
వసంతనగర్ కాలనీ..సంక్రాంతి పండగ సందర్భంగా దాదాపు కాలనీవాసులంతా వారి, వారి గ్రామాలకు తరలి వెళ్ళారు. వీధులన్నీ బోసి పోయాయి. ఒక వారం రోజులు పొతే గాని మళ్ళీ కాలనీకి నిండుదనం రాదు. పోలీసువ్యాను రాత్రింబగళ్ళు కాలనీచుట్టూ అప్పుడప్పుడు చక్కర్లు కొడ్తుండడంతో ఉన్న కొద్ది కుటుంబాలు నిర్భయంగా ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఆరోజు శనివారం. కాలనీలో సంత జరుగుతుంది. ఇందుమతికి ఇంట్లో ఉల్లిపాయలు నిండుకున్నాయని గుర్తుకు వచ్చింది. అప్పుడు సమయం నాలుగు కావస్తోంది. ఇప్పుడైతే సంతలో ఎక్కువమంది ఉండరు. తన ఒక్కగానొక్క ముద్దులపట్టి పవిత్రను తీసుకొని వెళదామని బెడ్‌రూంలోకి వెళ్ళి చూసింది. పవిత్ర గాఢ నిద్రలో ఉంది. లేపాలంటే మనస్కరించలేదు.
‘సంత కాలనీ మెయిన్ రోడ్డు పైన జరుగుతుంది. చాలా దగ్గర కూడానూ. ఇలా వెళ్లి అలా వస్తాను. పవిత్రను ఎందుకు లేపాలి?’ అనుకుంది మనసులో. పవిత్రకూ అలవాటే. ఒకవేళ లేచినా అమ్మ బయటికి వెళ్లి ఉంటుందని అర్థం చేసుకుని చదువుకోవడమో లేదా తనకిష్టమైన బొమ్మలు గీసుకుంటూ కూర్చోవడమో పరిపాటి. పవిత్ర మరీ చంటి పాపేం కాదు. రెండవ తరగతి చదువుతోంది.
ఇందుమతి కాటన్ సంచి తీసుకొని ఇంటికి తాళం పెట్టింది. ఆ పూట ఆమె భర్త భరణి మధ్యాహ్నం భోజనానికి రాలేదు. ఒకవేళ భరణి వస్తే తీసుకోడానికి వీలుగా యథాప్రకారం తాళం చెవిని గులాబి పూల కుండీ కింద రహస్యంగా పెట్టింది. ఇందుమతి గేటు దగ్గరకు వేసి సంతకు బయలు దేరింది. సంత అంతా తిరిగినా ఉల్లి జాడ కానరాలేదు. నిరాశతో వెనుదిరిగే సమయంలో...
‘‘ఉల్లిగడ్డా.. కిలో వందా..!’’ అనే కేక వినబడింది. అటువైపు తిరిగి చూసింది. కాస్త దూరంగా ఒక తోపుడు బండిని తోసుకుంటూ వస్తున్నాడొక ముసలాయన. ఇందుమతి బండిని చేరే సరికే క్యూ చాంతాడంత పెరిగింది. నిలబడక తప్ప లేదు. మొత్తానికి అరకిలో ఉల్లిగడ్డలు కొనుక్కొని ఇంటికి బయలు దేరింది.
చాలా సమయం అయ్యిందని మనసులో గొణుక్కుంటూ. ఇల్లు చేరింది. తాళం తీసి లేదు. అంటే భరణి ఇంకా రాలేదనుకుంది. పూలకుండీ కింద ఉన్న తాళం చెవి తీసుకుంటూ అనుమానంగా పరిశీలించింది. ఇంటి తాళం తీసి అలికిడేమీ వినరాక పోవడంతో, పవిత్ర ఇంకా లేవలేదనుకుంది. వెళ్లి లేపాలనుకుంది. ఉల్లిగడ్డల సంచి వంటింట్లో సర్ది ‘‘పవిత్రా..’’ అంటూ పిల్చుకుంటూ బెడ్ రూంకు వెళ్ళింది.
అక్కడి దృశ్యం చూసి నివ్వెరపోయింది. బీరువా తలుపులు తెరుచుకొని ఉన్నాయి. అందులోని బట్టలన్నీ చిందరవందరగా నేలపై పడి ఉన్నాయి. ఎవరో ఇంట్లో దూరినా పవిత్ర లేవలేదనే చిరు కోపంతో.. ‘‘ఏంటే నీ మొద్దు నిద్ర పాడుగాను. లే..’’ అంటూ పవిత్ర చెక్కిలిని తట్టింది. పవిత్ర ఉలుకూ, పలుకూ లేదు. ఒళ్ళు చల్లగా తాకింది. ఝల్లున వణకింది ఇందుమతి. పవిత్రని మరింత గట్టిగా తట్టింది. అయినా ఆమెలో చలనం లేదు. ఊపిరి ఆడుతుందో లేదోనని ఆందోళనతో పరీక్షించి చూసి స్థాణువయ్యింది.
గుండెలు బాదుకుంటూ, ఎవరైనా కనబడుతారేమోనని వీధిలోకి పరుగు తీసింది. ఇంతలో గస్తీ తిరుగుతున్న పోలీసు వ్యాను వీధిలోని గుంపును చూసి ఆగింది. వీధి చివర వ్యాను ఆపి ఇద్దరు పోలీసుల పరుగెత్తుకుంటూ వచ్చారు.
‘‘ఏమయ్యిందమ్మా!’’ అంటూ ఒకతను ఆతృతగా అడుగుతుంటే, మరొకతను పరిసరాలు పరిశీలించసాగాడు.
ఇందుమతి రెండు చేతులతో నొసలు కొట్టుకుంటూ ఇంట్లోకి వడి, వడిగా అడుగులులేసింది. ఆమెను అనుసరించారు పోలీసులు. బెడ్‌రూంలో మంచంపై విగత జీవిగా పడి ఉన్న పవిత్రను చూసి పోలీసులు కొయ్యబారిపోయారు. ఇందుమతి ఏడ్పు తారస్థాయికి చేరింది. పవిత్ర దగ్గరికి వెళ్తుంటే...
‘‘శవాన్ని తాకద్దమ్మా..’’ అంటూ ఒక పోలీసు అడ్డుకుంటున్నాడు. మరొక పోలీసు తమ వెనకాలే వచ్చిన జనాన్ని బయటికి వెళ్ళండని గద్దిస్తూ స్టేషన్‌కు ఫోన్ చేశాడు. అలాగే ఇందుమతిని ఫోన్ అడిగి భరణి నంబరు తెలుసుకొని వెంటనే రమ్మంటూ ఫోన్ చేశాడు.
మరో పది నిముషాలలో కూకట్‌పల్లి నుండి పోలీసు వ్యానులో తన సిబ్బందితో దిగాడు ఎస్సై ఉదయబాబు. ఉదయబాబును చూస్తూనే కాలనీ ప్రెసిడెంటు పరుశురాం ఎదురు వెళ్లి నమస్కరించాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ఘోరం జరగిందని విచారం వ్యక్తం చేశాడు. ఈ కేసును ఒక సవాలుగా తీసుకుంటున్నానని, నేరస్తుణ్ణి పదిరోజుల్లో పట్టుకుంటానని హామీ ఇచ్చాడు ఉదయబాబు. పోలీసు డిపార్ట్‌మెంటుకు సంబంధించిన ఫోటోగ్రాఫర్, వేలిముద్ర నిపుణులు, క్లూస్ టీమ్‌లు వారి, వారి పనుల్లో నిమగ్నమయ్యారు. కాసేపటికి ఉదయ బాబు బయటికి వచ్చాడు.
‘‘పాపను ఎప్పుడు చూశావు?’’ అంటూ ఇందుమతిని అడిగి జరిగిన విషయం తెలుసుకుంటున్నాడు.
ఇంతలో అక్కడికి వచ్చిన భరణి ఇంటి వాతావరణం చూసి కంపించి పోయాడు. ఇందుమతి ఏడ్పు తారస్థాయిని చేరింది. భరణి ఎదపై వాలి భోరుమంది. భరణి కన్నీళ్ళ పర్యంతమయ్యాడు. పవిత్రను చూద్దామంటూ లోనికి వెళ్లబోతుంటే..పోలీసు లోనికి అనుమతించ లేదు.
‘‘చూడు భరణీ, ఏడుస్తూ కూర్చుంటే పనులు గావు. ముందుగా నీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే ఫిర్యాదు రాసివ్వు’’ అంటూ నెమ్మదిగా అడిగాడు ఇన్‌స్పెక్టర్.
‘‘ఎవరి మీదా అనుమానము లేదు’’ అంటూ కన్నీళ్లు తుడ్చుకోసాగాడు భరణి.
‘‘ఎవరైనా మీ కుటుంబానికి శత్రువులున్నారా?’’
‘‘లేరు సర్’’ డగ్గుత్తికతో అన్నాడు.
‘‘సరే..బాగా ఆలోచించి మీ ఇంట్లో జరిగిన సంఘటన వివరిస్తూ.. ఒక దరఖాస్తు ఇవ్వు’’ అన్నాడు ఎస్పై.
పవిత్ర హత్యకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసుకునే సరికి రాత్రి దాదాపు ఏడయ్యింది.
శవాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించాడు ఉదయబాబు.
మార్చురీ గదిలో శవాన్ని భద్రపరచి ఆ మరునాడు ఉదయం పోస్ట్‌మార్టం చేశారు. రిపోర్ట్స్ సాయంత్రానికల్లా ఉదయబాబు చేతికి అందాయి. పవిత్రపై అత్యాచారం జరుగలేదు. ఊపిరాడక చనిపోయినట్లు రిపోర్టు ఉంది. ఎక్కడా వేలి ముద్రల జాడా కానరాలేదు. గదిలో, బీరువా పైనా కూడా క్లూస్ ఏమీ లభించలేదు. కేసు ముందుకు సాగిపోయే అవకాశాలు కనబడ్డం కష్టసాధ్యమనుకుంటూ కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు. సమయం దాదాపు ఏడు కావస్తోంది. బయట చూస్తే ఎంతో రాత్రి అయినట్టు కనబడుతోంది. ఉదయబాబు ఒక సాధారణ పౌరునిలా టూ వీలర్‌పై వసంతనగర్ కాలనీ సొసైటీ కార్యాలానికి వెళ్ళాడు. అతణ్ణి చూడగానే పరుశురాం సాదరంగా ఆహ్వానించాడు.
‘‘ఆఫీసు ఎంత వరకుంటుంది సర్’’ ఆరా తీస్తూ కుర్చీలో కూర్చున్నాడు ఉదయబాబు.
‘‘ఏడు వరకే సర్.. కట్టేద్దామనే ప్రయత్నంలో ఉన్నాం’’
‘‘పవిత్ర పాప హత్య కేసు గురించి కొంత సమాచారం కోసం వచ్చాను. కాలనీలో సి.సి. కెమెరాలు ఉన్నాయిగదా...ఒక సారి చూద్దామా’’
‘‘తప్పకుండా సర్. పదండి చూద్దాం. అయితే అవి కేవలం కాలనీ ప్రధాన మార్గాన్నే కవరు చేస్తాయి. ఇంకా వీధి, వీధికి పెట్టలేదు ’’ అంటూ సి.సి. కెమెరాల కేంద్ర పరిశీలన గది లోకి తీసుకెళ్ళాడు పరుశురాం.
సంత జరిగిన శనివారం రోజు ప్రధాన రోడ్డులో భరణి వాళ్ళు ఉండే వీధి మలుపు సునిశితంగా పరిశీలించసాగారు. ఇందుమతి ఇచ్చిన సమాచారం ప్రకారం నాలుగు గంటల తరువాత కనబడే దృశ్యాలలో ఇందుమతి కనబడే సరికి ఒక్కొక్క ఫ్రేం కదిలిస్తూ నింపాదిగా చూడసాగారు. ఒకతను హెల్మెట్ ధరించి బైక్ మీద అదే వీధిలోకి మళ్ళాడు. మరొకసారి వెనక్కి తిప్పి బైకు నంబరు నోట్ చేసుకున్నాడు ఉదయబాబు. మరింకేమీ విశేషాలు కనిపించలేదు.
‘‘ఓకే సర్. వస్తాను’’ అంటూ సెలవు తీసుకొని నేరుగా భరణి ఇంటికి దారి తీశాడు ఉదయబాబు.
కాలింగ్ బెల్ నొక్కుదామని స్విచ్ కోసం చూస్తుంటే హాల్లో నుండి వాడి, వాడి మాటలు వినవస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఏదో వివాదం జరుగుతుందని గ్రహించాడు. కిటికీ పక్కకు నిలబడి రహస్యంగా వినసాగాడు.
‘‘నేను చెబితే విన్నావా? ఇల్లు ఖాళీ చేసి మా అమ్మ వాళ్ళు ఉండే కాలనీకి వెళ్దామన్నాను’’ అది భరణి గొంతు.
‘‘ఆ కాలనీలో పిల్లలెవరూ సరిగ్గా చదువుకోరు. జులాయిల్లాగా తిరుగుతుంటారు. ఈ కాలనీలో మంచి బడి ఉందని పవిత్ర కోసం రానని మొండికేశాను. మీరు ఊరికే ఇలా ఇల్లు మారుద్దామని సతాయించడం ఏంబాగూ లేదు’’ అంటోంది ఇందుమతి.
‘‘ఆ మొండితనం వల్లనే పవిత్రను పోగొట్టుకున్నాం’’
వెంటనే ఇందుమతి గొంతు ఉరిమింది.
‘‘ముందుగా ఇది చెప్పు. మన ఇంటి తాళంచెవి రహస్యం వేరే వానికి ఎలా తెలిసింది? నేను సంతకు వెళ్లి వచ్చి తాళం చెవి పూల తొట్టి కింద నుండి తీస్తుంటే అనుమానమేసింది. అది నేను పెట్టిన చోట కాకుండా కాస్తా పక్కకు జరిగి బయటకు సగం కనబడుతూ ఉంది. నువ్వు ఎవరికైనా చెప్పావా?’’
‘‘నేనెందుకు చెబుతాను. నువ్వు దాస్తుంటే ఏ దొంగ వెధవ చూశాడో! వాడే తీసి మళ్ళీ హడావుడిలో అలా పెట్టి ఉంటాడను కుంటాను. వాడు దొరికితే గాని నిజం బయట పడదు’’
‘‘ఈ విషయం మనం పోలీసులకు చెబుదాం’’ అంటూ ఏడ్వసాగింది ఇందుమతి.
ఉదయబాబు వెంటనే కాలింగ్ బెల్‌కు పని చెప్పాడు. భరణి వచ్చి తలుపు తెరిచి ఆశ్చర్యంగా చూడసాగాడు.
‘‘నేను ఎస్సై ఉదయబాబును’’ అనగానే గుర్తుబట్టాడు భరణి.
‘‘సర్, రండి’’ అంటూ ఆహ్వానించాడు.
ఇందుమతి తలెత్తి చూసి ఏడ్పును కొనసాగిస్తూనే ఉంది. ఉదయబాబు కుర్చీలో కూర్చుంటూ..
‘‘మీ రిపోర్టులో డబ్బు గానీ, నగలు గానీ పోయినట్లు లేదు. ఏ వస్తువులూ కూడా పోలేదా!’’ అంటూ ప్రశ్నించాడు.
‘‘ఏవీ పోలేదు సర్’’
‘‘బీరువాలో డబ్బు లేదా?’’
‘‘పదివేల రూపాయలు బీరువాలోని సీక్రెట్ లాకర్లో అలాగే భద్రంగా ఉన్నాయి సర్. కేవలం బట్టలు మాత్రమే వెదజల్లాడు దొంగ’’ అని చేతులు నలుచుకుంటూ పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ గురించి అడిగాడు భరణి. ఇందుమతి కళ్ళు పెద్దవిగా చేసుకుని..ఉదయబాబు ఏం చెబుతాడో అని తలెత్తి వినసాగింది.
‘‘పవిత్ర ఊపిరాడకుండా చనిపోయిందని వచ్చింది’’ అనగానే ఇందుమతి ఘొల్లుమంది.
‘‘ఈ ఘోరం ఎవరు చేశారో త్వరలోనే తేలుతుంది’’ అనుకుంటూ లేచి మరోసారి బెడ్ రూం లోకి దారి తీశాడు. అతణ్ణి అనుసరించాడు భరణి. గదంతా మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాడు. తిరిగి హాల్లోకి వస్తూ..
‘‘భరణీ నువ్వు ఏం చేస్తుంటావ్?’’ అని అడిగాడు.
‘‘సర్.. నేను టూ వీలర్ మెకానిక్‌ను.’’
‘‘ఓకే..’’ అంటూ ఉదయబాబు బయలుదేరబోతుంటే ఇందుమతి కలుగజేసుకొని ఇంటి తాళం చెవిని రహస్యంగా దాచే పద్ధతిని చెప్పింది.
‘‘ఇది ఎవరో తెలిసినవారే చేశారని నా అనుమానం. నేను తప్పకుండా హంతకుణ్ణి పట్టుకుంటాను’’ అంటూ భరోసా ఇచ్చి బయలుదేరాడు ఉదయబాబు.
ఉదయబాబు మరునాడు స్టేషన్‌కు రావడంతోనే త్రీ నాట్ త్రీ కానిస్టేబుల్ రవిని పిలిచి రాత్రి నోట్ చేసుకున్న బైక్ నంబరు చెప్పి ఆ బండి కలిగిన ఆసామిని పట్టుకు రమ్మని పురమాయించాడు. ఇంటి తాళంచెవి విషయంలో భరణి మీద అనుమానముంది. ‘ఇందుమతి తాళంచెవి పూల కుండీ కింద దాస్తుంటే ఆరోజు మరో వ్యక్తి చూసే అవకాశం చాలా తక్కువ. ఇదివరకే ఈ రహస్యం తెలిసిన వాడై ఉండాలి. అదును చూసి దొంగతనానికి ప్లాను వేశాడే అనుకుందాం. కాని డబ్బు పోలేదు కదా..మరి పవిత్రను ఎందుకు చంపినట్టు. అత్యాచారం చేయలేదు కదా!’ ఇలా ఉదయబాబు మదిలో నుండి ప్రశ్నలు తెరలు, తెరలుగా చెలమలో నీళ్ళూరినట్టు ఉబికి రాసాగాయి.
అరగంటలో రవి బైకు అబ్బాయిని తీసుకు వచ్చాడు.
అతణ్ణి చూస్తూనే కోపంగా లేచి లాఠీ ఊపుతూ ‘‘నీ పేరేంట్రా..’’ అంటూ గద్దించి అడిగాడు. ఉదయబాబు వీరావేశం చూసి గజ, గజా వణకుతూ...
‘‘సుదీర్ సర్’’ అన్నాడు.
‘‘ఈ బైకు నీదేనా?’’
‘‘అవును సార్’’
‘‘మొన్న శనివారం బైకు మీద సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వసంతనగర్ వెళ్ళావుకదూ..’’ రెట్టించాడు ఉదయబాబు.
‘‘సర్.. శనివారం నా బైకు సర్వీసింగ్‌కు ఇచ్చాను. బండి ఆదివారం ఉదయం తీసుకున్నాను’’ అంటూ ఏదో జ్ఞప్తికి వచ్చిన వాడిలా పర్స్ వెదికాడు. అదృష్టవశాత్తు సర్వీసింగ్ బిల్లు దొరికింది. తీసి చూపించాడు సుధీర్. దాన్ని చూడగానే ఉదయబాబు కనుబొమ్మలు ముడిపడ్డాయి. దాని మీద డెలివరీ డేట్ కూడా ఉంది. వెంటనే భరణిని తీసుకురమ్మంటూ రవికి హుకుం జారీ చేశాడు. పోలీసు వ్యానులో వాయువేగంగా వెళ్లి పది నిముషాల్లో భరణిని హాజరు పరిచాడు రవి.
‘‘భరణీ.. ఈ బిల్లు చూడు’’ అంటూ చేతికి అందించాడు. అక్కడి వాతావరణం చూడగానే భరణి కాళ్ళూ, చేతులు చల్లబడ్డాయి.
‘‘అవును సార్ మా షాపుదే. నేనే ఇచ్చాను’’ అన్నాడు భయం, భయంగా.
‘‘అయితే ఈ బండి మీద మీ ఇంటికి ఎవరిని పంపావు? అబద్ధం చెప్పొద్దు. నా దగ్గర ఆధారాలున్నాయి. అబద్ధం చెప్పావనుకో..పోలీసు లాఠీ రుచి చూడాల్సి వస్తుంది’’ అంటూ లాఠీని గాలిలో ఝళిపించాడు.
భరణి ముఖం పాలిపోయింది.
‘‘నిజం చెప్తాను సర్. ఆరోజు నేను మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళ లేదు. టిఫిన్‌బాక్స్ తీసుకు రమ్మంటూ రాజును పంపాను. ఒకవేళ ఇంట్లో ఎవరూ లేకుంటే తాళం చెవి ఎక్కడుంటుందో చెప్పాను’’
‘‘మరి ఆరోజు ఎవరి మీదా అనుమానం లేదని చెప్పావు. నీ భార్యతో తాళంచెవి రహస్యం ఎవరికీ చెప్పలేదని వాదించడం నేనారాత్రి విన్నాను’’ అంటూ గర్జించాడు ఉదయబాబు.
గతుక్కుమన్నాడు భరణి.
‘‘నిజమే సర్. రాజు ఇంట్లోకి వెళ్లేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉందట. పవిత్రను పిలిస్తే పలుకలేదట. భయపడి వెంటనే తిరిగి వచ్చాడు’’ అంటూ తల దించుకుని రెండు చేతులా దండం పెట్టసాగాడు భరణి.
‘‘రాజు షాపులో ఉన్నాడా..’’ అంటూ ప్రశ్నించాడు ఉదయబాబు.
‘‘లేడు సర్..ఒంట్లో బాగుండడం లేదని ఆ మరునాటి నుండి రావడం లేదు’’ తల ఎత్తకుండానే సమాధానమిచ్చాడు భరణి.
‘‘వాడి ఇల్లెక్కడ?’’ అంటూ చిరునామా అడిగాడు ఉదయబాబు.
భరణి చెప్పేడు.
అంతా వింటున్న రవి, ఉదయబాబు చేతి సూచనలతో భరణిని సెల్లో వేసి రాజును తీసుకు రావడానికి వెళ్ళాడు. సుధీర్‌ను వెళ్ళిపొమ్మంటూ మరో చేత్తో సైగజేశాడు ఉదయబాబు. రవి, రాజును తీసుకురాగానే వేరే గదిలోకి తీసుకెళ్ళాడు ఉదయబాబు. నిజంగానే రాజు చాలా బలహీనంగా ఉన్నట్లు గమనించాడు. భయంతో వణికి పోతున్నాడు కూడా.
‘‘చూడు రాజూ..భరణిని తీసుకు వచ్చి లోపల వేశాను. నాలుగు తగిలిస్తే నువ్వు చేసిన నిర్వాకం నిజం చెప్పాడు. అలా లాఠీ దెబ్బలకు అవకాశం ఇవ్వకుండా నువ్వు ఆరోజు జరిగిన విషయం వివరంగా చెప్పు. నిజం చెప్పావనుకో..శిక్ష తక్కువ పడేలా చూస్తాను’’ అంటూ భరణి చెప్పిన విషయమంతా వివరించాడు.
‘‘నో సర్..అంతా అబద్ధం. భరణి చెప్పిందంతా అబద్ధం’’ అంటూ రాజు ఏడువసాగాడు.
‘‘అయితే నిజమేంటో చెప్పు’’ అంటూ నింపాదిగా అడిగాడు ఇన్‌స్పెక్టర్.
‘‘సర్..నేను దేవుని మీద, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను’’ అంటూ కన్నీళ్లు తుడ్చుకోసాగాడు.
‘‘భరణి ఇంట్లో రోజూ గొడవేనట సర్. ఇల్లు మారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని భరణి, ఆ ప్రసక్తే లేదని అతని భార్య రోజూ గొడవ పడేవారట. భరణి తనకు మనశ్శాంతి లేదని నాకు రోజూ చెబుతూ బాధపడే వాడు. ఆ ఇల్లు బాగానే ఉంది కదా! అని నేను నచ్చ జెప్పినా వినే వాడు కాదు. అసలు విషయం నాకు తెలుసు సర్..
భరణికి విధవరాలైన అతని మరదలితో అక్రమ సంబంధం ఉంది, అందుకే ఇల్లు అక్కడికి మారితే తనకు సౌకర్యంగా ఉంటుందని అతని ఆలోచన కావచ్చు. మొన్న శనివారం నన్ను చిన్న సాయం చేయమని కోరాడు. ఏంటని అడిగాను. ఈ రోజు శనివారం మా దగ్గర సంత జరుగుతుంది. ప్రతీ శనివారం నా భార్య పాపను తీసుకుని సంతకు వెళ్ళడం అలవాటు. ఈ రోజు వెళ్లి చూడు. ఒకవేళ ఈ రోజు కూడా వెళ్ళితే.. నువ్వు మా ఇంట్లోకి వెళ్లి దొంగలు పడ్డారన్నట్లుగా వస్తువులన్నీ చిందరవందర చేసిరా...ఆ దెబ్బతో నా భార్య భయపడి ఇల్లు ఖాళీ చేసేందుకు ఒప్పుకుంటుందని బతిమాలాడు. తాళంచెవి రహస్యం చెప్పాడు. అప్పుడే సర్వీసింగ్ పూర్తి అయిన బైకు ఇచ్చాడు. వేలి ముద్రలు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొమ్మంటూ గ్లౌస్ కూడా ఇచ్చాడు.
నేను ఇంట్లోకి వెళ్ళేసరికి పాప పడుకుని ఉంది. నెమ్మదిగా శబ్దం రాకుండా బీరువా తెరచి బట్టలు కింద వేస్తుంటే పాప లేచింది. నన్ను గుర్తు పట్టింది. నేను భయపడి పోయాను. పాప..అమ్మా..! అని పిలువబోతుంటే..గట్టిగా నోరు మూశాను. పాప కనుగుడ్లు తెరిసే సరికి వణికిపోయాను. వెంటనే ఏర్పడకుండా తాళం వేసి తాళంచెవి మళ్ళీ పూల కుండీ కింద పెట్టి వచ్చాను సర్’’ అంటూ కన్నీళ్ళ పర్యంతమయ్యాడు రాజు.
ఉదయబాబు నివ్వెర పోయాడు. రాజు చెప్పేది నిజమని నిర్ధారణ చేసుకున్నాడు. గోరుతో పోయే సమస్యకు భరణి గొడ్డలి వాడడం అవివేకమనుకున్నాడు.
భరణి, రాజుల స్టేట్‌మెంట్స్ తీసుకొని కేసు ఫైల్ చేశాడు ఉదయబాబు.
- చెన్నూరి సుదర్శన్
Comments
Please login to add a commentAdd a comment