
కశ్మీర భూమి చాలా రమణీయంగా ఉంది.
‘మేడమ్...కుచ్ లేంగే..కాఫీ...చాయ్...?’
రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘విస్మృత యాత్రికుడు’ నవలలో నుంచి తలెత్తి కుడి వైపుకు చూశాను. తెల్లటి యూనిఫారమ్‌లో చేతులు వెనక్కి కట్టుకుని వినయంగా నిలుచుకుని ఉన్నాడతను. ముఖంపై చిరునవ్వు రేఖ. ఈ అబ్బాయి కళ్లల్లో ఏదో మెరుపు ఉంది అనుకున్నాను ఆ క్షణంలోనే.
‘వుడ్ యు లైక్ టు టేక్ సమ్..’ అతని మాట పూర్తి కాకముందే ‘ష్యూర్...కాఫీ మిలేగా?(కాఫీ ఉందా)’ అడిగాను.
ఇప్పుడే తెస్తాను అని చెప్పి వెనక్కి తిరిగాడు. నాకు ప్రయాణాలు చేయటం చాలా ఇష్టం. వృత్తికి ఆర్కిటెక్ట్‌నైనా... సగటున ప్రతి మూడు నెలలకోమారు ఏదో ఒక ప్రాంతానికి భుజాన బ్యాగ్ వేసుకుని వాలిపోతుంటాను. కాశ్మీర్ లోయ అందాలను చూడాలని, ఇక్కడి ప్రకృతిని, ప్రశాంతతను, అనుభూతులను రంగుల్లో ముంచి కాన్వాసుపై అద్దాలని ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతూ వచ్చాను. ఇప్పటికి ఇలా కుదిరింది. ఈ హోటల్‌లో రూమ్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాను.
ఈ హోటల్‌కు ఉన్న గార్డెన్, లాన్ చూసి మనసు పారేసుకున్నాను. అందులోనూ నా రూమ్‌ను ఆనుకునే లాన్ ఉంది.లాన్‌కు నాలుగు దిక్కుల్లో గుండ్రటి టేబుళ్లు, చుట్టూ కుర్చీలు వేశారు. నేను ఓ ఖాళీ టేబుల్ చూసుకుని సెటిల్ అయ్యాను. కాస్త దూరంగా మరో టేబుల్ చుట్టూ ఐదారుగురు చేరి ఉన్నారు అప్పటికే. రేపు ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి ఈ గార్డెన్‌లో వాకింగ్ చేయాలి అనుకుంటున్నప్పుడే తెల్ల యూనిఫాం అబ్బాయి చిరునవ్వుతో పాటు కాఫీ తెచ్చాడు.
‘ఏం పేరు?’
‘ఆసిఫ్..’
‘మీది శ్రీనగరేనా?’
‘కాదు మ్యామ్...త్రాల్.’
‘త్రాల్! మ్...ఎక్కడో విన్నట్లుంది...’
‘న్యూస్‌లో చూసుంటారు. మాది కొంచెం సెన్సిటివ్ ప్రాంతం.’
‘ఓ...అంటే అల్లర్లు ఎక్కువగా జరుగుతుంటాయా?’
‘అవును మ్యామ్. ఇంతకీ...మీరు కాఫీ రుచి చూడలేదు. పుస్తకం చదువుతున్నారు కదా...టీనో, కాఫీనో తాగుతూ చదువుతుంటే ఈ వాతావరణంలో ఆ ఫీల్ ఇంకా బాగుంటుంది. అందుకే వచ్చి అడిగాను. వేరేలా అనుకోవద్దు. థ్యాంక్యూ మ్యామ్.’
వెల్‌కమ్ అనో, పర్వాలేదనో, నేనే అడుగుదామనుకున్నాను అనో...చెప్పేందుకు నోరు తెరిచేంతలో వెళ్లిపోయాడు. 4 సెకన్ల పాటు అతను వెళుతున్న వైపు చూసి చూపు మరల్చాను. అటూ ఇటూ చూడకుండా కాఫీ సిప్ చేస్తూ పుస్తకంలో కళ్ళు పెట్టి ఆ అబ్బాయితో జరిగిన సంభాషణను నెమరేయటం మొదలు పెట్టాను. ఏం పేరు చెప్పాడు...ఆసిఫ్ఫా...? ఊరేదో చెప్పాడే... తాస్... త్రాస్.... కాదు కాదు...త్రాల్. గూగుల్ చేయాలి. తన గురించిన ఎక్కువ వివరాలు ఇవ్వటం ఇష్టం లేక తెలివిగా టాపిక్ డైవర్ట్ చేశాడా? లేదంటే ఇలా గెస్ట్‌లతో అసుకేస్తూ పని ఎగ్గొడతారని వాళ్ల బాస్ కోప్పడతాడని వెళ్ళిపోయాడా? అయినా... ఆ అబ్బాయి గురించి నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను?
∙∙
అలారం పెట్టుకుని ఐదు గంటలకే నిద్ర లేచాను. బ్రష్షూ గట్రా కానిచ్చి... ఐదున్నరకు లాన్‌లోకి వచ్చాను. చెప్పులు ఓ మూలన పెట్టి నగ్న పాదాలు గడ్డిపై పరిచాను. పచ్చటి గడ్డిపోచలు, వాటిపై సేదతీరుతున్న తుషారపు తునకలు... చల్లటి ఆ స్పర్శ జర్రున పాకి మనసుకు చేరింది. హిమ శిఖరాలపై నుంచి వస్తున్న గాలి తెమ్మెరల్ని నా లోపలికి తీసుకున్నాను. తనివి తీరితేనా..? కాసేపు నడవగానే మనసు ఏదో చిత్రానికి రూపం ఇచ్చేస్తోంది. రంగులు కళ్ళముందు కదులుతున్నాయి. కాన్వాస్ టేబుల్, రంగులు, అన్నీ తెచ్చుకుని... లోపల రేగుతున్న ఆలోచనలకు చిత్ర రూపం ఇవ్వటం మొదలు పెట్టాను. నా ప్రయాణాల మొదటి లక్ష్యం చిత్రాలు వేయటమే. ట్రావెల్ పెయింటింగ్ నా హాబీ. అలా తిరుగుతూ తిరుగుతూ నచ్చిన చోట, మనసు స్పందించిన దృశ్యాన్ని కుంచెలోకి ఇంకిస్తుంటాను. పోటీ పడుతూ అరవిచ్చుకుంటున్న పూలు, చెట్ల మోదులు, పచ్చగా పరుచుకున్న లేత గడ్డిపోచలు, వాటిపై నడిచి వెళుతున్న రెండు నగ్న పాదాలు... పెన్సిల్‌తో ఔట్ లైన్ వేసేశాను.
యాభైకి కాస్త అటూ ఇటూగా ఒక వ్యక్తి ఒక పెద్దాయనను నెమ్మదిగా నడిపిస్తూ నా వైపు వస్తున్నారు. బహుశా అతని నాన్నేమో. ఏదో అనారోగ్యంతో ఉన్నారని అర్థం అవుతోంది. డాక్టర్లు ఇలా కాస్త లాన్స్‌లో నడిపించమని ