
ఎవడో రహస్యంగా బాటిల్ మూత తీసి, అందులోని యాసిడ్‌ను ఆమె మొహం మీదికి విసిరాడు. కణకణ మండే ఎర్రటినిప్పులు చర్మపు లోతుల్లోకి బాకుల్లా దిగినట్లు భరించలేని బాధ! ఆ చుట్టుపక్కల ఒక్కసారిగా అలజడి. పోలీసుల హడావుడి. దూరంగా అంబులెన్స్ సైరన్. దిగ్గున లేచి కూచుంది రేష్మ. తలలోంచి చెమట్లు కారుతున్నాయి. గొంతు ఆర్చుకుపోతోంది. పక్కనే పాప ప్రశాంతంగా నిద్రపోతోంది. టైవ్‌ు చూసింది. నాలుగున్నర కావస్తోంది. తెల్లవారబోతున్నా రణధీర్ జాడలేదు. లేచి, లైటు వేసింది. మంచినీళ్లు తాగి, అద్దం ముందు నుంచుంది. తొమ్మిది సర్జరీలతో పునర్జన్మ పొందిన ముఖాన్ని రెండు అరచేతుల్తో తడుముకుంది. కళ్లలో కాస్తంత భయం తప్ప, ముఖవర్చస్సులో లోపం కనిపించలేదు. మరి, అతనికేం విహీనకళ కనిపిస్తోంది?‘నేనిప్పటికీ నీ అంతఃసౌందర్యాన్నే చూస్తా డియర్. అమ్మలక్కలెవరో చేటల్తో నిప్పులు చెరుగుతుంటారు. పట్టించుకోవద్దు’ అంటాడు రణధీర్.మొదట్లో నిజమేననుకునేది. రాన్రానూ ఆ నిప్పులు రణధీర్‌లోంచే విడుదలవుతున్నాయేమోనన్న సందేహం మొదలైంది. ఆ సందేహం క్రమంగా బలపడసాగింది. పడుకున్నా, నిద్ర కమ్ముకోవడం లేదు. రేష్మ మనసు తీరం వెంట గాయాలు కవాతు చేస్తున్నాయి.
∙∙
మరో నెల రోజులుంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చివరి సంవత్సరం పరీక్షలు అయిపోయేవి. అంతలోనే అజిత్ రూపంలో ముంచుకొచ్చింది ఉపద్రవం. తనో క్లాస్‌మేట్. పనిగట్టుకు పలకరించేవాడు. సినిమాలూ షికార్లూ అనేవాడు. ‘‘కాళ్లమీద నిలబడు’’ అని కసిరేది.ట్యాంక్‌బండ్ మీద కాసేపు కబుర్లు కావాలనేవాడు. ‘‘పాఠాల గురించి మాట్లాడు’’ అనేది.ఎదురు చెప్పేవాడు కాదు. కానీ, అంతరాంతరాల్లో ఏదో వికారం పెరిగి పెద్దదయింది.కాఫీక్కూడా తిరస్కరించిందని ఆరోజు రగిలిపోయాడు. సాయంత్రం ఆమె తన హాస్టలు వైపు వెళుతుండగా అజిత్ దారి కాచి, రేష్మ మీద యాసిడ్ చల్లాడు. అది ఆమె మొహం మీదా, చేతుల మీదా పడింది. మంటకు తాళలేక, రేష్మ పెట్టిన గావుకేక క్యాంపస్ అంతా ప్రతిధ్వనించింది. విద్యార్థులూ అధ్యాపకులూ పరుగెత్తుకొచ్చారు. పోలీసులొచ్చారు. తనను అంబులెన్స్‌లోకి ఎక్కించడం లీలగా గుర్తుంది రేష్మకు. స్పృహ వచ్చేసరికి ముఖానికీ, చేతులకూ బ్యాండేజీలున్నాయి. మంటలింకా శరీరపు లోతుల్లోకి పాకుతూనే ఉన్నాయి. తల్లి వచ్చి తల నిమిరింది. మంటలు మెల్లగా చల్లారుతున్నట్టు ఒక్క క్షణం దివ్యానుభూతి. తండ్రి దగ్గరగా వచ్చాడు, కళ్లనిండా నీళ్లతో. ఆమెకు ఏడుపు తన్నుకొచ్చింది, వెక్కిళ్ల సాక్షిగా తల్లి ఓదార్చింది. ధైర్యం చెప్పింది. భర్తను కళ్లతో హెచ్చరించింది. డాక్టర్లు వచ్చారు. వస్తూనే ఉన్నారు. విస్తృతంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు.పోలీసులు వచ్చారు. వివరాలడిగి తెలుసుకున్నారు. ఏవేవో రాసుకున్నారు.ఓ మంత్రిగారు, ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు. మేమున్నామంటూ భరోసా ఇచ్చారు.జర్నలిస్టులు వచ్చారు. టీవీ కెమెరామన్ ఒకడు డెడ్ క్లోజప్పులో షూట్ చేస్తుండగా, రేష్మ తల్లి బద్దలయింది. ఆగ్రహంతో ఊగిపోయింది. ‘నడవండి బయటికి’ అంటూ అపరకాళిలా గర్జించింది.వైద్యులు శక్తివంచన లేకుండా ప్రాథమిక చికిత్సలు పూర్తి చేశారు. ప్రాణాపాయం లేదన్నారు. పూర్తిగా కోలుకోవడానికి నాలుగైదు నెలలు పడుతుందన్నారు. మల్టిపుల్ సర్జరీలు అవసరమన్నారు.ప్రభుత్వ సాయంపై ‘దండి’గా నమ్మకమున్న తండ్రి ఎక్కడెక్కడో తిరిగి డబ్బు సమకూర్చుకున్నాడు.సర్జరీలు మొదలయ్యాయి. మొదటిరోజే మూడు.
వారం తర్వాత మరో రెండు సర్జరీలు. మరో నెల వ్యవధిలో ఇంకో నాలుగు. నాలుగున్నర నెలల తర్వాత ఇంటికి. ప్రకాశం జిల్లాలోని ఆ మారుమూల పల్లెటూరులో ఆమెను చూడటానికి జనం క్యూ కట్టారు. ఒక్కసారి మొహం మీద ముసుగు తీయమంటారు. చూసి, బోలెడు సానుభూతి కురిపిస్తారు. కొందరు పరామర్శకే పరిమితం కాకుండా, ఏవేవో కామెంట్లు...
‘‘సన్నాసోడు, వాడి కాళ్లూచేతులూ పడిపోనూ’’.‘‘ఆ జిత్తులమారి అజిత్తు గాడ్ని ఉరి తియ్యాలి’’.‘‘ఏదో ప్రేమ యవ్వారం అంట! ఈ అమ్మాయిది తప్పేం ఉండదంటావొదినా?’’‘‘తప్పెప్పుడూ ఒక పక్కనే ఉంటదా?’’
రేష్మ కుంగిపోయింది. జనం రాకుండా తల్లి కట్టడి చేయగలిగిందేగానీ, కూతురి మనసులో రేగిన వాయుగుండాన్ని మాత్రం తీరం చేర్చలేకపోయింది.జీవితాంతం ఇలా ముసుగులో బతకాల్సిందేనా? అపనిందలతో తీసుకోవాల్సిందేనా?రేష్మలో ఇలాంటి ప్రశ్నలు పరంపరగా పుట్టుకొచ్చి, బతుకు మీద మమకారాన్ని చంపేశాయి.
ఆరోజు తండ్రి పొలం వెళ్లాడు. తల్లి గుడికి బయల్దేరింది, అలా బయటికి వెళ్లిందో లేదో గదిలో ఫ్యానుకు తాడును వేలాడదీసే ప్రయత్నాలు ప్రారంభించింది రేష్మ. ఏదో మర్చిపోయిన తల్లి, నిమిషంలోపే తిరిగొచ్చింది. కూతురి అఘాయిత్యాన్ని పసిగట్టి, మంచం మీద కూలబడింది. తండ్రీ వచ్చాడు.సమస్య తలెత్తిన ప్రతిసారీ ఒక పరిష్కారమై వికసించే తల్లి ఈసారి కుమిలి కుమిలి ఏడుస్తోంది. తను ఏది అడిగినా కాదనకుండా అమర్చిపెట్టడం తప్ప పెద్దగా మాట్లాడని తండ్రి ఈసారి నోరు విప్పాడు.
‘‘నేను పెద్దగా చదువుకోలేదమ్మా. నాకు తెలిసిన ఏకైక విద్య వ్యవసాయం. మా నాన్న పంచి ఇచ్చిన అయిదెకరాల్ని కష్టపడి పదకొండెకరాలు చేశా. అంత తేలిగ్గాదమ్మా. నకిలీ విత్తనాలు, కల్తీ మందులు, గిట్టుబాటు కాని ధర... ఇవన్నీ ఒక ఎత్తయితే అవసరానికి కురవని వానలు, పంట చేతికొచ్చే సమయంలో ముంచుకొచ్చే తుపాన్లు... కాళ్లానించి నుంచున్న నేల హఠాత్తుగా పాతాళంలోకి కుంగిపోతే ఎట్లా ఉంటుంది? అనేకసార్లు అట్లా నా కాళ్లకింద నేల కదిలిపోయింది. నిజానికి అలాంటప్పుడు ఆత్మహత్యే శరణ్యం. ఆ లెక్కన నేనిప్పటికి ఒక వందసార్లు ఉరేసుకుని ఉండాల్సింది...’’
రేష్మ, ఆమె తల్లి చేష్టలుడిగి వింటున్నారు.‘‘నువ్వు నీ జీవితం గురించి ఆలోచిస్తున్నావు. నేను రేపు నీలాంటి బాధితుల గురించి ఆలోచిస్తున్నాను. లండన్‌కు చెందిన రేషవ్‌ుఖాన్ ఒక మోడల్. తన ఇరవయ్యొకటో ఏట యాసిడ్ దాడికి గురైంది. నెలల తరబడి ఆస్పత్రిలో నరకం అనుభవించింది. గాయాలు తగ్గగానే, కొత్త ఉత్సాహంతో మళ్లీ మోడలింగ్ మొదలు పెట్టింది. ఇదో పబ్లిసిటీ అని కొంతమంది విమర్శించారు. ఆమె కుంగిపోలేదు. ‘నా మేకప్ వెనక, చర్మం పొరల కింద మండుతున్న గాడిపొయ్యి సెగను అర్థం చేసుకోగల హృదయం మీకుంటుందని నేననుకోను’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. ఒక బ్లాగ్ మొదలుపెట్టి, తన అనుభవాలు రాసింది. తనలాంటి బాధితులకు మార్గనిర్దేశం చేసింది...’’తల్లీకూతుళ్లు ఆశ్చర్యంగా వింటున్నారు.‘‘గూగుల్‌లో చదివానమ్మా. వచ్చీరాని ఇంగ్లిషు. సరిగా చెప్పానో లేదో తెలియదు. ఏ విషయాన్నైనా ఇట్టే పసిగట్టగలవని నీపై నాకో నమ్మకం...’’ తండ్రి కళ్లు తుడుచుకుంటూ లేచిపోయాడు.
రేష్మ హైదరాబాదు చేరుకుంది. ఆరునెలలు తిరక్కుండా ఫైనల్ ఇయర్ పాసయింది. ఓ బిజినెస్ ప్రపోజల్‌తో వారంపాటు బ్యాంకు చుట్టూ తిరిగి, చివరికి ఆ మేనేజర్‌ను ఒప్పించి, పది లక్షల రూపాయల ముద్ర లోన్ సంపాదించింది. పంజాగుట్టలో ఓ షాపును అద్దెకు తీసుకుని, ‘‘రేష్మ బొటిక్’’ ప్రారంభించింది. పార్ట్‌టైవ్‌ు కటింగ్ మాస్టర్‌ను పెట్టుకుంది. అయిదుగురు ప్రొఫెషనల్ టైలర్లను నియమించుకుంది. ఓ స్నేహితురాలి ద్వారా బంజారాహిల్స్ కస్టమర్లు దొరికారు. తన డిజైన్లు వారి మనసుకు హత్తుకున్నాయి. తన పట్ల సానుభూతి చూపుతూ పనినిచ్చే కస్టమర్లను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించేది. నాలుగు నెలలు తిరక్కుండానే తన సిబ్బంది, కుట్టుమిషన్లు రెట్టింపయ్యాయి.
ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీలకు గెస్ట్‌లెక్చర్‌గా వెళ్లేది. సెమినార్లలో పాల్గొనేది. చేతినిండా పని. క్షణం తీరిక లేదు. ప్రతినెలా తన సంపాదనలోంచి ఇరవై శాతం పక్కన పెట్టి, తనలాంటి అభాగ్యులను ఆదుకోవాలని నిర్ణయించింది. అందుకోసం ‘రేష్మ ఫౌండేషన్’ను రిజిస్టర్ చేసింది. ఆమె విజయగాథను వివరిస్తూ ఓ ప్రముఖ దినపత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. అది చదివి, తనను వెతుక్కుంటూ వచ్చాడు రణధీర్. ‘‘మీ అభిమానిని’’ అంటూ లొడలొడా మాట్లాడాడు.
‘‘ఇన్ని కష్టాలను అధిగమిస్తూ మీరు ఉన్నత శిఖరాలకు చేరడం నిజంగా గ్రేట్’’ అంటూ పొగిడాడు.అది మొదలు దాదాపు ప్రతిరోజూ కలిసేవాడు. తానో స్వచ్ఛందసంస్థలో పని చేస్తున్నట్లు చెప్పాడు. సామాజిక సేవకే జీవితం అంకితమన్నాడు. ఓరోజు ‘‘మీకభ్యంతరం లేకపోతే, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా’’నన్నాడు.ఆమె నవ్వింది. ‘‘నా మొహం సరిగ్గా చూసి చెప్పండా మాట’’ అంది ముడతల్ని తడుముకుంటూ.
‘‘ఓ రోగ్ చేసిన గాయమది. పైపై మెరుపులు కాదు, అంతఃసౌందర్యమే అసలైన స్వరూపం’’ అన్నాడు.‘‘చూడండి, సానుభూతితో ఏదో ఉద్ధరించడానికన్నట్లు ఎవరో నా జీవితంలోకి రావటానికి నేనొప్పుకోను. మాటలు చెప్పినంత తేలిగ్గాదు... మనిషిని రూపానికి అతీతంగా ప్రేమించడం. దయచేసి ఇంకెప్పుడూ ఈ విషయం నా దగ్గర ప్రస్తావించకండి’’ కరాఖండిగా చెప్పేసింది రేష్మ.రణధీర్ వదల్లేదు. ప్రతిరోజూ అభ్యర్థించాడు. ఆమె ఏమన్నా భరించాడు. చివరికి ఆమె మెత్తబడింది.తల్లిదండ్రులు వచ్చారు. రణధీర్‌తో మాట్లాడారు.
రిజిస్ట్రార్ ఆఫీసులో అత్యంత నిరాడంబరంగా జరిగింది పెళ్లి. సాక్షి సంతకం పెట్టడానికి వచ్చిన స్వచ్ఛందసంస్థ డైరెక్టర్ తన ఉద్యోగి రణధీర్ ఆదర్శానికి ముగ్ధుడయ్యాడు. అతనికి ప్రమోషన్ ఇచ్చాడు.బంజారాహిల్స్‌లో ఓ ఫ్లాటు అద్దెకు తీసుకుని, కాపురం పెట్టారు. ఇద్దరి జీవితాల్లోనూ సరికొత్త వెన్నెల. ఒకరికొకరుగా, ఇద్దరూ ఒకరిగా, రెండు ప్రపంచాలు ఏకమైనట్లుగా... రోజులు గడిచాయి.రేష్మ మరింత బిజీ అయిపోయింది. ఆమె వ్యాపారం నగరంలో నాలుగు శాఖలుగా విస్తరించింది.సినిమావాళ్లు కూడా సంప్రదిస్తున్నారు. కొత్త మోడళ్లు అడుగుతున్నారు. వర్క్ ఆర్డర్లు ఇస్తున్నారు.రెండేళ్లు నిండకుండానే పండంటి పాప పుట్టింది. తను బిజీ అయిపోవడంతో తల్లే హైదరాబాదు వచ్చి, పాప బాగోగులు చూసుకుంది. పాలు మానగానే, తనవెంట ఊరికి తీసుకెళ్లింది.‘‘గుడ్‌న్యూస్ డియర్. మాకు కొత్త ప్రాజెక్టు వచ్చింది. ఒడిశాలో ట్రైబల్ డెవలప్‌మెంట్. ఫారిన్ ఫండింగ్. ఈ ప్రాజెక్టుకు నన్నే హెడ్‌గా చేశారు మా బాస్’’ ఆనందంగా చెప్పాడు రణధీర్.‘‘అయితే అయ్యవారిక హైదరాబాదు, భువనేశ్వర్ల మధ్య చక్కర్లు కొడతారన్నమాట’’ మురిపెంగా అంది రేష్మ. పగలబడి నవ్వాడు రణధీర్.
అనుకున్నట్లే అతను నెలలో సగం రోజులు ప్రయాణాల్లో ఉండేవాడు. చేతినిండా పని ఉండటంతో రేష్మకూ ఆ లోటు కనిపించేది కాదు. కానీ, విమానాల్లో తిరగటం మొదలుపెట్టాక, భర్తలో ఏదో తెలియని తేడా గమనిస్తోంది. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడమా? ఖరీదైన వాచీలు కొనడమా? ఫారిన్ పర్‌ఫ్యూమ్‌సు వాడటమా? ఓరోజు రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికొచ్చాడు, మద్యం తాగి.‘‘ఇదెప్పట్నుంచి? ఏమిటీ కొత్త అలవాటు?’’ కళ్లు పెద్దవి చేసి అడిగింది రేష్మ.‘‘నోనో డియర్. అలాంటిదేమీ లేదు. ఫారిన్ నుంచి ఫండర్ వచ్చాడు. తాజ్‌లో డిన్నర్. మర్యాద కోసం నేనూ ఓ పెగ్గు తీసుకున్నానంతే’’.
‘‘దరిద్రం ఎప్పుడూ అలాగే మొదలవుతుంది...’’ ‘‘అరె, ఇప్పుడేమైందని! అంత చిరాకు పడతావ్?’’మాట్లాడలేదు రేష్మ. తాగేవాళ్లంటే ఆమెకు అసహ్యం. డైనింగ్‌లోకి నడిచి తనొక్కతే భోజనం కానిచ్చి, బెడ్‌రూములోకి వచ్చేసరికి రణధీర్ ముణగదీసుకుని నిద్రపోతున్నాడు.
ఆ వాసన కూడా పడని రేష్మ, డ్రాయింగ్ హాల్లోనే సోఫాలో పడుకుంది. రెండురోజుల తర్వాత...‘‘డియర్, నువ్వలా మౌనంగా ఉండటం బాలేదు. అలా చేసినందుకు సారీ. ఈరోజు సాయంత్రం మా ఆఫీసులో ఫంక్షన్. అందరూ కచ్చితంగా ఫ్యామిలీస్‌తో రావాలని మా బాస్ హుకుం. నేను నాలుగ్గంటలకల్లా వచ్చేస్తా. నువ్వు రెడీగా ఉండు. ప్లీజ్...’’ టిఫిన్ చేస్తూ అర్థించాడు రణధీర్.
అతని జాలిముఖం చూసి, పాపం అనిపించింది రేష్మకు. ఒప్పుకొంటున్నట్లుగా తలూపింది.
∙∙
అది పేరుకే స్వచ్ఛందసంస్థ. పక్కా కార్పొరేట్ హంగామా. రకరకాల స్నాక్స్. దేశవిదేశాల మద్యం బాటిళ్లు. ప్రతి ఒక్కరి చేతిలో గ్లాసు. అమ్మాయిలు కూడా యథేచ్ఛగా తాగుతున్నారు. రేష్మ సింపుల్‌గా వచ్చింది. సూటులో మెరిసిపోతున్న రణధీర్... ఆమెను అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఆమె గతం తెలిసిన కొందరు అబ్బురంగా చూశారు. ఒకామె అయితే ఆటోగ్రాఫ్ అడిగింది. నేనంత గొప్పదాన్ని కాదన్నా వినిపించుకోలేదు.
డైరెక్టర్ సమక్షంలో యాంకర్ ఒక్కో జంటనూ వేదిక మీదికి పిలుస్తోంది. ఆ ఉద్యోగి గొప్పతనాన్ని పాఠంలా చదువుతోంది. ఆనక డైరెక్టర్ మెమెంటో అందిస్తున్నాడు. తన వంతు రాగానే, రేష్మ చేతిలో చెయ్యేసి వేదికనెక్కాడు రణధీర్. యాంకర్ ఏదేదో చెబుతుండగా డైరెక్టర్ అడ్డు పడ్డాడు.‘‘రణా గురించి నేను చెబుతా. తనో అనాథ. కష్టాలు తెలిసిన మనిషి కాబట్టి కష్టాల్లో ఉన్నవారికి సేవలందించడంలో అగ్రస్థానంలో ఉంటాడు. సేవకు కుటుంబం ఆటంకం కాకూడదని పెళ్లి కూడా వద్దనుకున్నాడు. కానీ రేష్మ కలిశాక, ఆమె జీవితం గురించి తెలుసుకున్నాక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఆమె బాహ్య సౌందర్యాన్ని కాక అంతఃసౌందర్యాన్ని ప్రేమించాడు. ఆమెను ఆదుకోవాలనుకున్నాడు...’’చివాల్న తలెత్తి చూసింది రేష్మ. అదేమీ పట్టించుకోని డైరెక్టర్ తన ఉపన్యాసాన్ని కొనసాగించాడు...‘‘ఆమెకు ధైర్యమివ్వాలనుకున్నాడు. కొత్త జీవితం ప్రసాదించాలనుకున్నాడు. ఎంతో సానుభూతితో ఆలోచించి ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించాడు...’’చప్పట్లు మార్మోగుతుండగా, రణధీర్ సిసలైన రాజకీయ నాయకుడిలా రెండు చేతులూ గాల్లోకి ఎత్తి ఉద్యోగులందరికీ నమస్కరించాడు.రేష్మకు చర్మపు పొరల కింద మళ్లీ మంటలు మొదలయ్యాయి.
డైరెక్టర్ మెమెంటో అందిస్తూ ‘‘నిన్ను చేసుకున్నాక మా వాడి అరాచకం చాలా తగ్గిందమ్మాయ్’’ రహస్యం చెబుతున్నట్లుగా అన్నాడాయన.
రేష్మ పెదవులు విచ్చుకోకపోవడం రణధీర్ గమనిస్తూనే ఉన్నాడు. డిన్నర్ మొదలైంది. కొన్ని కూరగాయముక్కలు ప్లేటులో పెట్టుకుని అన్యమనస్కంగా తింటోంది రేష్మ. ఎవరెవరితోనో ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు రణధీర్. అత్యాధునిక వస్త్రధారణతో కొద్దిగా తూలుతున్నట్లుగా వచ్చింది ఓ యువతి.
‘‘హాయ్ రణా! వచ్చినప్పట్నుంచీ గమనిస్తున్నా... నన్ను పట్టించుకోవేమిటి?’’ ఇంగ్లిషులో అంది ఓ కన్ను గీటుతూ. ప్రస్తుతానికి నన్నొదిలెయ్ అన్నట్లు... రణా తన చూపుల్తోనే సంభాషించడం కూడా రేష్మ దృష్టి నుంచి తప్పించుకోలేదు.
‘‘ఏమిటీ, అవాయిడ్ చేస్తున్నావ్? పార్కులకీ పబ్బులకీ నేను కావాలి. సినిమాలకీ...’’ ఆమె మాటల్ని అడ్డుకుంటూ ‘‘హాయ్ నిషా. దిసీజ్ మై బెటర్‌హాఫ్ రేష్మ. రేష్మా... మై కలీగ్ నిషా’’ పరిచయాల్లోకి దిగాడు.
నిషా కళ్లు చిట్లించి, రేష్మను చూసి, పెద్దగా నవ్వేస్తూ ‘‘ఈమె... ఈమేనా నీ డియర్? ఇంతందంగా ఉన్న నాకే వంద వంకలు చెబుతావు... ఈమెనెలా ఇష్టపడ్డావ్ రణా?’’ అంది.
‘‘నిషా... షటప్’’ కోప్పడ్డాడు రణా.
‘‘ఫస్ట్, యూ షటప్’’ చూపుడు వేలిని రణధీర్ మొహం మీదికి విసురుతూ మరీ అరిచింది రేష్మ.
క్షణం కూడా ఆగకుండా, చేతిలోని ప్లేటును టబ్‌లో పడేసి విసవిసా వెళ్లిపోయింది.
∙∙
రణధీర్ దైనందిన వ్యవహారాల్ని మరింత నిశితంగా గమనించింది రేష్మ. ఇంట్లో ఉన్నంతసేపూ కారిడార్‌లోకి వెళ్లి ఎవరెవరితోనో ఫోన్లు మాట్లాడేవాడు. రాత్రిళ్లు ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. ఆరేళ్ల కిందటి సేవామూర్తి ఇప్పుడు రణధీర్ రూపంలో బతికిలేడని స్పష్టమవుతూ వచ్చింది.‘ఎలాగూ నిజం తెలిసింది కదా’ అన్న ధీమానో నిర్లక్ష్యమో తెలియదుగానీ, అతనిప్పుడు మరింత స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.
పారిపోయిన ఒంటరితనం మళ్లీ తిరిగొచ్చినట్లయింది రేష్మకు. నిస్పృహ ముంచెత్తింది. డిజైనర్లకు సరైన సలహాలివ్వలేకపోతోంది. తన మీద తనకే విరక్తి కలిగింది.
తండ్రికి ఫోన్ చేసింది.‘‘చెప్పు తల్లీ! ఎలా ఉన్నావు?’’‘‘మళ్లీ మీ మాటలు కావాలి నాన్నా. నాకు పిడికెడు ధైర్యం కావాలి. ఓసారి వస్తారా!’’ ‘‘రేపే వస్తానమ్మా’’.మరుసటి రోజే పాపను కూడా తీసుకుని హైదరాబాదు వచ్చారాయన.జరిగిందంతా చెప్పి ‘‘ఏం చెయ్యమంటారు?’’ అనడిగింది.‘‘ఇప్పుడు అతనెక్కడ?’’‘‘భువనేశ్వర్. ఎల్లుండి వస్తాడు’’.
‘‘నిజం చెబుతున్నానమ్మా. ఈ విషయంలో నేనొక్క మాట కూడా చెప్పలేను, చెప్పకూడదు. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. ఒక్కటి మాత్రం చెప్పగలను... ఇప్పుడు నీ మొహమే నీ ఉనికి. నీ చిరునామా. నీ విజయచిహ్నం. నువ్వు నమ్ముకోవాల్సింది ఎప్పటికీ నీ సొంత కాళ్లను మాత్రమే’’.
గాయాలకు లేపనం పూస్తున్నట్లుగా పాప గుక్కపట్టి ఏడ్చింది. ఎత్తుకుని గుండెలకు హత్తుకోగానే ఊరుకుంది. నిన్న తండ్రి వెళ్లిపోయాడు. పాపను ఇక తనవద్దే ఉంచుకుంటానని చెప్పింది. తండ్రి కాదనలేదు.
రణధీర్ ఫ్లైటు దిగి, సాయంత్రం అయిదింటికి ఇంటికి చేరాడు.‘‘రణా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి’’ సీరియస్‌గా అంది రేష్మ.‘‘టైవ్‌ు లేదు. కొత్త ప్రాజెక్టు కోసం అప్లై చేస్తున్నాం. ప్రపోజల్ నేనే ఫైనల్ చెయ్యాలి. రాత్రి పన్నెండు లోపు ఆన్‌లైన్లో అప్‌లోడ్ చెయ్యాలి. నైట్ ఒంటిగంటకల్లా వచ్చేస్తా. పొద్దున్నే మాట్లాడదాం...’’ చెబుతూనే డ్రస్ మార్చుకుని, కారులో వెళ్లిపోయాడు.
సెల్‌ఫోను చేతుల్లోకి తీసుకుని, సమయం చూసింది. అయిదు కావస్తోంది. రాత్రి ఒంటిగంటకు వస్తానన్న మనిషి తెల్లవారుతున్నా అయిపు లేడు. రాగానే అటో ఇటో తేల్చేయాలనుకుంది. గట్టిగా వార్నింగ్ ఇవ్వడమా, లేక ఇక నీ సాంగత్యం చాలు అని తెగతెంపులు చేసుకోవడమా అనేది మాత్రం తేల్చుకోలేకపోతోంది. ఫోన్ చేసింది. అవతలి నుంచి విన్న మాటలతో కంగు తింది! ఒక రకంగా... తన నిర్ణయం తేలికైంది. లేచి, రణధీర్ బట్టలు, అతనికి సంబంధించిన వస్తువులన్నీ సర్దడం మొదలుపెట్టింది.
ఏడు గంటలవుతుండగా వచ్చాడు రణధీర్.‘‘ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు’’ అన్నాడు దగ్గరకు రాబోతూ.కంటిచూపుతోనే అతన్ని దూరంగా నిలబెట్టి ‘‘అది నిన్నటి సంగతి. ఇప్పుడు మాట్లాడ్డానికేమీ లేదు. మీకు సంబంధించినవన్నీ సూట్‌కేసుల్లో సర్దాను. తీసుకుని బయల్దేరండి’’ అంది నింపాదిగా.‘‘ఒక్క కారణం చెప్పగలవా?’’ సీరియస్‌గా అడిగాడు.‘‘నీకూ ఆ అజిత్ గాడికీ ఏ మాత్రం తేడా లేదు. వాడు నిండు జీవితాన్ని నిమిషంలో తగలబెట్టగలడు. నువ్వు రోజూ కొంత చొప్పున జీవితాంతం తగలబెట్టగలవు. అంతే’’.అతనింకేదో మాట్లాడబోతుంటే, ఆమె రెండు చేతులూ జోడించి ‘ఇక మాట్లాడ్డానికేమీ లేదు. దయ చేయండి’ అన్నట్లు చూసింది.తెల్లవారుజామున తను కాల్ చేసినప్పుడు... రణధీర్ ఫోన్‌ను నిద్రమత్తులో ఉన్న నిషా అటెండ్ చేసిన విషయాన్ని రేష్మ అతగాడితో చెప్పదల్చుకోలేదు! రణధీర్ తన పెట్టెలతో బయటికి నడిచాడు. రేష్మ శరీరతీరాన చల్లటి గాలులు. మనసు నిండా సంతోషం.ఆమె కళ్ల ముందు ‘రేష్మ ఫౌండేషన్’ లోగో రెపరెపలాడుతోంది!
- ఎమ్వీ రామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment