
రాత్రి తొమ్మిది గంటలకు లింగంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర కారు పార్క్ చేసి లోపలికి నడిచాడు హనుమంతయ్య. వచ్చేపోయే రైళ్ళతో ప్లాట్‌ఫామ్ రద్దీగా ఉంది. టీ స్టాల్‌కి వెళ్ళి చాయ్ సిప్ చేస్తుంటే అతని సెల్‌ఫోన్లో మెసేజ్ వచ్చింది ‘ప్లాట్‌ఫామ్ కుడివైపుగా నడుస్తూవుండండి’ అని.
టీ కప్‌ను డస్ట్‌బిన్‌లో పడేసి ప్లాట్‌ఫామ్ పైన నడవనారంభించాడు అతను. మధ్యలోనే ఓ యువతి వచ్చి కలిసింది. ‘ఎమ్.ఐ.హెచ్.వై’ అంది మెల్లగా. ముప్పయ్యేళ్ళుంటాయి ఆమెకు. బ్లూ జీన్స్ ప్యాంట్ మీద లైట్ పింక్ కలర్ టీషర్ట్ తొడిగింది. బాబ్డ్ హెయిర్.
‘వై.హెచ్.ఐ.ఎమ్’ జవాబిచ్చాడు హనుమంతయ్య. కోడ్ వర్డ్ అది!
‘నా పేరు అనామిక. మే ఐ హెల్ప్ యూ స్క్వాడ్ చీఫ్‌ని. మనం నడుస్తూనే మెల్లగా మాట్లాడుకుందాం’ అంటూ చెప్పడం మొదలుపెట్టింది..
‘చదువుకున్న నిరుద్యోగ యువతీయువకులు మా స్క్వాడ్‌లో సభ్యులు. స్క్వాడ్ గోప్యతను కాపాడుకునే ఉద్దేశంతో ఓ ఆఫీసంటూ ఏర్పరచుకోలేదు. కేవలం నోటి మాట ద్వారానే స్క్వాడ్‌ని గూర్చిన ప్రచారం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోజాలని నిస్సహాయులకు అండగా నిలవడమే స్క్వాడ్ ఉద్దేశం. ఫీజు నామినల్. కేసును బట్టి ఉంటుంది’ అని ఆగింది.
అతను తన సమస్యను వివరిస్తుంటే శ్రద్ధగా ఆలకించింది.
‘నలభై ఎనిమిది గంటల తరువాత మా స్క్వాడ్ మెంబర్ మిమ్మల్ని కలుస్తారు. ఆ లోపున రియాలిటీ చెక్ నిర్వహిస్తాం. మీరు చెప్పినవి వాస్తవాలే అని నిర్ధారించుకోగానే
యాక్షన్ ప్లాన్‌తో మీ ముందుంటాం.. గుడ్ లక్ అండ్ గుడ్ నైట్!’ అంటూ గుంపులో కలసిపోయిందామె.
ఇంటికి డ్రైవ్ చేస్తుంటే హనుమంతయ్య మదిలో ఆలోచనలు రేగాయి. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్పీగా పనిచేసిన అతని తండ్రి రజనీకాంతరావు ఆస్తులు బాగా సంపాదించాడు. వాటిలో మాదాపూర్‌లోని ప్రైమ్ ఏరియాలో ఉన్న పెద్ద బిల్డింగ్ ఒకటి. కింద మూడు కమర్షియల్ పోర్షన్, పైన ఐదు రెసిడెన్షియల్ ఫ్లాట్లూను. దాన్ని కట్టి ముప్పయ్ ఐదేళ్ళు అవుతుంది. ప్రస్తుతం దాని విలువ కోట్లలో ఉంటుంది.
రజనీకాంతరావు ఏకైక సంతానమైన హనుమంతయ్య దుబాయ్‌లో గార్మెంట్ బిజినెస్ చేసుకుంటున్నాడు. రిటైర్మెంట్ అనంతరం రజనీకాంతరావు భార్యతో ఆ
బిల్డింగ్‌లోని ఓ ఫ్లాట్ లో ఉండేవాడు. రెండేళ్ళ కిందట.. భార్య పోయిన ఐదేళ్ళకు అతనూ మరణించాడు. దాంతో ఇండియాకి తిరిగివచ్చేశాడు ఏభయ్యో పడిలో ఉన్న హనుమంతయ్య. అతని ముస్లిమ్ భార్య అతనితో రావడానికి నిరాకరించడంతో ఒంటరిగానే వచ్చాడు. కూతురు తల్లితోనే ఉంటోంది. హైదరాబాదులో ఆఫీసు ప్రారంభించి గార్మెంట్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌కి శ్రీకారం చుట్టాడు. ఆ బిల్డింగ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో షాపులు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో మధ్యనున్న ఫ్లాట్‌లో హనుమంతయ్య ఉంటున్నాడు. మిగతా వాటిలో టెనెంట్లు ఉంటున్నారు. హనుమంతయ్య ఎడమ పక్క ఫ్లాట్‌లో అరవావిడ.. అరవై ఐదేళ్ళ ఆండాళ్ళు ఉంటోంది. ఆమె భర్త పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాడు. ఇరవయ్యేళ్ళ కిందట నక్సలైట్లతో ఎన్‌కౌంటర్‌లో పోయాడు. సంతానం లేదు. ఆ తరువాత పోలీస్ క్వార్టర్స్ ఖాళీ చేసి ఆ ఫ్లాట్‌లో అద్దెకు దిగింది. ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఠంచనుగా అద్దె చెల్లిస్తుందే తప్ప, ఎన్నేళ్ళైనా అద్దె పెంచదు, ఫ్లాట్ ఖాళీ చేయమంటే చేయదు. గొడవకు దిగుతుంది. ఆమె పక్క ఫ్లాట్లో ఓ నలభై ఏళ్ళ చిరుద్యోగి పదేళ్ళుగా కుటుంబంతో ఉంటున్నాడు. క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తుంటాడు. అద్దె పెంచమని అడిగితే, తన కష్టాలను ఏకరుపెట్టనారంభిస్తాడు.
హనుమంతయ్యకు కుడిపక్కన ఓ పాస్టర్.. భార్య, కూతురితో సుమారు ఐదేళ్ళుగా ఉంటున్నాడు. ఎవరెవరో వస్తుంటారు అతని ఇంటికి, ప్రార్థనలు చేయించుకోవడానికి. అద్దె రెగ్యులర్‌గా చెల్లించడు. అదేమంటే బైబిల్ లోంచి ఏవేవో ‘సువార్త’లను ఉటంకించి కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. అతని పక్క ఫ్లాట్‌ని అధికార పార్టీకి చెందిన ఓ ఛోటా నాయకుడు ఐదేళ్ళ కిందట అద్దెకు తీసుకున్నాడు. దాన్ని కొందరు స్టూడెంట్ కుర్రాళ్ళకు సబ్–లెట్ చేశాడు. అద్దె చెల్లించడు. గట్టిగా నిలదీస్తే తన పార్టీ కార్యకర్తలను ఉసిగొలిపి నానా రగడా çసృష్టిస్తాడు.
కాలక్రమాన ఆ ఏరియా బాగా డెవలప్ అయి అద్దెలు ఎన్నో రెట్లు పెరిగాయి. ఐనా ఆ కిరాయిదారులు మాత్రం ఆరంభంలో ఇచ్చిన అద్దెకు మించి పైసా ఎక్కువ ఇవ్వమని భీష్మించుకుని కూర్చున్నారు. మెయింటెనెన్స్ లేక పాతబడిపోయిన ఆ బిల్డింగును పడగొట్టి, బిల్డర్ కిచ్చి కమర్షియల్–కమ్–రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ని కట్టాలన్న ప్లాన్ అతనిది. అది నెరవేరాలంటే ముందుగా వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి. ఆ దిశగా అతను చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. కోర్ట్‌కు వెళితే, దాని పరిష్కారానికి తన జీవితకాలం సరిపోదని అతడెరుగును. అదిగో అప్పుడే వచ్చింది.. మూడు రోజుల క్రితం అతని సెల్ ఫోన్లో ఆ మెసేజ్– ‘ఎంతటి జటిలమైన సమస్యకైనా పరిష్కారం– ‘మే ఐ హెల్ప్ యూ?’ కాంటాక్ట్ ఫలనా నంబర్ అంటూ. రెండు రోజులపాటు తీవ్రంగా ఆలోచించిన మీదట ‘ఏ ప్రభుత్వ విభాగంలో ఏ స్కామ్ ఉందో అన్నట్టు, ఏ బుర్రలో ఏ జిత్తులున్నాయో! లెట్ మీ ట్రై’ అనుకుంటూ ఆ సెల్ నంబరుకు ఫోన్ చేశాడు హనుమంతయ్య. దాని పర్యవసానమే అనామికతో మీటింగ్.
∙∙
‘నా పేరు అజ్ఞాత. మే ఐ హెల్ప్ యూ స్క్వాడ్ నుంచి వస్తున్నాను’ అందామె, హనుమంతయ్య ఆఫీసు రూమ్‌లోకి ప్రవేశిస్తూ. పాతికేళ్ళుంటాయి ఆమెకు. అందంగా ఉంది. తుమ్మెదరెక్కల్లాంటి జుత్తును మెడ వరకు కత్తిరించుకుంది. వైట్ జార్జెట్ శారీ ధరించింది.
‘బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసి... మీది జెన్యూన్ ప్రోబ్లెమ్ అని నిర్ధారణ చేసుకున్నాం. మీ కేసు టేకప్ చేయడానికి నిర్ణయించుకున్నాం. మా ఫీజు కోటి రూపాయలు’ చెప్పిందామె.
‘కోటా!?’ అవాక్కయ్యాడు హనుమంతయ్య.
‘టెనెంట్లు ఖాళీచేసేస్తే ఓ పెద్ద మల్టీపర్పస్ కాంప్లెక్స్‌ను కట్టాలనుకుంటున్నారు మీరు. 60:40 నిష్పత్తి మీద ఆల్రెడీ ఓ ప్రముఖ బిల్డర్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. మీ ఆలోచన ఆచరణకు వస్తే కొన్ని వందల కోట్లు లాభిస్తాయి మీకు’ వివరాలన్నీ ఏకరువు పెడుతూండగా..
‘ఆల్ రైట్, అజ్ఞాతా! మీ అడ్వాన్స్ ఎంత?’ మధ్యలోనే అడిగాడు.
తాము అడ్వాన్స్ తీసుకోమనీ, పని పూర్తికాగానే ఇరవై నాలుగు గంటల్లో మొత్తం ఫీజు చెల్లించవలసి ఉంటుందనీ చెప్పిందామె. అగ్రిమెంట్ కాగితం ఇచ్చి అతని చేత సంతకం చేయించింది.
‘రేపు ఉదయం మీ ఇంటికి వస్తాను. లండన్ నుంచి వచ్చిన మీ మేనకోడలిగా ఆండాళమ్మకు నన్ను పరిచయం చేయండి. ఆవిడ ఒక్కరికి తెలిస్తే ఊరంతా తెలిసినట్టే!’
ఆమె అంత కరెక్ట్ గా ఎలా చెబుతోందా అని విస్తుపోయాడు అతను. అతని ఫ్లాట్‌లో ఆండాళమ్మ ఉన్న పోర్షన్ వైపు ఉండే గదిని తనకు కేటాయించవలసిందిగా కోరిందామె.
అతను పగలు షాప్‌కి వెళ్ళిపోతాడు కనుక, ఇంట్లోని విలువైనవాటిని బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోమని సలహా ఇచ్చింది అజ్ఞాత. తనకు కేటాయించిన గది తప్ప మిగతావాటిని లాక్ చేసుకుని వెళ్ళమంది. తన గది, మెయిన్ డోర్ డూప్లికేట్ కీస్‌ని తనకు ఇవ్వమంది. ‘సరిగ్గా నెల రోజుల తరువాత మీ బిల్డింగులో టెనెంట్లు ఉండరు!’ హామీ ఇచ్చింది.
ఆమె స్వరంలో తొణికిసలాడిన ఆత్మవిశ్వాసం అతనిలో ధైర్యాన్ని పెంచింది.
∙∙
మర్నాటి ఉదయం భోషాణాలవంటి మూడు పెద్ద సూట్ కేసులు, ఓ మీడియం సైజ్ బ్రీఫ్ కేసూ పట్టుకుని ఆ బిల్డింగ్ ముందు క్యాబ్ దిగింది అజ్ఞాత. పెట్టెలకు ఎయిర్‌లైన్స్ లగేజ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఆశ్చర్యంగా చూస్తున్న హనుమంతయ్యతో ‘మీ మేనకోడలు ఫారిన్ నుంచి వస్తోందంటే ఈమాత్రపు బిల్డప్ అవసరం అంకుల్!’ అంటూ నవ్వింది. ఆమెను ఆ రోజే ఆండాళమ్మకు పరిచయం చేశాడు హనుమంతయ్య.
‘ఇంద పొణ్ణె నానెప్పోవుం పార్కవే ఇల్లియే!’ అందామె. ఆమెకు తెలుగు బాగానే వచ్చినా హనుమంతయ్యను చూస్తే అరవంలో మాట్లాడుతుంది.
తాను లండన్‌లో జాబ్ చేస్తున్నట్టు, హాలిడేయింగ్ కోసం ఇండియాకి వచ్చినట్టు చెప్పింది అజ్ఞాత. తనకు తమిళ స్నేహితులు ఉన్నారనీ, వారి నుంచి తానూ తమిళం
మాట్లాడడం నేర్చుకుందనీ ఆమె అరవంలో చెప్పడంతో, ఆండాళ్ళు సంతోషానికి మేరలేకపోయింది. ‘నీ రొంబ అళగా ఇరికే!’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది.
అజ్ఞాత వచ్చి నాలుగు రోజులయిపోయింది. హనుమంతయ్య మేనకోడలు లండన్ నుంచి వచ్చిందన్న వార్త ‘ఆండాళ్ళు న్యూస్ ఛానల్’ ద్వారా ఆ బిల్డింగ్ అంతా పాకిపోయింది. రోజుకోసారైనా ఆండాళ్ళును పలుకరిస్తుండేది అజ్ఞాత. చిరుద్యోగికి ఐదేళ్ళ కూతురు. తెల్లగా ముద్దుగా ఉంటుంది. ఆ పాపను ముద్దాడి చాక్లెట్ బార్స్ ఇచ్చేది అజ్ఞాత. దాంతో ఆమెకు చేరిక అయిపోయింది ఆ పిల్ల.
ఓ రోజున ఎందుకో అజ్ఞాత గదిలో ప్రవేశించిన హనుమంతయ్య.. నేలపైన ఉన్న వస్తువులను చూసి విస్తుపోయాడు– ‘ఇన్సులేటెడ్ వైర్ కాయిల్స్, ఎక్స్ టెన్షన్ కార్డ్స్..సాకెట్లు.. మినీ స్పీకర్స్.. యాంప్లిఫయర్ డైరెక్షనల్ మైక్స్.. ఓ పెద్ద డ్రిల్లర్.. ఓ బాటిల్‌లో కెమికల్ వంటి ఏదో ద్రవం.. వగైరాలు. ‘ఇటీవల టెక్నాలజీ బాగా డెవలప్ అయింది అంకుల్! దాన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలన్నది మన తెలివితేటల పైన ఆధారపడివుంటుంది. దయ్యాలకు, భూతాలకు జడవని మనిషి ఉండడు. ఒక్క ఆండాళ్ళును స్కేర్ చేస్తే చాలు.. బిల్డింగంతా భయం పాకిపోతుంది. అత్యాధునికం అనుకునే అమెరికాలో మూడొంతులు దయ్యాలు, ప్రేతాత్మలు, చేతబడుల సినిమాలే! ఈ టూల్స్ నా ఆలోచనకు టెక్నికల్ సపోర్ట్ నిస్తాయి’ అందామె.
వారం తరువాత ఓ రోజు రాత్రి షాపు నుంచి తిరిగివచ్చిన హనుమంతయ్యకు ఆండాళ్ళు ఫ్లాట్‌కి పెద్ద తాళంకప్ప వేలాడుతూ కనిపించింది. ఆ రెండేళ్ళలో ఎన్నడూ ఆమె ఇంటి బైట అడుగుపెట్టిన దాఖలాలు లేవు. అన్నీ ఫోన్ ద్వారా ఇంటికే తెప్పించుకుంటుంది.
‘ఆండాళ్ళు ఇక తిరిగిరాదు!’ ప్రకటించింది అజ్ఞాత. ‘ఈ మధ్య ఇక్కడ తాతయ్య.. అదే మీ తండ్రిగారి ప్రేతాత్మ తిరుగుతోందని ఆండాళ్ళును నమ్మించాను. అందుకు అనుగుణంగా ఆమె ఫ్లాట్ వైపు గోడలో చిన్న రంధ్రం చేసి వరుసగా నాలుగు రోజులపాటు నా టూల్స్‌తో భయానక శబ్దాలు, ఆర్తనాదాలు వగైరాలను çసృష్టించాను. దాంతో ఉదయం ఫ్లాట్ ఖాళీ చేసేసి వెళ్ళిపోయింది’ అని చెప్పింది. హనుమంతయ్య ఆనందానికి మేరలేకపోయింది. వీకెండ్‌లో తాను సృష్టించబోయే స్పెషల్ ఎఫెక్ట్‌ల ధాటికి తట్టుకోలేక టెనెంట్లందరూ ఫిర్యాదు చేయడానికి అతని వద్దకు వస్తారనీ.. అతను వారికి అందుబాటులో ఉండకుండా మూడు రోజులపాటు ఫోన్ స్విచాఫ్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపొమ్మనీ సలహా ఇచ్చిందామె.
మూడు రోజుల అజ్ఞాతవాసం తరువాత సోమవారం ఉదయం.. ఇంటికి తిరిగివచ్చిన హనుమంతయ్య, ఆండాళమ్మను చూసి విస్తుపోయాడు.
‘నువ్వు ఫ్లాట్ ఖాళీచేసి వెళ్ళిపోయావుకదూ?’ అనడిగాడు.
‘నాన్ ఎన్నదుకు గాలీ పన్ననం అబ్బా?’ అంటూ ఎదురు ప్రశ్నించిందామె.
‘అజ్ఞాత లండన్ నుంచి వచ్చినట్లు తెలిసి హనుమంతయ్య బంధువర్గం రాబోతోందనీ, వాళ్ళంతా ఆటలతో పాటలతో రాత్రింబవళ్ళు హంగామా చేస్తారనీ, గుండెజబ్బుతో బాధపడే ఆండాళమ్మకు అది పెద్ద ఇబ్బందికరంగా పరిణమించ వచ్చుననీ, ఓ వారం రోజులపాటు ఏదైనా హోటల్లో ఉండి వస్తే మంచిద’నీ సలహా ఇచ్చిందట అజ్ఞాత. హోటల్ ఖర్చుల నిమిత్తం సొమ్ములు కూడా ఇచ్చిందట! ఆవిడ హోటల్ నుంచి ఆ రోజు ఉదయమే తిరిగివచ్చిందట. ‘నల్ల పొణ్ణు!’ అంటూ కితాబు ఇచ్చింది ఆండాళమ్మ.
హనుమంతయ్య ఖంగుతిన్నాడు. గబగబా తన ఫ్లాట్‌కి వెళ్ళి తన కీతో తలుపు తెరిచాడు. తిన్నగా అజ్ఞాత ఉన్న గదికి వెళ్ళి చూసిన అతని గుండె గతుక్కుమంది. గదిలో ఆమె లేదు. సూట్ కేసులూ లేవు! టూల్సన్నీ నేలపైన పడున్నాయి. గది మధ్యన ఉండవలసిన బెడ్ స్థానభ్రంశం చెందింది. దాని కిందనుండే తివాచీ పక్కగా పడుంది. దాని స్థానంలో.. నేలపైన ఓ మనిషి సులువుగా పట్టేటంత కన్నం ఉంది! హఠాత్తుగా తట్టింది అతనికి.. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ‘డైమండ్స్ అండ్ జువెల్స్’ నగల షాపు సరిగా ఆ గది కిందే ఉందన్న సత్యం!
ఆ బిల్డింగ్‌లోని నగల షాపులో భారీ దొంగతనం జరిగిందన్న వార్త క్షణాలలో దావానలంలా పాకిపోయింది. పోలీసులు, పోలీసు కుక్కలూ వచ్చాయి. వేలిముద్రల నిపుణులూ వచ్చారు. ఎక్కడా చిన్న క్లూ కూడా లభించలేదు. ఆ బిల్డింగ్‌లో కానీ, సమీపంలో కాని సి.సి. కెమెరాలు లేవు. నగల షాపులో ఉన్న కెమెరా పనిచేయడంలేదు. గత అర్ధరాత్రి సమయంలో ఆ చోరీ జరిగుంటుందని అంచనా వేశారు. షాపు తాళం చెక్కుచెదరలేదు. కాని వేల కోట్ల రూపాయల విలువచేసే వజ్రాలు, నగలు, బంగారం దొంగతనమయ్యాయి. దొంగలు హనుమంతయ్య ఫ్లాట్‌లోని గెస్ట్ రూమ్ నేలపైన కన్నం తవ్వి రోప్ సాయంతో షాప్‌లోకి దిగారు!
హనుమంతయ్యను ప్రశ్నించారు పోలీసులు. అతను లబోదిబోమంటూ తాను ‘మే ఐ హెల్ప్ యూ?’ స్క్వాడ్ నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకున్నప్పట్నుంచి జరిగినదంతా ఏదీ దాచకుండా వివరించాడు. అనుమానం పైన అతన్ని అరెస్ట్ చేసి.. ఇతర టెనెంట్లను ప్రశ్నించడానికి పూనుకున్నారు పోలీసులు. మూడు రోజుల తరువాత చందానగర్‌లోని ఓ హోటెల్లో దాక్కున్న అజ్ఞాత, అనామికలను పోలీసులు అరెస్ట్ చేయడం, దోచుకున్న సొత్తంతా రికవర్ చేయడమూ జరిగాయి. నేరస్థులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీస్ కమీషనర్ ‘ఎంత తెలివైన నేరస్థుడైనా ఏదో ఒక పొరపాటు చేయకమానడు. అజ్ఞాత చేసిన పొరపాటల్లా, ఆ బిల్డింగులోని ఓ టెనెంట్ కూతురితో చనువుగా ఉండడమే! ఐదేళ్ళ ఆ పాప తన తల్లి సెల్‌ఫోన్ తెచ్చి, సెల్ఫీ తీసుకుందామని అడగ్గానే అనాలోచితంగా ఒప్పేసుకుంది అజ్ఞాత. మా పరిశోధనలో బైటపడ్డ ఆ సెల్ఫీయే వీళ్ళను పట్టిచ్చింది. పాత నేరస్థులు కావడంతో వీళ్ళను ట్రాక్ చేయడం సులభమయింది మాకు. ఇద్దరూ నేరం ఒప్పుకున్నారు’ అని చెప్పాడు. హెచ్చరించి హనుమంతయ్యను వదిలేశారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment