. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ హైదరాబాదులో స్థిరపడ్డారు.
ఆ రోజు తాండా వాసులంతా పనులకు స్వస్తి చెప్పి రాంసింగ్ పిల్లలు వచ్చే వరకు వాళ్ళ వంశానుసారం అంతిమ సంస్కారానికి అన్ని ఏర్పాట్లు చెయ్యాలని చేయీ, చేయీ కలుపసాగారు. తాండాకు ఉత్తరాన శ్మశానవాటికలో ఖననం చేయడానికి వీలుగా రెండు గోతులు ప్రక్క, ప్రక్కనే తవ్వించారు. ధరంసింగ్, యమునాబాయి కలిసి కారులో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వచ్చారు. రాంసింగ్ దంపతుల అంతిమ సంస్కారం ముగిసే సరికి సాయంత్రం దాదాపు ఆరయ్యింది.
ధరంసింగ్, యమునాబాయిలను ఓదార్చుతూ మరో గంట సేపు గడిపి అంతా వెళ్లి పోయారు.
ధరంసింగ్ మనసు శూన్యమయ్యింది. తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి పరమపదించడం జీర్ణించుకోలేక పోతున్నాడు. అదే విషయం చెల్లెలు యమునాబాయితో చాలా సేపు చర్చించాడు.
రాత్రంతా ఉన్న ఒక్క చెక్క బీరువా సర్దుతూ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని ఆశగా వెదికాడు. ఆమధ్య తనతో సంప్రదించి ఎస్టీ కార్పోరేషన్ బ్యాంకులో అప్పు తీసుకుని కొన్న ట్రాక్టరు కాగితాలు ఒక నల్లని హ్యాండు బ్యాగులో ఉన్నాయి. అవి తప్ప మరేవీ లేవు.
‘ట్రాక్టరు అమ్మేశానన్నాడే..కాగితాలన్నీ కొన్నవాడు తీసుకోలేదా..’ అని ఆలోచిస్తూ మంచం మీద నడుం వాల్చాడు ధరంసింగ్.
ఆ మరునాడు ఉదయమే తన అనుమానం తీరక మళ్ళీ నల్లబ్యాగు తెరచి చూశాడు ధరంసింగ్. అందులో ఒక రహస్యపు అర వుంది. దాని జిప్ లాగి చూడగానే.. ట్రాక్టరు దేవదాసుకు అమ్మి కుదుర్చుకున్న ఒప్పంద పత్రం కనబడింది.
అందులో దేవదాసు ఒక లక్ష రూపాయలు నగదు అడ్వాన్సుగా ఇచ్చినట్లు, మిగతా కిస్తులు తాను కట్టుకునే విధంగా రాసి వుంది. అయితే కిస్తులన్నీ కట్టడం పూర్తయ్యాక కాగితాలు తీసుకునే వాడేమో! అనుకున్నాడు. కాని రెండు కిస్తులు కట్టనట్లు బ్యాంకు నుంచి వచ్చిన నోటీస్ ఉంది. కిస్తులు కట్టుకుంటానన్న దేవదాసు ఎందుకు కట్టలేదు. ఇందులో ఏమైనా తిరకాసు వుందా? అని ఆలోచించసాగాడు. కిస్తులు కట్టకుంటే ఒప్పందపత్రం ప్రకారం నలుగురు పెద్దమనుషుల ముందు అడిగించే ధైర్యం నాన్న చేస్తాడే తప్ప ఇలా మనోవేదనతో గుండె ఆగి మరణించడం నమ్మబుద్ధి కావడం లేదు. వెంటనే యమునాబాయికి చెప్పి ములుగు బయలుదేరాడు.
నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళాడు ధరంసింగ్.
ధరంసింగ్‌ను చూసి హడావుడిగా బయటకు వెళ్ళబోతున్న పోలీసు ఇన్‌స్పెక్టర్ విజయశేఖర్ ఆగిపోయాడు.
‘‘సర్..నా పేరు ధరంసింగ్. మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను’’ అంటూ రెండు చేతులు కట్టుకుని వినయంగా అన్నాడు ధరంసింగ్.
‘‘చెప్పండి’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్.
‘‘సర్..మాది మద్దనపల్లి. మా నాన్న పేరు రాంసింగ్. మా అమ్మ పేరు జానకమ్మ. నిన్న రాత్రి హఠాత్తుగా ఇద్దరూ చనిపోయారు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకోసాగాడు ధరంసింగ్.
‘‘సారీ ధరంసింగ్.. ఆ వార్త విని నేనూ బాధపడ్డాను. మీ నాన్న నాకు బాగా తెలుసు. చాలా అమాయకుడు’’
‘‘అవును సార్. నాన్న అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఎవరైనా మోసం చేశారా అనే అనుమానం వుంది’’ అంటూ కర్చీఫ్‌తో కళ్ళుతుడుచుకోసాగాడు.
‘‘మోసమా! ఈ మధ్య మీ నాన్న ఏమైనా లావాదేవీలు చేశాడా?’’
‘‘ఒక ట్రాక్టరు బ్యాంకు లోనుతో కొన్నాడు సర్. దాన్ని దేవదాసుకు అమ్మాడు. అతను మిగతా కిస్తులు కట్టుకుంటానని ఒప్పందపత్రం రాసిచ్చాడు. రెండు కిస్తుల తరువాత మరో రెండు కిస్తులు కట్టలేదు. బ్యాంకు నోటీసు వచ్చింది. ఆ కోణంలో ఆలోచించి మీ దగ్గరకు వచ్చాను’’
‘‘అంటే దేవదాసు మీద అనుమానమున్నదా?’’ అంటూ అడిగాడు విజయశేఖర్.
‘‘అవును సర్. వారిది సహజ మరణం కాదేమోనని అనుమానంగా వుంది’’
‘‘అయితే శవాలను పోస్ట్‌మార్టం చేస్తే గాని విషయం బయటపడదు. అప్పుడే కేసు పరిశోధనకు వీలవుతుంది. పోస్ట్‌మార్టం చెయ్యాలంటే నువ్వు కంప్లైంట్ ఇవాల్సి ఉంటుంది’’ అంటూ టేబుల్ పై ఉన్న బెల్ కొట్టి ఒక రైటర్ రమణయ్యను పిలిచాడు.
పోలీసు ఫార్మాలిటీస్ పూర్తీ కాగానే ధరంసింగ్‌ను, మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను ఇంకా పోలీసు డిపార్ట్‌మెంటు ఫోటోగ్రాఫర్‌ను తీసుకుని జీపులో మద్దనపల్లి తాండాకు బయలుదేరాడు విజయశేఖర్.
పోలీసులు వచ్చారని తెలియగానే తాండా అంతా అట్టుడికి పోయింది. గ్రామ సర్పంచ్ బిక్కు బిక్కు మంటూ శ్మశాన గడ్డకు పరుగులు తీశాడు. కాసేపట్లోనే తహసిల్దారూ వచ్చాడు.
ఇన్‌స్పెక్టర్ ఆదేశాలతో శవాలను బయటికి తీయడం, పంచనామా జరపడం, పోస్ట్‌మార్టం కోసం ములుగు హాస్పిటల్‌కు తరలించడం జరిగింది.
మరునాడు ఉదయం ధరంసింగ్ పోలీసు స్టేషన్‌లో అడుగు పెట్టగానే విజయశేఖర్ పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ అప్పుడే చదవడం పూర్తి చేశాడు.
‘‘ధరంసింగ్.. నీ అనుమానం నిజమేనని తేలింది’’ అన్నాడు విజయశేఖర్.
ధరంసింగ్ విస్తుపోయి చూస్తూండగా ‘‘మీ పేరంట్స్‌ది సహజమరణం కాదు. ఆత్మహత్యా కాదు. హత్య. వాళ్ళ మీద పొటాషియం సైనైడ్ విషప్రయోగం జరిగింది’’ అనగానే కుప్ప కూలిపోయాడు ధరంసింగ్. కానిస్టేబుల్ ఓబయ్య గబుక్కున గ్లాసుతో మంచినీళ్ళు తీసుకువచ్చి, ధరంసింగ్ ముఖం మీద చిలకరించాడు.
