సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు (టీఎస్–నాబ్) చిక్కిన ‘ఫిల్మ్ ఫైనాన్షియర్’కారుమూరి వెంకట రత్నారెడ్డికి సంబంధించి మరో వ్యవహారం బయటపడింది. క్రైమ్ కథనాలే స్ఫూర్తిగా నకిలీ ఐఆర్‌ఎస్ అధికారం ఎత్తాడని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీ కేసులో ఇతడిని కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించామని అధికారులు తెలిపారు. ఆ తర్వాతే నిందితులు ఎందరనే అంశంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
వెన్నెముక విరగడంతో కథ అడ్డం...
గుంటూరు నగరానికి చెందిన కె.వెంకట రత్నా రెడ్డి అలియాస్ రత్నారెడ్డి అలియాస్ కేవీఆర్ రెడ్డి బీఎస్‌సీ పూర్తి చేశాడు. ఆపై కొన్ని కంప్యూటర్ కోర్సులు కూడా చేసి బిల్డింగ్ ఎలివేషన్స్ డిజైనర్ గా స్థిరపడ్డాడు. 2007 లో ఓ బిల్డింగ్ వర్క్ చేస్తుండగా... ప్రమాద వశాత్తూ జారి పడటంతో వెన్నుముకకు తీవ్ర గాయమైంది.
ఈ గా యంతో చాలా కాలం పాటు మంచం పట్టిన రత్నారెడ్డి అప్పట్లో వార్తా పత్రికలు, చానళ్లలో వచ్చే క్రైమ్ కథనాలను ఆసక్తిగా చూసేవాడు. ఈ నేపథ్యంలోనే అనేక మంది ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుంటూ అమాయకులను మోసం చేసి భారీగా దండుకుంటున్న వైనంపై వెలువడిన కథనాలు ఇతన్ని ఆకర్షించాయి. ఆ స్ఫూర్తితోనే తానూ అదే రకంగా మోసాలు చేసి తేలిగ్గా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
కేవీఆర్ రెడ్డిగా అవతారం...
అనుకున్నదే తడవుగా మోసాలు ప్రారంభించేందుకు అవసరమైన సరంజామా సిద్ధం చేసుకున్నాడు. కేవీఆర్ రెడ్డి పేరుతో ఐఆర్‌ఎస్ అధికారిగా పేర్కొంటూ ఓ బోగస్ గుర్తింపుకార్డు తయారు చేశాడు. ఇదే పేరు, హోదాలతో కొన్ని విజిటింగ్ కార్డులు సైతం రూపొందించుకున్నాడు. తనకు తానే హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లోని కమిషనర్స్ ఫర్ డిపార్ట్‌మెంట్ ఎక్వయిరీస్‌లో సూపరెంటెండెంట్‌గా హోదా క్రియేట్ చేసుకున్నాడు.
నగరంలోని కృష్ణనగర్ ప్రాంతానికి చెందిన నర్సింహ నుంచి రూ.6 వేలు వెచ్చించి ఓ బొమ్మ పిస్తోలు కొనుగోలు చేశాడు. గుంటూరులోని ఓ షోరూమ్‌లో ఫైనాన్స్‌పై కారు కొన్నాడు. దానిపై ప్రభుత్వ చిహ్నం ఏర్పాటు చేయడంతో పాటు నెంబర్ ప్లేట్లపై గవర్నమెంట్ వెహికిల్ అని రాయించడం ద్వారా ఉన్నతాధికారిగా ‘కలర్’ఇచ్చాడు. వీటి సాయంతో తాను ఐఆర్‌ఎస్ ఆఫీసర్ అని నమ్మిస్తూ ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉందని, అనేక ప్రాజెక్టులు ఇప్పిస్తానని మోసాలకు తెరలేపాడు.
వరుస పెట్టి నేరాలు...
తాను ఐఆర్‌ఎస్ అధికారినంటూ నగరానికి చెందిన పి.వెంకటరామ్ అలియాస్ భీష్మాజీతో పరిచయం చేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆన్ లైన్’ అనే ప్రాజెక్టు ఇప్పిస్తానని, దీని విలువ రూ.5 కోట్లకుపైగా ఉంటుందని నమ్మబలికి ఆయన నుంచి రూ.11 లక్షలు వసూలు చేశాడు.
వరంగల్‌కు చెందిన బాల్‌కిషోర్‌రెడ్డికి, ఆయన సంబందీకులతో ఉన్న సివిల్ వివాదాన్ని సెటిల్ చేయడానికి రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఓ ఆర్థిక వివాదంతో కూకట్‌పల్లికి చెందిన గోపి అనే వ్యక్తిని బెదిరించాడు. తాను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధికారినంటూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పైరవీలు చేయడం ప్రారంభించాడు.
Comments
Please login to add a commentAdd a comment