ఒక క్రైమ్ కథ | Crime story | Sakshi
Sakshi News home page

ఒక క్రైమ్ కథ

Published Sun, Oct 30 2016 1:33 AM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

ఒక క్రైమ్ కథ

ఒక క్రైమ్ కథ

 ముకుందరావు చిన్న చిన్న వ్యాపారాలేవో చేసి డబ్బు బాగానే గడించాడు. ‘తానేమిటో తన వ్యాపారమేమిటో’ అన్నట్లుగా ఉండేవాడు తప్ప... ‘రిలాక్స్’ ‘కళా పోషణ’లాంటి పదాలు ఏవీ తెలియదు. మరి అలాంటి ముకుందరావుకు ఏమైందో ఏమోగానీ... సినిమాల మీద మోజు పెంచుకున్నాడు. ఏ మాత్రం సమయం దొరికినా... పాత సినిమాలు, కొత్త సినిమాలు అనే తేడా లేకుండా తెగ చూసేవాడు. ఒకానొక రోజు నిర్మాతగా మారి సినిమాలు తీయాలనే ఆలోచన వచ్చింది తనకు.
 
 ‘నువ్వు ఒక్కడివే తీస్తే చేతులు కాలుతాయి. అలా కాకుండా... ఇతరులతో కలిసి తీస్తే... ఒకవేళ సినిమా బాగా ఆడకపోయినా... ప్రమాదమేమీ ఉండదు’ అని సన్నిహితులు సలహా ఇవ్వడంతో... తనలాగే సినిమా పిచ్చి ఉన్న ఇద్దరితో మాట్లాడి వారిని కూడా రంగంలోకి దించాడు. అలా అశోక్, రమణ, ముకుందరావులు కలిసి ఒక హారర్ పిక్చర్‌కు ప్లాన్ చేశారు. హారర్ పిక్చర్‌కు పెద్ద ఖర్చేమీ ఉండదు.
 
 నష్టం వచ్చినా అది భారీగా ఏమీ ఉండదు.
 అయితే సినిమా మొదలైన రెండు వారాల్లోనే... పార్ట్‌నర్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. బడ్జెట్‌లో కొంత సొమ్మును తన సొంత ఖర్చులకు వాడుకున్నట్లు మిగిలిన ఇద్దరు ముకుందరావుపై ఆరోపణ చేశారు. ఒకరినొకరు తిట్టుకున్నారు. బెదిరించుకున్నారు. ఏమైందో ఏమోగానీ... వివాదం సడన్‌గా సద్దుమణిగింది. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. అయితే సినిమా తీయాలనే కోరిక మాత్రం ముకుందరావులో చావ లేదు. ఈసారి తానొక్కడే సొంతంగా తీయాలనుకున్నాడు. జూబ్లిహిల్స్‌లో ఆఫీసు తీసుకొని... కథలు వినడం ప్రారంభించాడు.
   
 ఆరోజు ఆఫీసుకు రవి అనే యువకుడు వచ్చాడు. కథ చెప్పడానికి వచ్చానంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు.
 ‘‘ఏం కథ?’’
 ‘‘మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కథ సార్...’’
 ‘‘లైన్ చెప్పు...’’
 
 ‘‘హరిప్రసాదరాయుడు అని సిటీలో పెద్ద పారిశ్రామిక వేత్త ఉంటాడు. ఒకరోజు హత్యకు గురవుతాడు. అతని చూపుడు వేలు గోడ మీద ఉన్న ఒక ఫొటోను చూపిస్తున్నట్లు ఉంటుంది. విషయం ఏమిటంటే... ఆ ఫొటోనే హంతకుడెవరో పట్టిస్తుంది. ఆ తరువాత...’’ కొత్త రచయిత రవి చెప్పుకుంటూ పోతున్నాడు.
 
 ‘‘ఆ స్క్రిప్ట్ ఇచ్చి వెళ్లు... తరువాత ఫోన్ చేస్తాను’’ అన్నాడు ముకుందరావు.తన స్క్రిప్ట్ ముకుందరావుకు ఇచ్చి వెళ్లాడు రవి. రెండు గంటల తరువాత... ముకుందరావు తన ఆఫీసులో హత్యకు గురైన వార్త నలుమూలలా వ్యాపించింది. పోలీసులు వచ్చారు. తన సీట్లో నిర్జీవంగా పడి ఉన్నాడు ముకుందరావు. అతని చూపుడు వేలు మాత్రం... టేబుల్  మీద ఒకవైపు ఉన్న సినీ హీరో రాజేష్ ఖన్నా ఫొటోను చూపెడుతోంది.
 
 ‘‘చూపుడు వేలు రాజేష్ ఖన్నాను ఎందుకు చూపెడుతుంది?’’ ఎవరికీ ఏమీ అర్థం కాలేదు.
 టేబుల్ మీద రవి స్క్రిప్ట్ ఉంది. దాని మీద అతని సెల్ నంబర్ ఉంది. పోలీసులు వెంటనే ఆ నంబర్‌కు ఫోన్ చేసి రవిని రప్పించారు.‘‘కథ లైన్ చెప్పి, స్క్రిప్ట్ ఇచ్చి వెళ్లిపోయాను. ఇంతకు మించి నాకు ఏమీ తెలియదు’’ అన్నాడు రవి.
 
 ‘‘నువ్వు చెప్పిన లైన్ ఏమిటి?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ.
 ‘‘ఒక పారిశ్రామికవేత్త హత్యకు గురవుతాడు. అతని చూపుడు వేలు గోడ మీద ఉన్న ఒక ఫొటోను చూపిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ ఫొటోనే హంతకుడిని పట్టిస్తుంది..’’ చెప్పాడు రవి. ఇన్‌స్పెక్టర్ నరసింహలో సడన్‌గా లైట్ వెలిగింది. ముకుందరావు శత్రువులు ఐదు గురు ఉన్నారు. వారి పేర్లేమిటో తెలుసుకున్నాడు. అవి...
 
 1.అశోక్ 2.రమణ 3.జతిన్
 4.అభిజిత్ 5.బాబ్జీ
  ముకుందరావు శత్రువులలోనే కాదు... పరిచయస్తులలోనూ ‘రాజేష్’ అనే పేరు ఎవరికీ లేదు. మరి ఎందుకు ఆ ఫొటోని చూపిస్తున్నట్లు? సిగరెట్ వెలిగించి ఆలోచిస్తున్నాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ. కొన్ని నెలల క్రితం తాను చదివిన ‘డార్క్ స్టార్’ అనే పుస్తకం గుర్తువచ్చింది. అది రాజేష్ ఖన్నా జీవితంపై వచ్చిన పుస్తకం.
 ‘‘యస్... హంతకుడు ఇతడే అంటూ పైన అయిదు పేర్లలో ఒక పేరును రౌండప్ చేశాడు. విచారణలో తన అనుమానం నిజమైంది.
 ఇంతకీ హంతకుడి పేరు ఏమిటి? ఆ పేరుకు రాజేష్‌ఖన్నాకు సంబంధం ఏమిటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement