ఆత్మహత్య కానే కాదు... | Sakshi Funday Crime Story | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య కానే కాదు...

Published Sun, Jul 7 2019 10:06 AM | Last Updated on Sun, Jul 7 2019 10:08 AM

Sakshi Funday Crime Story

సుకన్య వేడి వేడి కాఫీ తీసుకొస్తుందని ఎదురు చూస్తున్నాడు జయప్రకాష్‌ రెడ్డి. ప్రభుత్వం వారిచ్చిన బంగ్లాకు బయట ఆహ్లాదకరంగా ఉన్న లాన్‌లో తాపీగా కూర్చుని పేపర్‌ తిరగేస్తున్నాడు.. ఉదయం ఆరు గంటలకే జాగింగ్‌ పూర్తి చేసుకొచ్చి లేలేత సూర్యకిరణాలు తాకుతుండగా.. కాఫీ తాగడం ఆయనకు ఒక అలవాటు. రాష్ట్ర వాణిజ్య రాజధాని లాంటి విశాఖ నగరానికి జయప్రకాష్‌ రెడ్డి పోలీస్‌ కమిషనర్‌గా విధుల్లో ఉన్నారు.. ఉదయం పేపర్లలో ముందుగా క్రైం పేజీ తిరగేసి, రోడ్డు ప్రమాదాలు, హత్యలూ, ఆత్మహత్యలూ అన్నింటి గురించి చదివి, తన పోలీస్‌ బుర్రతో వాటి వెనకున్న కథేంటో ముందుగానే ఒక అవగాహనకొచ్చి కొన్ని కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వాటిని ఒక కొలిక్కి తేవడం కోసం తన విభాగపు ఇతర అధికారులనూ, సిబ్బందినీ సిద్ధం చేస్తుంటారు.

’’కైలాసగిరి కొండపై ఇద్దరు ప్రేమికుల ఆత్మహత్యాయత్నం..’’ ’’ప్రియుడు మృతి.. ప్రాణాపాయస్థితిలో ప్రియురాలు...’’ పోలీసు కమిషనరు జయప్రకాష్‌ రెడ్డిని విశేషంగా ఆకర్షించింది ఈ వార్త. ప్రేమికులిద్దరూ రాత్రంతా వెన్నెల వెలుగులో గడిపి, స్వస్థలం నుండి  తెచ్చుకున్న పురుగుల మందును కూల్‌ డ్రింక్‌లో కలుపుకొని త్రాగినప్పుడు ఇద్దరూ చనిపోవాలి కదా..? ప్రియుడు మాత్రమే చనిపోయాడు.
ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో ఉంది.. అంటే ఇంకా చనిపోలేదు.. ప్రియుడికన్నా ప్రియురాలు బలమైనదా..? లేదంటే ప్రియురాలి కన్నా ప్రియుడు బలహీనుడా..? ఇదే ఆయనను గందరగోళానికి గురి చేస్తోంది.. స్పస్థలం నుండి పురుగుల మందు తెచ్చుకున్నారంటే.. వారిది రైతు కుటుంబ నేప«థ్యమేనని అర్థమౌతోంది. మీడియా ఛానల్స్‌ హడావుడి అప్పటికే మొదలైంది. పత్రికలలో కూడా వార్త పతాక శీర్షికల్లో వచ్చేసింది.. ప్రేమికులిద్దరి కుటుంబాల నుండి ఫిర్యాదు ఇంకారాలేదు.. అయినా ఆలస్యం చేయకుండా.. ఎస్సై, సి.ఐలని రంగంలోకి దించాడు జయ ప్రకాష్‌ రెడ్డి.

ప్రేమికులిద్దరూ ఒక ఊరి వారే. మిగతా వివరాల సేకరణలో ఎస్సై నిమగ్నమై ఉంటే, పోస్ట్‌మార్టమ్, హాస్పిటల్‌ వ్యవహారాలన్నీ సీ.ఐ. చూస్తున్నాడు..
ప్రేమికులిద్దరిదీ కులం కూడా ఒక్కటే. పైగా దగ్గర బంధువులు, వరసకి బావా, మరదళ్లు కూడా.. ఇరుప్రక్కల కుటుంబ పెద్దలకీ వారి పెళ్లి విషయమే ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఆ కారణంగానే వాళ్లిద్దరిపైనా ఎటువంటి ఆంక్షలూ పెట్టలేదు. బస్సులో నూట ఎభై కిలోమీటర్లు ప్రయాణం చేసి.. కైలాసగిరి దాకా వచ్చారంటే కుటుంబాల మద్దతు ఉండటమే కారణం... రెండురోజుల తర్వాత పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టు కూడా వచ్చింది.. ప్రియుడిది ఆత్మహత్యగానే తేలింది.. కూల్‌డ్రింక్, పురుగులమందు డబ్బాలపైనున్న వేలిముద్రలు ప్రేమికులిద్దరివేనని కూడా ఫలితం వచ్చింది.. పోలీసులకేమీ అర్థం కాలేదు.. కేసు అపరిష్కృతంగానే మిగిలిపోతుందా అనే దిగులు మొదలైంది. ప్రియురాలు క్షేమంగా, ఆరోగ్యంగా మూడు రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జీ అయ్యింది.. జయ ప్రకాష్‌రెడ్డికి సైతం ఈ కేసు విషయం మింగుడు పడటం లేదు.. తలబద్దలు కొట్టుకునేంతగా ఆలోచించేసరికి తళుక్కున ఆలోచనొకటి మెదిలింది.. వెంటనే అమలులోకి పెట్టాడు. చివరి ప్రయత్నంగా ప్రియురాల్ని కస్టడీలోనికి తీసుకున్నారు పోలీసులు.

‘‘ఇది చాలా అన్యాయం అసలు నన్ను దేనికోసం అరెస్ట్‌ చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతోందా..? నా లవర్‌ అయిన నా బావని పోగొట్టుకున్న బాధలో ఉన్న నన్నే తిరిగి అరెస్ట్‌ చేస్తారా?’’ అని ఏడుపందుకుంది ఆ అమ్మాయి. పోలీసులు కూడా ఊరుకోలేదు.. ‘‘మీరు చనిపోవాలనుకుని.. ఆత్మహత్యాయత్నం చేశారు కదా.. ఆత్మహత్యకు ప్రయత్నించడం నేరం... అందుకు శిక్ష అనుభవించక తప్పదు...’’ అసలు విషయం చెప్పారు.. ‘‘...అందుకని మీ పైన తగిన సెక్షన్ల క్రింద.. కేసు నమోదు చేస్తున్నాం..’’ పోలీసులు చెప్పింది వినగానే... ఒక్కసారిగా గట్టిగా నవ్విందామె... ‘‘నేను ఆత్మహత్యకు ప్రయత్నించాననటానికి మీ వద్దనున్న సాక్ష్యాలేమిటి..?’’ బిగ్గరగా అరిచింది రమ్య. ‘‘...అంటే మీరు ఆత్మహత్యకు ప్రయత్నించలేదా..’’ పోలీస్‌ బుర్ర వెంటనే ప్రశ్నించింది...
‘‘...నో... నెవ్వర్‌’’
ఆమె సమాధానం విని ఆశ్చర్యపోయారు పోలీసులు.
’’...మరయితే నీ ప్రియుడు ఉరఫ్‌ బావ ఉరఫ్‌ శ్రీరామ్‌.. కూడా ఆత్మహత్యకు ప్రయత్నించలేదా..?’’
పోలీసుల ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదామెకు.
‘‘....నో...శ్రీరామ్‌ది ఆత్మహత్య కానేకాదు...’’ అని చెప్పి ఒక్కసారిగా బిగ్గరగా ఏడవసాగిందామె.. ఇక మిగిలిన వివరాలు రాబట్టడానికి , నిజాలు చెప్పించటానికి పోలీసులకి ఎంతో సమయం పట్టలేదు.. పోలీసులు తమదైన శైలిలో విచారించి, పూర్తి వివరాలు తెలుసుకున్నాక, ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్నాక శేఖర్‌ని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కి పంపించారు.
‘‘కైలాసగిరి శివపార్వతుల విగ్రహాల వెనకున్న దట్టమైన చెట్ల క్రింద.. ఏకాంతంగా ఉన్న మా ఇద్దరి వద్దకీ వచ్చాడు శేఖర్‌ బావ. శేఖర్‌ మా చిన్నత్త కొడుకు. నేనంటే చచ్చేంత ఇష్టం.. నాకేమో శ్రీరామ్‌ బావంటే ఇష్టం.. శ్రీరామ్‌ని గట్టిగా బెదిరించి, క్లాత్‌ చుట్టి తను తీసుకొచ్చిన పురుగుల మందుని, కూల్‌డ్రింక్‌ సీసాలో కలుపుకోమని చెప్పి, బలవంతంగా తాగించేశాడు. నా చేత కూడా ఓ కూల్‌డ్రింక్‌ తాగించాడు. దాంట్లో కూడా విషం కలిపించాడు కానీ చాలా తక్కువ.. తాగిన కొన్ని నిమిషాల్లోనే శ్రీరామ్‌ నురగలు కక్కుతూ నేలపై పడిపోయాడు. నాకు కళ్లు తిరిగినట్లై, మత్తు ఆవహించి, చెట్టు మొదలుపై వాలిపోయాను.. తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే’’
రమ్య స్టేట్మెంట్‌ రికార్డ్‌ చేసుకున్నాడు పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌. చాకచక్యంగా కేసును చేధించగలిగినందుకు సంతోషించాడు కమీషనర్‌ జయప్రకాష్‌ రెడ్డి.
- డా. ఎమ్‌.వి.జె. భువనేశ్వరరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement