సుపారీ: ఒక్క హత్యకు రూ.6 లక్షలు! | Supari Killer: A Crime Story | Sakshi
Sakshi News home page

సుపారీ: ఒక్క హత్యకు రూ.6 లక్షలు!

Published Sun, Feb 14 2021 8:47 AM | Last Updated on Sun, Feb 14 2021 9:04 AM

Supari Killer: A Crime Story - Sakshi

‘నిన్ను ఎక్కడో చూసినట్టుందే!’ బార్‌లోని ఏసీ సెక్షన్‌లోకి వెళ్లడంతోనే లోపల ఒంటరిగా కూర్చున్న ఒక వ్యక్తి వంక పరీక్షగా చూస్తూ అన్నాడు ప్రకాశ్‌. 
ఆ మాట విన్న ఆ వ్యక్తి నర్మగర్భంగా నవ్వుతూ ‘మీవంటి ధనవంతులకు సేవలందిస్తుంటాను. ఆ సందర్భంలో ఎక్కడో చూసి ఉంటారు నన్ను’ చెప్పాడు. 
అతని ముందు కూర్చుంటూ అడిగాడు ప్రశాశ్‌ ‘నువ్వు అందిస్తున్న సేవలు ఎలాంటివో?’ అంటూ. 
‘హత్యలు’ కూల్‌గా చెప్పాడు ఆ వ్యక్తి. 
ఆ మాట విన్న ప్రకాశ్‌ ఉలిక్కిపడ్డాడు. కంగారుగా అటూ ఇటూ చూశాడు. అది ఉదయం పదకొండు గంటల సమయం కావడంతో బార్‌లో బొత్తిగా జనం లేరు. తమ మాటలను వినేవారెవరూ లేరని గ్రహించాక  ‘నీ పేరేంటి?’ అని అతణ్ణి అడిగాడు ప్రకాశ్‌.
‘నా పేరు మారుతూ ఉంటుంది.. ప్రస్తుతానికైతే నేను రాజును’ చెప్పాడు అతను. 
ప్రకాశ్‌ ఆత్రంగా ముందుకు వంగి స్వరం బాగా తగ్గించి అడిగాడు ‘నా కోసం ఒక హత్య చేస్తావా?’ అంటూ. 
మళ్లీ నవ్వాడు రాజు. అర్థం కానట్టుగా చూశాడు ప్రకాశ్‌. అర్థమయ్యేలా చెప్పాడు రాజు ‘నేను ఎవరి కోసమూ హత్యలు చేయను. కేవలం డబ్బు కోసమే చేస్తాను’ అని. 
‘ఓకే.. ఎంత కావాలో చెప్పు?’ అన్నాడు ప్రకాశ్‌.

‘ఎవరిని చంపాలి? ఎలా చంపాలి? ఆ పనిలో ఉన్న రిస్క్‌ ఎంత? అనే దాన్ని బట్టి రేట్‌ ఫిక్స్‌ చేస్తా’ చెప్పాడు నింపాదిగా. 
‘ఇందులో రిస్క్‌ చాలా తక్కువ. చంపవలసిన వ్యక్తి గొప్పవాడేమీ కాదు. అతని పేరు వినోద్‌. ఓ విలేఖరి. గాంధీనగర్‌లోని చర్చి ఎదురుగా ఉన్న ప్రియా అపార్ట్‌మెంట్స్‌ రెండో అంతస్తులో ఉంటాడు. మూడు రోజుల కిందటే అతని భార్య, పిల్లలు బంధువుల పెళ్లికి వెళ్లారు. ప్రస్తుతం వినోద్‌ ఒక్కడే ఉంటున్నాడు ఇంట్లో. ఇంకో విషయం.. ఆ రెండో అంతస్తులో వినోద్‌ ఫ్లాట్‌ ఒక్కటే ఉంటుంది. కాబట్టి అతణ్ణి పట్టపగలు చంపినా ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. అతణ్ణి చంపి ఇంట్లో దోపిడీ జరిగినట్టు వాతావరణం సృష్టిస్తే చాలు... దోపిడీ కోసం జరిగిన హత్యనే అనుకుంటారు పోలీసులు’ వివరించాడు ప్రకాశ్‌. 
ఒక్క క్షణం ఆలోచించి చెప్పాడు రాజు ‘మామూలుగా నేను ఒక హత్యకు పది లక్షలు తీసుకుంటాను. ఇందులో రిస్క్‌ తక్కువ కాబట్టి ఎనిమిది లక్షలు ఇవ్వండి’ అని. 
‘చాలా ఎక్కువ అడుగుతున్నావ్‌. ఆరు లక్షలు ఇస్తాను’ స్థిరంగా ఉంది ప్రకాశ్‌ స్వరం. 
‘ఊ...’ అని నసుగుతూ రెండు చేతులతో తల రుద్దుకుంటూ ‘సరే.. కానీ మొత్తం డబ్బు ఇప్పుడే ఇచ్చేయాలి. పనయ్యాక నేను కన్పించను ’ అన్నాడు రాజు. 
‘నేను కోరుకునేదీ అదే. మొత్తం డబ్బు ఇప్పుడే ఇచ్చేస్తాను. నేను చెప్పిన పని కూడా ఈ రోజే ముగించాలి. ఎందుకంటే రేపు వినోద్‌ ఫ్యామిలీ తిరిగొచ్చేసిందనుకో.. కష్టం అవుతుంది. నేనూ ఈ మధ్యాహ్నం ఫ్లయిట్‌కి ఢిల్లీ వెళ్లిపోతున్నా. హత్య జరిగిన రోజు నేను ఇక్కడ లేనట్టు ఎలిబీ కూడా క్రియేట్‌ అవుతుంది కాబట్టి పోలీసులకు నా మీద అనుమానం రాదు’ చెప్పాడు ప్రకాశ్‌.

‘సరే.. ఆ వినోద్‌ ఫొటో ఉంటే ఇవ్వండి’ అడిగాడు రాజు. 
‘ఉన్న ఒక్క ఫొటో మహేశ్‌కి ఇచ్చేశా. అయినా ఫొటో అక్కర్లేదు. ఎందుకంటే ప్రియా అపార్ట్‌మెంట్స్‌ రెండో అంతస్తులో ఉండేది వినోద్‌ ఒక్కడే. సాయంత్రం ఆరుగంటల కల్లా అతను తన ఫ్లాట్‌కి చేరకుంటాడు. అక్కడే అతణ్ణి చంపాలి. శబ్దాలు వినపడకుండా పని ముగించాలి’ అన్నాడు ప్రకాశ్‌.
‘డోంట్‌ వర్రీ. నా దగ్గర సైలెన్సర్‌ సెట్‌ చేసిన పిస్తోల్‌ ఉంది. సైలెంట్‌గానే పని ముగిస్తాను’ ధీమాగా చెప్పాడు రాజు. 
ప్రకాశ్‌ తన బ్యాగ్‌ తెరచి ఆరు లక్షల రూపాయలు రాజుకు ఇచ్చాడు. రాజు ఆ డబ్బును షర్టులో కుక్కుకొని పై నుంచి హుడీ వేసుకొని వెళ్లిపోయాడు.

ప్రకాశ్‌ ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. అవినీతి, అక్రమాలతో బాగా డబ్బు సంపాదించాడు. ఈ వ్యవహారంలోనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ వినోద్‌ అతనికి తలనొప్పిగా మారాడు. వినోద్‌ వల్ల తన గుట్టంతా ఎక్కడ బయటపడు తుందోననే భయం పట్టుకుంది ప్రకాశ్‌కి. డబ్బు ఎర చూపి వినోద్‌ నోరు మూయించాలని ప్రయత్నించాడు. కానీ వినోద్‌ లొంగలేదు. అందుకే ఏకంగా అతని హత్యకే ప్లాన్‌ చేశాడు ప్రకాశ్‌. రాజు కన్న ముందే మహేశ్‌ అనే కిల్లర్‌కి సుపారీ ఇచ్చాడు. మూడు లక్షలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడు. తీరా పని మొదలుపెట్టే సమయానికి ఒక పాత కేసు విచారణ కోసం మహేశ్‌ను పట్టుకుపోయారు పోలీసులు. అతనెప్పుడు బయటకు వస్తాడో తెలియదు. ఈ లోపు వినోద్‌ కుటుంబం వచ్చేస్తే అతని మర్డర్‌ కష్టమవుతుంది. అందుకే వెంటనే ఆ సుపారీని రాజుకి బదలాయించాడు ప్రకాశ్‌.. ఆలస్యం కాకుండా వినోద్‌ను మట్టుబెట్టేందుకు. 

ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకే రాజు గాంధీనగర్‌లోని ప్రియా అపార్ట్‌మెంట్స్‌ దగ్గరికి చేరుకున్నాడు. తన ముఖం కనపడకుండా కోవిడ్‌ మాస్క్‌తో పాటు కూలింగ్‌ గ్లాసెస్‌ ధరించాడు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. నాలుగు అంతస్తులున్న ప్రియా అపార్ట్‌మెంట్స్‌ ఓ పాత బిల్డింగ్‌. ఒక్కో అంతస్తులో ఒక్కో ఫ్లాట్‌ ఉంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌కి తాళం వేసి ఉంది. పైకి వెళ్లడానికి ఓ పక్క లిఫ్ట్, మరోపక్క మెట్లు ఉన్నాయి. బిల్డింగ్‌ కాంపౌండ్‌లో వాచ్‌మెన్‌ గాని, సీసీటీవీ కెమెరాలు గానీ లేవు. నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు రాజు. బిల్డింగ్‌కి కొద్ది దూరంలో నిల్చొని వినోద్‌ కోసం ఎదురు చూడసాగాడు.

అరగంట గడిచాక మాస్క్‌ ధరించిన ఓ వ్యక్తి ప్రియా అపార్ట్‌మెంట్‌ కాంపౌండ్‌లోకి ప్రవేశించాడు. నేరుగా  లిఫ్ట్‌లో పైకి వెళ్లాడు. రాజు వెంటనే ఆ లిఫ్ట్‌ దగ్గరకు వెళ్లి చూశాడు. అక్కడ కనిపించిన నంబర్‌ను బట్టి ఆ వ్యక్తి రెండో అంతస్తుకి వెళ్లాడని అర్థమైంది రాజుకి. దాంతో ఆ వ్యక్తి వినోద్‌ అని నిర్ధారించుకున్నాడు. మెట్ల గుండా గబగబా రెండో అంతస్తుకి చేరుకున్నాడు రాజు. ఫ్లాట్‌ ద్వారాన్ని సమీపించి జేబులోంచి సైలెన్సర్‌ అమర్చిన పిస్తోల్‌ను  బయటకు తీశాడు. చిన్నగా తలుపు నెట్టి చూశాడు. లోపల గడియ లేకపోవడంతో తలుపు తెరుచుకుంది. చప్పుడు చేయకుండా లోపలికి నడిచాడు. ఎదురుగా కన్పించిన దృశ్యం చూసి అదిరిపడ్డాడు రాజు. 
ఇందాకా లిఫ్ట్‌లో పైకి వచ్చిన మాస్క్‌ వ్యక్తి పిస్తోల్‌ పట్టుకొని షూట్‌ చేసేందుకు పొజిషన్‌లో నిలబడి ఉన్నాడు. రాజును చూడగానే అతను ట్రిగ్గర్‌ నొక్కేశాడు. క్షణం ఆలస్యం చేయకుండా అసంకల్పితంగా రాజు చేతిలోని పిస్తోల్‌ కూడా పేలింది. ఇద్దరూ గురి తప్పలేదు. ఒకరి పిస్తోల్‌ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్‌ మరొకరి గుండెలోకి చొచ్చుకొని పోయింది. ఇద్దరూ ఆర్తనాదాలు చేస్తూ నేలకొరిగి ప్రాణాలు విడిచారు. 

‘నిన్న నగరంలోని గాంధీనగర్‌లో అనూహ్య సంఘటన జరిగింది. ప్రముఖ ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ వినోద్‌ ఫ్లాట్‌లో ఇద్దరు వ్యక్తులు పిస్తోళ్లతో ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారు. ఆ సమయంలో వినోద్‌ ఇంట్లో లేడు. చనిపోయిన ఇద్దరిలో ఒకవ్యక్తిని పాత నేరస్తుడు మహేశ్‌గా గుర్తించారు పోలీసులు. అతనొక సుపారీ కిల్లర్‌ అని పోలీసుల అనుమానం. ఓ పాతకేసులో విచారణ కోసమని నాలుగు రోజుల కిందటే పోలీసులు అతణ్ణి తీసుకెళ్లారు. కాని సరైన సాక్ష్యాధారాలు లేక నిన్న మధ్యాహ్నం వదిలేశారు. నిన్న సాయంకాలం అతను వినోద్‌ను హతమార్చడానికి ఆ ఫ్లాట్‌కి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. వినోద్‌ ఇంటికి చేరేకంటే ముందే మహేశ్‌ మారు తాళం చెవితో ఆ ఫ్లాట్‌కు వెళ్లి వినోద్‌ కోసం కాపు కాశాడు.

అంతలోకే మరో అజ్ఞాత వ్యక్తి వినోద్‌ను చంపడానికి అక్కడికి వచ్చాడు. ఒకరిని చూసి మరొకరు వినోద్‌ అని పొరబడి పిస్తోళ్లు పేల్చి ఉంటారని అనుకుంటున్నారు పోలీసులు. బుల్లెట్లు సూటిగా ఇద్దరి గుండెల్లోకి చొచ్చుకుపోవడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. ఆ ఇద్దరూ వినోద్‌ను చంపడానికి వచ్చిన సుపారీ కిల్లర్లే అని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి సుపారీ ఇచ్చిన వారి కోసం గాలిస్తున్నారు. నగరంలోని ఓ బార్‌లోని ఏసీ గదిలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాక పోలీసులకు ఓ క్లూ దొరికినట్టు తెలుస్తోంది. దాంతో ఈ హత్య వెనుక గల మిస్టరీని త్వరలో ఛేదిస్తామని పోలీసులు ప్రకటించారు.’ ఢిల్లీలో  ఉన్న ప్రకాశ్‌ టీవీలో వస్తున్న ఈ వార్తను చూడగానే  అసహనంతో జుట్టు పీక్కున్నాడు.

చదవండి: ఆమె నా భార్య కాదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement