సరిగ్గా 13 ఏళ్ల క్రితం.. యావత్ చైనానే అల్లాడించిన కథ ఇది. చైనా, బనాన్ జిల్లాలోని షుయాంగ్జింగ్ అనే మారుమూల గ్రామం అది. సుమారు 3 వేల మంది నివసించే ఆ గ్రామంలో కుయాంగ్ జీ అనే వలస కూలీకి ఓ పాత ఇల్లు ఉంది. తన 13 ఏళ్ల కొడుకు జిజున్ కువాంగ్ అదే ఇంట్లో ఒంటరిగా ఉంటూ సమీపంలోని స్కూల్లో చదువుకునేవాడు. కుయాంగ్ జీ దంపతులు.. ఆ గ్రామానికి దూరంగా ఉన్న మెగాసిటీలో వలస కూలీలుగా బతికేవారు.
ప్రతి శనివారం తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి.. కాసింత డబ్బు, కావాల్సిన సరుకులు తెచ్చుకోవడం జిజున్‌కి అలవాటే. అయితే అక్టోబర్ చివరిలో ‘ఈ వారం రావట్లేదు’అని తల్లిదండ్రులకు జిజున్ కాల్ చేసి చెప్పాడు. ఆ తర్వాత రోజుల గడుస్తున్నా జిజున్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫోన్ కూడా కలవలేదు. దాంతో కుయాంగ్ జీ పనులన్నీ మానుకుని.. నవంబర్ 5, ఉదయం 11 అయ్యేసరికి.. పాతింటికి చేరుకున్నాడు. తలుపులు వేసి ఉండటంతో.. జిజున్ చదువుకునే స్కూల్‌కి పరుగుతీశాడు.
అయితే అక్టోబర్ 25 నుంచే ఫ్లూ కారణంగా జిజున్ స్కూల్‌కి రావట్లేదని స్కూల్ వాళ్లు చెప్పారు. దాంతో కువాంగ్ జీకు గుండె ఆగినంత పనైంది. ఒకవేళ తన కొడుకు అనారోగ్యంతో ఒంటరిగా ఇంట్లోనే ఉన్నాడా? అనే అనుమానమొచ్చింది. వెంటనే పాతింటికి చేరుకున్నాడు. ముందు తలుపు, పక్క తలుపు వేసే ఉండటంతో.. ఎందుకైనా మంచిదని ఇంటి వెనక్కి వెళ్లి చూశాడు. అటు తలుపులు తీసే ఉన్నాయి. లోపల లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి.
తన కొడుకు జిజున్.. దూలానికి వేలాడుతూ కనిపించాడు. అయితే అది ఉరికాదు. తాడు మెడకు చుట్టుకుని లేదు.. చేతులకు బలంగా ముడి వేసి ఉంది. మెడ వెనక్కి వాలిపోయి ఉంది. చేతులకు కట్టి ఉన్న తాడే.. ఒళ్లంతా బిగుతుగా చుట్టి, అక్కడక్కడా ముడులు వేసి ఉంది. పాదల మధ్య పెద్ద బరువు వేలాడుతోంది. నిర్జీవంగా దూలానికి వేలాడుతున్న తన కొడుకుని చూడగానే.. గుండెలు బాదుకుంటూ అరవసాగాడు కుయాంగ్ జీ. అతడి అరుపులకు ఊరుఊరంతా పోగయింది.
నెమ్మదిగా జిజున్‌ని పైనుంచి కిందకు దించారు. చనిపోయిన బాలుడు.. స్త్రీలు ధరించే స్విమ్మింగ్ సూట్‌లో ఉండటమే ఇక్కడ షాకింగ్ ట్విస్ట్. స్విమ్మింగ్ సూట్ ఎరుపు రంగులో ఉంది. బికినీలో రెండు (నకిలీ వక్షోజాలు)నల్లటి గుడ్డ పోగులు ఉన్నాయి. బాలుడి నుదుట మీద పిన్‌హోల్ (గుండుసూది అంత రంధ్రం) ఉంది. ఇక ఒంటి మీద తాడు ఆనవాళ్లు తప్ప మరే గాయాలు లేవు. ఊపిరి అందక.. నరాలు చిట్లి.. కాళ్లమధ్యకు చేరిన రక్తం గడ్డకట్టుకుపోయింది.
ఇది కచ్చితంగా లైంగిక దాడే అని కొందరంటే.. లేదు క్షుద్ర బలి అని మరికొందరు వాదించారు. చైనీస్ క్షుద్ర పూజల్లో లోహం, కలప, నీరు, అగ్ని ఇవే ప్రాథమిక అంశాలట. కాళ్ల కింద బరువు లోహాన్ని, పైదూలం కలపని, స్మిమ్మింగ్ సూట్ నీటిని, ఎరుపు రంగు దుస్తులు అగ్నిని సూచిస్తున్నాయని.. పైగా నుదుటి మీద పిన్‌హోల్.. ఆత్మను శరీరం నుంచి బయటకు పంపించడానికే చేస్తారని నమ్మేవారి సంఖ్య పెరిగిపోయింది.
బాలుడు నవంబర్ 3, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రాణాలు విడిచాడని రిపోర్టులు తేల్చాయి. ఇది హత్య కాదు, ఆత్మహత్య కాదు, ప్రమాదవశాత్తు ఏర్పడిన మరణమని నిర్ధారించారు పోలీసులు. నవంబర్ 3కి.. బాలుడికి 13 ఏళ్లు పూర్తి అయ్యి 13వ రోజు అని.. అది క్షుద్రపూజలు చేసేవారి లెక్కల్లో సరైన రోజని.. వాదించేవారంతా గొంతు పెంచారు.
అయితే పోలీసుల వాదనలోనూ నిజం లేకపోలేదు. బాలుడి మరణానికి ఆర్థోస్టాటిక్ అస్పిక్సియా (శ్వాసకోస వైఫల్యం) కారణమని, బాలుడు తానే రోప్ బైండింగ్ మెథడ్ (తాడుతో బంధించే పద్ధతి)ను ప్రయోగించుకునే క్రమంలో ఊపిరాడక చనిపోయాడని చెప్పుకొచ్చారు. 1990లో 14 ఏళ్ల బాలుడు ఇలానే చనిపోయాడని.. 1994, 96లో కూడా ఇలాంటి కేసుల్లో కొందరి ప్రాణాలు పోయాయని పాత రికార్డ్స్ చూపించారు. అయితే విచారణలో ఆ స్మిమ్మింగ్ సూట్ జిజున్ బంధువుల అమ్మాయిదని తేలింది.
ఇదిలా ఉండగా బాలుడు చనిపోయే రెండు రోజుల ముందు తల్లికి ఓ విచిత్రమైన కలొచ్చిందట. ఆ కలలో ఒక పొడవాటి వ్యక్తి పెద్ద టోపీ ధరించి, బ్యాగ్ తగిలించుకుని వెనక్కి తిరిగి ఉన్నాడని, వికృతంగా నవ్వాడని, అతడు.. ఎప్పుడూ తెరవని పాత ఇంటి వెనుక తలుపును తెరవడం తీవ్ర ఆందోళనకు గురి చేసిందని.. ఆ కల రావడం వల్లే.. నవంబర్ 5న తన భర్తను బలవంతంగా ఇంటికి పంపించానని బాలుడి తల్లి చెప్పుకొచ్చింది. అయితే.. టోపీ ధరించి, బ్యాగ్ తగిలించుకున్న ఓ అపరిచితుడిని.. బాలుడి మరణానికి ముందు మేము చూశామని గ్రామస్థుల్లో కొందరు చెప్పారు.
మరోవైపు బాలుడి తండ్రి.. తన భార్య మాజీ భర్తే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. ‘నా భార్యకు, ఆమె మాజీ భర్తకు ఓ ఆడపిల్ల ఉండేది. వాళ్ల విడాకుల తర్వాత అతడు జైలుకి వెళ్లాడు. ఆ సమయంలోనే ఆ పాప కనిపించకుండా పోయింది. అయితే ఆ పాపను మేమే దాచిపెట్టామని ఆమె మాజీ భర్త గట్టిగా నమ్మాడు. మూడేళ్ల క్రితం తన బిడ్డను అప్పగించకుంటే ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించాడు. నా కొడుకుని అతడే హత్య చేసి ఉంటాడు’ అని చెప్పాడు బాలుడు తండ్రి. అయితే ఈ అభియోగంపై ఎలాంటి ఆధారాలు లభించలేదు.
జిజున్ ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికే ఇష్టపడేవాడని.. పైగా అతడికి ఇష్టమైన పుస్తకం ‘లియావోజై’ అని బాలుడి స్నేహితులు చెప్పారు. ‘లియావోజై’ చైనాలో పాపులర్ అయిన దెయ్యం కథల పుస్తకం. దాంతో ఆ ఇంట్లో దెయ్యం ఉందనే ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. కేసుని పోలీసులు తేల్చేసినా.. పుకార్లు, నమ్మకాలు తేల్చనివ్వలేదు. దాంతో ఇన్నేళ్లు గడిచినా బాలుడి మరణానికి అసలు కారణం మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment