డెవిల్‌ హౌస్‌ | The House of the Devil | Sakshi
Sakshi News home page

డెవిల్‌ హౌస్‌

Published Sat, Oct 28 2017 11:27 PM | Last Updated on Sat, Oct 28 2017 11:27 PM

The House of the Devil

పాలెం ఇళ్లల్లో సందడి మొదలు. ఇరవై రోజుల ముందు మట్టిలోకి మొదటి మేకు దిగ్గొట్టి డేరాలు కట్టారు. ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లు ప్రారంభం. ఆఖరి చెక్కపేడు లారీలకు ఎక్కిచ్చుకు తిరిగిపోయేదాకా ఇంక పండగే.  కుర్రపిల్లలు, నడివయసోళ్లు, ఆడపిల్లలు, వాళ్లూ వీళ్లూ  అని లేదు. అందరికీ అక్కడ ఏదో ఒక పని దొరుకుతది. నిండా ఓపికున్నోళ్లు పొద్దంతా బైట కూలి పని చేసుకుని సాయంకాలం ఉడుకు నీళ్లు పోసుకుని ఎగ్జిబిషన్‌ పనిలోకి పోవొచ్చు.  ఒక రోజుకి రెండు పనులు, రెండు కూలి డబ్బులు. పైగా ఎగ్జిబిషన్లో పనంటే అదసలు పనే కాదు. ఒక సంబరం. ఒక జాతర. ఆడపిల్లలు– గాజులు, క్లిప్పుల షాపుల్లో చేరతారు. మొగపిల్లలు– గన్ను కాల్చే దగ్గర , బంతులు వేసే దగ్గర నిలబడతారు. అబ్బులు (వాళ్లమ్మ పెట్టిన పేరు అభిలేష్‌.  

పాలెంలో పిల్లలకి ఫాషన్‌ ఫాషన్‌గా పేర్లు పెట్టడం, తరువాత క్రమంలో అవి జనాలకి నోరు తిరక్క, సులువాటి పేర్లుగా మారిపోవడం మామూలే) నాల్రోజులుగా ఎగ్జిబిషన్లో తిరుగుతానే వున్నాడు.  జెయింట్‌ వీల్, చిన్న చిన్న విమానాలు, చాటంత అప్పడం, అటూ ఇటూ ఊగులాడే పెద్ద పడవ.  ఒకటేంటి. అన్నీ భలే వున్నాయి. పాలెంలో పద్నాలుగేళ్ల పిల్లోడంటే రవంత గడుసుగా, రవంత కరుగ్గా ఉండాలి.  అబ్బులు మాత్రం పీలగా, జాలీగా ఉంటాడు.  ఉండీ లేక ఏ పూటైనా వాళ్లమ్మ వాడికి అన్నం సరిగా పెట్టలేకపోయి ఉండొచ్చు.  కానీ మనుషులు ఉచితంగా చూపగలిగే దయ, ప్రేమల్లో  ఆమె ఎప్పుడూ లోటు చూపించలేదు. బహుశా అందువల్లనే వాడు అలా ఉన్నాడనుకుంటాను!    ‘‘జాగర్త అబ్బులూ! పడి పోతావు,  అటు  పోబాకు అబ్బులా!  బూచాడు పట్టుకుపోతాడు,’’ ఇటువంటి సూచనలు రోజుకి లెక్కలేనన్ని ఇస్తది.

అబ్బులు గోడ మీద కూచుని చూస్తన్నాడు. అమ్మ వచ్చి వుంటే ఈ పాటికి ‘గోడ ఎక్కబాక అబ్బులా!’ అని ఒక్కసారన్నా అరిచి వుండేది. కాఫీ రంగులో కళ్లని లాగేస్తున్న ఐసు, పచ్చి ఉల్లిపాయలు, కొత్తిమీర, ఘాటు మసాలాలు జల్లిన చాట్‌. అబ్బులు నోరు వూరిపోతంది. కన్నూ, ముక్కూ సుబ్బరంగా పని చేసి, టయానికి ఆకలి పుట్టే ఏ మనిషికైనా వాటిని చూస్తే నోరు వూరకుండా వుంటదా? వాటిని చూస్తా నిన్న, ఇంట్లో చింతపండు చీక్కున్నాడు. మొన్న, ఉల్లిపాయల్లో ఉప్పూ కారం కలుపుకుని నమిలాడు. ఈ రోజు తినటానికి ఏమీ కనబడలేదు. అమ్మ లేదు. వేరే వూర్లో కోతల పనికెళ్లింది.  రోజూ ఈపాటికి వస్తది. ఇవాళ రాలేదు. అమ్మ వచ్చేప్పుడు మరమరాలో, సెనగ ముద్దలో తెచ్చి,

‘‘ఇంద తింటా ఉండరా, ఇప్పుడే అన్నం వండేస్తాను,’’ అంటది.  ఇవాళ ఎప్పుడొస్తదో?  ఆకలేస్తంది.ఎగ్జిబిషన్‌లోకి వెళ్లాలంటే పది రూపాయల టికెట్‌.  కానీ అబ్బులుకి  టికెట్‌ అవసరం లేదు.  పాలెం వెనక గ్రౌండులోనే ఎగ్జిబిషన్‌. ప్రతి యేడూ అక్కడే పెడతారు. గ్రౌండుకీ, అబ్బులు ఇంటికీ మధ్య ఒక గోడే అడ్డం. గోడెక్కి కూచుంటే అన్నీ కనబడతాయి. గోడ దూకి వెళితే ఇంకా దగ్గర్నించి కనబడతాయి. మిగతా విషయాల సంగతి పక్కన పెడితే, పాలెంలో పెరిగే అబ్బులులాంటి పద్నాలుగేళ్ల పిల్లోడికి ఆ ఆరేడడుగుల గోడ ఎక్కడం దూకడం అసలొక సంగతే కాదు. పాలెం పిల్లలు అటువంటి మిలటరీ ట్రెయినింగులు పదేళ్ల లోపే పాసై పోతారు.

 టికెట్‌ కొనకుండా గోడ దూకి లోనికి వెళ్లినా అబ్బులుని ఎవరూ ఏం అనరు. అక్కడ  పని చేసే వాళ్లంతా అబ్బులుకి తెలిసినోళ్లే. అంతా పాలెంలో వాళ్లే. గోడ దూకే వెళ్లడం వెనక ఇంకో రహస్యం వుంది. సాయంకాలం పర్లేదు గానీ, చీకటి పడితే చుట్టు రోడ్డు దారిలో అబ్బులు వెళ్లలేడు. కుక్కలు అరుస్తాయనీ, కరుస్తాయని; పాములు తిరుగుతాయని, దయ్యాలు పట్టుకుని పీకుతాయని భయం. కుక్కలు, పాములూ కొంతవరకూ పర్లేదు. కానీ దయ్యాలు?!  అమ్మో!   పైగా ఆ దోవలో చిల్ల చెట్ల మధ్య ఓ ఆడ దయ్యం ఉందని పుకారు.

 నిరుడు చచ్చిపోయిన వెఱ్రి చిట్టెమ్మని ఆ దయ్యమే పీడిచ్చి చంపిందని కొందరు అనుకుంటారు. ఇప్పుడు చచ్చిపోయిన చిట్టెమ్మతో కలిపి ఆ దారిలో మొత్తం ఒకటికి రెండు దయ్యాలు తిరుగుతా ఉండొచ్చని అంచనా.  కరెంటులైట్ల స్తంభాలు వున్నాయి. లైట్లు వెలిగితే భయం లేదు. వెలుగు చూస్తే దయ్యాలు పారిపోతాయి. కానీ ఆ లైట్లు వేసిన రెండ్రోజుల్లోపే ఎవడో ఒక తాగుబోతు పుణ్యాత్ముడు గురి తప్పకుండా రాయి విసిరి వాటిని పగల గొట్టి, తనెంత ‘స్టడీ’గా ఉన్నదీ తనిఖీ చేసుకుంటుంటాడు.  ఈ దయ్యాలు తాగుబోతుల్ని పట్టుకోవు ఎందుకనో?  అబ్బులు అనుమానం. ఏది ఏమైనా ఎలాగైనా చల్ల చల్లని ఐసు చీకుతా, తరువాత కారం కారం చాట్‌ మసాలా తింటా ఎగ్జిబిషన్‌ మొత్తం కలతిరగాలి. ఇదే ఆశ. గ్రౌండ్‌లోకి దూకాడు.  మొత్తం ఒక చుట్టు వేశాడు.  

మళ్ళీ ఐసు, చాట్‌ మసాలా షాపుల దగ్గరకొచ్చాడు. రెండు షాపులు అటోటి, ఇటోటి. మధ్యలో దయ్యాల ఇల్లు, డెవిల్‌ హౌస్‌ స్టాలు. దయ్యాల ఇల్లుకి కుడి పక్క చాట్‌ స్టాలు. ఎడం పక్క ఐసు బండి. ఐసు బండి దగ్గరకెళ్లాడు.‘‘ఐసెంత?’’అడిగాడు.‘‘ఏ ఐసు?’’‘‘ఇది,’’ చాకో బార్‌ చూయించాడు.‘‘ఇరవై రూపాయలు,’’జేబులు వెతుక్కున్నాడు. చిల్లర్లు తగిలాయి. మొత్తం ఎనిమిది రూపాయలు. ఎండాకాలం ఇంటి దగ్గరికొచ్చే ఐసు బండి అబ్బాయైతే ఓ రూపాయి తగ్గినా, అప్పు ఇస్తాడు.  ఇక్కడలా కుదరదు. అమ్మని అడిగినా ఐదు పది ఇస్తది కానీ ఐసు కోసం ఇరవై రూపాయలు వద్దంటది.తర్వాత చాట్‌ స్టాలు దగ్గరికి వెళ్లాడు. మధ్యలో డెవిల్‌ హౌస్‌లోంచి భయంకరమైన కేకలు. బైట డేరా మీద అదురు పుట్టిచ్చే పిశాచాల బొమ్మలు. బొమ్మలే, అయినా ఎంత ఘోరంగానో కనబడ్డాయి. చప్పున మొహం తిప్పుకున్నాడు. గబా గబా నడిచాడు. నాలుగడుగుల్లో దాటేశాడు.

‘‘చాట్‌ ఎంత?’’‘‘ముప్పై రూపాయలు,’’మళ్లీ జేబులో డబ్బులు తీసి చూశాడు. వాడి పిచ్చి గానీ, ఐసు బండి నుంచి చాట్‌ స్టాలు దగ్గరికి వచ్చే లోపుగా చిల్లర డబ్బులు పిల్లలు పెడతాయా ఏంటి!  అవి మళ్లీ ఎనిమిది రూపాయలే వున్నాయి. ఇంకా ఎంత కావాలి?  ఐసు, చాట్‌ రెండూ కొనాలంటే ఇంకా నలభై రెండు రూపాయలు కావాలి. లెక్కలు తెలుసు. బడికి వెళతాడు. బడికి వెళ్లక పోయినా పాలెం పిల్లలకి డబ్బుల లెక్కలు తప్పకుండా తెలుస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, బడి మొహం చూడని పాలెం పిల్లాడైతే ఈ పాటికి జేబులో ఇంకా ఎక్కువ డబ్బులు ఉండేయి!

అక్కడక్కడే తచ్చాడాడు. పది నిమిషాలు గడిచాయి. పిల్లల గుంపు వచ్చింది. చాట్‌ స్టాలు చుట్టూ మూగారు. ఎక్కువమంది అబ్బులుకి తెల్సినోళ్లే. తను చదివే బడి పిల్లలే కానీ, పాలెం పిల్లలు కాదు. లోపలి ఊళ్లో పిల్లలు. చాట్‌ కొన్నారు.     ‘‘ఓరే! నా దగ్గర ఎనిమిది వుంది. తీసుకో. చాట్‌ ఇద్దరం చెరి సగం తిందాం,’’ అబ్బులు శీనుతో ప్రతిపాదన చేశాడు. ఇద్దరూ ఒకే తరగతి.‘‘చెరి సగం తినాలంటే నువ్వు కనీసం పదిహేను వెయ్యాలి కదరా?’’ వాడు లాజిక్‌ లాగాడు.‘‘పోనీ సగం వద్దు. నాక్కొంచెం పెట్టి మిగిలింది నువ్వు తినరా,’’ ప్రాథేయ పూర్వకంగా బేరం పెట్టాడు. ఎగ్జిబిషన్‌లో పెద్ద పెద్ద స్పీకర్లు. ఏవేవో పాటలు. ఒకటే గోల. అబ్బులు చెప్పింది చాలామందికి వినబడలేదు. కొంతమంది వినిపిచ్చుకోలేదు. పిల్లలు తింటా, సందడిగా గట్టిగా మాట్టాడుకుంటా వెళ్లిపోయారు.

ఆకలి. చాట్‌ బండి వాడితోనే బేరం పెడదాం అనుకున్నాడు కానీ అతను మరాఠీ. డబ్బులు తీసుకుని చిల్లర ఇస్తాడు. అంతకన్నా ఎక్కువ తెలుగు తెలీదు. తెలిసినా తెలీనట్టు ఉంటాడు. అడిగినా లాభం లేదని అబ్బులుకి తెలుసు.ఇంటివేపు చూశాడు. లైటు ఇంకా వెలగలేదు. వెలిగితే అమ్మ వచ్చినట్టు. అమ్మ ఇంకా రాలేదు. అమ్మ ఇంకా ఎందుకు రాలేదు. ఆకలికి నిలవలేక ఏడుపొచ్చేస్తంది.‘‘ఓరే అబ్బులూ! ఇట్రా,’’ శివమ్మ పిల్చింది. పాలెంలో పిల్లే. అబ్బులు కన్నా మూడేళ్లు పెద్దది. ప్రతి రోజూ ఎగ్జిబిషన్‌ పనులకి వస్తది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా, ఏ పనైనా కుదిరినంతవరకూ ఒదిలి పెట్టదు. అబ్బులు తలొంచుకుని అరచేతులతో మొహం రుద్దుకుంటా వెళ్లాడు. జేబులో ఎనభై రూపాయలు పెట్టింది.

‘‘ఈ పూట గది లోపలుండే కుర్రోడు రాలేదురా. æబైటోడు చిన్నా ఒక్కడే ఉన్నాడు.  లోపలి పని చెయ్యరా. ఈ ఒక్క సారికి సాయం రారా. లోపలి పిల్లోడు లేపోతే నడవదు,’’ అబ్బులు ఎప్పుడూ పనుల్లోకి రాడని శివమ్మకి తెలుసు. కానీ ఇప్పుడు ఎలాగైనా ఆమెకి ఒక మనిషి కావాలి.‘ఏంటి నడవదు?’ అన్నట్టు తలెత్తి చూశాడు. తీరా అది డెవిల్‌ హౌస్‌. అయ్య బాబోయ్‌!  పిలవంగానే ఏదో ఆలాపనగా వచ్చేశాడు. డెవిల్‌ హౌస్‌లో పనా?  తనెందుకు వెళతాడు!?‘‘నా వల్ల కాదు, నాకు భయం,’’ అని చెప్పేలోగానే రెక్క పుచ్చుకుని లోపలికి లాక్కు పోయింది. అబ్బులుకి శివమ్మ దగ్గర ఒక మాదిరి  వాసన వచ్చింది. ఏదోగా అనిపించింది.  శివమ్మ బాలింతరాలు. పాలు తాగే చంటి బిడ్డ తల్లి. అది పాల వాసన.   ఇవాళ షో  నడిస్తే శివమ్మకీ, ఆమె బిడ్డకీ రేపు రోజు గడుస్తది.‘‘ఇదిగో, మాస్క్‌ వేసుకుని గోళ్లు పెట్టుకో. మొదటి కిటికీ దగ్గరికి జనాలు ఒచ్చినపుడు గట్టిగా కేకలు పెట్టు. మళ్లా ఆళ్లు ఆ పక్క నుంచి తిరిగి ఈ రెండో కిటికీ వేపుకి వస్తారు. ఈలోగా ఈ తెర అవతల ఉన్న రూములోకి వెళ్లి అక్కడ  బల్ల మీదున్న రెండో మాస్క్‌ వేసుకుని మళ్ళీ అరువు. అంతే. జనాలు లేనపుడు బైటే కూచోవొచ్చు,’’ గబా గబా చెప్పేసి మొహానికి మాస్క్‌ తొడిగి బైటికి వెళ్లిపోయింది. నిలువెల్లా నీరైపోయాడు. మొహానికి గాలి ఆడలేదు. ఒకటే చెమట.  ఒళ్లంతా చెమటే.

లోపల లైటు వుంది.  వీధి లైటు లాగా ధైర్యాన్ని ఇచ్చేది కాదు. ఎర్ర లైటు. భయాన్ని  పెంచే లైటు. రెండు పక్కలా కిటికీలు ఏర్పాటు చేసిన గది. ఆ గదిని రెండు భాగాలు చేస్తూ మధ్యకి ఒక తెర. జనాన్ని తికమక పెట్టి భయపెట్టడానికి  చుట్టూ మెలికల దారి. అబ్బులు కాళ్లు గడ గడా ఒణుకుతున్నాయి. ‘‘నా వల్ల కాదు.  నే పోతా,’’ మళ్లీ చెప్పాలని ప్రయత్నించాడు. వెనక్కి తిరిగి వెళ్లబోయాడు. వెనక్కి తిరగంగానే, శివమ్మ అక్కడ లేకపోయినా పాలవాసన వచ్చినట్టు అనిపించింది. ఆ వాసన బైటికి వెళ్లే దారికి అడ్డం పడినట్టు తూలాడు. అడుగు వెయ్యలేకపోయాడు. ఈ లోగా జనాలు వస్తున్న చప్పుడు వినబడింది. మూల కంత లోంచి చిన్నా కనబడ్డాడు.  ఎప్పుడు ఎగ్జిబిషన్‌ వచ్చినా డెవిల్‌ హౌస్‌లోనే పని చేస్తాడు. కాలేజీలో పెద్ద తరగతులేవో చదువుతున్నాడు. జనాల్లో కలిసి వాళ్లతో పాటు లోనికి వస్తున్నాడు. చిన్నాతో పాటు ముగ్గురు ప్రేక్షకులు లోనికి వచ్చారు. ఒక భార్యా భర్తల జంట, ఇంకొక నడివయసు మొగ మనిషి.డెవిల్‌ హౌస్‌ మొదట్లో మొహం ఎండుకొని పోయిన దయ్యం బొమ్మ ఉంది.‘‘ఈ బొమ్మకే మనం ఇప్పుడు భయపడి పోవాలా,’’ అన్నట్టుగా ఆ బొమ్మని ఎగాదిగా చూశారు.

లోపలంతా ఇంతే, అసలు తమలాంటి మీసాలొచ్చిన మొగోళ్లకి భయం పుట్టిచ్చే సంగతి ఏదీ ఉండనే ఉండదు అని నిశ్చయానికి వచ్చినట్టే వున్నారు. ఆడమనిషి లోపల అంతా పరిశీలనగా చూస్తంది.‘‘ఇది సమాధి,’’ చిన్నా బేస్‌ వాయిస్‌ లో నెమ్మదిగా చెప్పాడు. ఆ మాట చెప్పి వాళ్లు గమనించకుండా వెనుతిరిగి బైటికి వచ్చేయడమే అతని ఉద్యోగం. సమాధి పైన నీలం రంగు లైటు వెలిగింది. నీలం రంగు, ఎరుపు రంగు కలిసి పరిసరాల్లో ఊదా రంగు పట్టీ లాగా ఏర్పడింది. రంగుల మిశ్రమం, సమ్మోహన పరిచే చిన్నా కంఠం ప్రేక్షకుల మనసులో ఒక విధమైన ఉద్రిక్తతను రేపెట్టాయి. ముగ్గురూ తత్తరబిత్తరగా ఒకరినొకరు చూసుకున్నారు.  ముందుకి నడిచారు. కిటికీ దగ్గరికి వచ్చారు. కిటికీ లోపల ఏముందో అని తొంగి చూశారు.  అబ్బులు మోకాళ్ల మీదికి వంగి వున్నాడు. తలెత్తి వాళ్ల వంక చూశాడు. చేతికి గోళ్లు పెట్టుకోలేదు,  భయం పుట్టిచ్చేలా అరవనూలేదు. అయినా, ఊహించని విధంగా కనబడిన దయ్యం మాస్క్‌ ఆకారాన్ని చూసి వాళ్లు కొంచెం తమాషాకి, కొంచెం భయానికి గురై గబా గబా పరిగెత్తినట్టు బైటికి నడిచారు.    

అబ్బులు అక్కడే కూలబడ్డాడు. కళ్లు మూతలు పడతన్నాయి. స్పృహ కోల్పోతన్నాడు.  డేరాల మధ్య చిన్న సందులోంచి చల్లటి గాలి వస్తంది. గాలితో పాటు చాట్‌ మసాలా వాసన కమ్మగా వచ్చింది. గుండె నిండా గాలి పీల్చాడు. ఏదో జరగబోతంది. మూసుకుంటున్న కళ్లని బలవంతంగా తెరిచి విస్తుపోయి చూశాడు. అతను చూస్తుండగా, ఎండుకొని పోయిన పిశాచం బొమ్మ ఉన్నట్టుండి లేచి నడస్తా అబ్బులు దగ్గరికి వచ్చింది.  నిజానికి అబ్బులుకీ, పిశాచం బొమ్మకీ మధ్య తెర వుంది. కానీ, ఇప్పుడు తెర అవతల ఏముందో అబ్బులుకి కనబడతంది.  ఎగ్జిబిషన్‌ మొత్తం కనబడతంది. అడ్డంగా వున్న తెరలన్నీ పారదర్శకంగా మారిపోయాయి.

పిశాచం అబ్బులుని లేపి పైన కూచోపెట్టింది. మనుషులైతే నేల మీద కూచోపెడతారు. అది దయ్యం కదా, అబ్బులుని గాల్లో కూచోపెట్టింది. దాని ఆకారం చూడ్డానికి వికారంగా వుంది.    ‘‘అబ్బులూ!  నీకేం భయం లేదు’’ దయ్యం నేరుగా అబ్బులుతో చెప్పింది.‘‘ఎవరు నువ్వు?’’‘‘నేనా?  మీ భాషలో దయ్యం, భూతం, పిశాచం  ఇలా చాలా పేర్లు,’’‘‘ఎందుకొచ్చావు?’’‘‘నువ్వు నా గురించి చాలా భయపడ్డావు కదా? ఎంతంటే, ఇంక అంతకన్నా భయపడటం ఎవరి వల్లా కాదు.  భయం అనే భావన అంచుకు నువ్వు చేరుకున్నావు. కాబట్టి లోకనియమం ప్రకారం నువ్వు తరువాతి దశకి వెళ్లాలి. నిన్ను ఆ దశకు చేర్చడానికి నేను వచ్చాను,’’ చెప్పింది. ఆ తికమక మాటల తత్త్వం అబ్బులుకి అర్థం కాలేదు.‘‘దయ్యానివా! ఇప్పుడు నన్నేం  చేస్తావు? నువ్వు మనుషుల్ని నిజంగా చంపేస్తావా?’’ అబ్బులు ప్రశ్న మీద ప్రశ్న అడిగాడు. ‘‘నేను ఎవ్వరికీ ఏ హానీ చెయ్యను. పైగా ఇప్పుడు నీకు సాయం చేస్తాను,’’
‘‘ఎందుకూ?’’

‘‘సాయం చేస్తానంటే కారణం అడుగుతున్నావు!  అదే నష్టం చేస్తానని వుంటే కిమ్మనేవాడివి కాదు. ఎంతైనా మనిషివి అనిపించావు,’’ దయ్యం పక పకలాడింది. ంతలో మనుషుల అలికిడి. ‘‘భయపడబాకురే,’’ కుర్రోళ్ల నవ్వులు. ‘‘నీకు భయంగా ఉందా?’’ తన భయాన్ని తటస్థం చేసుకుంటా ఒకడు. పరాచికాలు ఆడుకుంటా వస్తన్నారు. ఇస్త్రీ బట్టలు, సెంట్‌ గుబాళింపు. అబ్బులుకి సెంట్‌ వాసన చిరాకు పుట్టిచ్చింది. బహుశా, సెంట్‌ వాసన చాట్‌ వాసనని అధిగమించడం అతనికి నచ్చలేదు.  దయ్యం కళ్లల్లోకి చూశాడు. దయ్యం దయగా నవ్వింది.‘‘హీహూ’’ బీభత్సంగా కేక పెట్టింది. వాళ్లు పరిగెత్తారు. రెండో కిటికీ దగ్గరికి చేరేలోగా రూపం మార్చి మరింత భీకరంగా అడిలింది. వాళ్ల కళ్ల లోతుల్లోంచి భయం తన్నుకొచ్చింది.  వచ్చిన దారిన వెనక్కి పరిగెత్తారు.‘‘ఎవరికీ హానీ చెయ్యనన్నావు.  మరి వాళ్లనలా అడలగొట్టావేంటి?’’‘‘వాళ్లు కోరింది వాళ్లకిచ్చాను.  ఇందులో తప్పేముంది?’’‘‘అంటే?’’

‘‘వాళ్లసలు డెవిల్‌ హౌస్‌కి ఎందుకొచ్చారు?’’ అబ్బులు ఏం చెప్పాలో తెలీక తెల్లబోయి చూశాడు. ‘‘డెవిల్‌ హౌస్‌కి ఎవరైనా భయపడ్డానికి వస్తారు.  భయపడటం మనుషులకి సరదా.  అందుకే దానికోసం డబ్బులు కట్టి మరీ లోనికొస్తారు. మరి వాళ్లు కోరింది వాళ్లకి ఇవ్వాలి కదా.  భయమంటే సాదా సీదా వస్తువు అనుకున్నావా? కాదు. అవసరాలు తీరిన మనుషులకి ‘భయం’ చాలా బలమైన వినోదం,’’డెవిల్‌ హౌస్‌లో గ్రాఫిక్స్‌ అదిరిపోయాయని పది నిమిషాల్లో ఎగ్జిబిషన్‌ అంతా పాకిపోయింది. ఎవరెవరో లోనికి వచ్చి చూసి పోయారు, సిటీలో డెవిల్‌ హౌస్‌తో పోలిస్తే ఇది ఉత్త పిల్లల ఆటలా ఉంటదని పెదవి విరిచే కాస్మోపోలిటన్లతో సహా. అంత లావు గ్రాఫిక్స్‌ ఏమున్నాయో లోపలికొచ్చి చూడాలని శివమ్మ అనుకుంది కానీ తీరికే లేనంత తిరునాళ్లుగా జనాలు టికెట్ల కోసం ఎగబడ్డారు. ‘దయ్యం భూత పిశాచం’ జనాన్ని భయపెడుతుంటే దాని/వాడి వేరు వేరు రూపాలన్నీ అబ్బులు చూశాడు. అబ్బులుకి ఏదో కొత్త బలం ఒంట్లోకి వచ్చినట్టుగా, చిన్న పిల్లవాడు తటాలున పెద్ద వీరుడిగా మారినట్టుగా వుంది. ఇంతట్లోకి ఇందాకటి చాట్‌ బండి దగ్గరి పిల్లల గుంపు డెవిల్‌ హౌస్‌లోకి వస్తా కనబడింది.

‘‘నన్ను కిందకి దించు.  వీళ్లని నేను భయపెడతాను,’’‘‘వాళ్లు నాకు భయపడినట్లు నీకు భయపడరు,’’‘‘ప్లీజ్‌!  నా మాట విని నన్ను కిందికి దించు,’’ అబ్బులు అర్థించాడు.  దయ్యం అబ్బులుని కిందికి దించింది. అబ్బులు రెండు కిటికీల దగ్గరా రెండు మాస్కులు మార్చి వాడి శాయశక్తులా పొలికేకలు పెట్టాడు.‘‘అంతా అబద్ధంరా. ఇక్కడ అంత ఘోరమైన దయ్యాలు ఏవీ లేవు, డబ్బులన్నీ వేస్టు’’ పిల్లలు మొహాలు వేలాడేసుకుని నిరాశగా బైటికి వెళ్లారు. వాళ్ళు కట్టిన డబ్బులకి సరిపడా భయం పుట్టలేదని బాధపడతన్నారని అబ్బులు అర్థం చేసుకున్నాడు. ‘భయం ఒక బలమైన వినోదం’ అన్న దయ్యం మాటలు అబ్బులుకి ఇప్పుడు మరింత బాగా బోధ పడ్డాయి. వాడి బుర్రలో ఇంకా బోలెడు ప్రశ్నలు రేగాయి. కానీ, ఎలా అడగాలో తెలీలేదు. ‘‘ఊరికే ఏదో అడగాలనీ, మాట్లాడాలనీ ప్రయత్నిం కు. అదంత మంచి అలవాటు కాదు,’’ అబ్బులు మనసు తెలుసుకున్నట్టు దయ్యం చెప్పింది.‘‘నువ్వు రోజూ ఇక్కడే ఉంటావా?  రేపు కూడా నిన్ను కలవొచ్చా?’’ అబ్బులు కుతూహలంగా చూశాడు.

‘‘ఉంటాను. నేను ఇక్కడ వున్నట్టు నీకు తెలుస్తది కానీ ఇంక కనబడను. నువ్వు చాలా దయ గల పిల్లాడివి. చంటి బిడ్డ పాల కోసం నీ భయాన్ని లెక్కచెయ్యకుండా డెవిల్‌ హౌస్‌లో నిలబడ్డావు. అది చూసి నేను నీకు మేలు చెయ్యాలని వచ్చాను. సరే, షో టైం అయిపోయింది.   మనిద్దరం షేక్‌ హాండ్‌ ఇచ్చుకుందాం,’’అబ్బులు దయ్యానికి షేక్‌ హాండ్‌ ఇచ్చి వీడ్కోలు తీసుకున్నాడు.షో అయిపోయేప్పటికి పిల్లోడు తెలివి తప్పి నేలపై పడి ఉండటం చూసి, అబ్బులుని ఎత్తుకుని చిన్నా బైటికి తీసుకొచ్చాడు. మొహానికున్న మాస్క్‌ తీసి సోడా నీళ్లు తెచ్చి మొహం కడిగాడు. ‘‘చిన్నా! లోపల నిజంగానే దయ్యం ఉంది,’’ అబ్బులు కళ్లు తెరిచి చిన్నాకి చెప్పాడు.‘‘నాకు తెలుసు,’’ అబ్బులు కళ్లలోకి చూసి చిన్నా మెత్తగా నవ్వాడు. అబ్బులు చిన్నా చేతుల్లో వుండటం చూసి డబ్బులు లెక్కపెడుతున్న శివమ్మ కంగారుగా వచ్చింది. పిల్లోడు నీరసపడి పడిపోయాడు. భయం లేదని చిన్నా చెప్పాడు.

‘‘ఏంరా?  పైటేల అన్నం తిన్లేదా?’’అడిగింది
‘‘లేదు,’’ తల అడ్డంగా ఊపాడు.  ‘‘లోపల అరిచీ అరిచీ నీరసం వచ్చినట్టుంది.  అయినా ఏం జనాలు!  ఇంత జనాలు ఎప్పుడూ రాలేదు. నీ కాలు మంచిదిరా,’’  శివమ్మ సంతోషం వ్యక్తం చేసింది. బన్ను రొట్టె తెప్పించి తినిపించింది. కొద్దిగా తేరుకున్నాడు. జేబు తడుముకున్నాడు. ఎనభై రూపాయలు, ఇంకా ముందర తన దగ్గర వున్న ఎనిమిది రూపాయల చిల్లర. మొత్తం ఎనభై ఎనిమిది. శివమ్మ స్టాల్‌ యజమానితో చెప్పి అబ్బులుకి ఇంకో ఇరవై రూపాయలు ఇప్పించింది. బాగా పొద్దు పోయింది. ఐస్‌ క్రీం బండి దగ్గరికెళ్లి ఒక ఐసు కొన్నాడు. ఐసు పెట్టెలోంచి ఐసు తియ్యడానికి షాపతను వంగాడు. అబ్బులు అతని చెవికి దగ్గరగా వెళ్లి, ‘‘అన్నా! డెవిల్‌ హౌస్‌ లో నిజంగానే దయ్యం ఉంది,’’ రహస్యంగా గొణిగాడు.‘‘ఔనా? ఐతే సరే,’’ ఐసబ్బాయి వేళాకోళంగా  నవ్వాడు.అబ్బులుకి తెలిసింది, ఈ సంగతి ఇతరులకు చెప్పడం లాభం లేని పని. ఐసు అక్కడే కొరుక్కుని తినేశాడు. చాట్‌ కూడా కొన్నాడు. ఇవాళ గోడెక్కి వెళ్లాలనిపించలేదు.

నెమ్మదిగా తింటా రోడ్డు దారిన పడ్డాడు. దారిలో ఎక్కడో ఒక లైటు వుంది.    కానీ లైటు వున్నా లేక పోయినా అబ్బులుకి ఇంక తేడా లేదు. చాట్‌ తింటున్నాడు గానీ, దాని కోసం సాయంకాలం ఆత్రపడినప్పుడు ఉన్న ఆకలి, ఆశ ఇప్పుడు లేవు!  ఇంటికెళ్లేప్పటికి అమ్మ వచ్చేసింది. పంచలో కూచుని కంచంలో అన్నం పెట్టి పచ్చి పులుసు పోసింది. అబ్బులు చుట్టుపక్కల చూశాడు. చిన్నా ఏదో రాసుకుంటన్నాడు. శివమ్మ బిడ్డకి పాలిస్తంది. ‘‘చిన్నా చిన్నా,’’ అబ్బులు  చిన్నాని పిలిచాడు. ‘‘ష్‌!  మాట్లాడకుండా తిను,’’ చిన్నా తలెత్తి పెదవులకి చూపుడు వేలు అడ్డుగా పెట్టి సైగ చేశాడు. అబ్బులు నిమ్మళంగా తలొంచుకుని అన్నం తినేసి చాపమీదికెక్కి కళ్ళుమూసుకున్నాడు.పాలెంలో సందడి సద్దు మణిగి ఇళ్లు నిద్రలోకి జారుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement