
పదేళ్ల తర్వాత నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిండింది. 590 అడుగుల లెవల్‌కి చేరువకాబోతోంది. ఇంకా శ్రీశైలం నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. నాగార్జునసాగర్ డ్యామ్ 26 గేట్లు ఎత్తారు. దశాబ్దం తర్వాత డ్యామ్ నుంచి వాటర్ ఓవర్ ఫ్లో అవుతోంది. ఒకేసారి ఇరవై ఆరు జలపాతాలు నదిలోకి దూకుతున్న దృశ్యం కనువిందు చేస్తోంది.
ఆ రోజు ఆదివారం కావడంతో రెండు రాష్ట్రాల ప్రజలు నాగార్జున సాగర్‌కి పోటెత్తారు. అటు హైదరాబాద్, నల్లగొండ నుంచి వస్తున్న జనం, ఇటు గుంటూరు నుంచి మాచర్ల మీదుగా వస్తున్నవారితో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. వెహికల్స్‌ని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు.
అసలే రోడ్లన్నీ వెహికల్స్‌తో నిండిపోయి ట్రాఫిక్ కదలడం లేదు. సిద్ధార్థ హోటల్ ముందు రోడ్డు పక్కన ఎరుపు రంగు మారుతి ఆల్టో కారు పార్క్ చేసి ఉంది. ఎస్సై అన్వర్‌కి మండుకొచ్చింది.
‘ఎవడో బద్మాష్.. కారు ఇక్కడ పార్కు చేశాడు’ అనుకుంటూ కారు దగ్గరికి వెళ్లాడు. ఫ్రెంట్ సీటు ఖాళీగా ఉంది. డ్రైవింగ్ సీట్లో స్టీరింగ్ మీద తలవాల్చి ఉంది ఒక యువతి.
‘మేడమ్! హలో మేడమ్!’ అని డోర్ తడుతూ పిలిచాడు ఎస్సై.
ఆమె నుంచి రెస్పాన్స్ రాలేదు.
‘నిద్రపోతుందా ఏంటీ’ అనుకున్నాడు.
వాచీ వైపు చూస్తూ ‘ఇంకా రాత్రి ఎనిమిది కూడా కాలేదు. అప్పుడే నిద్రేంటీ? మందుకొట్టి మత్తులో ఉందా?’ అని అనుమానపడుతూ డోర్ తీశాడు. డోర్ ఓపెన్ అయ్యింది. ఆమెను తట్టి లేపడానికి ప్రయత్నించాడు. ఐతే ఆమె పక్కకి ఒరిగిపోయింది. ‘ఓ మైగాడ్’ అనుకున్నాడు. చెయ్యి పట్టుకుని చూశాడు. చల్లగా ఉంది. ఆమె చనిపోయింది. బ్యాక్ సీటులో కూడా ఎవరు లేరు.
హిల్ కాలనీలో ఉన్న కమలా నెహ్రూ హాస్పిటల్‌కి ఆమె డెడ్ బాడీ తరలించారు. కారుని పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఆమె వయసు పాతికేళ్లు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు. రోడ్డు పక్కన కారు ఆపి చనిపోయి ఉంటుంది అనుకున్నారు. ఆమె ఒంటరిగా టూర్‌కి ఎందుకొచ్చిందో అర్థం కాలేదు.
‘ఆమె ఎవరు?’ అంటూ టీవీ ఛానల్స్‌లో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ఆమె డెడ్ బాడీని చూపిస్తున్నారు.
రాత్రి పదింటికి ట్రాఫిక్ తగ్గుముఖం పట్టడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మిర్యాలగూడ నుంచి వచ్చిన డీఎస్పీ రత్నాకర్ హాస్పిటల్ మార్చురీలో ఉన్న ఆమె బాడీని చూసి వచ్చాడు. పోస్ట్‌మార్టమ్ రిపోర్టు వస్తే కానీ ఆమె చావుకు కారణాలు తెలియవు. హాస్పిటల్ ఆర్‌ఎమ్‌ఓ పోస్ట్ మార్టమ్ రిపోర్టు మర్నాటికి ఇస్తామని తెలియజేశాడు. కారులో ఏ విధమైన ఆధారాలు దొరకలేదు. ఆమె వాలెట్ కనిపించలేదు. అది ఉంటే కనీసం సెల్‌ఫోన్ అయినా వుండేది. డాష్ బోర్డులో కారుకి సంబంధించిన డాక్యుమెంట్లు గానీ, ఆమె లైసెన్స్ గానీ కనిపించలేదు. ఆమె ఎవరో తెలుసుకోవడానికి ఏ ఆధారం దొరకలేదు. మర్నాడు కారు నంబర్ హైదరాబాద్‌లోని ఆర్టీవో ఆఫీసుకి పంపారు. ఆ వెహికల్ గురించిన వివరాలు మెయిల్‌లో వచ్చాయి. ఆమె పేరు కల్పన. డాటర్ ఆఫ్ రాఘవేంద్రరావు అని మాదాపూర్‌లో ఉన్న రాయల్ రెసిడెన్సీ అడ్రస్ ఉంది.
ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ఊహాగానం. పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో ఆమె విషం కలిపిన కూల్ డ్రింక్ తాగడం వల్ల మరణించిందని ఉంది. నిన్న సాయంకాలం ఆరు గంటలకు ఆమె ప్రాణం పోయింది. ఆమె ఫోటో, అడ్రస్ హైదరాబాద్‌లోని స్పెషల్ బ్రాంచి పోలీసులకు పంపించాడు మిర్యాలగూడా డీఎస్పీ రత్నాకర్. ఆమె ఎవరో తెలిస్తే వారి కుటుంబ సభ్యులకు బాడీని హ్యాండోవర్ చేయవచ్చు. ఆమె ఎవరో మిస్టరీగా ఉంది. ఒంటరిగా కారులో వచ్చి నాగార్జున సాగర్‌లో ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదు.
ఆమె గురించి వివరాలు తెలిసే వరకూ కల్పన బాడీని హిల్ కాలనీలోని కమలా నెహ్రూ హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు పోలీసులు. క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ మాదాపూర్‌లోని రాయల్ రెసిడెన్సీకి వెళ్లాడు. సెక్యూరిటీ వాళ్లకి ఆమె ఫోటో చూపించగానే గుర్తుపట్టారు.
‘ప్లాట్ నం. 303లో ఉంటుంది కల్పన మేడమ్!’ అని చెప్పారు. ఇప్పుడు ఆ ఫ్లాట్‌కి లాక్ చేసి ఉంది. ఆమె ఒంటరిగా ఉంటున్నదని అపార్ట్‌మెంట్ సెక్రటరీ తెలియజేశాడు. ఆమె తండ్రి రాఘవేంద్రరావు ఎవరో తమకు తెలియదన్నాడు.
నాగార్జునసాగర్‌కి కల్పన ఒంటరిగా వెళ్లి ఉండదు. ఆమెతో పాటు ఎవరో వెళ్లారు. ఆమెకు విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, ఆమె చనిపోయిందని నిర్ధారణకు వచ్చాక ఆమె వ్యాలెట్, కారుకి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని వెళ్లిపోయారనేది పోలీసుల అంచనా. ఐతే హైదరాబాద్‌లో ఆమె ఉంటున్న ఫ్లాట్ లాక్ చేసి ఉంది. ఆమె తాలూక ఎవరూ అపార్ట్‌మెంట్ వాళ్లకు తెలియకపోవడంతో కేసు మిస్టరీగా మారింది.
మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ రామ్ సింగ్ బిజీగా ఉన్న సమయంలో సెంట్రీ ఒక విజిటింగ్ కార్డు తెచ్చి టేబుల్ మీద వుంచి వెళ్లిపోయాడు. రామ్ సింగ్ విజిటింగ్ కార్డ్ చేతిలోకి తీసుకుని చూశాడు.
సునీత కోబాడ, ఎమ్.టిక్. సీఈఓ గ్లోబల్ టెక్నాలజీస్ అని గచ్చిబౌలి అడ్రస్ ఉంది. సెంట్రీని పిలిచి ఆమెను తీసుకురమ్మన్నాడు ఇన్‌స్పెక్టర్ రామ్ సింగ్. సునీత వస్తూనే విష్ చేసింది. ఆమెను కూర్చోమని... ‘చెప్పండి మేడమ్’ అన్నాడు.
‘సార్ టీవీలో కల్పన నాగార్జునసాగర్‌లో ఆత్మహత్య చేసుకుందని న్యూస్‌లో చూసి వచ్చాను’ అంది సునీత.
‘కల్పన మీకు తెలుసా?’
‘ఆమె నాకు బాస్ సార్.. గ్లోబల్ టెక్నాలజీస్‌లో ఆమె పార్టనర్. అఫ్‌కోర్స్ నాకూ చిన్న షేర్ ఉందనుకోండి’
ఆ కేసు క్రైమ్ బ్రాంచ్ వాళ్లు టేకప్ చేశారు మేడమ్. వాళ్లకి మీరు వివరాలు చెప్తే ఉపయోగంగా ఉంటుంది. క్రైమ్ బ్రాంచి ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్‌ని పిలిపిస్తాను. ప్లీజ్ వెయిట్ చేస్తారా?’
సునీత వెళ్లి విజిటర్స్ హాల్లో కూర్చుంది. పావు గంటలో క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ వచ్చి ఆమెను కలుసుకున్నాడు.
‘మేడమ్! కల్పన ఎవరో తెలియక డైలమాలో ఉన్నాం. ఈ సమయంలో మీరొచ్చి వివరాలు చెబుతున్నందుకు థ్యాంక్స్’ అన్నాడు ప్రభాకర్.
‘ఇన్‌స్పెక్టర్ గారూ! కల్పన నాగార్జున సాగర్ వెళ్లి సూసైడ్ చేసుకుందని తెలిసి షాక్ తిన్నాను. టీవీ న్యూస్‌లో చూసి ఇక్కడికి వచ్చాను’ అంది సునీత.
‘మంచి పని చేశారు మేడమ్.. చెప్పండి ఆమె గురించి వివరాలు?’
‘కల్పన గ్లోబల్ టెక్నాలజీస్ స్థాపించింది కొందరు లైక్ మైండెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో. అది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది’
‘అది ఓకే. ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏవైనా మీరు చెప్పగలరా? కంపెనీ అప్పుల్లో కూరుకుపోయి ఉండటం, అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేయడం వంటివి ఏమైనా ఉన్నాయా?’
‘నో సార్! కంపెనీ బాగానే నడుస్తోంది. మాకు అప్పులు ఏం లేవు. అసలు కల్పన సూసైడ్ చేసుకునేంత పిరికి మనస్తత్వం ఉన్నది కాదు. చాలా కరేజ్ గలది’
‘ఆమె రాయల్ రెసిడెన్సీలో ఒంటరిగా ఉంటున్నదని తెలిసిందే. మరి ఆమెకు పెళ్లి కాలేదా?’
‘లేదు సార్!’
‘పేరెంట్స్?’
‘సార్ ఆమెకు పేరెంట్స్ లేరు. మియాపూర్‌లో ఆమెకు ఒక అన్న ఉన్నాడు. అతను కెమికల్ ఫ్యాక్టరీలో సైట్ ఇంజనీర్’
‘అతని ఫోన్ నంబర్ మీకు తెలుసా?’
‘అతని పేరు గోపీకృష్ణ..’ అని ఫోన్ నంబర్ ఇచ్చింది సునీత.
‘హలో గోపీకృష్ణ గారేనా?’
‘ఎస్ మీరెవరూ?’
‘క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్‌ని మాట్లాడుతున్నాను. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి’
‘చెప్పండి సార్!’
‘మీ సిస్టర్ కల్పన నాగార్జునసాగర్ దగ్గర సూసైడ్ చేసుకుంది. ఆమె బాడీ కమలా నెహ్రూ హాస్పెటల్ మార్చురీలో ఉంది. మీరు అర్జెంట్‌గా రావాలి. మీకు బాడీ అప్పగిస్తాం’
‘వాట్? కల్పనా సూసైడ్ చేసుకుందా? ఎందుకు సార్?’
‘ఏమో తెలీదు. మీరు వెంటనే రండి’
‘సార్ నేను తిరుపతిలో ఉన్నాను. ఇప్పుడే బయలుదేరి వస్తాను’ అన్నాడు గోపీకృష్ణ.
మర్నాడు ఉదయం గోపీకృష్ణ హైదరాబాద్ వచ్చాడు. క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్‌ని కలుసుకున్నాడు.
‘సార్! ఇలా జరుగుతుందనుకోలేదు’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దుఃఖం ఆపుకోలేకపోయాడు.
‘ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్.. ప్లీజ్’ అంటూనే.. ‘చెప్పండి.. కల్పన సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏమైనా మీకు తెలుసా?’
‘సార్! నిజం చెప్పాలంటే తను కంపెనీ వర్కుతోనే చాలా బిజీగా ఉంటుంది. ఏం జరిగిందో ఊహించలేకుండా ఉన్నాను’
‘నాకు ఓ విషయం అర్థం కావట్లేదు. సూసైడ్ చేసుకోవడానికి అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏంటీ.? అదీ డ్రైవింగ్ సీటులో కూర్చుని ప్రాణాలు వదలడమేంటీ? ఆమె వాలెట్ లేదు. సెల్‌ఫోన్ లేదు. కారుకు సంబంధించిన డాక్యుమెంట్స్ లేవు. దీని బట్టి చూస్తే నాగార్జునసాగర్ వరకు ఆమెతో పాటూ మరెవరో వెళ్లారు. ఆమెకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి తాగించి, చనిపోయిన తర్వాత ఆధారాలు మాయం చేసుంటారు. కేవలం కారు నంబర్ ఆధారంగా ఆర్టీఓ ఆఫీస్ నుంచి వివరాలు తెలుసుకోగలిగాం’ అన్నాడు ప్రభాకర్.
‘ఆమె కంపెనీలో పని చేస్తున్న వాళ్లతోనే వెళ్లి ఉంటుంది సార్! నాగార్జునసాగర్ టూర్ వెళ్తుందని మాకు తెలియదు. మేము తిరుపతి వెళ్లాం’ అన్నాడు గోపీకృష్ణ.
కల్పన సూసైడ్ గురించి ఆమె అన్నకు ఏం తెలియదని నిర్ధారణకు వచ్చిన క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్, నాగార్జున సాగర్ పోలీసులకు కల్పన బాడీ ఆమె అన్న గోపీకృష్ణకు అప్పగించేయాలని కాల్ చేసి చెప్పాడు.
గోపీకృష్ణ నాగార్జున సాగర్ బయలుదేరి వెళ్లిన తర్వాత ఓ వ్యక్తిని వెంట బెట్టుకుని వచ్చింది సునీత.
‘సార్.. ఈయన మోహన్ కుమార్.. కల్పనకు »ñ స్ట్ ఫ్రెండ్. ఇద్దరూ మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకున్నారు. ఈ లోపు ఇలా జరిగింది’ అంది సునీత.
‘సార్! కల్పన సూసైడ్ చేసుకుందని న్యూస్‌లో తెలుసుకుని సునీతను కాంటాక్ట్ చేశాను. ఆమె మిమ్మల్ని కలిసినట్లు చెప్పింది’ అన్నాడు మోహన్ కుమార్.
‘మిస్టర్ మోహన్ కుమార్! కల్పన సూసైడ్ చేసుకుందని మీరు నమ్ముతున్నారా?’ అడిగాడు ఇన్‌స్పెక్టర్.
‘నో సార్.. తను అలా చేయదు. ఆమె మర్డర్ చేయబడింది’ అన్నాడు మోహన్ కుమార్ ఆవేశపడుతూ..
‘ఆర్ యూ ష్యూర్?’
‘ఎస్ సార్..!’
‘మీకు తెలిసింది చెప్పండి’
‘సార్.. కల్పన నన్ను పెళ్లి చేసుకోవడం వాళ్ల అన్న గోపీకృష్ణకు ఇష్టం లేదు. ఈ విషయమై చాలాసార్లు గొడవ పడ్డాడు’.
‘ఎందుకు ఇష్టం లేదు?’
‘ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. కల్పన ట్రాన్స్‌జెండర్. గోపీకృష్ణ తమ్ముడు కరుణాకర్ ఆపరేషన్ చేయించుకుని కల్పనగా మారాడు. కల్పనగా మారిన కరుణాకర్‌కి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. సంపాదనంతా తమ కుటుంబానికే చెందుతుందని గోపీకృష్ణ ఊహాగానం చేశాడు. అతడు ఊహించని విధంగా కల్పన నన్ను ప్రేమించింది. మేము పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవ్వడంతో షాక్ తిన్నాడు. పెళ్లి వద్దనీ, కావాలంటే లివిన్ రిలేషన్‌లో ఉండమని కోరాడు. పెళ్లయితే భర్తగా నాకు ఆస్తి హక్కులు వస్తాయని తెలుసుగా. అందుకే తీవ్రంగా వ్యతిరేకరించాడు’ అని చెప్పుకొచ్చాడు మోహన్ కుమార్.
‘అయితే మోహన్ కుమార్! మీరు గోపీకృష్ణను అనుమానిస్తున్నారా?’
‘అవును సార్! కానీ కల్పన నాగార్జున సాగర్ వెళ్లిన రోజున గోపీకృష్ణ తిరుపతి వెళ్లానంటున్నాడుగా?’
‘సార్ అదంతా అబద్ధం సార్! కల్పన, గోపీకృష్ణ, అతడి భార్య రాజేశ్వరీ అంతా కలిసి కారులో నాగార్జునసాగర్ వెళ్లారు. ఆ విషయం నాకు కల్పన ఫోన్ చేసి చెప్పింది సార్! కల్పన ఒంటరిగా నాగార్జునసాగర్ వెళ్లలేదు. ఐ యామ్ ష్యూర్ సార్! కావాలంటే నా కాల్ లిస్ట్ చెక్ చేయండి. బయలుదేరే ముందే కల్పన నాకు కాల్ చేసింది’ చెప్పాడు మోహన్ కుమార్.
అతని స్టేట్‌మెంట్‌తో కేసు చిక్కుముడి విడిపోయింది. పోలీసులు గోపీకృష్ణను, అతడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసు మర్యాదలు రుచి చూపించేసరికి చేసిన పాపం ఒప్పుకున్నారు ఇద్దరూ. నాగార్జునసాగర్ వెళ్లి తిరుగు ప్రయాణంలో సాయంకాలం సిద్దార్థ హోటల్ ముందు కారు ఆపి.. స్నాక్స్ తిన్నారు. కల్పనకు విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. ఆమె పడిపోయిన తర్వాత వాలెట్, కారు డాక్యుమెంట్స్ తీసుకుని, కల్పనని కారులోనే వదిలేసి.. నల్లగొండ నుంచి మాచర్ల వెళ్లున్న బస్సులో ఎక్కి మాచర్ల వెళ్లారు. ఆ రాత్రి పన్నెండు గంటలకు మాచర్లలో కె.పి.హెచ్.బి వెళ్లే బస్సులో హైదరాబాద్ వెళ్లారు. పోలీసులు ఐ.పి.సి 302 సెక్షన్ కింద కేసు పెట్టి గోపీకృష్ణను, రాజేశ్వరిని కోర్టులో హాజరు పరిచారు. కల్పన కేసు ఆ విధంగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment