
పాతికేళ్ల తర్వాత నేను మళ్ళీ అలివేణిని చూస్తానని అనుకోలేదు. అసంపూర్తిగా ఉన్న ఆమె కథను రాస్తాననీ అనుకోలేదు. రచయిత వేళ్ళు కీ బోర్డు మీద కదులుతున్నప్పుడు అక్షరాలను ఆవాహన చేసుకున్న కథ, కథనమై కదనరంగంలో అడుగిడినప్పుడు. ఒక నేరం తన రూపు మార్చుకుంది.
∙∙∙
పాతికేళ్ల క్రితం... చలికాలం... రాత్రి పన్నెండు కావడానికి పదినిమిషాలు బాకీ ఉంది. సరిగ్గా అప్పుడే కాలనీలోకి పోలీస్ వెహికిల్ వచ్చింది. ఆ వెహికల్ సరాసరి అలివేణి ఇంటి దగ్గర ఆగింది. కాలనీ వాళ్లంతా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచారు పోలీస్ వెహికిల్ హారన్ శబ్దం విని.
రెండు రోజులుగా అలివేణి కనిపించడం లేదు. రెండు రోజులుగా కనిపించకపోవడంతో నాకు అనుమానం, భయం కలిగాయి. నాకు తెలిసిన పోలీస్ అధికారికి విషయం చెప్పి సీక్రెట్‌గా ఎంక్వయిరీ చేయించాలని అనుకున్నాను. అంతలోనే పోలీస్ వెహికిల్ వచ్చింది.
పోలీసులు వెహికిల్ దిగి అలివేణి ఇంట్లోకి వెళ్లారు. ఇళ్లల్లో ముసుగు తన్ని పడుకున్న వాళ్ళు లేచొచ్చారు. నేను క్రైమ్ నవలా రచయితను కావడం, పోలీస్ అధికారులతో పరిచయాలు కలిగి ఉండడం వల్ల పోలీసులతో పాటు లోపలికి వెళ్ళాను. పోలీస్ ఇన్‌స్పెక్టర్ నన్ను గుర్తు పట్టి విష్ చేసి విషయం చెప్పాడు.
‘చెరువులో ఒక డెడ్ బాడీ దొరికింది. స్పాట్‌లో ‘అలివేణి’ అని ఎంబ్రాయిడరీ చేసి ఉన్న చేతి రుమాలు దొరికింది’ అని. రెండు రోజుల క్రితమే తన భార్య కనబడడం లేదని అలివేణి భర్త రిపోర్ట్ ఇచ్చాడు. డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడానికి అలివేణి భర్త నిరంకుశ్‌ని తీసుకువెళ్ళటానికి వచ్చారు.
అతని మొహంలో నెత్తురు చుక్క లేదు. భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఆ డెడ్ బాడీ అలివేణిదే అయితే తనకు శిక్ష పడటం ఖాయం అనుకున్నాడు. నా మనసు భారమైంది. ఆ డెడ్ బాడీ అలివేణిది కాకూడదని బలంగా కోరుకున్నాను. అలివేణి భర్త నిరంకుశ్‌తో పాటు నేనూ మార్చురీకి వెళ్ళాను.
‘ఆ డెడ్ బాడీ అలివేణిది కాదు’ అని తేలడంతో ఊపిరి తీసుకున్నాను. అలివేణి తండ్రి చక్రాల కుర్చీలో వచ్చాడు. తన కూతురి చావుకు కారణం అల్లుడే అని ఏడుస్తూ పోలీసులకు చెప్పాడు. రోజులు గడుస్తున్నాయి... రెండు రోజుల తర్వాత ‘మూడేళ్ళ పసిపాప శవం’ రైల్వే స్టేషన్‌లో కనిపించింది. నిరంకుశ్‌ని తీసుకు వెళ్లారు.
ఆ పసిపాప తన బిడ్డ కాదని తెలిసే వరకు నిరంకుశ్ తేరుకోలేక పోయాడు. మొదటిసారి అతనికి భయం పరిచయం అయ్యింది. వారంలో ఒకటి రెండు సార్లు ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ మార్చురీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రోజురోజుకూ చిక్కిపోతున్నాడు నిరంకుశ్.
ఎప్పుడు ఏ క్షణం పోలీసులు వస్తారో అనే భయం. ఎప్పుడు ఎక్కడ ఏ డెడ్ బాడీ దొరికినా భయమే. పసిపాపల అనాథ శవాలు దొరికినా భయమే. భయం కన్నా భయంకరమైన భయం మరోటి ఉండదు.. అందులోనూ తప్పు చేసినప్పుడు కలిగే భయమే వేరు!
రోజులు నెలలుగా మారాయి. నాకు అలివేణి ఇంటివైపు చూసినప్పుడల్లా మనసు భారంగా అనిపించేది. ఇదివరకులా ఆ ఇంట్లో నుంచి ఏడ్పుల చప్పుళ్ళు వినిపించడం లేదు. శ్మశానంలా ఉంది ఆ ఇల్లు. నిరంకుశ్ ఎప్పుడు వెళ్తున్నాడో, ఎప్పుడు వస్తున్నాడో తెలియడం లేదు. అప్పుడప్పుడు పోలీసులు వస్తూనే ఉన్నారు.
అలివేణి మిస్సింగ్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఆమె డెడ్ బాడీ కానీ కూతురి డెడ్ బాడీ కానీ దొరకలేదు. అలా అని వాళ్ల ఆచూకీ దొరకలేదు. కొన్నాళ్ల తర్వాత నిరంకుశ్ చెప్పాపెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి మరో జంట దిగింది. నాకు మాత్రం అలివేణి జ్ఞాపకం ఒక మిస్టరీలా ఉంది.
ఇది జరిగిన పాతికేళ్ల తర్వాత..
∙∙∙
రోడ్డు మీద కారు షికారు చేస్తోంది. నా దృష్టి ఒక్కసారిగా రోడ్డు క్రాస్ చేస్తోన్న వ్యక్తి మీద పడింది. చిన్న ఉలికిపాటు... అలివేణి... అవును అలివేణే... పాతిక సంవత్సరాల తరువాత కనిపించిన అలివేణి. మొహం బాగా గుర్తు. ఎక్సయిటెమెంట్‌ను కవర్ చేస్తూ కారు స్టార్ట్ చేశాను.
కుడివైపు టర్న్ చేశాను. అలివేణి ఎడమ పక్కగా నడుస్తోంది. కారు ఆమె పక్కనే ఆపి ‘ అలివేణీ..’ అని పిలిచాను. అలివేణి కాదు. కానీ అదే మొహం.. అదే అందం.. అదే చెక్కుచెదరని చిరునవ్వు. చీరలో నిండుగా కనిపించే అలివేణి.. చుడిదార్‌లో ఉంది.
కారు దిగి ఆమె దగ్గరికి వెళ్లి ‘అలివేణీ..’ అనగానే ఆమె నా వైపు చిరునవ్వుతో చూసి మర్యాదపూర్వకంగా చేతులు జోడించి ‘నా పేరు నీలవేణి. అలివేణి మా అమ్మ’ అన్నది. ‘సారీ ..’ అని నేను ఇంకా మాట్లాడబోతుండగానే ‘నాకు తెలుసు మీరు అలివేణి అనగానే నన్ను చూసి ‘అమ్మ’ అనుకున్నారని’ అంది.
మళ్లీ తనే.. ‘ మీరు కార్తికేయ. ప్రముఖ క్రైమ్ నవలా రచయిత. మిమ్మల్ని తెలియని వారు ఉండరు. పాతికేళ్ల కిందటి మీ నవలలు అమ్మ దగ్గర భద్రంగా ఉన్నాయి. ఈ మధ్యే రాసిన అడ్వెంచర్: డెత్ వ్యాలీ, మిడ్ నైట్ : 12, కథలు కూడా ’ నవ్వుతూ చెప్పింది. ఆ అమ్మాయితో నేను అలివేణి ఇంటికి బయల్దేరాను.
∙∙
ఒక చిన్న ఇంటిదగ్గర స్కూటీ ఆగింది. అందమైన పొదరిల్లు లాంటి ఇల్లు.. చుట్టూ పూల మొక్కలు. కాటన్ చీరలో అలివేణి. సోఫాలో కూర్చుని ఉంది. ఆమె కూర్చున్న సోఫా వెనుక నేను రాసిన క్రైమ్ నవలలు.
∙∙
నన్ను చూసిన అలివేణి కళ్ళలో ఎన్నో భావాలు. మేడ మీద నేను, అలివేణి.. ఆకాశంలో నక్షత్రాలు. నా ప్రశ్నలకు సమాధానం అలివేణి చెప్పడం మొదలుపెట్టింది... ‘నా భర్తలోని లోపాలన్నీ భరించాను. కానీ నా స్థానంలో మరొకరిని అతను ఆహ్వానించడాన్ని భరించలేకపోయాను.
అరచి అల్లరి చేయనా? ఆత్మహత్య చేసుకుని నా జీవితాన్ని అర్ధాంతరంగా ముగించనా? నా భర్తతో విడాకులు తీసుకుని విడిగా ఉండనా? నా బిడ్డను అకారణంగా నాతో పాటు చంపుకోవాలా? ఏ పాపం చేయని తనను చంపే హక్కు నాకు ఎవరు ఇచ్చారు?
అలా అని నా భర్తకు విడాకులు ఇస్తే, అతను జీవితంలోకి వచ్చిన ఇంకో అమ్మాయితో సజావుగా కాపురం చేస్తాడా? మళ్ళీ మరో అమ్మాయి వెంటపడడన్న గ్యారెంటీ ఏమిటీ? అందుకే నేను చావకుండా ఉన్నాను.
నా మృతదేహం దొరికేవరకు అతడిని చట్టం శిక్షించదు. కేసు మూసేసే వరకు అతను అనుభవించిన... అనుభవిస్తున్న ‘భయం’ కూడా శిక్ష లాంటిదే. అలా నా భర్త కొన్నాళ్లపాటు చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. మానసిక ప్రశాంతత కోల్పోయాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. నరకం అనుభవించాడు. శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా.
ఇప్పటికీ ఎక్కడైనా ఎవరి మృతదేహమైనా కనిపిస్తే అది నేనేమోనని ఉలిక్కిపడి లేస్తాడట. చేసిన తప్పుకు ఆ శిక్ష విధించాలని అనిపించింది. అతను చనువుగా ఉంటున్న అమ్మాయిని కలిశాను. నా భర్త గురించి అంతా చెప్పి జాగ్రత్తగా ఉండమని.. నా విషయం ఎవరి చెవినా వేయొద్దని చెప్పాను. నేనే పోలీసులకు కాల్ చేసి అనాథ శవాలకు సంబంధించిన సమాచారం ఇచ్చేదాన్ని.
నా భర్తకు ఫోన్ చేసి ఫలానా చోట ఫలానా శవం ఉందని చెప్పేదాన్ని. అతడిని శిక్షించాలని కాదు.. అతను చేసిన తప్పు తాలూకు భయం అతనికి తెలియజేయాలని. నేను చేసిన పనితో భయపడి, మరో అమ్మాయి జోలికి వెళ్లకుండా ఆమెతో బుద్ధిగా ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు అని తెలిసింది...’ ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటిపొర.
‘మా నాన్నకు నేను ఎక్కడ ఉన్నానో తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నాన్నతో టీ కొట్టు పెట్టించాను. నా కూతురికి నేనే తల్లీ.. తండ్రీ. తను సివిల్స్‌కి ప్రిపేర్ అవుతోంది’ అని చెప్పింది అలివేణి .. కళ్ళు తుడుచుకుంటూ.
∙∙
తన భర్త చేసిన నేరానికి ఘోరానికి ఇచ్చిన ఫినిషింగ్ టచ్ నాకు నచ్చింది. ఒక క్రైమ్ రూపు మార్చుకుని అలివేణి భర్తకు తగిన శిక్ష వేసింది
∙∙
నీలవేణి ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఏసీపీగా చార్జ్ తీసుకుంది. అది అలివేణి విజయం. నేరాన్ని శిక్షించడానికి నేరాన్నే శిక్షా స్మృతిగా, ఆయుధంగా మార్చుకున్న అలివేణి కథ ఇది.
కీ బోర్డు మీద నేను రాసిన క్రైమ్ స్టోరీ.. ‘ఫినిషింగ్ టచ్’... నేరాన్ని నేరంతో ఎదుర్కోవాలని నిరంకుశ్ లాంటి వాళ్లకు అంకుశంలా ఒక రెడ్ అలెర్ట్ వార్నింగ్‌లా మారాలని చెబుతూ!
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’
-విజయార్కె
Comments
Please login to add a commentAdd a comment