రంపచోడవరం కిడ్నాప్ | RAMPACHODAVARAM kidnapped | Sakshi
Sakshi News home page

రంపచోడవరం కిడ్నాప్

Published Sun, Feb 8 2015 12:54 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

రంపచోడవరం కిడ్నాప్ - Sakshi

రంపచోడవరం కిడ్నాప్

ముప్పై ఏళ్ల క్రితం జరిగిన క్రైమ్ స్టోరీ ఇది.  నేను 1984లో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా అపాయింట్ అయ్యాను. అప్పటికి ఆ ప్రాంతమంతా నక్సల్స్ కిడ్నాపుల సంఘటనలతో అట్టుడుకుతోంది. నేను అక్కడికి వెళ్లకుముందు జరిగిన ఓ రెండు పెద్ద కిడ్నాపులు నాకే కాదు, మొత్తం డిపార్టుమెంటుకే సవాలుగా నిలిచాయి.
 
ఒకసారి నక్సల్స్... ఎనిమిదిమంది ఐఏఎస్ ఆఫీసర్లను కిడ్నాప్ చేసి వారి డిమాండ్లను నెరవేర్చుకున్నారు. ఇంకోసారి పెద్దాపురం ఆర్‌డీఓను కిడ్నాప్ చేసి వారి సహచరుల్ని జైల్ నుంచి విడిపించుకున్నారు. అదే సమయంలో ఆదిలాబాద్ కలెక్టర్‌ని కూడా కిడ్నాప్ చేశారు. ఎక్కడ చూసినా నక్సల్స్ కిడ్నాపుల వార్తలే. తూర్పుగోదావరి చాలావరకూ ఏజెన్సీ ప్రాంతం కావడంవల్ల అక్కడే ఈ సంఘటనలు ఎక్కువగా జరుగుతుండేవి. ఎవరిని కిడ్నాప్ చేసినా దట్టమైన అడవుల్లోకి తీసుకెళ్లి దాచిపెట్టేవారు. పవర్‌లో ఉన్నవారిని కిడ్నాప్ చేసి తోటి నక్సల్స్‌ని జైళ్ల నుంచి విడిపించుకునేవారు. డబ్బున్నవారిని కిడ్నాప్ చేసి ధనాన్ని డిమాండ్ చేసేవారు. ఇలాంటివి వారి భాషలో ‘మనీ యాక్షన్’ పనులన్నమాట!
 
సాయంత్రంలోగా 35 లక్షలు!

ఒకరోజు ఉదయం నేను రంపచోడవరం ఏజెన్సీలో ఉండగా ఓ షావుకారి కుటుంబ సభ్యులొచ్చి చేతిలో ఓ లేఖ పెట్టి బోరుమన్నారు. సాయంత్రం లోగా 35 లక్షల డబ్బుని ఫలానా చోటికి పంపించకపోతే షావుకారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఆ ఉత్తరం సారాంశం. అప్పటికే నేను నక్సల్స్ కిడ్నాపింగ్ సంఘటనల విషయంలో చాలా అలర్ట్‌గా ఉన్నాను. ఉదయం తొమ్మిదింటికి కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే మా బలగాలను మొత్తం దింపాను. దాదాపు రెండు వందల మంది వరకూ ఉంటారు. వారిని ఎనిమిది గ్రూపులుగా విభజించాను. ఒక్కో గ్రూపులో ఇరవైమందికి పైగానే ఉంటారు. నా అంచనా ప్రకారం కిడ్నాప్ చేసిన దళంలో పదిమందివరకూ నక్సల్స్ ఉంటారు. ఒక నక్సల్‌కి ఇద్దరు పోలీసుల చొప్పున గ్రూపులను తయారుచేసి అటవీ ప్రాంతానికి చేరుకున్నాం. రంప ఏజెన్సీలో ఉన్న అటవీ విస్తీర్ణం చాలా పెద్దది. చాలా డేంజరెస్ జోన్ కూడా! చిరుత పులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేవి. ముందుగా అడవి మ్యాప్ తీసుకుని, అడవి చుట్టూ ప్రాంతాన్ని మా బృందాలు కవర్ చేసేలా ప్లాన్ వేశాను. అందరమూ దిక్సూచిలు, వైర్‌లెస్ ఫోన్లు, రాత్రుళ్లు కూడా కనిపించే నైట్ విజన్ గాగుల్స్, ఆయుధాలను వెంటబెట్టుకుని బయలుదేరాం.
 
కాళ్లు అరిగే ప్రయాణం...


నా స్కెచ్ గురించి చెప్పగానే టీమంతా ఆశ్చర్యపోయింది. లేఖలో చాలా స్పష్టంగా రాసి ఉంది. పోలీసులకు చెబితే బాగుండదని. అలాంటి పని చేస్తే వెంటనే ప్రాణాలు తీసేస్తామని కూడా హెచ్చరించారు. అలాంటి లేఖని చదివి కూడా నేను ఇలా పోలీసు బలగాలను అడవిలోకి పంపడం ఎంతవరకూ సమంజసమని అనుకున్నారంతా. కానీ నా స్కెచ్ ఫలితం... షావుకారు ప్రాణాలతో దక్కుతాడు. ఆ క్షణానికి అది నా నమ్మకం మాత్రమే. నా ప్లాన్ బెడిసికొట్టే అవకాశం లేకపోలేదు. మనసులో షావుకారు ప్రాణాలకు అపాయం జరక్కూడదని కోరుకుంటూ అడుగు ముందుకు వేస్తున్నానే కాని నా టెన్షన్ నాకుంది. అప్పటివరకూ ఇలాంటి ఆపరేషన్స్‌లో ఎస్పీ స్థాయి వ్యక్తి నేరుగా పాల్గొనడం అదే ప్రథమం.
 
గాల్లోకి కాల్పులు...

అడవిని ఆనుకుని ఉన్న గూఢాలు దాటుకుని మధ్యలో కాసేపు ఆగి గిరిజనులు పెట్టిన రొట్టెలు తిని మళ్లీ పరుగు మొదలుపెట్టాం. నక్సల్స్‌కి సానుభూతిపరులున్నట్టే మాక్కూడా ఉంటారు కదా! వాళ్లు షావుకారుని పట్టుకుని ఎటువైపు వెళ్లింది చూసినవారల్లా చెప్పుకొచ్చారు. దాన్నిబట్టి ముందుకు కదిలాం. మధ్యమధ్యలో చిన్న చిన్న దొంగతనాలు చేసిన దొంగలు మమ్మల్ని చూసి పారిపోయేవారు. ‘మీకోసం కాదురా బాబు’ అనుకుంటూ మా పనిలో మేం నిమగ్నమైపోతుండగా నక్సల్స్‌కి కొద్దిగా దగ్గరగా వచ్చామన్న విషయం అర్థమయ్యాక అసలు ప్లాన్ అమలుపరిచాను. వైర్‌లెస్ సాయంతో అందరికీ ఒక ఆర్డరు జారీ చేశాను. నాన్‌స్టాప్‌గా గాల్లోకి కాల్పులు జరుపుకుంటూ ముందుకి నడవమని చెప్పాను. అడవిలో చిన్న శబ్దం కూడా చాలా గట్టిగా వినపడుతుంది. అలాంటిది వందల సంఖ్యలో తుపాకులు ఆకాశంలోకి పేలుస్తుంటే చప్పుడు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. ఎనిమిది వైపుల నుంచి తుపాకి కాల్పులు. ఒక్కసారి పేలిస్తే నాలుగుసార్లు రీసౌండ్ వస్తోంది. మావరకూ మాకే చెవులు చిల్లులు పడేలా అనిపించింది.
 
విషయం అర్థమైంది...


గిరిజనులు నక్సల్స్ వెళ్లిన మార్గం గురించి మాకు ఎలా వివరాలు చెప్పారో వారికి అంతకంటే పెద్దస్థాయిలో సానుభూతిపరులు ఉంటారు కాబట్టి వారికి కూడా మా గాలింపు విషయాలు ఎప్పటికప్పుడు అందుతుంటాయి. పైగా ఎస్పీయే రంగంలోకి దిగిన వార్త వారికి ముందుగానే అందిపోయి ఉంటుంది. సాయంత్రం ఐదు అయ్యేసరికి వారున్న ప్రాంతానికి చేరుకున్నాం. ఒక కొండదిగాక పెద్ద జలపాతం కనిపించింది. అక్కడ పెద్ద రాయి. దానిముందు శివలింగం ఉంది. అక్కడికి వెళ్లి చుట్టూ ఉన్న లోయలోకి చూస్తే పక్కనే ఒక వెడల్పాటి రాయిపై పడివున్న షావుకారు కనిపించాడు. దగ్గరికి వెళ్లిచూస్తే బాగా దెబ్బలతో ఆయాసపడుతూ ఉన్నాడు. ‘ఏంటి సంగ’తని అని అడిగితే... ఇప్పుడే నక్సల్స్ తనని అక్కడ వదిలేసి పారిపోయారని చెప్పాడు. నేను దగ్గరకి వెళ్లగానే ఓపిక కూడదీసుకుని కన్నీళ్లతో కృతజ్ఞత చెప్పాడు. కారణం... అప్పటివరకూ డిమాండ్ నెరవేర్చకుండా ఏ ఒక్కరూ నక్సల్స్ చేతిల్లోనుంచి ప్రాణాలతో బయటపడలేదు.
 
చుట్టుముట్టడం వల్లే...

మామూలుగా ఇలాంటి కిడ్నాపింగ్ సంఘటనల్లో పోలీసులు దాడికి వస్తున్నారని తెలియగానే కిడ్నాప్‌కి గురైనవాడ్ని చంపేసి పారిపోతారు. లేదంటే అతన్ని ఎక్కడైనా దాచిపెట్టి బెదిరింపులు కొనసాగిస్తారు. కానీ ఓ సామాన్యుడ్ని కిడ్నాప్ చేస్తే ఇంత పెద్దస్థాయిలో బలగాల్ని దింపుతామని వారు ఊహించలేదు. పైగా నేను గాల్లోకి కాల్పులు జరపాలనే కాన్సెప్టుకి అర్థం ఏమిటంటే... ఒకవైపు నుంచి పోలీసులు వస్తున్నారంటే మరో వైపుకి వారు పరిగెడతారు. కానీ నాలుగువైపుల నుంచి ఫైరింగ్ చప్పుళ్లతో వస్తున్నారంటే పోలీసుల కోపం ఏ స్థాయిలో ఉందో వారికి అర్థమైపోతుంది. వాళ్లు మరో స్కెచ్ వేసుకునే అవకాశం లేకుండా సైకలాజికల్‌గా ఇబ్బందిలో పడేశాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... అప్పటికే షావుకారిని బలవంతంగా లాక్కుంటూ, కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లడం వల్ల అతని చాలా దెబ్బలు తగిలాయి. అతన్ని చంపేసి పారిపోతే మరునిమిషం మా టార్గెట్ నక్సల్సే అవుతారు. అడవంతా జల్లెడ పట్టయినా వారిని అంతం చేస్తామని వారికి తెలుసు. అదే షావుకారిని ప్రాణాలతో వదిలేస్తే మా దృష్టి అతనిపై ఉంటుంది. పైగా బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి కాబట్టి అతన్ని ముందుగా ఆసుపత్రికి తీసుకెళ్లే పనిలో పడతాం కదా! నా స్కెచ్ నాతో ఉన్న పోలీసువారికి ఎంతవరకూ అర్థమైందో తెలీదు కానీ, నక్సల్స్‌కి మాత్రం క్లియర్‌గా అర్థమైంది. నేను కోరుకున్నట్టుగానే షావుకారిని మార్గమధ్యంలో వదిలేసి పారిపోయారు.
 
సీఎం అభినందన...

దెబ్బలతో ఉన్న షావుకారిని మావాళ్లంతా మోసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. నక్సల్స్ చేతిలో కిడ్నాప్ అయిన వ్యక్తిని ఈ విధంగా విడిపించుకురావడం అప్పుడొక సంచలనమైంది. పోలీస్ డిపార్టుమెంట్ పేరు చెబితే నక్సల్స్ ఒక నిమిషం ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చింది. ఇక షావుకారి కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేవు. అప్పటి డీజీపీ కృష్ణమాచార్యులు వెంటనే ఫోన్ చేసి అభినందించారు. ఆ వెంటనే ముఖ్యమంతి ఎన్.టి రామారావుగారి దగ్గర నుంచి ఫోన్. ‘బ్రదర్...బాగుంది. కంగ్రాట్స్’ అంటూ. ఫోన్ చేసి ఊరుకోలేదు. రిటన్‌గా కమండేషన్స్(రాతపూర్వక ప్రశంస) పంపించారు. ఆ సందర్భంగా ‘ఎస్పీ స్వయంగా ఇలాంటి ఆపరేషన్స్‌లో పాల్గొంటే ఫలితాలెలా ఉంటాయనేందుకు ఈ కేస్ ఒక ఉదాహరణ’ అని  డీజీపీ కృష్ణమాచార్యులు అన్నమాట డిపార్టుమెంట్‌లోకి వచ్చేవారికి ఒక పాఠంలాంటిది!
 
రిపోర్టింగ్: భువనేశ్వరి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement