నీవు నేర్పిన విద్య | Funday Crime Story Of The Week 02-02-2019 | Sakshi
Sakshi News home page

నీవు నేర్పిన విద్య

Published Sun, Feb 3 2019 9:57 AM | Last Updated on Sun, Feb 3 2019 10:43 AM

Funday Crime Story Of The Week 02-02-2019 - Sakshi

‘‘నన్ను చంపాలి నువ్వు!’’ అన్నాడతను. ఉలిక్కిపడి అతని ముఖంలోకి తీక్షణంగా చూసిందామె. 
‘‘ఎస్, నువ్వు సరిగానే విన్నావు. నువ్వు హత్యచేయవలసింది నన్నే!’’ అన్నాడతను మళ్ళీ.  అతని పేరు రాంచందర్‌. ముప్పయ్యేళ్ళుంటాయి. 
‘‘జోకులు ఆపి ఎవర్ని లేపేయ్యాలో సమఝయ్యేలా చెప్పు’’ అందామె కటువుగా.
ఆమెకు పాతికేళ్ళుంటాయి. రఫ్‌ అండ్‌ టఫ్‌ హైర్డ్‌ కిల్లర్‌ ఆమె. ఇంటర్నెట్‌ లో ‘కిరాయి హంతకుడి’ కోసం కవర్ట్‌ యాడ్‌ ఇస్తే, కాంటాక్ట్‌లోకి వచ్చింది. ఓ హోటల్‌ రూమ్‌లో కలుసుకున్నారు వాళ్లు. 
‘‘నేను జోక్‌ చేయడంలేదు. నిజంగానే నాకు చావాలని ఉంది. అందుకే’’ అన్నాడు రాంచందర్‌.
అతను తనతో వేళాకోళం ఆడడంలేదనీ, సీరియస్‌గానే చెబుతున్నాడనీ గ్రహించింది. 
‘‘చచ్చుడు కర్మ నీకేంది, బిడ్డా?’’ ఆశ్చర్యంతో అడిగింది.
‘‘నీ పేరేమిటో తెలుసుకోవచ్చునా?’’ అడిగాడు అతను.
‘‘ఎల్‌. కె. – లేడీ కిల్లర్‌..’’ అంది, పేరు చెప్పడం ఇష్టంలేనట్టు.
‘‘సారీ!’’ అని, ‘‘ఎందుకు చావాలనుకుంటున్నానో చెబుతాను విను’’ అంటూ అతగాడు చెప్పిన కథనం:

‘రాంచందర్‌  ఓ ధనవంతుడు. సువర్చల అనే ఓ విడోని ప్రేమించి పెళ్ళాడాడు. వయసులో అతనికంటే ఐదేళ్ళు పెద్దది ఆమె. ఓ బలహీన క్షణంలో మోసంచేసి అతని ఆస్తినంతా తన పేరిట రాయించేసుకుంది. ఆ తరువాత నుంచి అతని కష్టాలు ఆరంభమయ్యాయి. ఏదో ఒక కారణంతో అతన్ని అవమానిస్తూ హెరాస్‌ చేయనారంభించింది ఆమె. విడాకులు ఇచ్చేద్దామంటే ఆమె మీది ప్రేమను చంపుకోలేకపోతున్నాడు. అతనికి తనపట్ల గల పిచ్చి ప్రేమను ఆసరా చేసుకుని విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది. ఆమెకు బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో ఉన్నాడన్న అనుమానం కూడా వుంది. ఆమె మాటలతో, చర్యలతో అనుక్షణం మానసిక క్షోభను అనుభవిస్తూ జీవించడం అతనికి చేతకావడంలేదు.. అందుకే చచ్చిపోవాలని నిశ్చయించుకున్నాడు.’
విస్తుపోయి చూసింది ఎల్‌.కె. ‘‘దాన్ని చంపక, నువ్వు చస్తానంటవేంది, బిడ్డా?!’’ అంది, నమ్మలేనట్టుగా.
‘‘అదిసరే. ఓ విషయం నాకు అంతుబట్టలే. చావాలనుకుంటే ఏ రైలు కింద పడో, హుస్సేన్‌ సాగర్‌లో దూకో, లేదా.. ఇంట్ల ఉరేసుకునో చావొచ్చుగా నువ్వు? కిరాయి హంతకులకు లక్షలు పోసి చంపించుకోవడమెందుకు?’’ అనుమానంగా అడిగింది. 
‘‘అదా? స్వయంగా ప్రాణాలు తీసుకోవడానికి గొప్ప ధైర్యం కావాలి’’ చెప్పాడతను. 
‘‘కిరాయి ముఖ్యంగాని, ఎవర్ని చంపామన్నది ముఖ్యం కాదుగా! నిన్ను చంపడానికి నేను ఒప్పుకుంటున్న. ఫీజు ఐదు లక్షలు. ముందే ఇచ్చేయాలె. అడ్వాన్స్‌ అంటే, బ్యాలెన్స్‌ పే చేయడానికి చచ్చాక నువ్వుండవుగద మల్ల!’’ అందామె. 
సగం సొమ్ము అడ్వాన్స్‌గా చెల్లించాడు రాంచందర్‌. తన చావుకు ముహూర్తం తానే నిర్ణయిస్తాననీ, చంపడానికి ముందురోజున మిగతా సొమ్ము ముట్టజెప్పబడుతుందనీ చెప్పాడు.
··· 
‘‘చందర్‌! నీతో కొంచెం మాట్లాడాలి’’ అంది సువర్చల, బయటకు వెళుతూన్న అతన్ని చూసి. 
ఆగి, ‘‘ఎస్, డియర్‌?’’ అంటూ వచ్చి సోఫాలో ఆమె పక్కను కూర్చున్నాడు అతను.
ముప్పయ్‌ అయిదేళ్ళ సువర్చల తెల్లగా, నాజూకుగా, అందంగా ఉంటుంది. ఆమె భర్త చమక్‌ లాల్‌ ముత్యాల వ్యాపారి. పత్తర్‌ ఘాట్‌లో ముత్యాల షాపు ఉంది అతనికి. మూడేళ్ళ క్రితం డెంగ్యూ ఫీవర్‌ తో అకాలమరణం చెందాడు. అప్పటి నుంచి వ్యాపారాన్ని స్వయంగా చూసుకోసాగింది ఆమె. ఒంటరిగానే జీవిస్తోంది.
రెండేళ్ళ క్రితం అనుకోకుండా రాంచందర్‌తో పరిచయమయింది సువర్చలకు. తాను ఓ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టునని చెప్పుకున్నాడు అతను. స్త్రీలను ఆకట్టుకునే అతని రూపానికీ, మాటలకూ పడిపోయిందామె. ఒంటరి ఆడదాన్ని చేసి ఆస్తి కోసం తనకు సమస్యలు తెచ్చిపెడుతూన్న బంధువుల బారినుంచి కాపాడుకునేందుకు అతని తోడు అవసరమనిపించింది. పెళ్ళిచేసుకున్నారు ఇద్దరూ. అయితే, ఆమధ్య రాంచందర్‌లో ఏదో మార్పు కనిపిస్తోంది ఆమెకు.
‘‘చెప్పు, చందర్‌! ఎవరామె?’’ సూటిగా అడిగింది సువర్చల.
ఎదురుచూడని ఆ ప్రశ్నకు కొద్దిగా తడబడ్డాడు అతను. ‘‘ఎవరు?’’ 
‘‘చూడు, చందర్‌! కొద్దిరోజులుగా నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. ప్రేమించానంటూ నా వెంటపడి వేధించావు. పెళ్ళయాక నా మీద మోజు తీరిపోయిందా నీకు?’’ ఆమె స్వరంలో తీక్షణత.
‘‘మార్పా? నాలోనా? నెవ్వర్‌!’’ అన్నాడతను. ‘‘అనవసరంగా ఏదేదో ఊహించుకుని ఆందోళనచెందకు, డియర్‌!’’.
‘‘పిల్లి కళ్ళు మూసుకున్నంతలో లోకం దాన్ని చూడకపోదు. నువ్వు ఎవరో పిల్లతో చక్కెర్లు కొడుతున్న సంగతి నా దృష్టికి వచ్చింది’’ అంది, అతని ముఖకవళికలను గమనిస్తూ. 
‘‘అబద్ధం! నామీద నీకెవరో చాడీలు చెప్పుంటారు, డియర్‌! మనల్ని విడదీయాలన్న పన్నాగం అయ్యుంటుంది. నువ్వు నా ప్రాణం!’’ అన్నాడతను, ఆమెను దగ్గరకు తీసుకుంటూ.
ఓ క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయిందామె. తరువాత, ‘‘ఓకే. నువ్వు చెప్పేది నిజం కావాలని ఆశిస్తున్నాను’’ అంది. ‘‘ఎల్లుండి దివాలీ. ఆ రోజున ఇంట్లో లక్ష్మీపూజ ఘనంగా చేస్తానన్న సంగతి నీకు తెలుసుగా? ఈ రెండు రోజులూ ఎక్కడికీ వెళ్ళొద్దు’’. ‘‘ఓ.. ష్యూర్, డియర్‌!’’ అన్నాడు లేస్తూ.
··· 
సువర్చల దీపావళి రోజున ఇంట్లో లక్ష్మీపూజ చేసుకుంటుంది. అది కుటుంబసభ్యులకే పరిమితం. ఎందుకంటే ఆ పూజలో అపూర్వ వజ్రం ఒకటి ఉంచబడుతుంది.
ఆ వజ్రం ఐదు తరాలుగా ఆ కుటుంబంలో ఉంది. దాని ప్రస్తుత విలువ వేయికోట్ల పైచిలుకే. అంతర్జాతీయ మార్కెట్లో అంతకు ఎన్నో రెట్లు ఉంటుందని అంచనా. వంశపారంపర్యంగా వస్తూన్న ఆ వజ్రమే తమకు సకల శుభాలనూ చేకూరుస్తోందన్న ప్రగాఢ నమ్మకం. దాని గురించి ఆ కుటుంబేతరులకు తెలియదు. ఏడాదికోసారి దీపావళి రోజున లక్ష్మీపూజ కోసం బైటకు తీయడం జరుగుతుంది. మిగతా 364 రోజులూ బ్యాంక్‌ లాకర్లో సేఫ్‌ గా ఉంటుంది.
గత దీపావళి రోజున ఆ వజ్రాన్ని చూసిన రాంచందర్‌ కన్నులు మిరుమిట్లు గొలిపాయి. దాని చరిత్ర విని, ‘‘ఇంత విలువైన వజ్రాన్ని ఇన్‌స్యూర్‌ చేయకపోవడం ఆశ్చర్యకరమే!’’ అన్నాడు.
సువర్చల నవ్వి, ‘‘ఇన్‌స్యూర్‌ చేయడమంటే దీని గురించి టామ్‌ టామ్‌ చేయడమే. దీని ఉనికి ఎవరికీ తెలియనంతవరకే సేఫ్టీ’’ అంది.
ఎప్పటిలాగే దీపావళికీ వజ్రాన్ని వుంచి పూజ చేసుకుంది సువర్చల. రాంచందర్‌ హాల్లో టీవీ చూస్తున్నాడు. బయటి నుంచి దీపావళి సందడి వినవస్తోంది. పటాసుల శబ్దాలు మిన్నంటుతున్నాయి. పూజ అయ్యాక వెండిపళ్ళెంలో స్వీట్స్‌తో హాల్లోకి వచ్చింది సువర్చల. 
అంతలో హఠాత్తుగా కరెంట్‌ పోయింది. వెనువెంటనే పిస్టల్‌ శబ్దమూ, ‘అమ్మా!’ అన్న ఆర్తనాదమూ – పటాసుల ధ్వనులలో కలసిపోయాయి. 
కాసేపటి తరువాత కరెంట్‌ తిరిగివచ్చింది. నేలపైన నెత్తుటిమడుగులో పడివున్న సువర్చలను చూసి ఒక్క ఉరుకులో ఆమెను సమీపించాడు రాంచందర్‌. 
··· 
రాంచందర్‌ తన చావుకు ముహూర్తం దీపావళికి పెట్టుకున్నాడు. ముందురోజున లేడీ కిల్లర్‌ ని కలసి బ్యాలెన్స్‌ ఫీజు చెల్లించేసాడు. దీపావళినాటి రాత్రి ఎనిమిదిన్నరకు సువర్చల భవంతికి వెళ్ళింది లేడీ కిల్లర్‌. మూడంతస్తుల భవనం అది. దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
మెయిన్‌ గేటు దగ్గర వాచ్‌మ్యాన్‌ లేడు. ఆరోజు అతనికి సెలవు ఇచ్చి పంపేస్తానన్నాడు రాంచందర్‌. కాంపౌండులో ప్రవేశించింది ఎల్‌.కె. ఫలానా టైముకు తాను ఫస్ట్‌ ఫ్లోర్‌ బాల్కనీలో నిలుచుంటాననీ, అప్పుడు షూట్‌ చేయమనీ చెప్పాడు రాంచందర్‌. తన సొంత ఆయుధంతోనే చావాలన్నది తన సెంటిమెంటనీ, ఇంటి ముఖద్వారం దగ్గర మెట్లపక్కన క్రోటన్‌ ప్లాంట్‌ ఉన్న మట్టికుండీలో తన పిస్టల్ని ఉంచుతాననీ, దాన్ని తీసి షూట్‌ చేయమనీ, తర్వాత దాన్ని అక్కడే పెట్టేయమనీ చెప్పాడు. 
‘ఇదేం చావు సెంటిమెంటురా బాబూ! చావడానికి ఏ పిస్టల్‌ అయితేనేమి?’ అనుకుని విస్తుపోయిందామె. కుండీలోంచి పిస్టల్‌ తీసుకుని బాల్కనీ వైపు వెళ్ళింది ఎల్‌.కె. ఫస్ట్‌ ఫ్లోర్‌  బాల్కనీలో నిలుచునివున్న రాంచందర్‌ కనిపించాడు.
అంతే! లేడీ కిల్లర్‌ చేతిలోని పిస్టల్‌ పేలింది. కుప్పకూలిపోయాడు అతను. 
పిస్టల్‌ శబ్దం దీపావళి ధ్వనులలో కలసిపోయింది. తరువాత పిస్టల్‌ని యథాస్థానంలో ఉంచి, కూల్‌గా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయిందామె.
··· 
సిటీ శివార్లలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో ప్రియుడి ఒడిలో పడుకుని ఆ వజ్రాన్ని కుతూహలంతో పరిశీలిస్తోంది షహనాజ్‌. ఇరవయ్యేళ్ళుంటాయి ఆమెకు. కొంచెం బొద్దుగా, తెల్లగా, అందంగా, మోడర్న్‌గా ఉంటుంది. ఆమె చేతిలో ఉన్నది సువర్చలకు చెందిన ఫ్యామిలీ డైమండ్‌!
‘‘జీవితంలో ఇలాంటి వజ్రాన్ని చూడడం ఇదే మొదటిసారి. దీని ఖరీదు వేయికోట్లంటే నమ్మశక్యం కావడంలేదు’’ అందామె.
ఏదో అనబోయిన అతను టీవీలో వస్తున్న వార్తను చూసి ఆగిపోయాడు. సువర్చల హత్యావార్త అది – ‘గతరాత్రి సువర్చల, ఆమె భర్త రాంచందర్‌ దీపావళి సందర్భంగా తమ నివాసంలో లక్ష్మీపూజ ఘనంగా జరుపుకున్నారు. అనంతరం దంపతుల నడుమ ఏం గొడవ జరిగిందో ఏమో, రాంచందర్‌ భార్యను ఆమె లైసెన్స్‌డ్‌ పిస్టల్‌తోనే షూట్‌ చేసి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. శవాలు రెండూ హాల్లో పడున్నాయి. పక్కనే పిస్టలూ, దానిపైన రాంచందర్‌ వేలిముద్రలూ ఉన్నాయి. పోలీసులు శవాలను పోస్ట్‌ మార్టమ్‌కి పంపించి, ఆ సంఘటన వెనుక వున్న కారణాలను పరిశోధిస్తున్నారు’
ప్రియుడి వంక ఆశ్చర్యంగా చూసింది షహనాజ్‌. ‘‘అక్కడ శవమై పడున్న రాంచందర్, ఇక్కడికి ఎలా వచ్చాడబ్బా!?’’ అంది. ‘‘ఏం మాయ చేశావ్, డియర్‌?’’
నవ్వాడతను. అతని మదిలో గతం సినిమారీలులా తిరిగింది..’విడో అయిన సువర్చలకు బోలెడు ఆస్తి వుందని తెలిసి ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్‌ చేశాడు రాంచందర్‌. ఆమెను ఒప్పించి పెళ్ళాడాడు. అంతవరకు రికామీగా తిరుగుతూ వచ్చిన అతను ఖరీదైన జీవితాన్ని అనుభవించసాగాడు. ఆమె ఆస్తినంతటినీ తన పేరిట రాయించుకోవడానికి అవకాశం కోసం చూడసాగాడు. అంతలో సువర్చల ఫ్యామిలీ డైమండ్‌ గురించి తెలిసింది. దాన్ని ఎలా కాజేయాలా అని ఆలోచిస్తూండగానే, శ్యామ్‌ సుందర్‌ తో పరిచయమయింది.
శ్యామ్‌ సుందర్‌ దుబాయ్‌లో ప్రియురాలిచేత వంచింపబడి ఆ మధ్యనే ఇండియాకి తిరిగొచ్చాడు. ఆమెను, ఆమె వంచనను మరచిపోలేక ఆత్మహత్యకు పూనుకున్నాడు. అప్పుడే రాంచందర్‌ అనుకోకుండా కలవడమూ, అతన్ని ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడటమూ జరిగాయి. కవలల్లా ఇద్దరూ ఒకే పోలికలో ఉండడం ఇద్దర్నీ చకితుల్ని చేసింది. ప్రపంచంలో ఒకే పోలికలో ఏడుగురు ఉంటారన్నది నిజమేననిపించింది. వారి మధ్య స్నేహం కలసింది.
శ్యామ్‌ సుందర్‌ని చూసాక రాంచందర్‌ ఆలోచనలు కొత్తపుంతలు తొక్కాయి. అతన్ని అడ్డుపెట్టుకుని సువర్చల వజ్రాన్ని తస్కరించేందుకు పథకం వేసాడు. ఓ కట్టుకథతో, హైర్డ్‌ కిల్లర్‌ కి సుపారీ ఇచ్చి తనను చంపమని పురమాయించాడు. దీపావళి రోజున తన ఇంటికి డిన్నర్‌ కి రావలసిందిగా శ్యామ్‌ సుందర్‌ ని ఆహ్వానించాడు. సువర్చల పూజలో ఉండగా వచ్చిన అతిథిని ఫస్ట్‌ ఫ్లోర్‌ బాల్కనీకి పంపించాడు – పూజ అయ్యాక పిలుస్తాననీ, భార్యను తమ రూపాలతో సర్‌ప్రైజ్‌ చేద్దామనీనూ..
తరువాత లైట్లు ఆర్పేసి సువర్చలను ఆమె పిస్టల్‌ తోనే షూట్‌ చేశాడు. ఆ పిస్టల్‌ని బైట పూలకుండీలో ఉంచాడు. లేడీ కిల్లర్‌ దాన్ని తీసుకుని రాంచందర్‌ లా ఉన్న శ్యామ్‌ సుందర్‌ని షూట్‌ చేసింది. పిస్టల్ని యథాస్థానంలో ఉంచి వెళ్ళిపోయింది. రాంచందర్‌ బాల్కనీలోని శ్యామ్‌ సుందర్‌ శవాన్ని తీసుకొచ్చి హాల్లో పడేశాడు. పిస్టల్‌ని పూలకుండీలోంచి తెచ్చి దాని మీది వ్రేలిముద్రల్ని చెరిపేసి, శ్యామ్‌ సుందర్‌ చేతిలో పెట్టి అతని ముద్రలు పడేలా చేశాడు. పిస్టల్‌ని అతని పక్కనే పడేసి, వజ్రంతో ఉడాయించాడు. సువర్చల వద్దనున్న ఆ వజ్రం గురించి ఎవరూ ఎరుగరు కనుక, అది దొంగిలింపబడినట్టు ఎవరికీ తెలియదు. ఇకపోతే, చనిపోయింది రాంచందర్‌ కాదనీ, అతని రెప్లికా మరొకడు ఉన్నాడనీ ఎరుగని పోలీసులు తనను అనుమానించరు.’
అతను చెప్పినదంతా నోరు తెరచుకుని ఆలకించిన షహనాజ్, ‘‘వాహ్‌! నీది సూపర్‌ బ్రెయిన్, డియర్‌!’’  అంది మెచ్చుకోలుగా, 
‘‘రేపే వజ్రంతో ఇక్కణ్ణుంచి మనం జెండా ఎత్తేస్తున్నాం, డార్లింగ్‌! మారిషస్‌ కి టికెట్స్‌ ఆల్రెడీ కొనేశాను. అక్కణ్ణుంచి అమెరికా వెళ్ళిపోదాం. అక్కడ వజ్రాన్ని అమ్మేద్దాం. మనం పెళ్ళిచేసుకుని  ఆ డబ్బుతో జీవితాంతం సుఖంగా గడిపేద్దాం’’ అన్నాడు రాంచందర్‌.
‘‘సో క్యూట్‌!’’ అంటూ ప్రియుణ్ణి గాఢంగా కౌగలించుకుంది షహనాజ్‌ సంతోషంతో. 
··· 
రాత్రి పదకొండు గంటలకు శంషాబాద్‌ ఏర్‌పోర్ట్‌లో ప్రవేశించారు రాంచందర్, షహనాజ్‌లు. ఆనవాలు తెలియకుండా తన రూపంలో మార్పులు చేసుకున్నాడు రాంచందర్‌. అతని వద్ద ఓ ట్రాలీ సూట్‌ కేసూ, ఆమె చేతిలో ఓ ట్రావెల్‌ బ్యాగూ ఉన్నాయి. 
మారిషస్‌ ఏర్‌ లైన్స్‌ ‘చెకిన్‌’ కౌంటర్‌ వద్ద పెద్ద క్యూ ఉంది. రెస్టారెంటుకు వెళ్ళి కాఫీ తాగారు ఇద్దరూ. అనంతరం అతను బోర్డింగ్‌ పాసెస్‌ కోసం క్యూలో నిలుచుంటే, ఆమె లాంజ్‌ లో కూర్చుంది. 
కొంతసేపటి తరువాత హఠాత్తుగా సెక్యూరిటీ స్టాఫ్‌ డాగ్‌ స్క్వాడ్‌ తో ప్రవేశించి ప్రయాణికుల బ్యాగేజ్‌ ని చెక్‌ చేయనారంభించారు. రాంచందర్‌ దగ్గరకు రాగానే కుక్కలు అతని సూట్‌కేస్‌ వాసన చూసి పెద్దగా మొరగనారంభించాయి. పోలీసులు దాన్ని తెరిపించి  సోదాచేసారు. ‘నాటుబాంబు’ బైటపడింది! 

తెల్లబోయిన రాంచందర్, ‘‘నో! నాకేం తెలియదు. అది అందులోకి ఎలా వచ్చిందో ఎరగను’’ అంటూ మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా, అతని రెక్కలు విరిచిపట్టుకుని లాక్కుపోయారు పోలీసులు. 
వెళ్తూ షహనాజ్‌ కూర్చున్న వైపు చూశాడు రాంచందర్‌. ఆమె కనిపించలేదు. స్క్వాడ్‌ రాకముందే, ఆమె ట్రావెల్‌ బ్యాగ్‌ని సీటులో పెట్టి వాష్‌రూమ్‌కి వెళ్ళడం అతను ఎరుగడు. కాసేపటికి వాష్‌రూమ్‌ నుంచి తిరిగొచ్చిన షహనాజ్, తన ట్రావెల్‌ బ్యాగ్‌ తీసుకుని కూల్‌గా ఏర్‌ పోర్ట్‌లోంచి బైటకు నడిచింది. ఖాళీగా ఉన్న క్యాబ్‌ని పిలిచి ఎక్కింది. 
క్యాబ్‌ సిటీవైపు దూసుకుపోతుంటే మదిలోనే అనుకుందామె – ‘సారీ, రామ్‌! నిన్ను నమ్మిన ఆడదాన్ని, పెళ్ళాడిన భార్యనే  డైమండ్‌ కోసం నిర్దాక్షిణ్యంగా చంపేశావు నువ్వు. రేపు నాకంటే అందంగా ఉన్న మరో ఆడది కనిపించినా, లేదా నీ రహస్యం ఎరిగినదాన్ని అనో నా అడ్డు తొలగించుకోవన్న గ్యారంటీ ఏమిటి? అందుకే తెలివిగా వజ్రాన్ని తస్కరించి, నీ సూట్‌ కేసులో నాటుబాంబును తెచ్చి పెట్టాను. పోలీసులకు దాని గురించి టిపాఫ్‌ ఇచ్చింది కూడా నేనే. రేపే వజ్రంతో యు.ఎస్‌. చెక్కేస్తున్నాను. టెర్రరిస్టుగా నువ్వు జైలునుంచి బైటపడటం కల్ల. ఒకవేళ ఎలాగో మేనేజ్‌ చేసి బైటపడ్డా, నన్ను కనిపెట్టడం నీ తరం కాదు. నిన్ను డబుల్‌ క్రాస్‌ చేశానని తిట్టుకోకు. ఆఫ్టరాల్, ఇది నువ్వు నేర్పిన విద్యేగా’  
·   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement