
ఓడంటే అలాంటిలాంటి ఓడ కాదు. ఇది తేలియాడే నగరం. అతి భారీ నౌకల కంటే పరిమాణంలో ఐదురెట్లు పెద్దదైన ఈ ఓడ పేరు ‘ఫ్రీడమ్ షిప్’. దీని పొడవే ఒక మైలు ఉంటుంది. ప్రస్తుతం ఇది తయారీ దశలో ఉంది. దీని తయారీ పూర్తయితే, ప్రపంచంలోని అతిపెద్ద ఓడలు కూడా దీనిముందు మరుగుజ్జుల్లాగానే కనిపిస్తాయి. ఈ ఓడను తయారు చేయాలని ముప్పయ్యేళ్ల కిందటే ఫ్లోరిడాకు చెందిన ఇంజినీరు నార్మన్ నిక్సన్ సంకల్పించాడు. అతడు 2012లో మరణించాడు.
దీని తయారీ మొదలయ్యాక చాలా కంపెనీల చేతులు మారాక, 2020లో ప్రస్తుత యాజమాన్య సంస్థ ఫ్రీడమ్ క్రూయిజ్ లైన్ ఇంటర్నేషనల్ చేతికి చేరింది. సింగపూర్, ఇండోనేసియాలలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఫ్రీడమ్ క్రూయిజ్ లైన్ ఇంటర్నేషనల్ సీఈవో రోజర్ గూష్ చెబుతున్నారు. అయితే, దీని డిజైన్‌కు రూపకల్పన చేసింది తామేనని భారత్‌కు చెందిన కనేతారా మెరైన్ సంస్థ చెబుతోంది.
ఈ ఓడ తయారీ పూర్తయితే, ఇందులో ఏకంగా లక్షమంది ఒకేసారి ప్రయాణించే వీలు ఉంటుంది. ఇందులో నలభైవేల మంది శాశ్వత నివాసులు, ముప్పయివేల మంది వచ్చిపోయే జనాలు, పదివేల మంది హోటల్ అతిథులు, ఇరవైవేల మంది సిబ్బంది ఉంటారని చెబుతున్నారు. నిర్మాణం పూర్తయ్యాక ఈ ఓడ నిరంతరాయంగా సముద్రంలో ప్రపంచయాత్ర సాగిస్తూనే ఉంటుందని, సరుకులు నింపుకోవడానికి మాత్రమే అనుకూలమైన రేవుల్లో నిలుస్తుందని కూడా చెబుతున్నారు.
చదవండి: Christmas 2022: క్రీస్తు జననం.. విశ్వానికి పర్వదినం
Comments
Please login to add a commentAdd a comment