పేద్ద.. క్రూయిజ్ ఓడ నీళ్లలో వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఓ బిల్డింగే అలా కదిలిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. ఆ ఓడలను అంతలా అద్భుతంగా నిర్మిస్తుంటారు. రోడ్రిగ్యుయెజ్ డిజైన్ అనే కంపెనీ కూడా తామేం తీసిపోలేదంటూ కళ్లు చెదిరే ఓ ఓడ డిజైన్‌ను రూపొందించింది. 110 మీటర్ల పొడవు.. 26 మీటర్ల ఎత్తున్న అతిపెద్ద ఈ ఓడను పక్కనుంచి చూస్తే ఓ లగ్జరీ హోటలేనా అనిపించేట్టు ఉంటుంది. ఈ డిజైన్‌తో ఓడను నిర్మించాలంటే ఓడలో వాడే వస్తువులు, నిర్మించే కంపెనీని బట్టి దాదాపు రూ.2,500 కోట్ల వరకు ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది. ఓడకు ‘మలేనా’ అని పేరు పెట్టింది.
ఓడలో మొత్తం 11 క్యాబిన్లు ఉంటాయి. వీటన్నింటిలో కలిపి 24 మంది ప్రయాణించొచ్చు. ఓడ ప్రధాన డెక్‌లో 6 వీఐపీ క్యాబిన్లు ఉంటాయి. లోయర్ డెక్‌లో 4 డబుల్ క్యాబిన్ డెక్‌లు, ఒక యజమాని అపార్ట్‌మెంట్ ఉంటాయి. ఇందులో హాట్ టబ్, డైనింగ్ ప్రాంతం ఉంటుంది. లోయర్ డెక్‌లోనే 9 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పుతో రెండు ఇన్‌ఫినిటీ పూల్స్, వీటితో పాటు సన్ బెడ్స్ ఉంటాయి. అలాగే ఏడుగురు కూర్చునేలా బార్ ఉంటుంది.
లోయర్ డెక్ నుంచి మెట్లెక్కి పైకి వెళ్తే అప్పర్ డెక్ వస్తుంది. ఇక్కడ ఓ పెద్ద డైనింగ్ ఏరియా ఉంటుంది. 24 మంది కలిసి కూర్చొని తినవచ్చు. అప్పర్ డెక్‌లో ఒక హెలిప్యాడ్ కూడా ఉంటుంది. ఏసీహెచ్ 160 లేదా అలాంటి పరిమాణంలోని హెలికాప్టర్లు దీనిపై ల్యాండ్ చేయవచ్చు.
(చదవండి: వామ్మో ! కుక్కపిల్ల మాదిరి సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చేసింది!!)
నిర్మాణానికే నాలుగైదేళ్లు
ఓడలో అన్నింటికన్నా పైన సన్ డెక్ ఉంటుంది. దీన్నే పార్టీ డెక్ అని కూడా అంటారు. ఇక్కడ మరో హాట్ టబ్, కూర్చునేందుకు ఓ ప్రాంతం, ఓ బార్ కూడా ఉంటాయి. బోటు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది. డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఇంధనాలతో కలిసి నడుస్తుంది. బోటును నిర్మించడానికి దాదాపు 4 నుంచి 5 ఏళ్లు పడుతుందని కంపెనీ యజమాని చెప్పారు. ప్రస్తుతానికి ఇది డిజైన్ మాత్రమే అయినా ఓడ నిర్మాణానికి ఓ షిప్ యార్డ్‌తో, నిర్మించాలనుకుంటున్న వ్యక్తితో సంప్రదింపులు జరుపుతున్నామని డిజైన్ కంపెనీ చెప్పింది.
(చదవండి: లాక్‌డౌన్‌తో ఆగమాగం .. చైనీయుల ఆకలి కేకలు, అయినా తగ్గేదే లే!)
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment