
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఒక అత్తరు దుకాణంలో కూర్చుని ఉన్నాను. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇక్కడ ఏ భాష మాట్లాడేవారైనా దీన్ని ఓల్డ్ సిటీ అనే అంటారు. హిందీ వాళ్ళు ‘పురానీ శహర్’ అని కానీ, తెలుగు వాళ్ళు ‘పాత నగరం’ అని కానీ, తమిళం మాట్లాడేవాళ్ళు ‘పళైయ నగరమ్’ అని కానీ అనరు. ఉర్దూ మాట్లాడేవాళ్ళు, ఇంగ్లీష్ తెలియనివారూ కూడా ఓల్డ్ సిటీ అనే పిలుస్తారు. ఆంగ్ల భాషలోని ఈ రెండు పదాలు మనకు అక్కడి చార్మినార్ చుట్టుపక్కల కనిపించే గిజగిజలాడే రోడ్లు, ఇరుకు గల్లీలు, హలీమ్ చేసే ఫుట్పాత్ హోటళ్ళు, షేర్వాని కుర్తాలు వేసుకుని కళ్ళకు సుర్మా రాసుకుని మీసాలు తీసేసి ఉత్త గడ్డం పెంచుకుని తిరిగేవారు, నలుపు బుర్ఖాలు, గాజులు ముత్యాలు అమ్మే అంగళ్ళు, తోపుడు బళ్ళలో ఎత్తుగా పోసుకుని అమ్ముకునే రొట్టె బిస్కత్తులు, చాయ్ దుకాన్లు, బిర్యాని షేర్వా సువాసనలు వీటన్నిటినీ కళ్ళకు కనిపించేలా చేసేంతగా ఇతర భాషల పదాలు చేయలేవు. ఇది నిజమో భ్రమో అర్థం కాదు. కానీ కొన్ని పదాలు అంత ప్రభావితం చేస్తాయి.
బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నన్ను ప్రమోషన్ పైన హైదరాబాద్ పంపించారు. ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్న నా ఆఫీస్‌కు దగ్గరగా గగన్‌మహల్ ఏరియాలో ఒక రెండు బెడ్ రూముల ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం ఉంటున్నాను. వచ్చి నాలుగేళ్ళయినా ఇంకా ఎవరూ స్నేహితులు ఏర్పడలేదు. కొంతమంది బంధువులున్నా వారితో పెద్ద టచ్ లేదు. కాబట్టి ఆఫీసులో పనయిపోయినాక నేను ఇంట్లోనే భార్యా పిల్లలతో గడిపేవాణ్ణి.
ఇలా నీరసంగా రోజులు సాగిపోతున్న సమయంలో ఒక పత్రికలోని ప్రకటన నన్నాకర్షించింది. దాన్ని చూసి ఫోటోగ్రఫీ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 దాకా ఆబిడ్స్ లోని ఒక స్కూల్లో తరగతులు జరిగేవి. దాని కోసం పెంటెక్స్ కెమెరాను కొన్నాను. ఇలా మూడు నెలల ట్రైనింగ్ తర్వాత ఇక్కడి ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్‌లో సభ్యత్వం పొందాను. ఆదివారం తొందరగా లేచి హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైనా స్థలానికి అసోసియేషన్ స్నేహితులతో వెళ్ళి ఫోటోలు తీసుకోవడం అలవాటయ్యింది. కొన్నిసార్లు నేను ఒక్కణ్ణే వెళ్ళేవాణ్ణి. అలాగే ఈ రోజు ఒక్కణ్ణే బయలుదేరిన వాణ్ణి ఏదో కుతూహలం కొద్దీ ఓల్డ్ సిటీకి వచ్చి ఈ అత్తర్ అంగళ్ళో కూర్చుని ఈ అత్తర్ అమ్మేవాడు ఉర్దూలో అత్తర్ గురించి చెప్తూంటే వింటున్నాను.
ఇత్తర్ అనే అరబ్బీ పదమే కాలక్రమేణ అత్తర్ అయిందట. దీన్ని కొన్ని రసాయన పదార్థాలతో తయారుచేస్తారట. కానీ పూలు, వేళ్ళు, మసాలా పదార్థాలతో లేదా ఉడికించిన మట్టి, గంధపు నూనెతో తయారైన అత్తర్లే నిజమైన అత్తర్లట. వీటిని నీటిలో ఉడికించి ఆవిరిగా మార్చి వడగట్టినప్పుడు వచ్చే తైలాన్ని సుమారు ఒక సంవత్సరం నుండి పది సంవత్సరాలదాకా సేకరించి తరువాత వాడతారట. వాటి నాణ్యత బట్టి వాటి ధరలుంటాయి అని చెప్పాడు. 10 ఎమ్.ఎల్ అత్తరుకు వంద రుపాయల నుండి లక్ష రుపాయలకు పైగానే ఉంటుందట. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు సుమారు 150 కి.మీ దూరం ఉన్న కనౌజ్ అనే ఊరే ఇప్పటిక్కూడా అత్తర్ తయారీకి ప్రసిద్ధి అట. మొగలాయిలకు, నవాబులకు అత్తర్ అంటే చాలా ఇష్టమట. హైదరాబాద్ నవాబులకయితే మల్లెపూల అత్తర్ అంటే చాలా ఇష్టమట. తూర్పు దేశాలలో అత్తర్ ను అతిథులకు బహుమతిగా ఇవ్వడాన్ని గౌరవప్రదంగా భావించే పద్ధతి ఇప్పటికీ ఉంది. ఈ అత్తర్‌ను అందంగా కనిపించే కట్ గ్లాసుతో చేసిన చిన్న, పెద్ద సీసాలలో నింపి అమ్ముతారు. రంగురంగుల ద్రవాలు నింపుకున్న కట్ గ్లాసు సీసాలపైన పడే కిరణాలు అన్ని వైపులకీ చెదిరిపోయి కలల ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఈ సీసాలను ఇత్తర్‌దాన్ అని పిలుస్తారు. సూఫీ సంతులు ధ్యానం చేసేటప్పుడు, సూఫీ నృత్య సమయంలో దర్వేశిలు అత్తర్ వాడడం జరుగుతుంది. కేసరి, మొగలి, మస్క్, గులాబి, హీనా, అణ్బర్, జాస్మిన్ ఇలా ఎన్నో విధాల సువాసనల అత్తర్లున్నాయి. ఈ అత్తర్‌ను కొన్ని గుండెవ్యాధుల మందుల తయారీలో కూడా వాడతారట. ఈ సువాసనల ద్రవ్యాలను ఉపయోగించి ‘అరోమా థెరపీ’ అనే చికిత్సతో కొన్ని రోగాలను నయం చెయ్యచ్చట.
ఇలా అతడు అత్తర్ గురించిన అనేక విషయాలను చెప్పసాగాడు. ఉదయం పూట కావడంతో అంగట్లో ఇతర గిరాకీలెవరూ లేదు. అత్తరు గురించిన సంపూర్ణ సమాచారాన్ని నాకు చేరవేయాలని అతని తపన. తన దగ్గరున్న అత్తరు సీసాల నుండి అందులో వేసిన గాజు కడ్డీకి అత్తరును రాసి నా ముంజేతికి రాస్తూ, వాసన చూడమన్నాడు. ఇలా కొన్ని వాసనలన్నీ కలగలిపి అదేదో రకమైన గాఢమైన వాసన నా తలకెక్కింది. ఒక రకమైన మత్తు నా నెత్తిలో చోటు చేసుకుంది. వెళ్ళిపోదాం అనిపించింది. అతడేమో నాకు ఒక్క బాటిలైనా అమ్మాలని పట్టుదల మీద ఉన్నట్టనిపించింది. నన్ను వదిలేటట్టు లేడు అనిపించింది. మొదటి గిరాకీ కదా, బోణీ కొట్టాలి మరి. చివరికి ఆ లఖ్నవి కుర్తా పైజామా తొడుక్కుని తలకు తెల్లదారాలతో నేసిన తఖియా టోపీ పెట్టుకున్న, మీసాలను నున్నగా గొరిగేసి ఉత్త గడ్డం మాత్రం పెంచుకున్న అతడినుండి బయటపడడానికి మల్లెపూల ఘుమఘుమల చిన్న ఇత్తర్దాన్ సీసాను 350 రుపాయలకు బేరమాడి కొనుక్కున్నాను. దాంతో పాటు అతడి చిటికెన వ్రేలంత చిన్న సీసాను కానుకగా ఇస్తూ నవ్వు పులుముకున్న ముఖంతో ‘‘శుక్రియా సాబ్, ఆప్ కే మేమ్ సాబ్‌కో బహుత్ పసంద్ ఆయెగా’’ అన్నాడు. ఎంత బేరమాడినా ఎక్కువే ఇచ్చేసానేమో అనిపించింది నాకు.
అతని కొట్టు మెట్లు దిగి నాలుగయిదు అడుగులు వేసానో లేదో కాలికేదో తగిలినట్టనిపించి వంగి చూశాను. క్రింద పాల మీగడ కలర్లోని ఎ4 సైజు కవర్ ఒకటి కనిపించింది. చేతిలోకి తీసుకుని, అటూ ఇటూ చూశాను. ఎవరూ కనబడలేదు. కవర్ని ముందూ వెనకా తిప్పి చూశాను. ఎవరికి చేరాలో వారి చిరునామా కానీ, పంపే వారి చిరునామా కాని కనబడలేదు. కవర్ పై భాగంలో ఎడమ మూలలో ఒక చిన్న వృత్తంలో ధను రాశి గుర్తు కనిపించింది. ఆ చిత్రం లోని పై భాగం విల్లెక్కు పెట్టిన మనిషి ఆకారం, క్రింది భాగం గుర్రం నడుం భాగంగా ఉండింది. ఈ కవర్ ఎవరిదో ధను రాశి వారిదయి ఉండాలని అనిపించింది. కవర్‌ని ఎరుపు రంగు లక్కతో సీల్ చేశారు. దాని పైన కూడా ధనస్సు రాశి గుర్తు కనిపించింది. ముందేమో ఇది ఏ కంపెనీదైనా కవరేమో అనిపించింది. మందమైన హ్యాండ్ మేడ్ పేపర్‌తో చేసిన సుందరమైన కవర్ అది. ధనస్సు రాశి గుర్తు కూడా బంగారు రంగులో ముద్రించి ఉండి ముద్దుగా ఉండింది. ఇవన్నీ చూడగా కవర్ కంపెనీది అయి ఉండదు, ఎవరో రసిక వ్యక్తిదే అయి ఉండాలి అనిపించింది. ఆ కవర్ నుండి కూడా అత్తరు సువాసన వచ్చింది. ముందుగానే ఉండిందా లేక నా చేతి నుండి సోకిందా తెలియలేదు.
అప్పుడే కొత్తగా కొన్న కైనెటిక్ హోండా స్కూటర్ ముందు వైపు బాక్స్‌లో ఆ కవర్‌ను ఉంచి మూసేసి ఇంటి వైపు బయలుదేరాను. ఆరోజు ఫోటోలు తీయలేదు. ఇంట్లోకి రాగానే నా వైపు పరుగెత్తుకొచ్చిన నా ఐదు సంవత్సరాల బాబు నా నుండి వస్తున్న అత్తరు వాసన చూసి ముక్కు చిట్లించి ‘‘అమ్మా! నాన్న దగ్గర్నుండి అదో రకమైన వాసన వస్తోందే’’ అనగానే, లోపల్నుండి వచ్చిన నా భార్య నావైపు సంశయంగా చూస్తూ ‘‘ఎక్కడిదండీ ఈ అత్తరు వాసన’’ అని అడిగింది. నేను జరిగిన సంగతంతా చెప్పి ఆమెకు నేను తెచ్చిన అత్తర్ సీసాను ఆమెకిచ్చాను. ఆమె అట్టపెట్టెలో పత్తితో చుట్టి పెట్టిన కట్ సీసాను చూసి ‘‘బాటల్ బావుంది’’ అంది. తరువాత ‘‘అత్తరూ బావుంది’’ అంటూ వంకరగా నవ్వింది.
నా రూముకు వెళ్ళి కెమెరాను బీరువాలో పెట్టి, ఆ కవర్ని మళ్ళీ ఒకసారి వెనుకా ముందూ చూసి, తీసి చూడనా అని ఆలోచించి, మళ్ళీ ‘‘ఎందుకులే ఎవరిదో ఏమో, ఏం వ్రాసుకున్నారో ఏమో నాకెందుకు? తరువాత దీని గురించి ఆలోచిద్దాం’’ అనుకుని నా బీరువాలోనే ఉంచుతూ కాంప్లిమెంటుగా అత్తర్ సాయిబు ఇచ్చిన చిటికెన వేలు సీసాను దాంతోపాటే ఉంచాను.
ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం. భార్యా, బాబు చికెన్ బిరియాని కడుపునిండా తిని,ఆ మత్తులో నిద్ర పోతున్నారు. నేను మాంసాహారం తినను. అన్నం చారూ తిని మధ్యాహ్నం పూట నిద్ర అలవాటు లేని కారణంగా హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నాను. విసుగ్గా ఇంట్లోని బ్లాక్ అండ్ వైట్ టీవీ ఆన్ చేశాను. ఉన్న ఒక దూరదర్శన్ చానల్లో మొగలే ఆజమ్ చిత్రం వస్తోంది. ప్యార్ కియాతో డర్నా క్యా అనే పాటకు మధుబాల నృత్యం చేస్తోంది. మొత్తం సినిమాని బ్లాక్ అండ్ వైట్లో తీసి ఈ పాటను మాత్రం కలర్లో తీసినా అప్పటి టీవీలలో బ్లాక్ అండ్ వైట్లోనే వచ్చేది.
ఎన్ని సార్లు ఈ సినిమా చూడాలి అనిపించి ఆ పాట అయిపోయేదాకా చూసి తరువాత కట్టేసి, ఏదైనా పుస్తకం చదువుదామని బీరువా తీశాను. తీయగానే అత్తర్ సువాసన. ఆ చిట్టి సీసాతో పాటు ఉన్న పాల మీగడ తెల్ల కవర్ కనిపించింది. చాలా రోజులైంది దాని గురించి మరచిపోయి. దాన్ని తీసుకుని హాల్లోకి వచ్చి విప్పి చూద్దామా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాను. అందులో ఏముందో? బహుశా ఉత్తరమే ఉండొచ్చు. ఎవరిదో ఏమో?ఎవరిదో ఉత్తరాన్ని అలా చదవడం సబబేనా అనే నైతిక సంబధమైన ప్రశ్నల సందిగ్ధానికి లోనై, కొంత సేపు తన్నుకున్నాను. తరువాత ‘‘చూసేద్దాం, అందులో ఎవరికని తెలిస్తే వారికి చేర్చవచ్చు’’ అని మనసుకు ఊరట చెప్పుకుని కవర్‌ను తెరిచాను. పది పన్నెండు ఎ4 సైజు ఐవరి పేపర్లకు ఒక జెమ్ క్లిప్ వేసి కనిపించింది. ఎడమ వైపు భాగంలో బంగారు రంగులో అదే ధనస్సు రాశి బొమ్మ అన్ని పేజీల్లోనూ కనిపించింది. ఎలెక్ట్రానిక్ టైప్ రైటర్లో అందంగా పేజీకి ఒకే వైపున ఇంగ్లీషులో టైపు చేసింది కనిపించింది. మొదటి లైను మాత్రం నల్లటి ఇంకులో ఇటాలిక్ శైలిలో ముద్దుగా చేత్తో రాసిన ఇంగ్లీషు అక్షరాలు కనిపించాయి. ఆ లైనును చదివాను. Ditty My Dear.
వెంటనే అర్థమయింది ఇదేదో ప్రేమ పత్రమని. ముందుకు చదవాలా వద్దా అనే మీమాంస సతాయించింది. ఇంకా ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని అలా ఒక్కసారి ఉత్తరాన్నంతా కళ్ళతో చదివాను. చివరగా Loving Regards, Yours, M10th March 1985 అని రాసుంది. మొదటి లైన్ లాగే ఇది కూడా ఇటాలిక్ శైలిలో నల్లటి ఇంకుతో చేత్తో రాసి కనిపించింది. ఇది రాసి పదిహేను రోజులయ్యాయి. పాపం, పోగొట్టుకున్న వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో. ఉత్తరంలో వివరాలేమైనా ఉండుంటే దీన్ని ఎవరికి చేర్చాలో వారికి చేరవేయవచ్చు. ఎందుకని ఈ చిరునామా కూడా వ్రాయలేదు. బహుశా పర్సనల్ గానే ఇవ్వాలనేమో? ఖచ్చితంగా ఇది ప్రేమ పత్రమే. ఎలాంటి అనుమానమూ లేదు. చదవడం మర్యాద కాదు అని అనిపించి అలాగే కవర్ లోపల పెట్టేశాను.
మరుసటి రోజు ఆఫీసుకు రాగానే కొంచెం సేపటి తర్వాత, పక్కనే ఉన్న బషీర్‌బాగ్ నాగార్జున హోటల్ పైనున్న డెక్కన్ క్రానికల్ వార్తా పత్రిక ఆఫీసుకు వెళ్ళి ఇంగ్లీషులో ఒక చిన్న ప్రకటన రాసిచ్చి దానికయ్యే రుసుము రూ.50 ఇచ్చాను.
‘‘డిట్టి మై డియర్ అని సంబోధించబడి, 10వ తేదీ మార్చ్ 1985 రోజు వ్రాసి, ‘యం’ అని సంతకం చేసిన ఉత్తరం, దాంతో పాటు ధనస్సు రాశి చిహ్నం ముద్రించిన ఒక కవర్, ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గరి అత్తర్ షాపు ముందు నాకు దొరికింది. పోగొట్టుకున్నవారు ఈ క్రింది ఫోన్ నంబర్ పై సంప్రదించండి.’’ అంటూ నా ఆఫీస్ ఫోన్ నంబర్ ఇచ్చాను. ఆ ప్రకటన మ్యాటర్ చదివిన అక్కడి గుమాస్తా ‘‘ఎంత మంచివారు సార్ మీరు. ఈ రోజుల్లో తమ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇలాంటి పని ఎవరు చేస్తారు చెప్పండి.’’ అన్నాడు. నేను పేలవమైన ఒక నవ్వు నవ్వి వచ్చేశాను.
నేను పని చేసే ఆఫీసు చిన్నది. ముగ్గురమే మేము. నేను లేనప్పుడు ఫోన్ వస్తే వివరాలు కనుక్కుని ఉంచమని నా జూనియర్స్ ఇద్దరికీ చెప్పి పెట్టాను. వారాలు, నెలలు గడిచినా ఎవ్వరి వద్ద నుండి ఫోన్ రాలేదు. సంబంధించిన వారికి నా ప్రకటన కనిపించిందో లేదోననిపించింది. నా పుస్తకాల బీరువాలో ఒక మూల ఆ కవర్ ను పెట్టి మరచిపోయాను. కానీ, అప్పుడప్పుడు ఏదైనా పుస్తకం తీసేటప్పుడు బీరువా తలుపు తీస్తే అత్తర్ సువాసనా, ఆ తెల్ల కవర్ తొంగి చూసి నాకు జరిగింది గుర్తుకు తెచ్చేవి. కానీ, ఏదో పాపపు ప్రజ్ఞ నన్నా ఉత్తరాన్ని చదవనివ్వలేదు.
మూడు సంవత్సరాల తరువాత నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చి బెంగళూర్లోని మా హెడ్డాఫీసుకు వచ్చి అప్పుడే ఏడెనిమిది సంవత్సరాలు గడచిపోయాయి. బెంగళూరుకు వచ్చాక కొద్దిమంది సాహితీ మిత్రుల సహవాసంతో నేను కూడా వ్రాయడం మొదలుపెట్టాను. అప్పుడే ఒక ఏడెనిమిది కథలు, కొన్ని కవితలు అక్కడి వార, మాస పత్రికలలో ప్రకటించబడి నా పేరు కూడా రచయితల పట్టీలో నమోదయింది. నేను పుస్తకాల బీరువా తెరచినప్పుడల్లా అత్తరు సువాసన, ఆ కవర్ నన్ను సతాయించేవి. ఇలాగే ఒక రోజు ఏదో పుస్తకం కోసం వెతుకుతూ బీరువా తీసేసరికి మళ్ళీ ఆ కవర్ కనిపించింది. అప్పటికి ఆ కవర్ నా చేతికి వచ్చి సుమారు పన్నెండో,పదిహేనో సంవత్సరాలయ్యాయి అనిపించింది.
మెల్లిగా కవర్‌ను దాని అత్తరు సువాసనతో పాటు చేతిలోకి తీసుకున్నాను. ఎందుకో ఈ రోజు ఆ ఉత్తరాన్ని చదివేయాలి అనిపించింది. ఇన్ని రోజులు చదవకుండా ఆపుకున్న నా నైతిక విలువలు సడలిపోయాయి. నా ఫీలింగ్‌కి తర్కం కూడా తోడయ్యింది. ఇన్ని సంవత్సరాలయ్యాయి. చదివితే తప్పేముంది? ఎవరో తెలియదు. వారికైనా ఇది నా దగ్గర ఉందని ఎలా తెలుస్తుంది? వారు కూడా మరచి పోయుండొచ్చు. ఇంతా చేసి అది ప్రేమ పత్రమే కదా. అందులో ఏ రహస్యమున్నా నేనెవరికి చెప్తాను? ఎవరు నన్నడిగేది? ఈ ఉత్తరం ఎవరికి రాసుందో వాళ్ళకైనా ఎలా తెలుస్తుంది? ఇలా నా పరంగా నేను వాదించుకుని నా బుద్ధిని మనస్సుకు అప్పగించి ఉత్తరం చదవడానికి తయారయ్యాను.
నాకు ముందుగా కుతూహలాన్ని రేపింది డిట్టి అనే ఆ పేరు. డిట్టి అనేది అదెంత ముద్దొచ్చే పేరు! ఇది ఇంగ్లీష్ పదం. దీనర్థం ఒక చిన్న పాట అని. పాట కోసమే రాసిన చిట్టి కవిత. ఉత్తరం రాసింది మగవాడే అయ్యుండాలి. చాలా మట్టుకు రసికుడే అయ్యుండాలి. లేకుంటే ఇలాంటి పేరు స్ఫురించడం కష్టమే. అతడు ప్రేయసినే ఇలా ముద్దు పేరుతో పిలుస్తుండాలి. మరి ఈ ‘యం’ అంటే ఏమయ్యుండొచ్చు? అతడి పేరులోని మొదటి అక్షరమయ్యుండొచ్చు. అతడి ఇంటి పేరో ముద్దు పేరో అయ్యుండే ఛాన్సు తక్కువే.
మరి తన పేరు పూర్తిగా రాయకుండా ఉత్త M మాత్రమే ఎందుకు రాశాడు ? ఈ అక్షరంతో మొదలయ్యే పేరు ఏమయ్యుంటుంది? మోహన్, మురళి, ముకుంద్.. ఇలా ఏదో ఒక కృష్ణుడి పేరే అయ్యుండాలి. ప్రేమించేవాడి పేరు వేరే ఇంకెలా ఉంటుంది? మనం మోహన్ అనే పిలుచుకుందాం. మోహనంగా ఉంటాడేమో. ధను రాశివారు మంచి ప్రేమికులని విని ఉన్నాను. మరి ఈయన రాశి ధనస్సయితే ఆమెది ఏదయి ఉంటుంది? నా కల్పన ఏవేవో దారులు పట్టింది. ఈ రాశుల గురించి లిండా గుడ్డన్ మొదలయిన వారు రాసిన అనేక వ్యాసాల్ని చదివాను కాబట్టి కొన్ని గుర్తుకొచ్చాయి. ఈ ధను రాశికి అనురూపమైన కొన్ని రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనస్సు, కుంభం. వీటిలో ఏదుండొచ్చు? కుంభరాశి అయితే శ్రేష్ఠం. ఆ రాశివారే ధను రాశివారితో అన్నివిధాలా సర్దుకుని పోతారట. నాకు వీటిమీద నమ్మకం లేకపోయినా ఊరకే కుతూహలానికని ఇలా ఆలోచించాను.
డిట్టి. ఈ పూర్తి పేరు గురించి మనం బుర్ర చెడుపుకోవద్దు. ఒక చిట్టి కవిత/పాట అనుకుంటేనే బాగుంది. అదే కొనసాగిద్దాం. ఈమెకి సుమారు ఒక ముప్ఫై/ ముఫ్ఫై అయిదేళ్ళు ఉండొచ్చు. విడాకులు తీసుకుంది. ఏదో ఒక జాతీయ బ్యాంకులో పని చేస్తోంది. ఇటీవలే బెంగళూరు నుండి హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ మీద వచ్చి ఖైరతాబాద్ శాఖలో పని చేస్తోంది. అక్కడే దగ్గర్లో ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటోంది. వచ్చి సుమారు ఒక సంవత్సరం అయ్యింది. ఈమె విడాకులు తీసుకుందని అక్కడ ఎవరికీ తెలియదు ఒక్క ఈ ‘యం’ అని రాసుకున్న మోహన్‌కు తప్ప. అతడు ఇదే బ్యాంకులోని ఓల్డ్ సిటీలోని ఒక శాఖలో పనిచేసే హైదరాబాద్ మనిషి. బ్యాంక్ వాళ్ళ ఒక పార్టీలో ఇద్దరూ కలుసుకున్నారు. తరువాత పరిచయం పెరిగింది.
మోహన్‌కు సుమారు 40 సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. పెళ్ళైంది. ఒక అబ్బాయి. మన డిట్టికి తెలుగు రాదు, మోహన్‌కు కన్నడం రాదు. ఇద్దరూ ఇంగ్లీషులోనో, హిందీ లోనో మాట్లాడుకునేవారు. డిట్టిది చామన చాయ, నూనె రాసినట్టు మెరిసే చర్మం, నల్లగా ఒత్తుగా భుజాల దాకా పరచుకున్న కురులు, మెరిసే వజ్రాల్లా ఉన్నా ఎప్పుడూ ఉదాసీనంగా కనిపించే కళ్ళు, నుదుట బొట్టు, చెవుల్లో కమ్మలు, ముక్కుకు ఎడమ వైపు మెరిసే ముక్కుపుడక. ఎప్పుడూ ఆమె కట్టే గంజిపెట్టి ఇస్త్రీ చేసిన గరగరలాడే మగ్గం చీర, సన్నగా పొడుగ్గా ఉన్న ఆమె అందానికి మెరుగులు దిద్దేది. ఆమెను ఒక సారి చూసిన ఏ మగవాడైనా తిరిగి చూడకుండా వెళ్ళిపోవడమన్నది అసాధ్యం. అటువంటి కిల్లర్ బ్యూటీ ఆమె!
ఆడ మగ స్నేహం ఎప్పుడు ఎలా ఆకర్షణకు లోనై మోహంగానో, ప్రేమగానో మారుతుందో చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు. వీళ్ళ స్నేహం కూడా అంతే. పార్టీలో కలిసిన తరువాత అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నారు. తరువాత శనివారాలు బ్యాంకు సగం రోజు కాబట్టి పని ముగించేసి, ఎక్కువ రద్దీ లేని రిట్జ్ హోటల్లో మధ్యాహ్నం భోజనం కానిచ్చి, చాలా సేపు కబుర్లతో కాలం గడిపి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళేముందు ఒక కప్ కాఫీ త్రాగడం అలవాటయింది. ఆ రిట్జ్ హోటల్ బహుశా బ్రిటిష్ వాళ్ళ కాలం నాటిదై ఉంటుంది. ట్యాంక్ బండ్ పక్కనున్న ఆనంద్ నగర్లో ఒక్క చిన్న మిట్ట పైన ఉన్న కాస్త పెద్ద హోటల్. బయటినుండి పాత కోట లాగా కనిపిస్తుంది.
కాని లోపల మంచి వాతావరణం. ఎత్తైన కిటికీలు, వాటికి రంగురంగుల పరదాలు, ఎత్తైన పైకప్పునుండి వేలాడుతున్న ష్యాండలియర్లు, గోడకు అలంకరించిన కత్తి డాలు ఈటె మొదలైనవి, కొన్ని అందమైన తైలవర్ణ చిత్రాలు, శుభ్రమైన తెల్లటి గుడ్డ పరచిన గుండ్రటి టేబుల్స్, వాటి చుట్టూ కుషన్లు వేసిన నాలుగు చెక్క కుర్చీలు, టేబుల్ పైన ఒకే ఒక గులాబి పువ్వున్న ఫ్లవర్ వేజ్, తెల్ల వస్త్రాలతో అటూ ఇటూ తిరిగే వెయిటర్లు, మొగలాయి శైలిలో తయారైన శుచీ రుచీగల వంటకాలు ఇవన్నీ ఆ హోటల్ లోపలికి అడుగు పెట్టిన వారిని ఏదో లోకాలకు తీసుకెళ్ళేవి. వీరిద్దరూ ప్రతి వారం అక్కడికొచ్చి భోజనం చేయడం వలన అక్కడి వెయిటర్లకు బాగానే పరిచయమయ్యారు. వీరికిష్టమైన పదార్థాలేవి అనేది వారందరికీ తెలుసు.
వీరు వచ్చి కూర్చోగానే ఆర్డర్ చేయకముందే తెచ్చిపెట్టే పానీయం స్వీట్ అండ్ సాల్ట్ లెమన్ సోడా. తరువాత ఇద్దరికీ ఇష్టమైన రోటీ, ఆలూ పాలక్, గోబీ మసాలా, జీరా రైస్, దాల్ తడ్కా వచ్చేవి. చివరిగా ఆ రోజు డెసర్ట్–కెరామెల్ కస్టర్డ్, కుబానీ కా మీఠా, షాహీ తుక్డా ఏదైనా ఒకటి వచ్చేది. ఇద్దరికీ షాహీ తుక్డా అంటే చాలా ఇష్టం. ఆవు నేతిలో వేయించిన గరగరలాడే త్రికోణాకారపు బ్రెడ్డు ముక్కలను తేనె కలిపిన చక్కెర పాకంలో కొంత సేపు నాన్చి తీసి, యాలకుల పొడి చిలకరించి, పింగాణి ప్లేటులో రెండు ముక్కలను అమర్చి వాటి పైన రబ్డీ పోసి, బాదాం తురుము, జీడిపప్పు, కేసరి చిలకరించి వేడి వేడిగా తెచ్చి పెట్టగానే అక్కడ కూర్చున్న వారిద్దరి నోళ్ళలో నీరూరిపోయేది. వాటిని ముక్కలు చేసి నోట్లో వేసుకుని అది కరగి పోయేటప్పుడు వీరిద్దరి మొహాల్ని చూడాలి.
అప్పుడే ముద్దు పెట్టుకుని తడిబారిన పెదవులతో కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎలా ఉంటుందో అంత తాదాత్మ్యత. అప్పుడప్పుడు కొద్దిగా రబ్డీ డిట్టి పెదాల అంచులకు అంటుకోవడం, ఎవరూ చూడకుండా దాన్ని మోహన్ తన చిటికెన వ్రేలితో తీసి నోట్లో వేసుకుంటే ఆమె చామన చాయ మొహానున్న కుంకుమకు మరికొంచెం ఎరుపు రంగు కలిసేది. ఆమె ‘‘థత్.... యే క్యా షరారత్ హై’’ అంటూ ముద్దుగా కసిరితే, అతడి కళ్ళల్లోమరింత మత్తు కనిపించేది.
వారిద్దరూ ఇలా కలవడం కొనసాగుతూ ఉంది. అప్పుడప్పుడు ఇతడు ఆమెను తీసుకుని గోల్కొండ ఖిల్లా, గండిపేట్ చెరువుకు వెళ్ళేవాడు. అతడి వెనుక స్కూటర్ పైన కూర్చుని వెళ్ళడం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఊరు దాటగానే అతడి నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని అతడి భుజంపైన తల ఆనించి తనను తాను మరచిపోవడం ఆమెకెంతో సంతోషాన్నిచ్చే సంగతి. అలా వెళ్ళేటప్పుడు ఆమె కురులు అతడి చెక్కిలిని తాకితే నెమలి ఈక తనను తాకినట్టనిపించేది అతడికి. ఒకసారి అతడు ఆమెకు మల్లెపూల సువాసన కల అత్తర్ ను తెచ్చిచ్చాడు.
‘‘అబ్బా! దీని సుగంధం అచ్చం మా ఊరి మల్లెపూల సుగంధంలా ఉంది’’ అనింది. అలా స్కూటర్ పైన వెళ్ళేటప్పుడు ఆ అత్తర్ సువాసన గాలిలో తేలుతూ అతడి ముక్కుకు సోకేది. అప్పుడు అతడు దానిని దీర్ఘంగా పీల్చేవాడు. ఆమె అతడి నడుముని ఇంకా గట్టిగా పట్టుకునేది.
ఆ రోజు ఉగాది. అతడిని తన ఇంటికి భోజనానికి పిలిచింది. చిన్నగా తరిగిన క్యారెట్, బీన్స్, బటాణీలు వేసి అరిటాకులో వడ్డించిన బిసి బేళె భాత్ పైన వేడి నెయ్యి వేసుకుని, వేయించిన వేరుశెనగలతో చేసిన ఆవడలను ఉల్లిపాయల మరియు దోసకాయల రైతతో తింటుంటే వాటి రుచికి మైమరచి పోయాడతడు. ఇది మా వైపు చేసే స్పెషల్ భోజనం అంటూ ఆమె కొసరి కొసరి వడ్డించి తినిపించి, చివరిగా గసాల పాయసం తెచ్చినప్పుడు అతడికి మగతగా అనిపించింది.
వారిద్దరూ పరస్పరం ఇచ్చుకున్న గిఫ్ట్‌ల గురించి అందులో రాశాడతడు. ప్రత్యేకంగా అతడు ఆమెకు కుంభ రాశి చిహ్నపు డాలర్‌తో పాటు ఇచ్చిన బంగారు గొలుసు. ఆమె అతడికి ఇచ్చిన చేతి గడియారం. అతడు ఆమెకు తెచ్చిన ఆమెకిష్టమైన మగ్గం చీరలు....ఆమె ఇచ్చిన టీషర్టులు ఇలా.
మరుసటి రోజు ఆదివారం. ‘‘ఉండిపొండి’’ అందామె. ఎలాగూ పెళ్ళాం పిల్లలు ఇంట్లో లేరు. పండుగకని ఎవరో బంధువుల ఇంటికి వెళ్ళారు. రావడం రేపు మధ్యాహ్నమే అనుకుని ‘‘ ఓకే’’ అన్నాడతడు.
ప్రేమించుకునేవారు రాత్రి అలా ఆగిపోతే మామూలుగా ఏం జరుగుతుందో చెప్పనవసరం లేదు. ఆమె రాత్రికి ఉండి పొమ్మన్నదీ, అతడు ఒప్పుకున్నదీ దానికే మరి! అక్కడ జరిగింది కూడా అదే! ఆమె చామన చాయలో ఈ మురళీ మోహన ముకుందుడు కరగిపోయాడు. ఆ ముకుందుడి మోహన మురళికి ఆమె కూడా కరగిపోయింది.
ఇలా అనేక విషయాలను రాస్తూ తన గురించి కూడా అందులో రాశాడు. ఇంతకు ముందు కూడా అనేక ఉత్తరాలను ఆమెకు రాశాడు అని కూడా అర్థమయ్యింది. మంచి ఇంగ్లీషు భాషలో ఉన్న ఉత్తరం అది. ఆ భాషకి నేనే చిత్తయిపోయాను. ఇక డిట్టీకి ఎలా ఉంటుంది? ప్రేమికుడంటే ఇలా ఉండాలి అనిపించింది. ఆమెకు మళ్ళీ బెంగళూరుకు ట్రాన్స్‌ఫర్ అయిన సంగతి తెలిసి తన మనస్సులోని బాధను ఆ ఉత్తరంలో రాసుకున్నాడు. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి జాగ్రత్తలు తీసుకోమన్నాడు. అబార్షన్ చేసుకోమని అతడు అన్న మాటకు ఆమె కోపగించుకుని నిరాకరించడం గురించి రాస్తూ ముందు ముందు ఎదురించాల్సిన సమస్యల గురించి ఆమెకు వివరించాడు. ఆమె వాటిని ఖాతరు చేసినట్టు కనిపించలేదు.
ఆ ఉత్తరంలోని విషయాలతోపాటు నేను ఊహించిన కొన్ని పరిస్థితులని కల్పించి ఒక కథ రాసి పంపించాను. క్రితం వారం ఒక మాసపత్రికలో అది ప్రచురించబడింది. దానితర్వాతి కొన్ని రోజులకు నాకు పత్రిక ఆఫీస్ నుండి ఒక ఫోన్ వచ్చింది. నా అభిమాని ఒకరు అత్తర్ కథను చదివి నన్ను కలుసుకోవాలని అనుకుంటున్నట్టు, నా ఫోన్ నంబర్, ఇంటి చిరునామా కావాలని ఫోన్ చేశారని అన్నారు. నేను ఇవ్వండి అన్నాను. ఇలా అభిమానులు ఫోన్లో మాట్లాడడం, ఇంటికొచ్చి కలవడం అప్పుడప్పుడు జరిగేది.
ఆ రోజు కూడా ఆదివారం. వాకింగ్ తరువాత ఇంటికొచ్చి, ఆ రోజు పేపర్ తిరగేస్తూ కాఫీ తాగుతున్నాను. అప్పుడు ఒక ఫోన్. పేరు చెప్పి ‘‘మీ అభిమానిని. మీ కథలు, కవితలు చదివాను. నాకు మీ రచనలంటే ఇష్టం.’’ అన్నాక కొంచెం ఆగి ‘‘మిమ్మల్ని కలవాలి.’’ అన్నది. నేను ‘‘ఈ రోజు ఆదివారం. ఇంట్లోనే ఉంటాను. రండి’’ అన్నాను. ఆ రోజు సుమారు పదకొండు గంటలకు ఆమె వచ్చింది. సుమారు యాభై సంవత్సరాలుండవచ్చు. వచ్చినావిడను ఎప్పుడూ చూడకపోయినా ఎందుకో తెలిసిన మనిషే అనిపించింది. బూడిద రంగు, నల్ల బార్డర్, జరీ బూటాలున్న నలుపు పల్లూ, మగ్గం చీరను గంజి పెట్టి ఇస్త్రీ చేయించి పొందికగా కట్టుకుంది. ఆ యాభై ఏళ్ళ వయస్సులోనూ ఆకర్షణీయంగా కనిపించింది.
నా కథ గురించి, ఇతర రచయితల గురించి, సాహిత్యం గురించి ఏమేమో మాట్లాడసాగింది. నా భార్య కాఫీ తెచ్చిచ్చింది. ఆమె కాఫీ తాగుతున్నప్పుడు నేను లేచి, లోపలికి వెళ్ళి హ్యాండ్ మేడ్ తెల్లని ఎ4 సైజు, బంగారు రంగులో ముద్రితమైన ధను రాశి చిహ్నంతో మెరుస్తున్న ఆ కవర్ తీసుకొచ్చి ఆమెకిచ్చాను. మౌనంగా చేతిలోకి తీసుకుని, ముక్కు దగ్గరికి తీసుకెళ్ళి, దాన్నుండి వస్తున్న మల్లెపూల అత్తర్ సువాసనను పీల్చి, మెరిసే కళ్ళతో చేతులు జోడిస్తూ ‘‘థ్యాంక్సండీ! ఇంట్లో అబ్బాయి వెయిట్ చేస్తుంటాడు. తొందరగా వెళ్ళాలి ‘‘ అని అన్నది. అలా ఆ చిట్టి కవిత అ కవర్ ను తన గుండెలకదుముకుని వెళ్ళిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment