సముద్రం.. ఎవరినైనా చిన్న పిల్లాడిలా మార్చేస్తుంది! ఎగసిపడే కెరటాల్లా మనసును కేరింతలు కొట్టిస్తుంది!! మరి అలాంటి సముద్రంపై ప్రయాణమంటే... అది కూడా 11 అంతస్తుల కదిలే లగ్జరీ హోటల్లాంటి క్రూయిజ్లో విహరిస్తే? తేలియాడే నగరంలో చక్కర్లు కొడితే? పోలా... అదిరిపోలా... తలుచుకుంటేనే ఎప్పుడెప్పుడా అనిపిస్తోంది కదా! నాదీ సేమ్ ఫీలింగ్. ఎక్కడో విదేశాల్లో ఉండే క్రూయిజ్ విహారం మనక్కూడా అందుబాటులోకి వచ్చిందన్న విషయం తెలియగానే నాలోని ‘ప్రయాణాల పక్షి’ నిద్రలేచాడు.
అందులోనూ నేను పుట్టిపెరిగిన వైజాగ్ నుంచి క్రూయిజ్‌లో బయలుదేరడం అనగానే, ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి... అంటూ ఆనంద‘సాగరం’లో మునిగిపోయాను. మన దేశంలో ఏకైక, తొలి లగ్జరీ క్రూయిజ్లైనర్ కార్డీలియా క్రూయిజెస్ ‘ఎంప్రెస్’లో సముద్ర ప్రయాణం ఎలా ఉంటుంది? అందులో ఉన్న విందు వినోదాలు.. వింతలు విశేషాలేంటి? అసలు అంతపెద్ద షిప్లో చూడ్డానికి ఏమేమి ఉన్నాయి? ఇందులో వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే లాహిరి లాహిరి ‘క్రూయిజ్’లో అంటూ విశాఖ నుంచి చెన్నైకి నాతో పాటు జర్నీ చేసేయండి మరి! కమాన్.. లెట్స్ క్రూయిజ్!!
దేశంలో తొలిసారిగా అమెరికా, యూరప్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి చోట్ల నడిపే అతిపెద్ద లగ్జరీ క్రూయిజ్ ఏడాది క్రితం పశ్చిమ తీరంలోని ముంబైలో జర్నీ స్టార్ట్ చేసింది. దీన్ని వాటర్వేస్ లీజర్ టూరిజమ్‌కు చెందిన కార్డీలియా క్రూయిజెస్.. ‘ఎంప్రెస్’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, చొరవతో ఈ ఏడాది జూన్‌లో తూర్పు తీరంలో వైజాగ్–చెన్నై మధ్య వర్షాకాల సీజన్ ట్రిప్పులు మొదలయ్యాయి. దీంతో నేను, మరో ఇద్దరం కలిసి నాలుగు రోజులు (సెప్టెంబర్ 14–17) టూర్ ప్లాన్ చేశాం. ఎదురుచూపులకు తెరపడే రోజు రానే వచ్చింది. సన్నగా చిరుజల్లులు కురుస్తున్నాయి. క్రూయిజ్ కంపెనీ ప్రతినిధులు విశాఖలోని ఒక హోటల్లో బోర్డింగ్ పాస్లు, ఆధార్ కార్డు వెరిఫికేషన్ పూర్తి చేసి గెస్ట్ పేరు, రూమ్ నంబర్ తదితర వివరాలతో ఉన్న యాక్సెస్ కార్డులను అందించారు. కోవిడ్ నేపథ్యంతో రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి.
లేదంటే జర్నీకి 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్లో నెగటివ్ వచ్చిన రిపోర్ట్ను చూపాల్సి ఉంటుంది. విశాఖ కంటైనర్ టెర్మినల్లోని బెర్త్ వద్దకు చేరుకోగానే... రాజహంసలా సేదతీరుతున్న క్రూయిజ్ ‘ఎంప్రెస్’ను చూడగానే ‘వాట్ ఎ బ్యూటీ’ అనుకుంటూ చూస్తుండిపోయాం!! క్లిక్మనిపించి సెక్యూరిటీ చెక్లో లగేజీ స్కానింగ్ పూర్తి చేసుకున్నాం. క్రూయిజ్ చెక్–ఇన్ ఎయిర్పోర్టులానే ఉంటుంది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది లగేజీని అణువణువునా స్కాన్ చేశాకే పంపిస్తారు. తీసుకెళ్లకూడని జాబితాలో ఉన్న వస్తువులను సెక్యూరిటీకి అప్పగించాల్సిందే. వాటిని భద్రంగా ఒక కవర్లో పెట్టి, షిప్ దిగాక తిరిగిస్తారు. ఎలాంటి డ్రింక్స్, ఆహార పదార్థాలనూ లోనికి అనుమతించరు. ఈ తతంగం పూర్తయ్యాక యాక్సెస్ కార్డును చెక్ చేసి, షిప్లోకి చేరుస్తారు. ఇది చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఏటవాలుగా ఉన్న పొడవాటి నిచ్చెనపై జాగ్రత్తగా నడుస్తూ అయిదో అంతస్తులోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది.
కళ్లు జిగేల్‌మనే ఏట్రియం...
లోపలికి ప్రవేశించగానే ప్రతిఒక్కరూ కళ్లప్పగించి చూసే సెంట్రల్ కోర్ట్ (ఏట్రియం) నిజంగా హైలైట్. గాజు పైకప్పుతో, అద్దాల లిఫ్ట్లు, మిరుమిట్లుగొలిపే లైట్లతో అదొక మయసభను తలపిస్తుంది. దాన్ని తనివితీరా ఓ లుక్కేసి, లగేజీతో రూమ్కు వెళ్లాం. విండో, బాల్కనీ నుంచి సీన్ చూస్తే.. మైమరచిపోవాల్సిందే. మధ్యాహ్నం ఒంటిగంట నుంచే షిప్లోకి ఎంట్రీ మొదలవడంతో... పదో డెక్లోని ఫుడ్ కోర్టులో అతిథుల కోసం లంచ్ సిద్ధంగా ఉంది. క్రూయిజ్ మైకంలో ఆకలి లేకపోయినా.. ఫుడ్డు అదిరిపోవడంతో దండిగానే లాగించేశాం.
లక్కీగా చిరుజల్లులు ఆగిపోయి సూర్యుడు దర్శనమివ్వడంతో సన్సెట్ను చూసే అవకాశం చిక్కింది. సముద్రం మీద నుంచి ఆ సీన్ నిజంగా ప్రకృతి ప్రేమికులకు కనులవిందే! షిప్ బయలుదేరడానికి ముందే ఎమర్జెన్సీ డ్రిల్ ఉంటుంది. బ్లాస్టింగ్ శబ్దం వినబడగానే ప్రయాణికులందరూ ఎక్కడున్నాసరే యాక్సెస్ కార్డుపై ఉన్న ‘మస్టర్ స్టేషన్’ నంబర్ ఆధారంగా ఆయా ప్రదేశాలకు చేసుకోవాలి. అక్కడ లైఫ్ జాకెట్ ఎలా ధరించాలి... అత్యవసర పరిస్థితుల్లో లైఫ్ బోట్లలోకి ఎలా తీసుకెళ్తారు వంటి సూచనలన్నీ సిబ్బంది వివరిస్తారు. షిప్లో 14 లైఫ్ బోట్లు ఉంటాయి. ఎట్టకేలకు సాయంత్రం ఆరు గంటలకు వైజాగ్కు గుడ్బై చెబుతూ కార్డీలియా ‘ఎంప్రెస్’ నిండుకుండలా నెమ్మదిగా కదిలింది. సంధ్యవేళ లైట్ల వెలుగులో మిలమిల మెరిసిపోతున్న సిటీ అందాలను చూస్తే.. ఎవరైనా సరే వావ్ వైజాగ్ అనాల్సిందే!
సెయిల్ ఎవే పార్టీ సూపర్బ్...
క్రూయిజ్ జర్నీ స్టార్ట్ అవ్వగానే తొలిరోజు సాయంత్రం 6 నుంచి 8 వరకూ పదో డెక్లో సెయిల్ ఎవే పార్టీ ఉందనడంతో అక్కడికి చేరుకున్నాం. అప్పటికే అక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కన ‘డీజే టిల్లు కొట్టు.. కొట్టు’ అంటూ చిన్నాపెద్దా తేడాలేకుండా చేస్తున్న డ్యాన్సులతో ఫ్లోర్ మొత్తం పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది. సరదాగా మేం కూడా రెండు స్టెప్పులేసి పూల్ బార్లో చిల్ అవుతూ డీజే పార్టీని ఎంజాయ్ చేశాం. ఎంటర్టైన్మెంట్ క్రూ ఆడించే ఆటపాటల్లో అంతా తలమునకలైపోయారు. ఇక అక్కడి నుంచి చిమ్మచీకట్లో వెలుగులీనుతూ సముద్రాన్ని చీల్చుకుంటూ గుంభనంగా సాగుతున్న క్రూయిజ్ను చూస్తూ టెర్రస్ అంతా ఒకసారి కలియదిరిగాం.
4వ డెక్లో ఉన్న స్టార్లైట్ రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని చైర్మన్స్ క్లబ్ బార్ లాంజ్లో నడుస్తున్న లైవ్బ్యాండ్లో మాంచి హిందీ, ఇంగ్లీష్ సాంగ్స్ను ఆస్వాదించాం. అక్కడి నుంచి రాత్రి 12 తర్వాత డోమ్ బార్లో మిడ్నైట్ డీజే మొదలైంది. దాదాపు ఒంటి గంట వరకూ అక్కడ ఫుల్ జోష్లో డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లింది. ఇక రూమ్కు చేరుకుని బాల్కనీలోకి వెళ్లేసరికి ఒక్క క్షణం ఇది కలా నిజమా అనిపించింది. చిమ్మచీకట్లో నిండు చందమామ కనువిందు చేస్తూ.. సముద్రంతో దోబూచులాడుతున్న వేళ... వెన్నెల్లో షిప్ కదులుతూ ఉంటే... దాన్ని చూసేందుకు రెండుకళ్లూ చాలవు!! కాసేపు మూన్స్కేప్ను ఎంజాయ్ చేస్తూ.. 2 గంటలకు బెడ్డెక్కాం.
మార్క్యూ థియేటర్... మరో లోకం!
మతిపోగొట్టే క్రూయిజ్ ప్రత్యేకతల్లో మార్క్యూ థియేటర్ నిజంగా అద్భుతం. దీనిలోకి వెళ్తుంటే ఆ గ్రాండ్ లుక్ అబ్బురపరుస్తుంది. రెండు అంతస్తుల్లో (5, 6 డెక్లు), 900 మందికిపైగా కూర్చునే వీలుంది. తొలిరోజు రాత్రి 10.30కి దక్షిణాదికి చెందిన పాత, కొత్త తరం సినిమా స్టార్స్ బ్లాక్బస్టర్ సాంగ్స్తో గుదిగుచ్చిన ‘సౌత్ ఎక్స్ట్రావెగాంజా‘ డ్యాన్స్ షో దీనిలో ప్రదర్శించారు. అరగంటపాటు చూపుతిప్పుకోనివ్వని నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్తో గెస్ట్లను ఉర్రూతలూగించింది. రెండో రోజు సాయంత్రం 6 గంటలకు పంజాబీ భారీ పెళ్లి సందడి థీమ్తో డ్యాన్స్ అండ్ డ్రామా షో ‘బల్లేబల్లే’ మరో హైలైట్. మూడో రోజు రాత్రి 7 గంటలకు ’కార్డీలియాస్ మ్యూజిక్ ఫియస్టా‘లో హాలీవుడ్, బాలీవుడ్తో సహా సౌత్ హిట్స్ను లైవ్ ఆర్కెస్ట్రాతో సింగర్స్ పాడుతుంటే.. ఈలలు, చప్పట్లు, డ్యాన్సులతో హాలంతా దద్దరిల్లింది!! ఇక విదేశాల్లోని ఫేమస్ డ్యాన్స్ అండ్ మ్యూజికల్ షో ‘బర్లెస్క్’ మూడో రోజు రాత్రి 10.30కి ప్రదర్శించారు. బాలీవుడ్ థీమ్తో హాట్ హాట్ దేశ విదేశీ భామలు చేసే హంగామా కనువిందు చేస్తుంది!! ఇది పెయిడ్ షో, 18+ వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది.
సన్రైజ్, సన్సెట్.. మాటల్లేవ్!!
క్రూయిజ్ జర్నీలో ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడనివి సన్రైజ్, సన్సెట్. వేకువజామున లేలేత సూర్యకిరణాలు సాగరంపై పడుతూ.. పసిడి వర్ణంలో ధగధగమంటూ కనువిందు చేసే ఆ దృశ్యాన్ని చూస్తే మనసు ఆకాశంలో అలా తేలిపోతుంది! బాల్కనీలో చీర్స్ కొట్టి కడలిపై అరుణోదయ అందాలను కెమెరాల్లో బంధించాం. ఇక సాయంత్రం అయ్యేసరికి 11వ అంతస్తుపై సూర్యాస్తమయం కోసం గెస్ట్ల ఎదురుచూపులు మొదలయ్యాయి. ఎరుపు వర్ణంలో కాంతులీనుతూ సాయం సంధ్య వేళ భానుడు అస్తమించే సన్సెట్ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు!! చుట్టూ సముద్రం మధ్యలో మనం జర్నీ చేస్తున్న క్రూయిజ్ తప్ప ఇంకేమీ కనబడని చోట సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూస్తే.. నేచర్ లవర్స్ గుండెజారి బంగాళాఖాతంలో గల్లంతవ్వాల్సిందే!!
నిజంగానే ‘ఎంప్రస్‘...
పేరుకు తగ్గట్టే ‘ఎంప్రస్’ది నిజంగా మహారాణి దర్పమే. దీని పొడవు 210 మీటర్లు (దాదాపు 692 అడుగులు) కాగా, వెడల్పు 36 మీటర్లు, ఎత్తు 47 మీటర్లు. మొత్తం బరువు 48,500 టన్నుల పైనే. 11 డెక్లు (అంతస్తులు) ఉన్న ఈ క్రూయిజ్‌లో మొత్తం 796 గెస్ట్ క్యాబిన్లు (రూమ్స్) ఉంటాయి. సుమారు 2,000 మంది ప్రయాణికులకు అతిథ్యం ఇస్తుంది. ఇక ఇందులో 600–700 మంది సిబ్బంది ఉంటారు. నాలుగు ఇంజిన్లుండే దీని గరిష్ట వేగం 19 నాటికల్ మైళ్లు (గంటకు 35 కిలోమీటర్లు). మేము ‘బ్రిడ్జ్ టూర్’కు కూడా వెళ్లాం. దీనికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కచ్చితంగా అందరూ చూసితీరాలి.
6వ డెక్లో షిప్ ముందు భాగంలో కెప్టెన్ ఇతరత్రా సిబ్బంది ఉండే ఆపరేషనల్ ప్రదేశం ఇది. ఇక్కడ మాకు ఫ్రాన్స్కు చెందిన థర్డ్ ఆఫీసర్ ‘లూసియన్’ షిప్ గురించి బోలెడన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. నిజానికి చాలా కొత్తగా కనిపిస్తున్న ఈ షిప్ను రాయల్ కరీబియన్ క్రూయిజెస్ కోసం ఫ్రాన్స్ కంపెనీ దాదాపు 32 ఏళ్ల క్రితం 1990లో తయారు చేసిందట. అక్కడి నుంచి చేతులు మారుతూ చివరికి కార్డీలియా చెంతకు చేరింది. అయితే, ప్రతి రెండేళ్లకోసారి పూర్తిగా దీని రూపురేఖలను మార్చేస్తుంటారు, అందుకే ఎప్పుడూ కొత్తగా అలరిస్తుంది. ఇక బ్రిడ్జ్ టూర్లో అన్నింటికంటే అబ్బురపరిచే అంశం షిప్ స్టీరింగ్. కేవలం ఒక అంగుళం పొడవున్న వీడియోగేమ్ తరహా జాయ్ స్టిక్తో అంత పెద్ద ఐరావతంలాంటి క్రూయిజ్ను అలవోకగా ఎటుకావాలంటే అటు తిప్పొచ్చని లూసియన్ చెబుతుంటే.. అంతా అవాక్కయ్యారు!! ఈ ట్రిప్లో ఎంప్రెస్ గంటకు 12–14 కిలోమీటర్ల వేగంతో.. తీరం వెంబడి 80–120 కిలోమీటర్ల దూరంలో జర్నీ చేసింది. అక్కడ సముద్రం లోతు 2 కిలోమీటర్ల పైమాటే!!
అన్నీ పూసగుచ్చినట్లుగా...
నగరాన్ని తలపించే క్రూయిజ్లో ఏది ఎక్కడ ఉంది.. ప్రోగ్రామ్లు, ఈవెంట్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవడం కాస్త కష్టమే. అయితే, గెస్ట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ వివరాలన్నింటితో చిన్న బ్రోచర్ను ఏరోజుకారోజు ప్రతి రూమ్లో ఉంచుతారు. దీన్ని కచ్చితంగా మన వెంట ఉంచుకోవడం లేదంటే ఫోన్లో పిక్ తీసుకోవడం బెటర్. ఇక అయిదో డెక్లో రిసెప్షన్ పక్కన ఉన్న బాక్సాఫీస్లో పెయిడ్ ఈవెంట్లు, షోలకు సంబంధించిన టిక్కెట్లు లభిస్తాయి.
రూమ్స్ ఎన్ని రకాలంటే..?
ఇంటీరియర్ స్టేట్రూమ్, ఓషన్ వ్యూ, మినీ సూట్, సూట్, చైర్మన్స్ సూట్ అనే 5 రకాల రూమ్స్ ఉంటాయి. 63 మినీ సూట్లు, 5 సూట్లు ఉండగా, చైర్మన్ సూట్ మాత్రం ఒకేఒక్కటి ఉంది. ఇక మిగతావన్నీ ఇంటీరియర్ (విండో ఉండదు), ఓషన్ వ్యూ (విండో ఉంటుంది) స్టేట్ రూమ్లే. వీటిలో కూడా మళ్లీ స్టాండర్డ్, ప్రీమియం అని రెండు రకాలున్నాయి. స్టాండర్డ్ రూమ్లన్నీ 3, 4 డెక్స్లో, ప్రీమియం రూమ్స్ 8, 9 డెక్స్లో ఉంటాయి. అంతేకాదు, ఈ గెస్ట్లకు అన్నిరకాల షోలు, ఏరియాలు, ఈవెంట్లకూ యాక్సెస్ ఉండటంతో పాటు ‘హ్యాపీ అవర్’ మరో బోనస్. మినీ సూట్కు బాల్కనీ ఉంటుంది. సూట్ రూమ్లో పేద్ద బాల్కనీ, లివింగ్ రూమ్, బెడ్రూమ్ వంటి లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి. ఇక అల్టిమేట్ లగ్జరీతో, సకల సదుపాయాలన్నీ చైర్మన్స్ సూట్ సొంతం. భారీ బాల్కనీ, ప్రత్యేక డైనింగ్, లివింగ్ రూమ్, బెడ్రూమ్, ఇలా అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ను తలపిస్తుంది.
రేట్లు ఎంతెంత?
క్రూయిజ్ అనగానే వామ్మో టూర్ ప్యాకేజీ లక్షల్లో ఉంటుందనే అపోహ మీకే కాదు నాక్కూడా ఉండేది. అయితే, సాధారణ మధ్యతరగతి కుటుంబం సైతం లగ్జరీ క్రూయిజ్ జర్నీ చేసేలా రూమ్లు, డిస్కౌంట్లు, గ్రూప్ ప్యాకేజీలను కార్డీలియా అందిస్తోంది.
ఇద్దరు పెద్దవాళ్లకు 2 నైట్స్, 3 డేస్ ప్యాకేజీ ప్రారంభ ధరలు చూస్తే (పన్నులతో)...
ఇంటీరియర్ స్టేట్రూమ్ స్టాండర్డ్: రూ. 44,174
ఓషన్ వ్యూ స్టాండర్డ్: రూ.54,120
మినీ సూట్: రూ.85,413
సూట్: రూ.1,42,846
చైర్మన్ సూట్: రూ.2,37,831
అంటే ఇంటీరియర్ స్టాండర్డ్ స్టేట్రూమ్కు ఒక్కో వ్యక్తికి రూ.22,000 చార్జీ(ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అన్నీంటితో) పడుతుంది. మూడు రోజుల పాటు ఫైఫ్స్టార్ లగ్జరీతో పాటు సముద్ర ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ రేట్లు విమాన టిక్కెట్ల మాదిరిగా డైనమిక్గా మారుతుంటాయి. ముందుగా బుక్ చేసుకుంటే చాలా తక్కువకు లభించవచ్చు. 3, 5 నైట్స్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. నలుగురు కలిసి ఒక రూమ్ బుక్ చేసుకుంటే మిగతా ఇద్దరికీ క్యాబిన్ ధరలో సగం డిస్కౌంట్(స్పెషల్ ఆఫర్స్), 12 ఏళ్ల లోపు చిన్నారులకు షరతులకు లోబడి ఉచిత జర్నీ (పన్నులు కాకుండా), గ్రూప్ బుకింగ్స్లో ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది. https://www.cordeliacruises.com/cruise-routes వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు లేదా వెబ్లోని కాంటాక్ట్ నంబర్లకు కాల్ చేస్తే మొత్తం వివరాలన్నీ చెప్పడంతో పాటు బుకింగ్ కూడా చేసేస్తారు.
గమ్య స్థానాల్లో ఆన్షోర్ సిటీ టూర్ ఆప్షన్ కూడా ఉంది. తూర్పు తీరంలో ‘ఎంప్రెస్’ మాన్సూన్ టూర్ సీజన్ సెప్టెంబర్తో పూర్తయింది. ఇక పశ్చిమ తీరంలోని ముంబై, కొచ్చి, లక్షద్వీప్, గోవాలో వచ్చే ఏడాది మే వరకూ ఆతిథ్యం ఇస్తుంది. మళ్లీ జూన్ తర్వాత చెన్నైకి చేరుకుని తూర్పు యాత్రకు సిద్ధమవుతుంది. అంతేకాదు, 2023 జూన్ కల్లా ఎంప్రెస్–2 (దాదాపు 3,500 ప్రయాణికుల సామర్థ్యం) కూడా కార్డీలియా చెంతకు చేరే అవకాశం ఉంది.
ఫుడీస్‌కు పండగే...
కార్డీలియా ‘ఎంప్రెస్’లో ఫుడ్... భోజనప్రియులకు పండగే! రూమ్ స్టేతో పాటు ఉదయం బ్రేక్ పాస్ట్ నుంచి లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్, అర్థరాత్రి శాండ్విచ్ల వరకూ అన్నీ ఉచితమే. తిన్నోళ్లకు తిన్నంత అనేలా రకరకాల వెరైటీలతో చూస్తేనే కడుపునిండిపోయే రేంజ్లో మెనూ ఉంటుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటు నోరూరించే రకరకాల స్వీట్స్, డెసర్ట్స్, ఫ్రూట్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా దక్షిణాది వంటకాలనూ వడ్డిస్తున్నారు. రెండంతస్తుల స్టార్లైట్ రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్లో ఫుడ్ అందరికీ కామన్ ఇంకా ఫ్రీ కూడా. చాప్స్టిక్స్ పెయిడ్ రెస్టారెంట్ మాత్రం హైలైట్. దీనిలో ఆసియాలోని అన్ని దేశాలకు చెందిన క్యుజీన్స్ (వంటకాలు)తో పాటు.. షెఫ్స్ టేబుల్ అనే ప్రత్యేకత కూడా ఉంది.
కనీసం ఆరుగురు బుక్ చేసుకుంటే.. స్వయంగా చీఫ్ షెఫ్ పర్యవేక్షణలో మన టేస్ట్కు అనుగుణంగా వంటకాలను వండి వడ్డిస్తారు. కాక్టెయిల్స్ (హాట్ డ్రింక్స్), మాక్టెయిల్స్ వంటి పానీయాల కోసం క్రూయిజ్లో అనేక బార్ లాంజ్లు ఉన్నాయి. ఇది పూర్తిగా పేమెంట్ సర్వీస్. ఫుడ్ తినే చోటే కాకుండా, ఎంటర్టైన్మెంట్ షోలు, స్విమ్మింగ్ పూల్ ఇలా మనం ఎక్కడున్నా వీటిని సర్వ్ చేస్తారు. ప్రీమియర్ క్యాబిన్ గెస్ట్లకు ‘హ్యాపీ అవర్’ ప్రత్యేకం. గంటపాటు ఏది తాగినా 1+1 ఆఫర్తో కుమ్మేయొచ్చన్నమాట!! సిబ్బందితో కలిపి దాదాపు 2,600 మందికి ఘుమఘుమలాడే వంటకాలను సిద్ధం చేసేందుకు ఇందులో ఏకంగా ఫుడ్ ఫ్యాక్టరీ ఉంది. తెలంగాణకు చెందిన షెఫ్ శ్రీనివాస్, చీఫ్ షెఫ్ అశ్విన్ కుమార్ ఫుడ్ తయారీ నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ వరకూ అన్నీ చూపించి, వివరించారు. ఫ్రీగా ఇచ్చేవి కాకుండా, మనం ఏది కొనుక్కున్నా రేటు ఘాటుగానే ఉంటుంది.
పూల్.. సముద్రంలో ఈదినట్లే!
క్రూయిజ్ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయడం అనేది మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. ఈత రాకపోయినా పర్లేదు. లైఫ్ జాకెట్లు వేసుకొని జలకాలాటల్లో.. అంటూ తేలిపోవచ్చు. పిల్లల కోసం ప్రత్యేకంగా పూల్ ఉంది, మూడేళ్లలోపు బుడుగులకు సైతం పాండ్స్ ఉండటం విశేషం. దీనిలో సముద్రపు నీటిని నింపుతారు. షిప్ కదులుతుండటం వల్ల పూల్లో నీరు అలల మాదిరిగా పైకి, కిందికి కదులుతుంది. దీనివల్ల మనం సముద్రం నీటిలో ఉన్నట్లే ఫీల్ అవుతాం. అన్ని రూమ్స్ వాళ్లకూ పూల్ యాక్సెస్ ఉంటుంది.
ఫన్.. అన్లిమిటెడ్!
అరే, రోజు అప్పుడే అయిపోయిందా అనిపించేలా క్రూయిజ్లో అన్లిమిటెడ్ వినోదం మనల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. ప్రత్యేక డ్యాన్స్, మ్యూజిక్ షోలతో పాటు లైవ్ బ్యాండ్స్ సైతం సంగీత ప్రియులను మైమరపిస్తాయి. ‘డోమ్’ నైట్ క్లబ్ డీజేలో డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లిపోతూ.. పార్టీ ఫ్రీక్స్లో ఫుల్ జోష్ నింపుతుంది. షిప్ మొత్తం ఎక్కడికెళ్లినా మాంచి మ్యూజిక్తో ఏదో తెలియని వైబ్ మనల్ని ఉరకలేయిస్తుంది. 24 గంటలూ జనాల కోలాహలంతో క్రూయిజ్లో ఉన్నంతసేపూ ఏదో జాతరలో ఉన్నామన్న ఫీలింగ్ కలిగింది.
ఇక మెగా హౌసీ, ట్రెజర్ హంట్... మినీ ఒలింపిక్స్... మ్యాజిక్ షో.. వీడియో గేమ్స్.. ఇంటర్నెట్ కేఫ్.. కార్డ్స్ ప్లే ఏరియా... లైబ్రరీ.. కిడ్స్ అకాడమీ... ఫోటో గ్యాలరీ అండ్ స్టూడియో.. టేబుల్ టెన్నిస్.. జిమ్.. స్పా.. పూల్ బార్.. ఇలా ఒకటేంటి చిన్నాపెద్దా అందరికీ అంతులేని ఆటవిడుపే!! ఇంటర్నెట్ కోసం శాటిలైట్ వైఫై (పే చేయాలి) కూడా ఉంది. అడ్వెంచర్ లవర్స్ కోసం రాక్ క్లయింబింగ్ ప్రత్యేకం. దేశంలో సముద్రంపై అత్యంత ఎత్తయిన రాక్ క్లయింబింగ్ కూడా ఇదే. క్రూయిజ్ కదులుతుంటే.. దీన్ని ఎక్కడం అనేది అదిరిపోయే థ్రిల్!! ఇక జూద ప్రియులను ‘కేసినో రాయల్’ రారమ్మంటుంది. సరదాగా మేము కూడా దీన్ని కాసేపు ఎంజాయ్ చేశాం. అయితే, తీరం నుంచి అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి అంటే, 12 నాటికల్ మైళ్ల (22 కి.మీ) దూరం క్రూయిజ్ వెళ్లాకే కేసినో తెరుస్తారు. ఇందులో ఆడకపోయినా .. కనీసం ఆ యాంబియెన్స్ కోసమైనా దీన్ని చూసితీరాల్సిందే. జాక్పాట్ కొట్టినవాళ్లు చేసే హంగామా మామూలుగా ఉండదు మరి!!
అంతా డాలర్లలోనే...
ఒక్కసారి క్రూయిజ్లోకి ఎక్కామంటే మనం విదేశంలో ఉన్నట్లే లెక్క. చెల్లింపులన్నీ డాలర్లలో ఉంటాయి. రిసెప్షన్ దగ్గర మన రూపాయలను క్యాష్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తే డాలర్లు ఇస్తారు. అదీకూడా క్యాష్ కాదు.. మనకిచ్చిన యాక్సెస్ కార్డులో వేస్తారు. ఇక ఎక్కడ ఏది చెల్లించాలన్నా ఈ కార్డు ఇస్తే చాలు. రేట్లన్నీ డాలర్లలోనే ఉంటాయి. డబ్బులు అయిపోతే, మళ్లీ లోడ్ చేసుకోవచ్చు. 24 గంటలూ ఈ సర్వీస్ ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ మిగిలితే క్రూయిజ్ దిగే ముందు క్యాష్ రూపంలో తిరిగి ఇచ్చేస్తారు.
ఇలా... టన్నులకొద్దీ మధుర స్మృతులను నింపుకుని చెన్నైలో క్రూయిజ్ దిగుతుంటే.. నాలుగు రోజుల టూరు నాలుగు నిమిషాల్లో అయిపోయినట్టు అనిపించింది. విందు వినోదం.. సాహసం.. ప్రకృతిలో పరవశించిపోవడం.. వీటి కోసం హాలిడే ట్రిప్ వేయాలంటే జర్నీ చేయాల్సిందే. మరి ఆ ప్రయాణమే ఒక గమ్య స్థానం అయితే, ఇవన్నీ కూడా జర్నీ చేస్తూనే ఎంజాయ్ చేస్తే.. క్రూయిజ్ ప్రయాణంతో ఈ అనుభూతులన్నీ సొంతం చేసుకోవచ్చు. నడిసంద్రంలో సకల సౌకర్యాలున్న కదిలే దీవిలో అలా చక్కర్లు కొడుతూ నేచర్ను ఆస్వాదించడం అనేది జీవితాంతం గుర్తుండే జ్ఞాపకంగా నిలిచిపోతుంది! మరింకేం లగేజీ సర్దేయండి.. గెట్ సెట్ క్రూయిజ్!!
-శివరామకృష్ణ మిర్తిపాటి
ఫోటోల సహకారం: సూర్య చైతన్య వానపల్లి
Comments
Please login to add a commentAdd a comment