
కారు దిగబోతున్న జాన్సన్ దూరంగా కొండ మీద నుంచి వినిపిస్తున్న కేకలకు ఉలిక్కిపడ్డాడు. ‘డల్హౌసీ లో తెలుగు వాడి కేకలా?’ అనుకుంటూ ఆశ్చర్యంగా పైకి చూశాడు. పైనున్న కొండ మీద జనం మూగి ఉన్నారు. జనం మధ్యలోంచే ఆ కేకలు వినబడుతున్నాయి. జాన్సన్ వేగంగా అక్కడి చేరుకున్నాడు. ‘కష్టంలో ఉన్న తెలుగు వాడెవడయి ఉంటాడు? ఆ గొంతు ఎక్కడో విన్నట్లుంది’ అనుకుంటూ కుతూహలంగా, జనాన్ని నెట్టుకుంటూ ముందుకెళ్ళిన జాన్సన్ ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు. లోయలోకి చూస్తూ హిస్టీరిక్‌గా అరుస్తున్నది ఎవరో కాదు. జాన్సన్ దూరపు బంధువు జెన్నిఫర్ భర్త భరత్. ‘మైగాడ్! జెన్నిఫర్ ఏమైంది? లోయలో పడిపోయిందా?’ అనుకోగానే అతనిలో హఠాత్తుగా వణుకు ప్రారంభమయింది. (అనంతగిరి అడవిలో ఇద్దరి ఆత్మహత్య)
భరత్ హృదయవిదారకంగా అరుస్తూ లోయలోకి దూకే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడున్న జనం అతన్ని ఆపడానికి ఎంతో కష్టపడుతున్నారు. జాన్సన్‌ని చూడగానే, ఒక్కసారిగా ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకొని, ‘‘జాన్సన్... నా జెన్నీని కాపాడు’’ అంటూ బిగ్గరగా అరిచాడు భరత్. అప్పుడు చూశాడు జాన్సన్ లోయలోకి. ఆ లోయలో సుమారు ఇరవైఅడుగుల లోతులో ఒక కొమ్మను పట్టుకొని వేలాడుతూ ప్రాణాల కోసం పోరాడుతోంది జెన్నిఫర్. కానీ ఆమెను కాపాడే అవకాశమే లేదు. తాడు లాంటిది ఏమయినా దొరుకుతుందేమోనని అటూ ఇటూ చూస్తుంటే, పక్కనే ఉన్నతను చెప్పాడు ‘‘తాడు కోసం మా తమ్ముడు వెళ్ళాడు. అదిగో వచ్చేస్తున్నాడు’’అంటూ అటు వైపు చూసి, ‘‘జల్దీజల్దీ’’ అని ఆత్రుతగా అరిచాడు. అందరూ ఆశగా ఆ కుర్రాడి వైపు చూస్తూ ‘అమ్మయ్య గండం గడిచినట్లే’ అనుకుంటుండగా, కెవ్వున కేక వినిపించింది. అందరూ అప్రయత్నంగా లోయలోకి చూశారు. జెన్నిఫర్ అప్పటికే వంద అడుగుల లోతున్న లోయలోకి పడిపోయి, మంచులో కూరుకుపోయి, మాయమయిపోయింది. ఆ దృశ్యం చూస్తూనే భరత్ స్పృహతప్పి పడిపోయాడు. అందరి మనసులూ వికలమయిపోయాయి. (ప్రియుడు రాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య)
డల్హౌసీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని హిల్ స్టేషన్. జాన్సన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆఫీసు పని మీద హైదరాబాద్ నుంచి రెండ్రోజుల క్రితమే డల్హౌసీ వచ్చాడు. ‘సూయిసైడ్ పాయింట్’ అని ఒకప్పుడు పేరుమోసిన ‘కాలా టాప్ వ్యూపాయింట్’ చూడడానికి వచ్చిన జాన్సన్‌కి ఈ దురదృష్టకరమైన సంఘటన చూడవలసిన అగత్యం పట్టింది. జెన్నిఫర్‌తోనూ, ఆమె కుటుంబంతోనూ జాన్సన్‌కి, అతని తమ్ముడు రాబిన్‌కి ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన జెన్నిఫర్ అందాన్ని చూసి, ధనవంతుడయిన భరత్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళయి మూడేళ్లు కావస్తోంది. జెన్నిఫర్ అంటే భరత్‌కి ఎంత ప్రేమో ఎవరూ చెప్పనవసరం లేదు. అన్యోన్య దాంపత్యానికి ఆ జంటనే ఉదాహరణగా చెప్పవచ్చు. జెన్నిఫర్ కన్నా రెండేళ్లే పెద్ద అయిన రాబిన్‌తో ఆమెకు గాఢమయిన స్నేహం. రాబిన్ ఆమెకు ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్. భరత్, జెన్నిఫర్‌లకు విహారయాత్రాలంటే చాలా ఇష్టం. ఈసారి వాళ్లు డల్హౌసీలో వారం రోజులు గడపడానికి వచ్చారు. వచ్చిన నాలుగోరోజుకే ఈ ప్రమాదం జరిగింది.
∙∙
పోలీస్ ఎంక్వయిరీ మొదలయింది. జాన్సన్ పూర్తిగా ఫాలో అవుతూ వచ్చాడు. కాలా టాప్ పాయింట్ దగ్గరున్న టీ షాప్‌ను నడుపుతున్న రామ్‌దేవ్ ద్వారా కొన్ని విషయాలు తెలిశాయి. ‘‘మూడు రోజులుగా రోజూ ఆ సాబ్, మేమ్ సాబ్‌లు వ్యూ పాయింట్‌కి వచ్చి గంట, గంటన్నర గడిపి వెళ్తున్నారు. మేమ్‌సాబ్ అంటే ఆ సాబ్‌కి ఎంత ప్రేమో, ఆ మూడు రోజుల్లోనే నాకు బాగా తెలిసింది. ప్రమాదం జరిగిన రోజున మునుపటి కన్నా హుషారుగా ఉన్నారు మేమ్‌సాబ్. కొండ చరియ దగ్గరున్న బండ మీద ఆమె కూర్చుంటే, ఈ సాబే మా షాప్ నుంచి టీ పట్టుకెళ్లి ఆమెకిచ్చేవారు. ఇద్దరూ టీ తాగుతూ ముచ్చటగా కబుర్లు చెప్పుకుంటుంటే నాకెంతో ఆనందం కలిగేది. చూడ చక్కటి జంట వాళ్లిద్దరిదీ. ...ప్చ్... ఆ పైవాడే చూడలేకపోయాడు. టీ కలుపుతూ నా పన్లో పడిపోయిన నేను, ఆయన పెట్టిన కేకకు అదిరిపడి, అటు చూస్తే... ఇంకేముంది? ఆమె లోయలో పడిపోవడం, ఆమెను రక్షించబోయినసాబ్ బండకు తగిలి, అక్కడే పడిపోవడం’ చూసేసరికి నా కాలూ చెయ్యీ ఆడలేదు. గబగబా పరుగెత్తి, సాబ్‌ని లేవదీశాను. పాపం మోకాలికి దెబ్బ తగిలి, ప్యాంట్ రక్తంతో తడిసిపోయింది.
లోయలోకి చూస్తే, మేమ్‌సాబ్ చెట్టుకొమ్మను పట్టుకు వేలాడుతున్నారు. నాకేమీ తోచలేదు. సహాయం కోసం గట్టిగా అరిచేసరికి, జనం పోగయ్యారు. అంతమందిమి ఉన్నా ఆమెను కాపాడలేకపోయాం’’ అంటూ ఏడ్చేశాడతను. ఇతర ప్రత్యక్ష సాక్షుల కథనాలు కూడా విన్న తర్వాత పోలీసులకు కూడా భరత్ పై అమితమయిన జాలి కలిగింది. ఆ లోయలో పడిన వారెవరూ ఇంత వరకూ ప్రాణాలతో బయట పడలేదు. జెన్నిఫర్ విషయంలోనూ ఆ ఆశ లేనప్పటికీ, ఆమె మృత దేహాన్ని పైకి తీయించాలని జాన్సన్ కోరిన మీదట, ‘అది చాలా కష్టమయిన పని’ అంటూ పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేతులెత్తేశాడు. అయినా జాన్సన్ ఒప్పుకోలేదు. తన పలుకుబడిని ఉపయోగించి, ఆ ప్రయత్నాలు ప్రారంభించేంత వరకు ఊరుకోలేదు. ఎంతో కష్టం మీద మూడో రోజుకు గానీ, ఆమె మృత దేహాన్ని పైకి తీయలేకపోయారు. ప్రమాదం జరిగిన మర్నాడే అక్కడికి చేరుకున్న జెన్నిఫర్ ముసలి తల్లితండ్రులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. భరత్ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. జెన్నిఫర్ శవాన్ని బయటకు తీసినపుడు, ఆమె తల్లి తండ్రుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గుండె దిటవు చేసుకుని,వాళ్ళను ఓదార్చాడు భరత్..
శవం దొరికాక, పోస్ట్‌మార్టమ్ వంటి కార్యక్రమాలను విడిచిపెట్టి శవాన్ని తొందరగా తరలించడానికి, జాన్సన్ తన పరపతిని ఉపయోగించడంతో వాళ్ళంతా తొందరగానే హైదరాబాద్‌లోని జెన్నిఫర్ పుట్టింటికి చేరుకోగలిగారు.‘శవాన్ని ఎవరింటికి తీసుకెళ్లాలి?’ అనే ఆలోచన ఎవరికీ రాలేదు. ఏదోరకంగా తొందరగా హైదరాబాద్‌లో పడితే చాలు అనేదే వాళ్ళ తాపత్రయం. అప్పటికే జెన్నిఫర్ ఇంటి దగ్గర కాచుకుని కూర్చొని ఉన్నాడు రాబిన్. అచేతనంగా పడిఉన్న జెన్నిఫర్‌ని చూడగానే, అతని దుఃఖం కట్టలు తెంచుకుంది. చంటి పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని చూసేసరికి, అందరి హృదయాలూ ద్రవించి పోయాయి. మర్నాడు అంత్య క్రియలు జరపడానికి నిర్ణయించారు. జాన్సన్, రాబిన్‌లు ఆ ఏర్పాట్లలో ఉన్నారు.
∙∙
జెన్నిఫర్ మరణంతో పిచ్చివాడయి పోయాడు రాబిన్. చిన్నప్పటి నుంచి ఆమె అంటే పిచ్చి ప్రేమ అతనికి. ఆమెను పెళ్ళి చేసుకోవాలని ఎంతో ఆశ పడ్డాడు. ఆమెకు కూడా రాబిన్ అంటే వల్లమాలిన అభిమానమే. అయితే అతనిని పెళ్ళాడాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. రాబిన్‌కి మంచి ఉద్యోగం గానీ, ఆస్తిపాస్తులు గానీ లేకపోవడం వల్ల, ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేకపోయాడు. మంచి ఉద్యోగం సంపాదించి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా, భరత్ తో ఆమెకు పెళ్లి అయిపోయింది. అప్పటి నుంచి అతనిలో కసి ప్రారంభమయింది. జెన్నిఫర్ తనకు దక్కలేదన్న కసితో పెళ్ళయిన తర్వాత కూడా వదలకుండా తన చుట్టూ తిరగడం, అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా ఆమెకు మెసేజ్‌లు పెట్టడం... ఇవన్నీ కావాలనే చేశాడతను. వాటి వల్ల వాళ్లిద్దరి దాంపత్యంలో కలతలు రావాలనే పైశాచిక ఆలోచన అతనిలో లేకపోలేదు. జెన్నిఫర్‌ని చేసుకున్న భరత్ అంటే అతనికి చాలా అసూయకలిగేది.
అతన్ని చంపేస్తే, జెన్నిఫర్ తనదవుతుందనే పిచ్చి ఆలోచనలు కూడా అతనికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవి. కానీ అది సాధ్యం కాదు అని అతనికీ తెలుసు. జెన్నిఫర్ శవానికి పోస్ట్‌మార్టమ్ చేయలేదని తెలిసినపుడు అతనికో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో పాటూ అతని బెస్ట్ ఫ్రెండ్ ఇన్సె్పక్టర్ మహంకాళి గుర్తొచ్చాడు. ‘ఎలాగయినా వాడి చేత కేసు రీ ఓపెన్ చేయించి భరత్‌గాడిని జైల్లోకి తోయించాలి. భరత్ గాడు సామాన్యుడు కాదు. వాడే జెన్నిఫర్‌ని లోయలోకి తోసేసి ఉంటాడు. ఏదో జరిగింది. అది నిశ్చయంగా హత్యలేనని నా అంతరాత్మ చెబుతోంది. అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు తిరిగి ఓపెన్ చేయించాలంటే అన్నయ్యను ఒప్పించడం అవసరం. అతను అడ్డు పడితే, ముందుకెళ్లడం కష్టం’ అనుకుని జాన్సన్‌ను ఒంటరిగా కలిశాడు.
‘‘ఇది నిస్సందేహంగా హత్యే అన్నయ్యా. భరత్‌గాడు మీరందరూ అనుకునేటంత అమాయకుడేమీ కాదు. వాడే జెన్నిని లోయలోకి తోసేసి ఉంటాడు’’ అంటున్న రాబిన్ మాటలు వినగానే మతిపోయింది జాన్సన్‌కి. ‘‘ఛ... తప్పు.. నీకెందుకొచ్చిందా అనుమానం?’’ అంటూ గసిరాడు. ‘‘నా దగ్గర ఆధారాలు ఏవీ లేవు గానీ, ఎందుకో అది యాక్సిడెంట్ కాదని అనిపిస్తోంది’’ అన్నాడు రాబిన్. ‘‘అతను ఎందుకలా చేస్తాడు? నీకేదో పిచ్చి పట్టినట్లుంది. ఎవరయినా వింటే, ఏమనుకుంటారు? భరత్ చాలా మంచివాడురా. జెన్నీని ఎంతో ప్రేమగా చూసుకునేవాడురా. అతని మీద ఇలా నిందలు వేయడం భావ్యం కాదురా. పోనీ ఒక విషయం చెప్పు. జెన్నీ నీకు బాగా క్లోజ్ కదా? భరత్ గురించి చెడ్డగా ఎప్పుడయినా చెప్పిందా? సంసారంలో కలతలు వచ్చాయని చెప్పిందా?’’ అని అడిగాడు జాన్సన్. ‘‘లేదు. కానీ ... నాకెందుకో అది యాక్సిడెంట్ అనిపించడం లేదు’’ అన్నాడు రాబిన్. ‘‘అర్ధంపర్ధం లేని అనుమానాలు నీవి’’ అంటూ కొట్టి పారేశాడు జాన్సన్. ‘‘అలా అనకు. నా అంతరాత్మ చెబుతోంది, ఏదో తేడా ఉందని.
ఈ మధ్య భరత్ వ్యాపారంలో బాగా దెబ్బ తిన్నాడు. వాడికి చాలా అప్పులున్నాయట. డబ్బు కోసం వాడు పన్నిన పన్నాగం ఇది. నాకు మూడు అనుమానాలు ఉన్నాయి... మొదటిది అతను జెన్నీ పేరిట పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేసి ఉంటాడు. రెండవది, అతనికేదో గొప్పింటి సంబంధం వచ్చి ఉంటుంది. మూడవది, సహజంగా అందగాడు కదా? ఏ అమ్మాయో తగులుకొని ఉంటుంది. ఆ విషయం తెలిసిపోయేసరికి జెన్నీ రాద్ధాంతం చేసి ఉంటుంది. ఆమెను వదిలించుకోవడానికి ఇలా పథకం వేసి ఉంటాడు’’ అంటూ ఆరోపించాడు రాబిన్. ఆవేశంగా ఆలోచిస్తున్న వాడికి ఏం చెప్పినా వినడని, ‘‘సర్లే... నీ మాట ఎందుకు కాదనాలి? కానీ... అలా ఆరోపిస్తే సరిపోదు. ఆధారాలు కావాలి. ప్రయత్నించు, ఏదయినా క్లూ దొరుకుతుందేమో!’’ అని సలహా ఇచ్చాడు. ఆమాత్రం ప్రోత్సాహానికే పొంగిపోయాడు రాబిన్. ‘‘ఆ పని ఇంకా సులువు. అంతా మహంకాళి చూసుకుంటాడు అన్నాడు హుషారుగా.‘వీడిక్కడితో ఆగేలా లేడు. కేసు రీ ఓపెన్ చేయిస్తాడు. కానీ ఆధారాలు దొరకాలి కదా?’ అనుకున్నాడు జాన్సన్ మనసులో...
∙∙
అంత్యక్రియల ఏర్పాట్లకు బయటకెళ్లిన అన్నదమ్ములిద్దరూ జెన్నిఫర్ ఇంటికి తిరిగి వచ్చేసరికి, భరత్ తండ్రి రఘురామారావు, అతని భార్య కనిపించారు. జాన్సన్‌ని చూడగానే రఘురామారావు ఎదురెళ్ళి, ‘‘ఏమిటి జాన్సన్? డెడ్ బాడీని ఇక్కడికి తీసుకొచ్చావు? మా ఇంటికి కదా తీసుకురావాలి?’’ అని ప్రశ్నించాడు ఘాటుగా. ‘‘ఏమో సార్... అంతా అలా జరిగిపోయింది. అందరూ దుఃఖంలో ఉన్నారు. ఏదో నాకు తోచినట్లు చేసేశాను. ఇప్పుడేమంటారు?’’ అని అడిగాడు, తత్తర పడుతూ. ‘‘మా ఇంటికే తీసుకుపోదాం. అంత్యక్రియలన్నీ అక్కడే’’ ఆర్డర్ వేస్తున్నట్లు అన్నాడు. ‘‘ఏర్పాట్లన్నీ చేసేశామే! కఫిన్ రెడీ అయిపోయింది. పాస్టర్ కి చెప్పేశాం. రేపు ఉదయం అందరూ ఇక్కడికే వస్తారు. మీ ఇంటికి తీసుకెళ్తామని మేము ఎవరమూ అనుకోలేదు. భరత్ కూడా...’’అంటుంటే అడ్డు తగిలాడు రఘురామారావు. ‘‘పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. వాడెలా చెప్తాడు? సరే అయ్యిందేదో అయ్యింది. తంతు అంతా మా ఇంటి దగ్గరే జరుగుతుంది. మా పద్ధతిలోనే’’ అంటూ ఆఖరి ముక్క గట్టిగా నొక్కి చెప్పాడు.
జాన్సన్‌తో పాటు అక్కడున్న అతని బంధువులంతా తెల్లబోయారు.‘‘తొందరగా కానివ్వండి, ఎక్కువ టైం లేదు. రేపటి ఏర్పాట్లు చూడాలి. వాసంతీ మీ తమ్ముడికి ఫోన్ చేసి చెప్పు, అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయమని’’అంటూ భార్యకు పురమాయించాడు. ఆ మాటలు విన్న జెన్నిఫర్ తండ్రి, డెబ్భయి ఏళ్ళు దాటిన అబ్రహాం బిగ్గరగా ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. ఆ వార్తను అతని భార్య మార్తా కూడా తట్టుకోలేక తల్లడిల్లిపోతుంది. తమ పద్ధతిలోనే అంత్యక్రియలు జరిపితే, కూతురి పరిశుద్ధ ఆత్మ పరలోకాలకు చేరుతుందనే ప్రగాఢ విశ్వాసంతో ఉన్న ఆ ముసలి జంట, తాము విన్నదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కోరిక మన్నించమని అల్లుడిని ప్రాధేయపడ్డారు. ‘‘నాన్న ఇష్టం. నాదేమీలేదు’’ అంటూ నిస్సహాయతను ప్రదర్శించాడు భరత్.. జెన్నిఫర్ బంధువులందరూ రఘురామారావును బతిమాలడం మొదలు పెట్టారు. చాలా సేపు వాళ్ళంతా బతిమాలేసరికి అతను ఒప్పుకోక తప్పలేదు. జెన్నిఫర్ ముసలి తల్లి తండ్రుల పట్ల అతనికి జాలి, సానుభూతి కలిగాయి.
ఆ మర్నాడు ఉదయం క్రై స్తవ పద్ధతిలోనే అంత్యక్రియలు జరిగాయి. ఆ మధ్యాహ్నమే రాబిన్... మహంకాళిని కలిసి, తన అనుమానాలన్నీ వ్యక్తం చేశాడు. అయితే ఇన్సె్పక్టర్ మహంకాళి సానుకూలంగా స్పందించలేదు. కేసు రీ ఓపెన్ చేయడానికి ఇష్టపడలేదు. కానీ రాబిన్ తన పంతాన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళిద్దరికీ ఉన్న ప్రగాఢ స్నేహానికి మహంకాళి తలవంచక తప్పలేదు. పరిశోధన ప్రారంభించాడు. రాబిన్ కూడా అతని వెంటే ఉండి, భరత్ ను ఎలా అయినా కటకటాల్లోకి నెట్టేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. శవాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టమ్‌కి పంపారు. భరత్ చరిత్ర అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ ఏ క్లూ లభించలేదు. జెన్నిఫర్ పేరుతో బీమాపాలసీ ఏదీ తీసుకున్న దాఖలాలు లేవు. రాబిన్ ఆరోపణలన్నీ నిరాధారమని రుజువయింది. భరత్‌కు ఉన్న ‘క్లీన్ రికార్డ్’ చూసి, రాబిన్ పై మండిపడ్డాడు. మూసేసిన కేసును తిరగదోడినందుకు పై అధికారుల నుంచి తిట్లు తప్పవని రాబిన్ పై విరుచుకు పడ్డాడు. ఎప్పటికప్ప్పుడు కేసు వివరాలను తెలుసుకుంటున్న జాన్సన్ ‘అమ్మయ్య’ అనుకుంటూ తేలికగా ఊపిరి తీసుకున్నాడు. ఈ విషయాలేవీ తెలియని భరత్, తన రొటీన్లో పడిపోయి బిజీ అయిపోయాడు.
∙∙
వారం రోజుల తర్వాత... అనూహ్య పరిణామం జరిగింది. ‘ఇంత వరకు నేను చేపట్టిన ఏ కేసూ ఫెయిల్‌అవ్వలేదు. ఈ రాబిన్‌గాడి వల్ల నా రికార్డ్ మీద మచ్చ పడింది’ అని బాధపడుతున్న మహంకాళి పెదవులపై చిరునవ్వు విరిసింది. రాబిన్ విజయగర్వంతో పగలబడి నవ్వే రోజొచ్చింది. భరత్ అరెస్ట్ అయ్యాడు. ఆ వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. భరత్ తన నేరాన్ని ఒప్పుకోక తప్పలేదు. నిజానికి ఆ విజయం పూర్తిగా రాబిన్‌ది కాదు. పోలీసులదీ కాదు. తొందరపడి చేసిన తప్పుకు కుమిలిపోతూ, తానే పోలీసులకు లొంగిపోదామనుకున్న తరుణంలో ఇలా జరిగేసరికి, పోలీసుల పని సులువయింది. మంచి లాయర్‌ని పెట్టి, తమకున్న పరపతితో బయటపడడం భరత్ కి పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆ ప్రయత్నం చేయలేదతను.
పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో కేసు ముడివీడింది. జెన్నీ కడుపులో కనుగొన్న మత్తుమందు చిక్కుముడిని విప్పింది. దాన్ని బట్టి జెన్నిఫర్‌ది యాక్సిడెంట్ కాదని తేలింది, మహంకాళికి. భరత్ హత్యచేసి ఉంటాడన్న దానికి బలమయిన ఆధారం దొరికింది. అతను భార్యను చంపడానికి ఏ కారణమూ తోచలేదు మహంకాళికి. ‘భరత్ ఏదయినా మానసిక సమస్యతో బాధపడుతున్నాడా? దాని కారణంగానే, మతి స్థిమితం తప్పి భార్యను హత్య చేశాడా?’ అనే సందేహం వచ్చింది. భరత్ ఫ్యామిలీ డాక్టర్ తో మాట్లాడినపుడు ఒక కొత్త విషయం తెలిసింది. ఈమధ్య కాలంలో వ్యాపారంలో వచ్చిన సమస్యల కారణంగా భరత్‌కి రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదని, దాని వల్ల డాక్టర్ సలహా మీద నిద్రమాత్రలు వాడుతున్నాడని... అతను వాడే నిద్రమాత్రలలో ఉండే రసాయన పదార్థం జెన్నిఫర్ కడుపులో కనుగొన్న మత్తుమందు ఒకటేనని తెలియడంతో భరత్ నేరస్తుడు అని రుజువయింది.
కాలా టాప్ వ్యూ పాయింట్ దగ్గర టీలో తను వాడే నిద్ర మాత్రల పొడిని కలిపి ఇవ్వడం వల్ల కలిగిన మత్తు వల్ల జెన్నిఫర్ కంట్రోల్ తప్పి లోయలో పడి మరణించిందని, ఆ లోయలోని మంచులో కూరుకుపోయిన శవాన్ని పైకి తీసే అవకాశమే లేదు కాబట్టి తను సురక్షితంగా పోలీస్ కేసు నుంచి తప్పించుకోవచ్చునని ప్లాన్ చేశానని, కానీ ఆ సమయానికి జాన్సన్ అక్కడికి రావడంతో కథ అనుకోని మలుపు తిరిగిందని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు భరత్.
హత్య చేయడానికి కారణం భార్య శీలంపై అనుమానమని, రాబిన్‌కి, జెన్నిఫర్‌కి పెళ్లి ముందు నుంచే వ్యవహారం ఉన్నట్లు గట్టిగా నమ్మానని చెప్పాడు. రాబిన్‌ని కలిసినా, అతనితో మాట్లాడినా, అతని నుంచి మెసేజులు వచ్చినా ఆమెలో చాలా మార్పు వచ్చేదని, అంత హుషారుగా మామూలు సమయాల్లో ఉండేది కాదని, రాత్రి పది, పదకొండు గంటలప్పుడు కూడా రాబిన్ నుంచి మెసేజ్‌లు రావడం, ఆమె చాటుగా సమాధానం ఇస్తూ ఉండడం, తనని బాగా రెచ్చగొట్టడం జరిగేదని చెప్పాడు. తను నేరం చేశానని రాబిన్... జాన్సన్ దగ్గర అభియోగం చేయడం చాటుగా విన్నానని, కేసు రీ ఓపెన్ చేసి, పోస్ట్‌మార్టమ్ చేస్తారేమోనన్న భయం కలిగిందని, అందుకే హిందూ పద్ధతి ప్రకారం శవాన్ని కాల్చేసే నిమిత్తం, అంత్యక్రియలు హిందూ పద్దతిలో జరగాలనే ఆలోచన, తండ్రి మనసులో గట్టిగా నాటానని, కానీ తను అనుకున్నట్లు జరగక పోవడంతో పట్టుబడాల్సి వచ్చిందని చెప్పాడు.
తొందరపాటుతో హత్య చేసినా, నిదానంగా ఆలోచిస్తే, తనెంత తప్పు చేశాడో అర్ధమయిందని, ఏ ఆధారమూ లేకుండా అంతటి అఘాయిత్యానికి పాల్పడడానికి కారణం, ఆమెపై తాను పెంచుకున్న పిచ్చి ప్రేమేనని, అందువల్లే తానొక సైకోలా మారిపోయానని చెబుతూ హృదయ విదారకంగా ఏడ్చేశాడు భరత్.
Comments
Please login to add a commentAdd a comment