ఉన్మాదం వెర్రితలలేయడం చరిత్రకేం కొత్త కాదు. వికృత చేష్టలతో కొందరు.. సీరియల్ కిల్లర్స్ ఇంకొందరు.. తరతరాలను వణికిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో ఒకడు మౌపా సెడ్రిక్ మాకే. తప్పు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించిన ఘనుడు. హత్యలు, హత్యాచారాలు, దొమ్మీలు, దోపిడీలు.. ఒక్కటేమిటి తవ్వేకొలదీ అతడి జీవితం ఓ నేరాల పుట్ట.
దక్షిణాఫ్రికాకు చెందిన మౌపా.. 1965లో జన్మించాడు. అతడి నేర చరిత్ర 1996 నుంచి మొదలైంది. ఏడాదిలోనే తనున్న నగరాన్ని అతలాకుతలం చేసేశాడు. ‘మౌపా సెడ్రిక్ మాకే’గా కాకుండా ‘వెమ్మెర్ పాన్ కిల్లర్’గా పేరు మోశాడు.
ఎందుకలా మారాడు?
1996 నుంచి 1997 వరకూ జోహాన్నెస్‌బర్గ్‌లోని వెమ్మెర్ పాన్ అనే ప్రాంతంలో వరుసగా 3 రకాల హత్యలు జరిగాయి. ఎవరు చేస్తున్నారో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. హత్యలు జరిగిన తీరుని బట్టి రెండు రౌడీగ్యాంగ్స్ నగరానికి వచ్చి ఉంటాయని.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. హత్యకు గురైన తీరుని బట్టి వాటిని మూడు వేరువేరు కేటగరీలుగా విభజించి ప్రొఫైల్స్ కూడా రెడీ చేశారు. మొదటి రకం.. ఒంటరిగా నడిచివెళ్లే ఆడ, మగలను బండరాయితో కొట్టి చంపి, వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకోవడం. రెండవ రకం.. కారుల్లో వెళ్లే జంటలను టార్గెట్ చేసి మొదట మగవారిని గన్‌తో కాల్చి చంపి.. తర్వాత స్త్రీలను రేప్ చేసి చంపడం. మూడవ రకం.. స్థానిక టైలర్ల షాపులపై దాడి చేసి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం. ఇలా జరిగిన హత్యల్లో మూడు తేడాలు ఉండేవి. దాంతో ఈ ఉదంతం ఓ మిస్టరీగా మారిపోయింది. టైలర్స్ మీద దాడి చేసేది ఒక గ్రూప్ అని, మిగిలిన రెండు రకాల హత్యలను మరో గ్రూప్ చేస్తోందని ముందొక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. వెమ్మెర్ పాన్ ప్రాంతంలో హత్యలు జరుగుతున్నాయి కాబట్టి ‘వెమ్మెర్ పాన్ కిల్లర్’గా, కొందరిని సుత్తితో చంపుతున్నారు కాబట్టి ‘హామర్ కిల్లర్’గా పేర్లు పెట్టి స్థానిక మీడియా ఆ నగరవాసులను హెచ్చరించేది.
మౌపా
చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!
ఓ రోజు ఓ టైలర్ షాప్‌లో పోలీసులకు ఒక స్లిప్ దొరికింది. దాంట్లో ఓ సంతకం ఉంది. దాన్ని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే.. అప్పటికే అలాంటి సంతకం రెండో గ్రూప్ చేసిన హత్యలో కీలక ఆధారంగా దొరికింది. దాంతో రెండు గ్రూపులు లేవనీ ఒకటే గ్రూపు ఇదంతా చేస్తోందని పోలీసులు భావించారు. కనీసం ఒక్కడిని పట్టుకున్నా గ్యాంగ్ మొత్తాన్ని బయటికి లాగొచ్చు అనే ఆలోచనతో దాన్నో సవాలుగా తీసుకున్నారు. వెమ్మెర్ పాన్ చుట్టుపక్కల మఫ్టీలో తిరగడం మొదలుపెట్టారు.
కొన్నిరోజులకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమ పై అధికారులకు అప్పగించారు ఆ మఫ్టీ పోలీసులు. అయితే ఆ అధికారులు అతన్ని చూడగానే షాక్ అయ్యారు. ‘నువ్వా?’ అంటూ ఆశ్చర్యపోతున్న అధికారులతో ‘నేనే సార్.. గుర్తున్నానా? నా పేరు మౌపా సెడ్రిక్ మాకే. ఆ ఏరియా మాదే సార్. ఇంతకు ముందు కొన్ని హత్యలకు సంబంధించిన సమాచారాన్ని నేనే కదా మీకిచ్చింది’ అని అతను అనడంతో పోలీసులకు మతి పోయింది. ఆ వెంటనే తేరుకొని వాళ్లు ‘అసలు ఆ నేరాల గురించి నీకు మాత్రమే ఎలా తెలుస్తోంది?’ అంటూ ఆరా లాగారు. దాంతో అతని డ్రామాకి తెరపడింది. అనుమానం రావాలే కానీ నిజాలను కక్కించడం ఎంతసేపు? చివరికి అదే జరిగింది. గ్యాంగులు, గ్రూపులు ఏమీ లేవని.. ఆ నేరాలన్నిటినీ తానే చేశానని ఒప్పుకున్నాడు మౌపా. పోలీసులకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ తప్పించుకుని తిరిగిన మౌపా వ్యూహాన్ని చాకచక్యంగా ఛేదించారు పోలీసులు.
చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద!
మౌపా అరెస్టు
1,340 ఏళ్ల జైలుశిక్ష..
1997 డిసెంబర్‌లో అరెస్ట్ అయిన మౌపాకి.. 6 సెప్టెంబర్, 2000 సంవత్సరంలో అన్ని ఆధారాలతో శిక్ష ఖరారైంది. అతడు మొత్తంగా 110కి పైగా నేరాలు చేసినట్లు తేలింది. 27 హత్యలు, 26 హత్యాయత్నాలు, 14 రేప్‌లు, 41 దోపిడీలు చేసినట్లు రుజువైంది. వాటన్నింటికీ కోర్టు అతడికి 27 జీవిత ఖైదులను విధించింది. అంటే 1,340 సంవత్సరాలు అతను జైల్లో ఉండాలని తీర్పునిచ్చింది. అయితే ఈ నేరాల్లో ఎక్కువ శాతం రెండిళ్ల చుట్టుపక్కలే జరగడం గమనార్హం. వాటిలో ఒకటి మౌపా పని చేసే ఇల్లు, మరొకటి అతడి సోదరుడు నివసిస్తున్న ఇల్లు. ఆ రెండిళ్ల మధ్య తన ఇష్టానుసారంగా తిరుగుతూ ఈ నేరాలకు పాల్పడ్డాడు మౌపా. అయితే ఈ శిక్షలపై బాధిత బంధువు ఒకరు స్పందిస్తూ.. ‘మరణ శిక్ష అమల్లో ఉంటే నేను చాలా సంతోషించేవాడిని’ అన్నాడు.. 1995 నుంచి దక్షిణాఫ్రికాలో మరణ శిక్షలు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.
-సంహిత నిమ్మన
చదవండి: Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..
Comments
Please login to add a commentAdd a comment