రాత్రి.. పది గంటలు.. బయట జోరుగా వర్షం కురుస్తోంది.. తన ఫ్లాట్‌లో విస్కీ తాగుతూ హాలీవుడ్ మూవీ చూస్తున్నాడు శ్రీకర్. ఇంతలో సెల్ ఫోన్ రింగ్ అవటంతో తీసి ‘హలో’ అన్నాడు.
‘మిస్టర్ శ్రీకర్ ఫారెన్ క్లయింట్స్‌కు సంబధించిన సర్వర్‌లో ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చిందంట. నువ్వు వెంటనే ఆఫీస్‌కు వెళ్ళి ఇష్యూ సాల్వ్ చేయి’ చెప్పాడు బాస్ వరుణ్.
‘సార్.. బయట బాగా వర్షం పడుతోంది. ఈ టైమ్ లో...’ అంటూ నసిగాడు శ్రీకర్.
‘నో మోర్ డిస్కషన్స్. డూ వాట్ ఐ సే. కావాలంటే నైట్ సిఫ్ట్‌లో వున్న షీలా కూడా నీకు హెల్ప్ చేస్తుంది. ఆఫీస్‌కు వెళ్ళి నాకు ఇన్ఫామ్ చేయి’ అంటూ ఫోన్ కట్ చేశాడు వరుణ్.
చేసేది లేక వెంటనే ఆఫీస్‌కు బయలు దేరాడు శ్రీకర్. ఇష్యూ సాల్వ్‌చేసి తెల్లవారు జామున సుమారు మూడు గంటల ప్రాంతంలో తిరిగి ఫ్లాట్‌కు చేరుకొని అలసటగా బెడ్ మీద వాలిపోయాడు.
∙∙
రాత్రి డెల్టా ఐటీ సొల్యుషన్స్‌లో జరిగిన షీలా మర్డర్ విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్ వంశీ తన సిబ్బందితో హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్నాడు. ‘సార్ నా పేరు మురళి. పొద్దున ఐదున్నర గంటలకు నేను డ్యూటీ ఎక్కాను.
నైట్ డ్యూటీ వాచ్‌మన్ సైదయ్యను పంపించి ఆఫీస్ అంతా ఒకసారి చెక్ చేస్తుంటే కారిడార్‌లో షీలా మేడమ్ శవం కనిపించింది. వెంటనే మీకు ఫోన్ చేశాను సార్’ చెప్పాడు వాచ్‌మన్ మురళి.
‘నైట్.. ఆఫీస్‌లో ఎవరెవరు వున్నారు?’ అడిగాడు ఇన్‌స్పెక్టర్ వంశీ. ‘ఎంట్రీ బుక్‌లో రాత్రి పది గంటలకు షీలా మేడమ్ వచ్చిన తర్వాత , పదకొండు గంటలప్పుడు శ్రీకర్ సార్ వచ్చి .. మళ్ళీ తెల్లవారు జమున రెండున్నర టైమ్‌లో వెళ్ళిపోయినట్లు వుంది సార్’ చెప్పాడు మురళి ఎంట్రీ బుక్ చూసి.
‘ఆఫీస్ బాస్, మిగతా స్టాఫ్ ముఖ్యంగా శ్రీకర్, సైదయ్య... అందరినీ స్టేషన్‌కు పిలిపించండి’ అని తన సిబ్బందికి చెప్పి క్లూస్‌టీమ్‌తో కలసి ఆఫీస్ చుట్టుపక్కల మెత్తం తిరిగి కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరించి వుంచుకున్నాడు వంశీ.
ఈలోపు..
‘సార్ స్టాఫ్ మొత్తం స్టేషన్‌కు వచ్చారంట’ అని కానిస్టేబుల్ చెప్పడంతో షీలా బాడీని పోస్ట్ మార్టమ్‌కు పంపించి వంశీ స్టేషన్‌కు చేరుకున్నాడు. మొదట మొత్తం సిబ్బందిని విచారించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నాడు వంశీ. ఇక విచారించవలసిన వాళ్ళు ఆఫీస్‌బాస్ వరుణ్, శ్రీకర్, సైదయ్య. వాళ్లనూ ఒకరి తర్వాత ఒకరిని విచారణకు లోపలికి పంపించమని కానిస్టేబుల్‌కు పురమాయించాడు వంశీ.
∙∙
‘మిస్టర్ శ్రీకర్.. మీకు షీలాకు అస్సలు పడేది కాదని.. మీకు రావలసిన ప్రమోషన్ ఆవిడకు వచ్చిందని, అందుకే ఆమె పై మీకు చాలా కోపం వుందని.. దానివల్లనే మీ మధ్య మాటలు కూడా లేవని మీ కొలిగ్స్ చెప్పారు. ఆ అక్కసుతోనే మీరు ఈ మర్డర్ చేశారని అనుకోవచ్చా? ఎందుకంటే ఆ రాత్రి ఆఫీసులో మీరు.. షీలా తప్ప ఇంక ఎవరు లేరు’ అని అడిగాడు వంశీ .
‘సార్.. ప్రమోషన్ నాకు రాలేదన్న బాధ వుంది కానీ దానికోసం మర్డర్ చేసేంత కిరాతకుణ్ని మాత్రం కాదు. ఎందుకో నాకు ఆమె పద్ధతి నచ్చలేదు. అందుకే తనతో మాట్లాడడం మానేశాను. ఆ రోజు రాత్రి నేను ఆఫీస్‌కు వెళ్లినప్పుడు కూడా అసలు తనున్న ఫ్లోర్ క్కూడా వెళ్లలేదు. నా పని నేను పూర్తి చేసుకొని రూమ్‌కు వచ్చేశాను’ చెప్పాడు శ్రీకర్.
ఆ మాట విని సైదయ్య వైపు తిరిగి.. ‘చూడు సైదయ్యా.. నవ్వు ఒకసారి షీలా పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు అందరిముందర ఆమె నిన్ను అవమానించిందన్న కోపంతో నువ్వే ఈ హత్య చేసి వుండొచ్చని మీ ఆఫీసులో కొందరు అనుకుంటున్నారు?’ అనుమానంగా అడిగాడు ఇన్‌స్పెక్టర్ వంశీ.
‘అయ్యో.. లేదు సార్! తాగిన మైకంలో నేను.. ఆమె పట్ల అలా ప్రవర్తించినందుకు తర్వాత చాలా బాధపడ్డాను. పశ్చాత్తాపంతో ఆరోజు నుంచి తాగుడే మానేశాను సార్. సత్యప్రమాణకంగా నేను ఈ హత్య చేయలేదు సార్’ చెప్పాడు సైదయ్య.
‘సార్ నేను బాస్‌గా వున్న ఆఫీస్‌లో హత్య జరగడం చాలా బాధగా వుంది. ప్లీజ్, మీరు త్వరగా కేస్ సాల్వ్ చేయండి. లేకపోతే మా కంపెనీ ఇమేజ్ దెబ్బ తింటుంది’ అభ్యర్థిస్తున్నట్టుగా వరుణ్.
‘ఓకే వరుణ్‌గారు.. ఒక పెద్ద కంపెనీ బాస్‌గా మీ ఇబ్బందిని అర్థం చేసుకోగలను. కానీ మాకు కొంచెం టైమ్ కావాలి. ఏదైనా అవసరం అనిపిస్తే మళ్లీ మీ ఆఫీస్‌కు వచ్చి కలుస్తాను. మీరు వెళ్ళండి’ అని చెప్పాడు ఇన్‌స్పెక్టర్ వంశీ.
∙∙∙
షీలా మర్డర్ కేసుకు సంబంధించిన పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్స్ పరిశీలిస్తున్నాడు వంశీ. ఎవరో గొంతు నులిమి చంపేశారు. కానీ చంపిన వాళ్ల వేలి ముద్రలు డెడ్‌బాడీ పై లేవు. రిపోర్ట్‌లో వున్న ఒక ఆసక్తికరమైన అంశం మీద నిలిచిపోయాయి వంశీ చూపులు.
డెడ్‌బాడీ తల వెంట్రుకల్లో అక్కడక్కడ కాల్చిన చుట్ట తాలూకు బూడిద వున్నట్లు ఆ రిపోర్ట్‌లో రాసుంది. ఆ పాయింటే వంశీని కాస్త లోతుగా ఆలోచింపచేసింది. హత్య జరిగిన ఆ కారిడార్‌లో ఒక చోట కాల్చిపారేయగా మిగిలిన చుట్టముక్క దొరికితే దాన్ని తీసివుంచాడు వంశీ.
∙∙
‘హలో మిస్టర్ వరుణ్! షీలాను మర్డర్ చేసిన హంతకుడు దొరికేశాడు. నేను.. నా టీమ్‌తో మీ ఆఫీస్‌కు వస్తున్నాను. అక్కడే అతన్ని అరెస్ట్ చేస్తాను’ చెప్పాడు వంశీ.. వరుణ్‌కి ఫోన్లో. ‘ఒకే సార్ రండి. మేము కూడా వాడు ఎవడాని వెయిట్ చేస్తున్నాం’ అన్నాడు వరుణ్.
∙∙
‘ఓకే.. అందరికీ ఒకేసారి గుడ్‌బై చెప్పేస్తే మనం స్టేషన్‌కు బయలుదేరదాం’ అన్నాడు వంశీ... వరుణ్‌తో . ఆ మాటకు షాక్ అయ్యి ‘వాట్.. నేను స్టేషన్‌కు రావడం ఏంటి?’ అడిగాడు వరుణ్.
‘యెస్.. మిస్టర్ వరుణ్.. షీలాను మర్డర్ చేసింది తమరే’ చెప్పాడు నింపాదిగా ఇన్‌స్పెక్టర్ వంశీ.
∙∙
‘షీలా మర్డర్ కేస్ ఎలా సాల్వ్ చేశారు?’ అడిగారు విలేఖరులు వంశీని.
‘ముందుగా.. షీలా మర్డర్ జరిగిన ప్రదేశంలో ఒక చోట నాకు.. కాల్చిపారేసిన చుట్టముక్క దొరికింది. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల ప్రాంతలో ఆఫీస్ అంతా క్లీన్ చేస్తారని తెలిసింది నా ఎంక్వయిరీలో. అలాంటిది ఆఫీస్ కారిడార్‌లో నాకు చుట్టముక్క దొరికిందంటే క్లీన్ చేసిన తర్వాతనే ఎవరో పారేసి వుండాలి. పైగా ఆ చుట్టముక్క చుట్టూ వున్న బూడిద, షీలా తలవెంట్రుకల్లో దొరికిన బూడిద ఒకటే అని నిర్ధారణ అయింది.
అంటే దీన్ని బట్టి ఆ చుట్టను తప్పకుండా హంతుకుడే కాల్చి పారేసి వుంటాడన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చాను. ఆఫీస్ వెనుక ప్రాంతంలో బురదను పరిశీలిస్తే నాకు రెండు షూ గుర్తులు కనిపించాయి. గమనించవలసిన విషయం ఏమంటే ఆ రెండు షూ గుర్తులు వేరు వేరు సైజుల్లో వున్నాయి. అంటే హంతకుడి రెండు పాదాల సైజు ఒకటి కాదు.
ఆఫీస్ వెనుక ప్రాంతలో చాలాసేపు ఒక కారు రోడ్డు పక్కన పార్క్‌చేసి వుందని అక్కడ వున్న వాళ్ళు చెప్పారు. వీటన్నిటినీ అనుసంధానం చేస్తే వచ్చిన సమాధానమే వరుణ్. నేను మొదటిసారి విచారణ చేసినప్పుడు వరుణ్ పాదాలను గమనించాను. రెండు పాదాలు ఒకే పరిమాణంలో లేవు. చూస్తే చాలు తెలిసిపోయేంత తేడాగా ఉన్నాయి.
పైకి మోడర్న్‌గా కనిపించిన వరుణ్‌కు చుట్ట తాగే అలవాటు ఎక్కువ వుందని మాకు ఆ చుట్టలు అమ్మే షాపు అతను చెప్పాడు. ఆఫీస్ వెనుక చాలాసేపు పార్క్ చేసి వుంచిన ఆ కారు నంబర్ ఎంక్వయిరీ చేస్తే అది వరుణ్‌ది అని తేలింది. ఇంకొక ముఖ్య విషయం ఆరోజు శ్రీకర్‌కు వరుణ్ ఫోన్ చేసింది ఆఫీస్ వెనుక నుండే. మేం ఆ సెల్‌ఫోన్ లొకేషన్ కూడా ట్రేస్ చేశాం.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్... షీలా డైరీ. దాన్ని మేం... ఆమె వుంటున్న వర్కింగ్ వుమెన్స్ హాస్టల్లో స్వాధీనం చేసుకున్నాం. ఆ డైరీని చదివితే... సదరు వరుణ్ ఆఫీస్‌కు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ డేటాను డబ్బుల కోసం ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడో పసిగట్టిన షీలా ... డబ్బుల కోసం అతన్ని బ్లాక్‌మెయిల్ చేయసాగింది.
షీలా నుండి తప్పించుకోవడాని ఆమెను మర్డర్ చేసి ఆ హత్యను శ్రీకర్ మీదకు తోసెయ్యడానికి తెలివిగా అతనిని ఆరోజు ఆఫీస్‌కు రప్పించాడు వరుణ్. దాని కోసం ముందుగానే క్లైంట్స్‌కు సంబంధించిన సర్వర్‌లో కావాలనే ఇష్యూను జనరేట్ చేశాడు.
హంతకుడు తన చేతి గ్లోవ్స్‌ను ఆఫీస్ వెనుకున్న కాలనీ కాలువలో పడేశాడు. వాటినీ సంపాదించా. ఇవీ వరుణ్ హంతకుడు అని చెప్పే... మాకు దొరికిన క్లూస్’ అంటూ తన ప్రెస్ మీట్ ముగించాడు ఇన్‌స్పెక్టర్ వంశీ.
చదవండి: కథ: నీలం రంగు రాయి ఉంగరం
Comments
Please login to add a commentAdd a comment