
క్యాష్ కౌంటర్ నుంచి జీతం తీసుకు వెళ్ళిన సన్యాసిరావు కాసేపటికే తిరిగి వచ్చి, ‘వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చేశావు నాకు,’ అంటూ క్యాషియర్‌కు డబ్బు తిరిగి ఇచ్చేశాడు. తనకు డబ్బులు ఎక్కువ వచ్చేశాయంటూ సన్యాసిరావు అలా తిరిగి ఇవ్వడం అది మొదటిసారి కాదు. ఒక్కోసారి క్యాష్ బ్యాలన్స్ చెక్ చేసుకున్న జగదీష్, తన దగ్గర షార్టేజ్ కనిపించకపోవడంతో, సన్యాసిరావు పొరబడ్డాడేమోనని ఆ సొమ్ము వాపసు చేయబోతే – ‘బహుశా ఎవరికో తక్కువ ఇచ్చుంటావు. వాళ్లు వచ్చి అడిగితే ఏం చేస్తావ్? ఉంచు’ అంటూ, తీసుకోకుండా వెళ్ళిపోయేవాడు. అతని నిజాయితీకి ఆ బ్యాంకులో మెచ్చుకోనివారంటూ లేరు. సన్యాసిరావు అదే బ్యాంక్‌లో లెడ్జర్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు.
రంగరాజుకు పిచ్చి పిచ్చిగా ఉంది – ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో. అర్జెంటుగా పాతిక వేలు కావాలి అతనికి. రెండు రోజులలో గుర్రపు పందేల సీజను ఆరంభమవుతుంది. రంగరాజు కూడా సన్యాసిరావు పనిచేసే బ్యాంక్‌లోనే పనిచేస్తున్నాడు. ఐదేళ్ళ సర్వీసుతో జీతం బాగానే వస్తోంది. రంగరాజు, సన్యాసిరావును పాతిక వేలు అప్పు అడిగాడు. అతను లేవన్నాడు. క్యాషియర్ జగదీష్‌ను అడిగితే, క్లాస్ తీసుకుని తల వాచేలా చీవాట్లు పెట్టాడు. రంగరాజు కంటే ఐదేళ్లు సీనియర్ అతను. అదే ఆఖరుసారంటూ బతిమలాడడంతో ఐదువేలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.
ఆ రోజు వీకెండ్ కావడంతో బ్యాంక్‌లో క్యాష్ ట్రాన్జాక్షన్ హెవీగా ఉంది. కౌంటర్లో యమ బిజీగా ఉన్నాడు జగదీష్. ముందురోజు రాత్రి డిన్నర్ పార్టీకి వెళ్ళి వచ్చాడు అతను. దాంతో కడుపులో అలజడి మొదలైంది. అర్జెంటుగా టాయ్‌లెట్‌కు వెళ్ళవలసివచ్చింది. క్యాషంతా నేలపైన కుప్పలుగా పడి ఉంది. లెడ్జర్ క్లర్క్ సన్యాసిరావును పిలిచి కౌంటర్లో కూర్చోమని రిక్వెస్ట్ చేశాడు. రెండు నిమిషాల తరువాత రంగరాజు కౌంటర్ దగ్గరకు వచ్చాడు.
‘జీవితంలో ఎదగాలంటె కొన్ని రిస్కులు తీసుకోక తప్పదు గురూ! అందులోంచి ఓ కట్ట నా మొహాన కొడితే...రేపు ఈపాటికి కోట్లు గుర్రం మీద తెచ్చి గుమ్మరించనూ?’ అన్నాడు.
‘ఇంకాసేపు నీ మాటలు విన్నానంటే, నా బుద్ధి కూడా గుర్రమెక్కి రేస్ చేసేటట్టుంది. జగదీష్ తిరిగి రాకముందే నువ్విక్కడి నుండి కదలడం మంచిది’ అన్నాడు సన్యాసిరావు చిరాకుగా. రంగరాజు నవ్వేశాడు.
అదిగో, అప్పుడే జరిగింది ఆ సంఘటన –
ముసుగు మనిషి ఒకడు హఠాత్తుగా లోపలకు చొరబడి, రివాల్వర్‌తో సీలింగ్‌కు గురిపెట్టి వార్నింగ్ షాట్ పేల్చాడు. మెయిన్ డోర్ మూసేసి, ‘డోంట్ మూవ్!’ అంటూ అరిచాడు. ఓ లేడీ కస్టమర్ని హాస్టేజ్ గా దొరకబుచ్చుకుని ఆమె తలకు రివాల్వర్ గురిపెట్టాడు.
‘ఛుప్! నోరు మూయకపోతే, ఇందులోని బుల్లెట్సన్నీ నీ నోట్లోకే షూట్ చేస్తా జాగ్రత్త!’ అంటూ గదిమాడు. ఠక్కున నోరు మూసేసింది ఆమె. మిగతావారితో, ‘మీరేంటీ గుడ్లప్పగించి చూస్తున్నారూ? ఇది హోల్డప్. హ్యాండ్సప్ చేయండంతా!’ అన్నాడు.
ఇమ్మీడియట్‌గా చేతులు పైకెత్తేసి స్టాచ్యూస్ అయిపోయారంతా.
‘కదిలితే కాలుస్తా!’ బెదిరించాడు ముసుగు మనిషి.
సిబ్బంది అంతా టేబుల్స్ క్రిందా, డెస్కుల వెనుకా, కుర్చీల చాటునా దాక్కున్నారు.
వాష్ రూమ్‌కి వెళ్ళొచ్చిన జగదీష్ తల వంచుకుని కౌంటర్ వైపు నడిచాడు. ట్రాన్జాక్షన్స్‌తో సందడిగా ఉండే వాతావరణం హఠాత్తుగా స్తబ్దత సంతరించుకున్న సంగతి అతను గమనించలేదు.
కౌంటర్ వెనుక చెరో మూలా నిలుచున్న సన్యాసిరావు, రంగరాజులను చూసి, ‘ఏమైంది? దొంగాట ఆడుతున్నారా?’ అనడిగాడు ఆశ్చర్యంగా.
ఏమయిందో వాళ్ళు చెప్పలేదు. ముసుగు మనిషి చెప్పాడు. అదీ – రివాల్వరుతో!
హాల్లోని గందరగోళం ఆలకించి తన ఛాంబర్‌లోంచి బయటకు వచ్చిన మేనేజర్ ముకుందరావ్, విషయం గ్రహించి, చటుక్కున జేబులోంచి మొబైల్ తీశాడు, పోలీసులకు ఫోన్ చేయడానికని. అది గమనించిన ముసుగు మనిషి మెరుపులా షూట్ చేయడంతో మొబైల్ ఎగిరిపడింది. మేనేజర్ చేయి రక్తం క్రక్కింది. చేతిని పట్టుకుని గిలగిలలాడుతూ ముందుకు వాలిపోయాడు అతను.
అదిరిపడ్డ జగదీశ్, అప్పుడు చూశాడు – అక్కడి దృశ్యాన్ని! పరిస్థితి అర్థం కావడానికి ఎంతోసేపు పట్టలేదు అతనికి. ‘క్యాషంతా మూట కట్టి ఇక్కడ పెట్టు!’ జగదీష్‌ను ఆదేశించాడు ముసుగు మనిషి. అతను తటపటాయిస్తూంటే వార్నింగ్ షాట్ పేల్చాడు.
‘ప్రాణాలతో ఉంటే...బోడి క్యాషియర్ ఉద్యోగ మేమిటీ, ఏ స్కామో చేసుకుని బతకొచ్చును!’ అనుకుంటూ కౌంటర్లోను, నేలపైనా ఉన్న క్యాషంతా ఏరి, హ్యాండీగా కనిపించిన ఓ బ్లూ క్లాత్ లో మూట కట్టి కౌంటర్ బయట బల్ల మీద పెట్టాడు జగదీష్.
‘స్ట్రాంగ్ రూమ్, లాకర్ సంగతి నెక్ట్స్ టైమ్ చూసుకుందాం. టైమ్ ఈజ్ వెరీ టైట్...’ అంటూ మూట అందుకున్నాడు ముసుగు మనిషి. ‘ఇంకెప్పుడూ వీకెండ్స్‌లో బ్యాంక్‌కి రాకు. వచ్చినా ఇలా అందుబాటులో ఉండకు’ అంటూ లేడీ హాస్టేజ్‌ను ముందుకు ఒక్క తోపు తోసి, వెళ్తూ వెళ్తూ మళ్లీ రివాల్వర్ పేల్చి, క్షణాలలో అక్కణ్ణుంచి అదృశ్యమైపోయాడు.
ఆ రోజు రాత్రి – టీవీలోని న్యూస్ ఛానెల్స్‌లో ఆ బ్యాంక్ దోపిడీ వార్తే ప్రముఖమయింది... ముసుగు మనిషి ఎవరో – బ్యాంక్ సిబ్బందినీ, కస్టమర్స్‌నూ రివాల్వర్‌తో బెదిరించి అరవై లక్షల రూపాయలు దోచుకుపోయిన వైనం చెబుతూ ఆ కేసును క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శివరామ్ పరిశోధిస్తున్నట్టూ...ఆ రాబర్ ఆచూకీ గాని, క్లూస్ గాని తెలిపినవారికి యాభై వేల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందనీ ప్రకటించారు. ఇన్‌స్పెక్టర్ మొబైల్ నంబరూ, క్రైమ్‌బ్రాంచ్ ఫోన్ నంబర్లూ స్క్రోలింగ్‌లో ఇచ్చారు.
టీవీలోని ఆ వార్తను కుతూహలంగా చూస్తున్న ఆ వ్యక్తి, ‘నాన్సెన్స్!’ అంటూ పట్టరాని ఆగ్రహంతో చేతిలోని డ్రింక్ గ్లాస్‌ను నేలకేసి కొట్టాడు. మొబైల్ అందుకుని ఇన్‌స్పెక్టర్ శివరామ్‌కు ఫోన్ చేశాడు.
అటువైపు నుంచి రెస్పాన్స్ రాగానే, ‘ఇన్సె్పక్టర్! యూ ఆర్ లయింగ్! ఆ బ్యాంక్ దోపిడీలో పోయిన సొమ్ము అరవై లక్షలు కాదు, యాభై లక్షలే. ఓన్లీ ఫిఫ్టీ లాక్స్!’ అంటూ అరిచాడు.
‘హౌ డూ యూ నో?’ ప్రశ్నించాడు శివరామ్.
‘మీ పోలీసులు బ్యాంక్ మేనేజర్‌తో కుమ్మక్కయి పది లక్షలు నొక్కేసిన నిజం ఎరిగినవాణ్ణి!’ పళ్లు నూరాడు అతను.
‘ఎవరు నువ్వు? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావ్?’ అడిగాడు ఇన్సె్పక్టర్.
‘బ్యాంక్‌ను దోచుకున్న ఆ రాబర్ నేనే కనుక!’ అనేసి ఫోన్ కట్ చేసేశాడు అతను. మరో గ్లాస్ అందుకుని, సీసాలోని డ్రింక్‌ను అందులో పోసుకుని, కసిగా అంతా ఒకేసారి గొంతుకలోకి ఒంపేసుకున్నాడు, ఏదో తిట్టుకుంటూ.
ఇన్‌స్పెక్టర్ శివరామ్ బ్యాంక్‌కి వెళ్లి మేనేజర్ ముకుందరావ్‌ను కలిశాడు. గత రాత్రి ‘బ్యాంక్ రాబర్’నంటూ అజ్ఞాత వ్యక్తి చెప్పిన విషయం చెప్పి, ‘దొంగ తీసుకు వెళ్లినది యాభై లక్షలే ఐతే, మిగతా పది లక్షలూ ఏమైనట్టు?’ అని ప్రశ్నించాడు. మేనేజర్ తెల్లమొహం వేశాడు. ‘నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకేం తెలియదు. పోయిన సొమ్ము లెక్కలు వేసి చెప్పింది క్యాషియరే’ అన్నాడు కంగారుగా.
‘క్యాషియర్ పేరేమిటి? అతను ఎలాంటివాడు?’ అడిగాడు ఇన్సె్పక్టర్.
‘అతని పేరు జగదీష్. మనిషి మంచివాడు, నమ్మకస్తుడు. మూడేళ్లుగా ఆ సీట్లో ఉంటున్నాడు’ చెప్పాడు మేనేజర్.
జగదీష్‌ను పిలిపించి విడిగా ఇంటరాగేట్ చేశాడు ఇన్‌స్పెక్టర్. ఆ రోజు తాను డ్యూటీలోకి వచ్చింది మొదలు జరిగినదంతా వివరించాడు జగదీష్. తాను ఏ పాపమూ ఎరుగనన్నాడు. తాను వాష్ రూమ్‌కి వెళ్లినప్పుడు పది నిముషాలపాటు లెడ్జర్ క్లర్క్ సన్యాసిరావును కౌంటర్లో కూర్చోబెట్టినట్టు చెప్పి, ‘సన్యాసిరావు చాలా నిజాయితీపరుడు. ఎప్పుడైనా పేమెంటులో పొరపాటున వెయ్యి, ఐదు వందలూ నేను ఎక్కువ ఇచ్చేస్తే, ప్రామ్ట్‌గా తెచ్చి వాపసు చేసేస్తూంటాడు’ అంటూ లోగడ అలా ఎన్ని సార్లు జరిగిందీ వివరంగా చెప్పుకు వచ్చాడు.
తర్వాత ఇన్‌స్పెక్టర్ సన్యాసిరావును ప్రశ్నించాడు. తాను డబ్బు ముట్టుకోలేదన్నాడు సన్యాసిరావు. మరో కొలీగ్ రంగరాజు కూడా తనతోనే ఉన్నట్టు చెప్పి, ఆ సమయంలో నోట్ల కట్టలను చూసి అతను చేసిన కామెంట్స్ గురించి కూడా చెప్పాడు.
అతన్ని పంపేసి, రంగరాజు కోసం కబురుపెట్టాడు ఇన్‌స్పెక్టర్. అతను ఆ రోజు డ్యూటీకి రాలేదని తెలిసింది. మేనేజర్‌ను అతని గురించి వాకబు చేస్తే, ‘గుర్రపు పందేల పిచ్చి తప్పిస్తే మనిషి నమ్మకస్తుడే’ అని చెప్పాడు.
‘మిస్టర్ ముకుందరావ్! బ్యాంకును దోచుకున్నది తానేనని ధైర్యంగా ఒప్పుకున్న మనిషి, దోచుకున్న సొమ్ము విషయంలో అబద్ధం చెప్పడు... సమ్ థింగ్ ఈజ్ రాంగ్ సమ్ వేర్!’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ బయటకు వెళుతూ.
మేనేజర్ టేబుల్ మీది టెలిఫోన్ మ్రోగింది. రిసీవర్ తీసి, ‘స్పృహలో!’ అన్నాడు ముకుందరావ్.
‘ఒరేయ్ చీటర్! పది లక్షలు కొట్టేసి నా అకౌంట్ లో కలిపేశావు కదురా?’ అరిచాడు అవతలి వ్యక్తి.
‘ఏయ్, ఎవరు నువ్వు?’ కోపంగా అడిగాడు మేనేజర్.
‘నీ బ్యాంక్‌ను దోచుకున్న రాబర్ని! నువ్వు నొక్కేసిన పది లక్షలూ వెంటనే నాకు అందజేయకపోయావంటే... నీ ప్రాణాలు దక్కవ్!’ కర్కశంగా అన్నాడు ఆ వ్యక్తి. ‘ఎక్కడ, ఎలా అందజేయాలో ఆలోచించుకుని మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈ లోపున పోలీసులకు చెప్పావో... ఆనక కోర్ట్‌లో సాక్ష్యం చెప్పడానికి నువ్వుండవ్!’
మేనేజర్ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. డిస్‌కనెక్ట్ అయిన ఫోన్ వంక వెర్రి చూపులు చూస్తూ ఉండిపోయాడు కొద్ది క్షణాలపాటు. చేతిరుమాలు తీసి ముఖం తుడుచుకుని, తన మొబైల్‌లో ఎక్కడికో రింగ్ చేశాడు.
టీవీలో న్యూస్ చూసిన బ్యాంక్ రాబర్ ఆవేశంలో ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేశాడు. అయితే, తాను చేసిన ఆ ఘోరమైన పొరపాటును అతను గ్రహించేసరికి ఆలస్యమైపోయింది. పోలీస్ లాకప్‌లో ల్యాండ్ అయ్యాడు!
అతని మొబైల్ నంబర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్టర్ శివరామ్, అతని చిరునామాను తెలుసుకుని, తెల్లవారు ఝామున అతని ఇంటిపైన రెయిడ్ చేశాడు. హ్యాంగోవర్ నుంచి అతను బయటపడే సరికే చేతులకు అరదండాలు పడ్డాయి. అతను దోచుకుని దాచుకున్న యాభై లక్షలూ పైసా తగ్గకుండా పోలీసులు రికవర్ చేసుకున్నారు.
రాబర్‌కి హ్యూమర్ కాస్త ఎక్కువే. ‘సార్! ఇదే నా ఫస్ట్ ఎటమ్ట్. ప్చ్! పురిట్లోనే సంధి కొట్టేసింది. నా ధైర్యానికి బ్రేవరీ అవార్డ్ ఒద్దు కానీ, ఓ పది లక్షలు నా ముఖాన కొట్టకూడదూ?’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌తో. ‘షటప్!’ అంటూ ముఖం మీద కొట్టి సెల్‌లోకి తోశాడు ఇన్‌స్పెక్టర్. దవడ మీద చేత్తో రాసుకుంటూ, ‘ఎక్కడ పొరపాటు జరిగిందబ్బా!?’ అనుకుంటూ, లాకప్ తలుపులకు ఉన్న ఊసలు లెక్కించడం ఆరంభించాడు అతను.
దోపిడీ సొమ్ము విషయంలో రాబర్ చెప్పింది కరెక్ట్ అని తేలడంతో, ‘మిగతా పది లక్షలూ మాయం చేసిన ఆ ఇంటి దొంగ ఎవరు చెప్మా!’ అన్న ప్రశ్న ఇన్‌స్పెక్టర్ బుర్రలో ముల్లులా గుచ్చుకుంది.
పిల్లలకు వేసవి సెలవులు కావడంతో ‘అతని’ కుటుంబం పుట్టింటికి వెళ్ళింది. అందువల్ల హోటల్ తిండీ, ఒంటరి నిద్రా అయింది అతనికి ఆ వారం రోజులుగానూ. ఆ రోజు రాత్రి హోటల్లో డిన్నర్ చేసి, కొత్త సినిమా ఏదో రిలీజైతే సెకండ్ షోకి వెళ్ళివచ్చాడు.
హుషారుగా ఈల వేసుకుంటూ ఇంటి తాళం తెరిచాడు. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అది... తలుపు తెరచి, లైట్ వేసి, లోపల అడుగు పెట్టిన అతను ఉలిక్కిపడ్డాడు.
హాల్లో ఫర్నిచర్ స్థానభ్రంశం చెంది ఉంది. బెడ్ రూమ్‌లో అడుగు పెట్టాడు. గదంతా చిందరవందరగా ఉంది. బీరువాలు, టేబుల్ సొరుగులూ, సూట్ కేసులూ, కిచెన్‌లోని స్టీల్ డబ్బాలు, స్టోర్ రూమ్‌లోని వస్తువులూ–అన్నీ నేలపాలయ్యాయి.
నిశ్చేష్టుడయ్యాడు అతను...ఇంట్లో ఎవరో ప్రవేశించారు! ఇల్లంతా ర్యాన్సాక్ చేశారు!!
ఎవరు? ఎందుకు??... హఠాత్తుగా ఏదో జ్ఞప్తికి రావడంతో తుళ్లిపడ్డాడు.
ఒక్క ఉరుకులో స్టోర్ రూమ్‌లోని అద్దాల స్టీల్ బీరువా వైపు పరుగెత్తాడు. అందులోని పుస్తకాలు, వస్తువులు చాలామటుకు నేల మీద పొర్లాడుతున్నాయి. లోపల మిగిలి ఉన్న కొద్దిపాటి వస్తువులు కూడా గబగబా తీసి కింద పడేశాడు. తరువాత ఖాళీ బీరువాను జాగ్రత్తగా నేల పైన బోర్లించాడు. బీరువా అడుగున పొడవుగా ఉన్న పోలిథీన్ ప్యాకెట్ ఒకటి సెల్లోటేప్ తో అతికింపబడియుంది. దాన్ని చూడగానే అతని కన్నులు మెరిశాయి. టేప్ ఊడదీసి, ప్యాకెట్ ను బైటకు తీసాడు. దాన్ని తెరిస్తే, లోపల రెండువేలరూపాయల నోట్లతో కూడిన కరెన్సీ కట్టలు ఐదు ఉన్నాయి! మొత్తం పది లక్షలు!
తేలిక పడ్డ మనసుతో ఆ డబ్బును ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు అతను.
అదే క్షణంలో– ‘వెల్, వెల్! దట్స్ వాట్ ఐ వాంటెడ్ మేన్!’ అంటూ దాక్కున్న చోటు నుంచి బయటకు వచ్చాడు ఇన్‌స్పెక్టర్ శివరామ్.
మర్నాడు బ్యాంక్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటైంది. మేనేజర్, సిబ్బందితో పాటు కొందరు కస్టమర్స్ కూడా హాజరయ్యారు.
‘ఇన్సె్పక్టర్ గారూ! ఎంతో నిజాయితీపరుడనుకున్న సన్యాసిరావు ఈ నేరం చేశాడంటే నమ్మలేకపోతున్నాను’ అన్నాడు మేనేజర్.
ఇన్‌స్పెక్టర్ నవ్వాడు. ‘క్యాషియర్ అతన్ని నమ్మి అప్పుడప్పుడు క్యాష్ కౌంటర్‌ను తనకు అప్పగిస్తూండడంతో, వీలు చూసి సొమ్ము దొంగిలించేందుకు లాంగ్ టెర్మ్ స్కీమ్ ఒకటి వేసుకున్నాడు సన్యాసిరావు. నిజాయితీపరుడిగా మిమ్మల్ని నమ్మించి మీ విశ్వాసం చూరగొనే పథకంలోని భాగమే... అతను తరచు తనకు ఎక్సెస్ పేమెంట్ జరిగిందంటూ డబ్బులు వాపసు చేయడం. ఐతే, ఎక్సెస్ రానప్పుడు కూడా అతను బలవంతంగా వాపసు చేసేవాడని క్యాషియర్ చెప్పిన విషయం నన్ను ఆలోచింపజేసింది.
నేను అనుమానిస్తున్నట్టు సన్యాసిరావే ఆ సొమ్మును దొంగిలించి ఉంటే, వెంటనే ఖర్చు చేసే ధైర్యం చేయడు. కొన్నాళ్లపాటు దాచి ఉంచుతాడు...సో, ముందుగా అతను సొమ్ము దాచిన చోటును కనిపెట్టాలనుకున్నాను. హ్యూమన్ సైకాలజీని బేస్ చేసుకుని చిన్న నాటకం ఆడాను...ఓ రాత్రి వేళ అతని ఇంట్లో చొరబడి, ఎవరో దేనికోసమో వెదికినట్లు ఇల్లంతా చిందర వందర చేసేశాను.నేను ఎదురు చూసినట్టే, దాచుకున్న సొమ్ము పోయిందేమోనని కంగారుపడ్డాడు సన్యాసిరావు. దాన్ని దాచిన చోటు నుంచి బయటకు తీసి, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు’ నవ్వాడు ఇన్‌స్పెక్టర్.
‘రాబరీ సమయంలో టెన్షన్‌తో అందరి చూపులూ దొంగ వైపు ఉన్న తరుణంలో లక్ష రూపాయల కట్టలు ఐదు తీసుకుని షర్ట్ లోపల పడేసుకున్నాడు సన్యాసిరావు. రాబర్ నిష్క్రమించాక ఏర్పడిన గందరగోళంలో ఆ సొమ్ముతో సునాయాసంగా జారుకున్నాడు...ఇంటరాగేషన్‌లో ఆ సంగతి స్వయంగా అంగీకరించాడు.’
మేనేజరు, సహోద్యోగులూ తన వంక అసహ్యంగా చూడటంతో తలవంచుకున్నాడు, చేతులకు అరదండాలతో కానిస్టేబుల్స్ మధ్య కూర్చున్న సన్యాసిరావు.
‘అయితే, సన్యాసిరావు చర్య వల్ల తెలియకుండానే ఓ మేలు జరిగింది’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ మందహాసంతో. ‘ఇతనే కనుక డబ్బు దొంగిలించి ఉండకపోతే, రాబర్ అంత సులభంగా బయటపడేవాడూ కాదు, దోపిడీ సొమ్ము అంత త్వరగా రికవర్ అయ్యేదీ కాదు!’
- తిరుమలశ్రీ
Comments
Please login to add a commentAdd a comment