‘‘నువ్వు ధైర్యంగా ఉండు. హంతకులను పట్టుకుని శిక్ష వేయించే పూచీ నాది’’ అంటూ ధరంసింగ్‌ను ఓదార్చాడు విజయశేఖర్.
‘ఈ హత్యలు చేసిన వాణ్ణి పట్టుకోవాలంటే ముందుగా సైనైడ్ విషయం తేలాలి’ అంటూ కొద్ది సేపు ఆలోచించి ‘‘పద వెళ్దాం..’’ అంటూ లేచి జీపు తీయమంటూ డ్రైవర్‌ను ఆదేశించాడు విజయశేఖర్.
ములుగులో ఉన్నది ఒకే ఒక కాశీనాథం కంసాలి షాపు. అందులో కస్టమర్ల అభిరుచి మేరకు బంగారు నగలు వర్కర్లతో తయారు చేయించడం, అమ్మడం కాశీనాథం వ్యాపారం. సైనైడ్ అతని షాపులో తప్ప మరో చోట దొరకడం అసాధ్యం.
నేరుగా కాశీనాథం షాపు ముందు ఆగింది పోలీసు జీపు.
‘‘నమస్కారం సర్. రండి.. రండి..’’ అంటూ రెండుచేతులా నమస్కరిస్తూ ఆహ్వానించాడు కాశీనాథం.
‘‘మీతో ఒక ముఖమైన కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందామని వచ్చాను’’ అంటూ విజయశేఖర్ తనకు కావాల్సిన విషయం అడిగాడు.
‘‘అలాగే సర్..’’ అంటూ లోపలి గదిలోకి ఇద్దరినీ తీసుకెళ్ళాడు. సీసీ కెమెరాలో గతవారం రికార్డయిన దృశ్యాలపై దృష్టి సారించాడు విజయశేఖర్.
రెండు రోజుల క్రితం తాలూకు దృశ్యాలలో ఒకతను సైనైడ్ దొంగిలిస్తున్నాడు.
‘‘నగలు దొంగతనం చెయ్యడం రివాజు. కాని వీడేమో సైనైడ్ దొంగిలించడం.. చావడానికా సర్..’’ అంటూ వ్యంగ్యంగా అడిగాడు కాశీనాథం.
‘‘చావడానికి కాదు చంపడానికి. అయినా అత్యంత భద్రంగా దాచాల్సింది అంత నిర్లక్ష్యంగా ఎందుకు బయట పెట్టావు?’’ అంటూ చిరుకోపం ప్రదర్శించాడు. ‘‘వాణ్ణి గుర్తుపట్టగలవా?’’ అంటూ ప్రశ్నించాడు .
‘‘మన ఊరి వాడే సర్. దేవదాసు..’’
‘‘అతనే సర్.. ’’ అంటూ ధరంసింగ్ చిన్నగా కేక వేసినంత పని చేశాడు.
విజయశేఖర్ ఆదేశం మేరకు దాన్ని కాపీ చేసిచ్చాడు కాశీనాథం. వీడియో కాపీని తీసుకొని స్టేషన్‌కు బయలుదేరారు. స్టేషన్‌లోకి అడుగు పెడ్తూనే కానిస్టేబుల్ ఓబయ్యను పిలిచి దేవదాసును అర్జంటుగా తీసుకు రమ్మని హుకుం జారీ చేశాడు విజయశేఖర్.
ధరంసింగ్ ఇచ్చిన చిరునామాతో ఓబయ్యకు దేవదాసు ఇల్లు కనుక్కోవడంలో పెద్ద కష్టమేమీ కాలేదు.
నెమ్మదిగా వెళ్ళి తలుపు తట్టాలనుకున్నాడు ఓబయ్య. ఇంతలో ఎవరో ట్రాక్టరు గురించి లోన మాట్లాడుకోవడం వినరావడంతో నెమ్మదిగా కిటికీ పక్కకు వెళ్ళాడు. హాల్లో నుంచి వాళ్ళ మాటలు స్పష్టంగా వినవస్తున్నాయి. వెంటనే వారి మాటలను తన దగ్గరి సెల్‌ఫోన్‌తో రికార్డు చెయ్యసాగాడు.
వారి సంభాషణ ఆగిపోయింది. వారు బయటికి వస్తున్నట్లు గమనించి చటుక్కున తిరిగి వీధిలో పడ్డాడు ఓబయ్య. వెళ్తున్నది బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్. ఓబయ్యకు బాగా తెలుసు. అప్పులు కావాలంటే ఆతనే శరణ్యం.
ఆతను వెళ్ళిపోయేదాకా చూసి దేవదాసు ఇంటి తలుపు తట్టాడు ఓబయ్య. కానిస్టేబుల్‌ను చూడగానే కంగు తిన్నాడు దేవదాసు.
‘‘ఎస్సైగారు మిమ్మల్ని అర్జంటుగా తీసుకురమ్మన్నారు’’ అని చెప్పాడు.
‘‘ఎందుకు?’’ గంభీరంగా అడిగాడు దేవదాసు. లోలోన భయమనిపించినా బయటకు కనపడకుండా–
‘‘నాకేం తెలుసు సర్. పెద్దల వ్యవహారం’’ నింపాదిగా సమాధానిమిచ్చాడు ఓబయ్య.
‘‘సరే..బట్టలు మార్చుకుని వస్తాను’’ అంటూ లోనికి వెళ్ళాడు దేవదాసు.
ఇద్దరూ పోలీసు స్టేషన్ చేరుకున్నారు. అక్కడి వాతావరణం చూసే సరికి దేవదాసుకు ఒంట్లో వణుకు పుట్టింది. పోలీసుస్టేషన్ హాల్లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయబడి వుంది. ఓబయ్య నేరుగా విజయశేఖర్ దగ్గరికి వెళ్లి తాను రికార్డు చేసిన విషయం వినమని తన సెల్‌ఫోన్ ఇచ్చాడు. అది వినగానే విజయశేఖర్‌లో మరింత ఉత్సాహం పెల్లుబికింది.
దేవదాసును తన గదిలోకి తీసుకెళ్ళాడు. అతడి గుండె వేగం తగ్గింది. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ. ‘‘సర్.. ఎందుకో పిలిచారట’’ అన్నాడు రెండు చేతులతో నమస్కరిస్తూ.
‘‘అతను రాంసింగ్ కొడుకు ధరంసింగ్. రాంసింగ్ దంపతులు చనిపోవదానికి నువ్వే కారణమని నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు..’’ అంటూ బయట నిలబడ్డ ధరంసింగ్‌ను చూపించాడు విజయశేఖర్.
‘‘నాకేమీ తెలియదు సర్. దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకు ఎలాంటి సంబంధం లేదు’’ అంటూ దేవదాసు భయం, భయంగా అన్నాడు.
‘‘చూడు దేవదాసు. అనవసరంగా నా లాఠీకి పని చెప్పకు. నా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి. నిజం చెప్పలేదనుకో లాఠీ దెబ్బలు రుచి చూడాల్సి వస్తుంది’’ అంటూ గద్దించాడు విజయశేఖర్.
దేవదాసు మెడపై చెయ్యి వేసి హాల్లోకి తోశాడు.
‘‘అటు చూడు’’ అంటూ గద్దిస్తూ కాశీనాథం షాపులో రికార్డు అయిన క్లిప్పింగులు తెరపై ప్రదర్శించమని రమణయ్యను ఆదేశించాడు. అందులో సైనైడ్ తస్కరిస్తున్నట్లు కనబడేసరికి కనుగుడ్లు తేలేశాడు దేవదాసు.
‘‘సైనైడ్ రాంసింగ్ దంపతుల మీద ప్రయోగించావు. ఇదిగో పోస్ట్‌మార్టం రిపోర్ట్స్’’ అంటూ దేవదాసు ముఖమ్మీద టప టపలాడించి విలేఖరుల ముందుంచాడు విజయశేఖర్.
‘‘నాకేం అవసరం సర్. వాళ్ళనెందుకు చంపుతాను’’ బింకంగా అన్నాడు దేవదాసు.
‘‘ఎందుకా..ఇది విను’’ అంటూ ఓబయ్య వంక చూశాడు విజయశేఖర్.
దేవదాసు ఇంటికి వెళ్ళినప్పుడు తాను బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్‌ను చూసిన విషయం చెబుతూ సెల్‌ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు ఓబయ్య.
‘‘దేవదాసూ, చిన్న పొరబాటు చేశావు. రాంసింగ్‌కు రాసిచ్చిన ఒప్పందపత్రం తీసుకోవాల్సింది’’
‘‘దాని సంగతి వదిలేయండి సార్. ధరంసింగ్ నుండి ఎలాగోలా నేను సంపాదిస్తాను కాని ముందుగా ఈ విషయం చెప్పండి, రాంసింగ్ పోయాడు కదా... ఇక కిస్తులు కట్టాల్సిన పనిలేదు కదా!’’
‘‘కాని డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఇన్సూరెన్స్ వాళ్లకు సబ్మిట్ చెయ్యాలి. వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. మా బ్యాంకుకు ఒక కాపీ వస్తుంది. కొంత సమయం పడ్తుంది’’
‘‘సమయం పట్టనివ్వండి. కిస్తులు కట్టాల్సిన అవసరం లేదని నాకు తెలుసు గాని..ఆమాట మీ నోట వినాలని..’’
‘‘కిస్తులు కట్టాల్సిన అవసరం లేదు..’’
‘‘అయితే రాత్రికి పార్టీ ఇస్తాను. ఘనంగా బక్షీసు ఇస్తాను. మనవారందరినీ తీసుకుని రావాలి’’
ఓబయ్య సెల్‌ఫోన్ ఆగి పోయింది.
‘‘ఇప్పటికైనా వాస్తవం ఒప్పుకో.. లేకుంటే..’’ అంటూ వీరావేశంతో లాఠీ ఝళిపించాడు విజయశేఖర్.
దేవదాసుకు నోరు విప్పక తప్పలేదు.
‘‘సర్..నిజం చెబుతాను’’ అంటూ తాను చేసిన నిర్వాకం వివరించసాగాడు....
‘‘రాంసింగ్‌తో నమ్మకంగా మెలిగేవాణ్ణి. లక్ష రూపాయలిచ్చి ట్రాక్టర్ తీసుకున్నాను. మిగతా కిస్తులన్నీ నేనే కట్టుకుంటానని ఒప్పంద పత్రం రాసి ఇచ్చాను. రెండు కిస్తులు సకాలంలో కట్టాను. ఆతరువాత డబ్బులకు ఇబ్బంది వచ్చింది. బాగా ఆలోచించాను. ట్రాక్టరు ఇంకా నా పేరు మీద బదిలీ కాలేదు. రాంసింగ్ ఇన్సూరెన్స్ చేశాడు కనుక అతడు చనిపోతే కిస్తులు కట్టాల్సిన అవసరం ఉండదని ప్లాను వేశాను.
ఎవరికీ అనుమానం రాకుండా సైనైడ్ తస్కరించాను. దాన్ని విస్కీలో కలుపుకొని వారి ఇంటికి వెళ్లాను. తాండా అంతా నిర్మానుష్యంగా ఉంది. మూడు గ్లాసుల్లో విస్కీ నీళ్ళు కలిపి వారికి ఇచ్చాను. నేను తాగుతున్నట్లు నటించాను. వాళ్ళు క్షణాల్లో చనిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా మందు బాటిల్ గ్లాసులు అన్నీ సర్దుకుని బయటపడ్డాను’’ అంటూ భోరుమన్నాడు దేవదాసు.
ధరంసింగ్ ఆవేశంగా లేచి దేవదాసును కొట్టబోయాడు. ఓబయ్య అడ్డుకున్నాడు.
‘తగిన శాస్తి నేను చేస్తాగా’ అన్నట్టు ధరంసింగ్ వంక చూశాడు ఇన్‌స్పెక్టర్ విజయశేఖర్.
ఒప్పంద పత్రం
Published Sun, Dec 8 2019 3:37 AM | Last Updated on Sun, Dec 8 2019 3:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment