
నోట్ల నీల్లసుక్కముడ్తలేదు సారు. మీరు పెద్దోళ్లు, మిమ్ముల నమ్ముకొని ఈడ బతుకీడుస్తున్నం. అద్దమ్మరేతిరైనా కంటికి కునుకు రానియకుండ కుక్కలెక్క ఈ అపార్టుమెంటు కాపల ఉంటున్న.
గాలితో జత కట్టి రైయిమంటూ వేగంగా దూసుకొచ్చిన స్విప్ట్‌డిజైర్‌కారు అపార్టుమెంటు గేటు ముందు ఆగింది. కారు చప్పుడికి గేటు తెరవాల్సిన వాచ్‌మెన్ అక్కడ లేకపోవడంతో కారు హరన్ మోగిస్తుండు. డ్రైవర్ స్థానంలో కూర్చున్న ఓనర్ ఒక్కింత అసహనానికి లోనై ‘‘వాచ్‌మెన్... వాచ్‌మెన్... ఏయ్ వాచ్‌మెన్...’’ అంటూ కారు దిగి గట్టిగా కేక వేసిండు. అపార్ట్‌మెంట్‌లో ఉదయం వాటర్ సప్లయి రిపేర్ కావడంతో దాన్ని విప్పే పనిలో మునిగి కారు వొచ్చిన విషయం మర్సిండు వెంకులు. కారు ఓనర్ దొరబాబు గట్టిగా అరవడంతో ఆ కేకకు గేటు తెరువనీకి ఆందోళన పడుతూనే ఆఘమేఘాలపై గేటువైపు పరుగులు తీసి గేటు బార్లా తెరిచిండు వాచమెన్ ఎంకులు.
‘‘ఏంరా ఎంకులు నిద్రపోతున్నావ్‌రా, కారు హారన్ ఇనపడ్తలేదా, పిలిస్తేగాని ఒస్తలేవ్ బల్చిపోయినవురా? తేరగా తిని కాపల గాయంటె వాచమెన్ డ్యూటీ మర్సినవ్, పనిల నుంచి పీకిపడేస్తే తెలుస్తదిరా...’’ అంటూ పండ్లు పటపట కొరుకుతూ ఎంకులుపై చిందులు తొక్కుతూ కారు లోపటికి పోనిచ్చిండు దొరబాబు ఎంకులు సమాధానం వినకుండానే. ఎంకులు విషయం చెబుదామని కారు ఎనకాల నంగాడుతూ చేతులు కట్టుకొని అతని వైపు బేలగా చూడసాగిండు.
అతను కారు దిగి ‘‘డ్యూటీ మర్చి ఏంజేస్తున్నావ్ బద్మాష్, జీతమెక్కువైందారా! నాల్గు రోజులు కడ్పుకాల్తే తెలుస్తుంది’’ అని దొరబాబు కటువుగా అనగానే ‘‘అదికాదు సార్ నేను నా డ్యూటి ఎన్నడు మరువలే. నేనేమిటో మీకు తెలువదా? ఇప్పుడు కూడ బోర్ వాటర్ సప్లై అయితలేదని పైన అంతస్తుల రమేష్ సారు పిలిస్తే ఎల్లి చూస్తున్న, ఇంతల్నే మీరొస్తిరి. కావాలంటే వారిని అడుగుండ్రి సారు’’ అని ఎంకులు దీనంగా అనగానే ‘‘పిల్లికి ఎలక సాక్ష్యమారా..సాకులు చెప్పొద్దు, డ్యూటీ సక్కరంగు జేయ్, నువ్ పైకి పోతే నీ పెండ్లాం ఏంజేస్తుందిరా? నీ పని అది చేయకూడదా గేటు తెర్వనికే బరువా, ఏంబరువెత్తుకుంటుండ్రు? అపార్టుమెంటుల అందరు పైసలు ఇయ్యకున్న నెలనెల మొదటి వారంలనే నేను నా జేబుల కెల్లి నీకు కర్సులున్నయని జీతం ఇస్తున్న.
నీకు బల్పు ఎక్కువైందిరా’’ అంటూ తన గదిలోనికి దొరబాబు నడుస్తుంటే ‘‘అయ్యా మీరు ఊరెల్లిన సంది నా పెండ్లానికి జరమొచ్చింది. అదేదో డెంగు జరమట. ఎన్ని మందులు వాడినా తక్కువకాలే. అది దుప్పటి ముసుగేసినసంది బైటికెల్తలేదు. నోట్ల నీల్లసుక్కముడ్తలేదు సారు. మీరు పెద్దోళ్లు, మిమ్ముల నమ్ముకొని ఈడ బతుకీడుస్తున్నం. అద్దమ్మరేతిరైనా కంటికి కునుకు రానియకుండ కుక్కలెక్క ఈ అపార్టుమెంటు కాపల ఉంటున్న. ఇండ్ల కాపురముండే కుటుంబాలకు చాకిరి చేస్తున్నం. గాళ్లు ఏది తెమ్మంటే అది పట్కొస్తున్నం. మాట రానియకుండ పనిచేస్తున్నాం సారు. మయ్యగాని కోపంపడకండ్రి’’ అంటూ ప్రాధేయపడసాగిండు ఎంకులు.
‘‘ఏంరో మాటలు బాగా నేర్సినవ్. పట్నం నీళ్లు తాగితే పైకి సుకమొస్తదట నీకు అట్టనేవుంది. గోచి పెట్టుకొని అడ్డమీద పనికి పోతే తెల్సుద్ది. కావాలిగాసుడు కష్టమేనారా? నీ ఒళ్లు అల్సినాద్రా?’’ అనుకుంటు దొరబాబు గదిలోకి వెళ్లి డోర్ వేసుకుండు. అతనే ఆ అపార్టుమెంటుకు ఓనర్. అతని కనుసన్నల్లోనే అందరూ నడచుకోవాలి. అందుకే అతను రుబాబుగ మాట్లాడిండు. అప్పటికి ఎంకులుకు ఏమి పాలుపోలె చిన్నగా గేటు దగ్గరకు నడిసిండు. అతని మదిని కారు చీకట్లు కమ్ముకున్నట్లు అయింది. తన గతంలోకి మతి మల్లింది. ఊరి కామందు దగ్గర ఎంకులు తండ్రి పాలేరుగ జీతం ఉండు. అతని తల్లి అక్కడే కూలీ, నాలి, కాయ కష్టంజేస్తూ ఉండేవారు.
పనిలో వారు ఎప్పుడు ఎవరితో ఏలుపెట్టిచూపించుకోలే. అతని పని తీరు మెచ్చి కామందు కొడ్కు దొరబాబు బస్తిల రియలెస్టేటు వ్యాపారం చేస్తుంటే ఎంకులు తల్లి కాలంజేసిన తరువాత తండ్రికొడుకులను పట్నం పంపిండ్రు. అప్పడి సంది అక్కడే వాచమెన్‌గా పనిచేస్తావుండు ఎంకులు తండ్రి రాములు. పైకి వాచమెన్‌లా ఉషారుగున్న అతని తెరవెనుక జీవితం మరోలావుంది. అక్కడివారు ఎప్పుడు ఏపనిచెప్పినా ఉర్కులాడి చేయాల్సిందే. కాసింత ఆలస్యం అయిందంటే రుసరుసలు చీదరింపులు, చిత్కారాలు అనుమానపు చూపులు సూటి పోటి మాటలు. అన్నింటిని సహిస్తూ రాములు కొడుకుతో బతుకు బండి నెట్టుకొస్తుండు.
అమ్మకాలంజేస్తే నాయనతో పాటు తను పట్నం వచ్చిండు ఎంకులు. అక్కడే ఆ బంగ్లాలో తన భార్య సారమ్మ తల్లి జోగువ్వ ఇంటి పన్జేస్తుండేది. సారమ్మకు అప్పుడు ఐదేండ్లు వుంటయి. అతని జీవితం ఆ పాత బంగ్లాలోనే మోగిచ్చి మొగ్గుతొడిగింది. తండ్రి అదే ఇంటికి వాచ్‌మెన్‌గా ఉండి సేవ చేస్తుంటే తను అయ్యకు ఆసరాగా కనిపెట్టుకుని ఉండు. సదువుకొమ్మని బడికి తోలినా సదువబ్బక పనిపాటల్లోనే ఎంకులు మునిగిండు. తండ్రి చేసే పనులన్నీ ఆ ఇంటికి తను చేయడం మొదల్బెటిండు. ఆ బంగ్లాలో కింద రెండు కుటుంబాలు, పై అంతస్తులో నాలుగు కుటుంబాలు.
ఆ పై అంతస్తులో మరో నాలుగు కుటుంబాలు కాపురముండేవి. ఆ బంగ్లాకు యజమాని దొరబాబు తండ్రి రామచందర్‌రావ్. అతని మరణం తర్వాత అతని కుమారుడు బరువు బాధ్యతలు తీసుకొని ఆ బంగ్లాలో అద్దెకున్నవారందరిని శాసించడం మొదల్బెట్టిండు. కొన్నిరోజులకు జోగువ్వ కాలంజేసింది. ఆమె కూతురు సారమ్మకు ఎంకులుకు సోపతి కుదిరింది. ఇద్దరి కులాలు వేరైనా ఒకే తావున పనిచేయడం వలన వారి మనసులు కలిశాయి. వారి మాటలు కలిశాయి. ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేకుండా అయ్యారు. సారమ్మంటే ఎంకులుకు పాణం. ఎంకులంటే సారమ్మకు అంతే. తనకేమిష్టమో తను కష్టపడి మరీ మిగిలిన డబ్బులతో ఎంకులుకు బట్టలు కొనడం నాటికోడి కూర చేపలపులుసు చేసిపెడితే మనసారా తినేవాడు. అతనూ అంతే. ఆమె మనసెరిగిన వాడు. ఆమెకు ఏరికోరి నచ్చిన వన్నెలో లంగావోణి తెచ్చేవాడు. రోజూ పూలు తెంపుకొచ్చేవాడు. వారిద్దరినీ దూరంగా గమనిస్తున్న ఆ బంగ్లా దొరసానమ్మ వారికి ఓ శుభదినాన పెనిమిటిని ఒప్పించి లగ్గం జేసింది.
అలా దంపతులైన సారమ్మ –ఎంకులు ఇద్దరు పిల్లలు కలిగి మురిపంగ ఆ బంగ్లాలోనే కావలి కాసుకుంట తమ జీవితాలను బంగ్లాకి దారబోస్తూ బతుకీడుస్తుండు. కాలం మబ్బులెక్క కదిలిపోతుంది. రోజు రోజుకు వయసు పెరుగుతుంది. వయసుతోపాటు రోగం రొప్పులు పెరిగాయి. చాలీచాలని జీతంతో కష్టాలు మొదలయ్యాయి. ఖర్చులు పెరగసాగాయి. మూడంతస్తుల బంగ్లా కాలంతోపాటు కొత్త రూపు మార్చుకుంది. కాని వారి జీవితాలు అలాగే ఉన్నాయి. ఎప్పుడో అయ్యగారికి బుద్ధి పుట్టినప్పుడు ఏడాదికింత జీతం పెంచితే తప్ప సాలిసాలని బతుకెల్లదీస్తుండు. కానున్నది కాకమానదు ఎట్లయ్యేదుంటే అట్ల జరుగుతది అనుకుంట కడుపునొచ్చినా కాల్నొచ్చినా బాధల్ని దిగుమింగుకుంటూ బతకడం నేర్సిండ్రు.
ఎంకులు తన ఇద్దరు పిల్లల్ని బడికి తోల్కపోయిండు. ఎవరో పిలిచినట్టు సప్పుడైంది. తేరుకున్న ఎంకులు ఎనకకు మళ్ళిచూస్తే తన భార్య ‘‘ఇటురా’’ అంటూ సైగుచేసింది చేతులూపుతూ ఎంకులు తన గదిౖ వెపు నడిచిండు. ‘‘ఏందే పిల్సినవ్’’ అన్నడు. ‘‘పిల్లలకు పీజులు కట్టమని సారు చీటిరాసి పంపిండు. పీజులు కడ్తెనే పరీక్షలు రాయనిస్తరట, లేకుంటే రాయనియరట’’ అని అన్నది భార్య సారమ్మ. ఆమెకు తెల్సు తమది లేమిడి బతుకులని. కాని అప్పుసప్పు జేసి బతుకు ఎల్లదీయలే. అందుకే పెనిమిటిని ఏనాడు గొంతెమ్మ కోర్కెలు కోరలే. ఉన్నంతల సర్దుకుంటు సంసారం గుట్టుగా సాగుదీస్తుంది. ఎంత సాకీరు జేసిన పొట్టకి బట్టకి సాల్తలేదు. లెక్కలు జూస్తే దొరబాబుకే అప్పు తేలితట్టుంది. చిన్నమ్మగారు వారిపట్ల కాసింత జాలి చూపడంవల్ల వారి బతుకులు తెల్లారుకుంటూ వస్తున్నయ్. ఎప్పుడు ఆపతి వచ్చినా అమ్మగార్ని సాటుంగు అడగడం, ఆమె లేదనకుండా ఇయడం జరుగుతుంది.
ఆమె వల్లనే వారి అవసరాలు తీరుతున్నయి. సారమ్మ కాసింత భయము బెరుకుతో అడిగితే ఏమనుకుంటుందో అని మతిల గునుక్కుంటు అమ్మగారి దగ్గరి కెళ్ళింది. చిన్నగా గునుపు తీస్తూ ‘‘అమ్మగారు’’ అని పిల్చింది. ‘‘ఏందే సార ఏందిట్లా వచ్చినావు పనంతా అయిందా’’ అని అడిగింది చిన్నమ్మగారు.‘‘అ అయిందమ్మగారు’’ అంటూ తలవూపింది సారమ్మ.‘‘ఏందో సనుగుతున్నవ్ చెప్పే’’ అన్నది చిన్నమ్మ. ‘‘అది అది’’ అంటూ నీళ్లుమింగింది సారమ్మ. ‘‘ఏందో నీ నస చెప్పే అమ్మా’’
‘‘అమ్మగారు... నా చిన్నతనం నుంచి మీరే మమ్ముల సాదుతుంటివి. దయగుల తల్లివి. ఆపతి సాపతికి ఆసరయితుంటివి. మీ పున్యాన పెద్దపిల్ల కాలేజీకి, పోరడు పదిలకొచ్చిండు. నా బతుకు మీరు సూడందా? పై అంతస్తులో ఉన్నవారు మా ఆయన్ని మొటోడని గేలిచేసిన పట్టించుకోలే. అయ్యగారెన్ని సార్లు చెడామెడా తిట్టినా నువ్వు వున్నవన్న ఆశతోనే ఈడ ఉంటిమి. మేము వట్టిగున్నప్పుడు ఏమన్న పడ్తమ్ ఎంతన్న పడ్తమ్. పిల్లల ముందల సూటిపోటి మాటలు అనోద్దని చెప్పండి. ఇప్పడికే పిల్లలు మా మీద కసురుకుంటుర్రు జరజెప్పండమ్మ’’ అన్నది సారమ్మ.
‘‘అదిగాదే సారీ ఈసారి నిన్నుగాని ఎంకన్నిగాని మర్యాదగ పిల్సుకొని పనిచేపించుకొమ్మను. ఎవరైనా ఎచ్చిడి చేశినట్టు మాట్లాడినా కారుకూతలు కూసినా ఆళ్ల మాటకు ఎదురు సవాలియ్యాలి. నువ్ బాంచదానివా? కాదు కదా! ఈసారంటే నేన్జూసుకుంట. ముందటేడ్లు సాలు సక్కగపోతనే ఎనక ఎడ్లు సాలు సక్కగొస్తది. మంచిగ మాట్లాడ్తనే పన్జేయ్ వాలింట్ల. లేదంటే పని బందుపెట్టు. దెబ్బకు దెయ్యం వదిలి కాళ్ళ బేరానికొస్తరు’’ అన్నది చిన్నమ్మ.ఆమె మాటలు సారమ్మకు కొండత ధైర్యాన్నిచ్చినయ్.
‘‘సరెనమ్మా ఇప్పటిసంది అట్లనే ఉంట’’ అంటూ తన గది వైపు కదలబోయింది సారమ్మ.‘‘ఆగె సారమ్మ కూసోవే కాసెపు’’ అన్నది ఆమె ‘‘ అమ్మగారు దిగుులుగుండ్రు ఎంది’’ అంటూ అడిగింది సారమ్మ ‘‘చెబుత వినవే ఆ ముచ్చట’’ అంటు చెప్పడం మొదలుపెట్టింది చిన్నమ్మ.‘‘పెళ్ళయిన కొత్తలో మేము అన్యోన్యంగ ఉంటిమి. మూడేండ్లు మా కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగ సాగింది. ఇప్పుడు అట్ల లేదు. ఆయనకు కొత్తపరిచయాలు పెరిగాయ్. బద్మాష్ పద్మికి ఆయనకు పరిచయం అయింది. అది ఏం మందుమాకు నూరిపోసిందో దాన్ని మర్గిండు ఆయన. అప్పడి సంది వాళ్లది ఆడిందే ఆట పాడిందే పాట.
నేనెన్ని సార్లు మొత్తుకున్నా నా మాట వింటేనా, ఈ జన్మకు తలరాత ఇంతే అనుకుని నా బాదెవరికీ చెప్పుకోలేక నా కూతురు కోసం బతుకుతున్న. నేనిట్లా బతుకుతున్న ఆయనపోరు అంతఇంతగాదు. పెండ్లయిన కొత్తలో సుక్కవన్నడు కలలరాణివన్నాడు, ఇప్పుడు నేను ఆకరోస్తున్ననట, నేను దొడ్డుగ లావయితున్ననట. కొవెక్కి రుబ్బురోలోలె ఉన్ననట. నల్గుట్ల ఇజ్జతి పోవద్దని గుట్టు సంసారం చేస్తున్న. పేరుకు నేను పెండ్లం, గని ఉంచుకున్నదాందే పెత్తనమంత అయింది’’ అని కండ్లనీరు తుడ్చుకుంటూ చెప్పసాగింది.‘‘అమ్మగారు సహజీవనం అంటే ఏందమ్మ?’’ అడిగింది సారమ్మ. ‘‘అంటే పుస్తెకట్టకుండ కాపురం చేయడం’’ అన్నది ఆమె.
‘‘అమ్మ మా ఇండ్లల్లనే ఇట్ల ఉంటరనుకున్నగని లేకిశేతలు లేకి మనుషులు మీ దాంట్ల ఉండ్రు. పైన పటారం లోన లొటారం. బైట్కి పెద్దిర్కిం. లోన జలదంత్రం’’ అన్నది సారమ్మ.
‘‘మీరే నయం. కూడుకు లేకున్న కూడి ఉంటరు. మా ఇండ్లల్ల ఆడోళ్లకు అన్ని తిప్పలే. మొగోడు ఏదైనా చేయవచ్చు. అయినా మీదే నయం. రోలుపోయి మద్దెలకు చెప్పుకున్నట్టుందే మీవరస. నేనేవరకి చెప్పుకోను’’ అంటూ దీనంగా పలికింది చిన్నమ్మ. ‘‘అట్టంటవేంది చిన్నమ్మగారు... ఎవలమైనా మన్సులమే. ఎవరికైనా బాధ, నొప్పి ఒకటే. కాకుంటె మేం లోడలొడ బైట వాగుతం. మీరు గుట్టుగుంటరు. గంతేనమ్మ తేడ. పై అంతస్తుల ఉండేటోళ్లు రాచిరంప్పాన పెడ్తరు. ఎంత మంచిగ జేసిన పనికి వంకలు బెడ్తరు. చెప్పినపని నాల్గుసార్లు చేపిస్తరు. తెల్లగ బట్టలుత్కినా ఏదోటి అనంది ఊకోరు.
దమ్మిడు జరనీయరు. ఏం మనుసులో. ఇగ గాళ్ళ దాంట్ల చివరకున్న సారు, అతని భార్య మంచోళ్లెగని గాళ్ళకు సుట్టబక్కాల తాకిడేక్కువ. వాళ్ళది వాళ్ళకే సాలదంటే వారానికో సుట్టం ఊడిపడతరు. వాళ్ళు మంచినీళ్లలెక్క కర్చుజేత్తరు. మనదాక వొస్తాది అమ్మగారు. మా కష్టమైనా సుకమైనా ఆర్సె దానివి నువ్వేనమ్మ. నువ్వుసల్లగుండాలి. అయ్యగారికి తెలుసొస్తది తీయ్యి. తట్టుబాద తనదాక వొస్తె మారని మనిషి ఉంటడా’’ అన్నది సారమ్మ. అంతలోనే సరాయించుకుంట దొరబాబు అక్కడికి వస్తూనే...‘‘ఏంటి గుసగుసలు. పని ఇడ్సి ఇక్కడేంజేస్తున్నవే సారా? నీకు సుస్తి అయిందట, నా పేరు చెప్పి డాక్టరుకు చూపించుకో’’ అన్నాడు.‘‘ కింద అంతా చెత్త లేకుండ ఊడ్చినవా? చెట్లకు నీళ్ళు పెట్టిండ్రా? వాడేడి?’’ అని అడిగిండు దొరబాబు.
‘‘అయ్యా ఆయన పిల్లల బడికి తోలిరానుపోయిండు. చెట్టకు నీళ్లు బెట్టిండు. నేను వరండ అంత ఊకిన అంట్లు, బాసండ్లు తోమినా, బట్టలు వుతికిన. జర్రుంటే పై పోర్షన్‌కి ఎల్లి వాళ్లపనిజేయలేగా. సారు డూటికి పోయినంక ఆ అమ్మగార్లు కాలిగ ఉంటరు. అప్పుడు ఆళ్ళముంగులనే పని చేస్తా. మా ఆయన అటుపోంగనే అమ్మగారి దగ్గరికి వొచ్చిన’’ అన్నది సారమ్మ. ‘‘అవునండి నేనే పిల్సిన. ఎందుకు చిటికిమాటికి చికాకుపడతావు! పక్కవారి కోపం పనివాడిమీద సుపుతరు. వాళ్లె అల్కగ దొరికిండ్రా’’ కోపంగా అన్నది చిన్నమ్మ. ‘‘నీకు తెలవదు. ఊకె వారికి వకల్తా పుచ్చుకోకు. ఏడ ఉండెటోళ్ల ఆడనే ఉంచాలే. పనోళ్ల పనోని తీరుగుసూడల గాని పక్కన కూర్చొబెట్టి పీటలేస్తమా. సరే లే నేను ఆపీసుకెల్తున్నా’’ అంటూ అతను కారువైపు నడ్సిండు. ‘‘ఆళ్ల ఫీజులు కట్టమని సారు అడుగుతుండట, పిల్లలు ఒకటే పోరుచేస్తుండ్రు’’ అన్నది సారమ్మ దీనంగ.
‘‘ఎంతగట్టాల్నే’’ అన్నది చిన్నమ్మగారు. పిల్లకు పదిహేను, పిలగానికి పదివేలు. పిల్లపిలగానికి మొత్తం పాతికవేయిలవుతున్నయ్. ఫీజు పైసలు అప్పు కింద కాగితం రాస్కోని ఇస్తే వచ్చేడుకు నెలకింత అయిన కొచ్చేదాంట్ల నాకొచ్చేదాంట్ల కోత కోసుకొండ్రి’’ అన్నది సారమ్మ. ‘‘ఎప్పుడు గట్టాల్నే’’ అడిగింది చిన్నమ్మ. ‘‘అమ్మ పరీక్షలు దగ్గురకొస్తున్నయట. అయికడ్తనే రాయనిస్తరట’’ అన్నది సారమ్మ. ‘‘ఆ అట్లనా. సరే ఓ వారమల్ల కడ్దం సార్‌కు జెప్పి పంపు’’ హామి ఇచ్చింది చిన్నమ్మ. పిల్లల్ని బడిలో దింపిన ఎంకులు అపార్టుమెంట్ చేరిండు. అతని మొకం పాలిపోయివుంది. అతన్ని సమస్యలు చుట్టుముట్లినయ్. ఆ ఊబి లోంచి బైట పడేమార్గం లేదు. అప్పు మీద అప్పు అది వారి కాపురానికి ముప్పుగా కూకుంది.
దిగాలుగా గేటు దాటి నడచిండు.‘‘ఏమయ్య పిల్లల తోలినవా సారుతో మాట్లాడినవా?’’ అడిగింది సారమ్మ.‘‘ఆళ్లకాళ్ల మీద ఆళ్లు నిలవడిందాక మనకు తిప్పలు తప్పవుకదా. నాది సర్కారు నౌకరి కాదు, నీది నౌకరి కాదు. అత్తెసరు బతుకులు’’ అంటూ దీనంగా పలికిండు ఎంకులు.‘‘దిగులుపడకు. నారుపోసినోడు నీరుపోస్తడు. ఏదోదారి దొర్కపోతదా పూట గడవక పోతదా’’ అని పెనిమిటిని ఓదార్చబుచ్చింది సారమ్మ.‘‘నేను సుస్తలేరా’’ అన్నది చిన్నమ్మ.‘‘అది కాదమ్మ ఇప్పటికే మీరు సానాసాయం జేసిండ్రు. పాతయే తీరలే మల్ల అంటే ఎట్లనో’’ అంటూ నీళ్ళు మింగసాగిండు ఎంకులు.‘‘వాటి గూర్చి ఆలోచించక జరిగేది చూడలే, నేను పిల్లల పీజులు తెస్తాను వుండండి’’ అంటు లోపలికి నడించింది చిన్నమ్మ.
‘‘దొరబాబు ముక్కోపి అయినా మంచిమనసున్న సిన్నమ్మ మంచితనమే నన్ను వాచ్‌మేన్‌గా ఉండేట్టు జేసింది. లేదంటే ఎన్నడో ఈనుంచి పనిమాని వేరేపని చూసుకొనివుండేటోన్ని. సూస్తసుస్తనే పాతికేండ్లపొద్దుగుడ్సె’’ అన్నడు ఎంకులు. ‘‘అవునయ, నువు అనేది నిజమే’’ అన్నది సారమ్మ.తమ గదివైపు కదిలారు ఇద్దరూ. ఆ అపార్టుమెంటులోని వారు అప్పుడప్పుడు తాగిన సీసలను ఒక దగ్గరేసి బస్తా నింపిండు. ఎప్పటి మాదిరె ఆరోజు పై వారు మందు తెమ్మంటే తెచ్చి ఇచ్చాడు ఎంకులు.‘‘మేం తాగిన బీరు సీసలు తీస్కపో’’ అన్నారు వారు. ‘‘ఆ... అట్టగే నయ్య’’ అంటూ ఎంకులు కిందికి కదలబోయాడు. ‘‘అరె ఎంకులు గింత కారబుంది మిర్చి పట్టుకరా’’ అని ఎంకుల్ని షాపుకు తోలారు.అతను అవి తేనీకి వెళ్ళాడు.
ఎంకులు వచ్చేసరికి బాగ తాగిన నిషాలో ... ‘‘ఆ వాచ్‌మేన్‌గాడు ఉన్నడే ఎంకులు గాడు గుంతకండ్లు, సొట్టసెంప్పలు అబ్బా అందగాడే చెప్పు. వాడు బలె ఇరుసుకుంటడు బై. మనం తాగిపారెస్తే కాళి సీసాలు ఏరుకునే ఎదవ నాయాలు గని చెప్పు’’ అని వారు అనుకుంటుండగ ఎంకులు రాబోయి ఆగిపోయిండు. అక్కడే ఆగి వారి మాటలు విన సాగిండు.‘‘బలె అన్నవ్ బాస్! ఆడి భార్యలేదు సారి... సంసారి లెక్క వగులుపోతది. దానికి మన అపార్ట్‌మెంట్ దొరబాబుకి అదట! అందుకే వాళ్లను వాచమెన్‌గ పెట్టుకుండు. పని సరిగ్గ చేయకున్న వాళ్లను ఏమనడు. వాళ్లకు మనం ఏదన్న అంటే ఆ చిన్నమ్మ ఎనకేసుకోస్తది’’‘‘ఔనా నాకు తట్టనే లేదు గని బై సారి పనిమనిషైనా సొట్ట ఎంకన్ని జేస్కున్న బలె మస్తుగుంటది. గిల్లుదామంటే చిక్కదు. కైపెక్కించే కండ్లు, తెనేలూరే పెదాలు సందమామరూపు వంకులు దిరిగిన వాగులెక్క చంద్రవొంక నడుము...’
‘‘అది ఈ ఎడ్డి ఎంకన్ని ఎట్టబరిస్తదో! వాడి మొకం సూడబుద్దికాదు, దరిద్రనారాయణుడు. ఎప్పుడు చింతల వుంటడు. మనం ఏదన్న ఇస్తమా అని ఆశగా చూస్తడు. వాడు మాపు గుర్రుబెట్టి నిద్రపోతే ఇగ ఆని పెండ్లం కావలిగాస్తది. అప్పుడన్న ఓ సూపుసూద్దామంటే దొరబాబు మెల్కలనే వుంటడు దానికోసమె’’ ... అంటూ వారు మత్తులో మాట్లాడుతుంటే ఆ మాటలు ఇంటున్న ఎంకులుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. వారిని నరికి సంపాలన్న కశి.కాని తను అసహయుడు. అదే మాటున వొనుకుతున్న స్వరంతో ఎరుపెక్కిన కండ్ల నీరు పొంగుకొస్తుంటే తన గదిలో కొచ్చి తన భార్య సారమ్మను చూసి బావురుమని ఏడ్చాడు.
ఇదేమి అర్తం కాని సార...‘‘ఏమయిందయ్య ఏంది ఇసయం?’’ అంటూ ఆందోళనపడుతూ ఆతృతతో ఎంకుల్ని అటుఇటు కదిలిస్తూ అడగసాగింది.‘‘ఏమే మనం ఈ నుంచి పోదాము. ఇంకేడైనా బతుకుదాం. కూలినాలి జేసి బతుకుదాం. మనకు పని కొత్తకాదు’’ అన్నాడు ఎంకులు ఎరుపెక్కిన కళ్లు తుడుచుకుంటూ. ‘‘అసలేమైంది చెప్పయ?’’ మళ్లి అడిగింది సారమ్మ.‘‘అది ఎలా చెప్పనే... ’’ అంటూ తటపటాయించసాగిండు ఎంకులు.
‘‘ఏదైనా సరె చెప్పు. నువ్ బాదపడకు. నువ్ బాదపడితే మాకూ బాదే. ఎదిగిన పిల్లల ముందు చిన్నపిలగానిలెక్క ఎందిది?’’ అని అడిగింది. ‘‘అదికాదు సారా ఇలారా’’ అని గదిలో మూలకు తీస్కపోయి...‘‘పూట గడ్వక మనం తిప్పలపడుతుంటే కొంచెపు నా కొడుకులు కారుకూతలు కూస్తుండ్రు’’ అంటూ జరిగిన ఇసయం చెప్పిండు.ఎంకులు గొంతులొ వొనుకు మొదలైంది. ఆమె కళ్లలో దుక్కం కట్టలు తెంచుకొని వరదలై పొంగింది. కొంత సేపటి తర్వాత తేరుకొని పైటతో కండ్లు తుడ్చుకొని గుండె ధైర్యం చేసుకొని అతనికి దైర్యం చెప్పసాగింది... ‘‘ఏందయ్య నేనేందో నీకు తెలుసు. నువ్వెందో నాకు తెల్సు. కొంచపు బుద్దులు కొంపకు చేటు. అప్పుడే గల్లపట్టి గుంజుపోయినావ్. ఆళ్లు సార్లా కుల్లిన మనసులు. లోపల ఇంత కుటిలం పెట్టుకుండ్రా! వాళ్లు మనుషులా? వారికంటే పశువులేనయం.ఇదిగో కుక్కకు ముద్దేస్తే ఇస్వాసం గుంటది.పశువుకు గడ్డేస్తే పాలిస్తుంది పనిజేస్తది. కని గీసదువు నేర్సిన కొడుకులు మనుషులా!
మనం వారి మాటలు పట్టించుకోవదు.్ద దారిన పోతుంటే కుక్కలు మొరిగిన యనుకుందాం, ఇగో కొక్కరిచ్చినదాని కుడి కన్నుపోయిందట ఎక్కిరించినదాని ఎడమ కన్ను పోయిందట.
మన ఊసుపోసుకన్నోళ్లు ఎవరు బాగుపడలే. వాళ్లే నాశనమైతారు గని నువ్ పికర్ జేయకు. ఈ బంగ్లాలో మన ముందు చాలా మంది వచ్చారు వెళ్లారు. గిసోంటి మనుషులు లోకం నిండా వున్నరు. మనం యాడికెళ్ళినా ఇలాంటివారు ఎదురు పడుతనే వుంటరు. మనం లోకానికి ఎదురీదాలే. వారికి దుర్గాలమోచ్చె కారుకూతలు గూస్తుండ్రు.మనకు కాలమొస్తది. ఎన్నడు అరిసిన నోర్లు మూత పడేరోజు వోస్తది. మన పిల్లల కోసం ఈ తిప్పలు తప్పవు’’ అంటూ తన పెనిమిటికి ఓదార్పు మాటలు పలికి అతనిలో ఆత్మస్థైర్యాన్ని నింపింది సారమ్మ.
Comments
Please login to add a commentAdd a comment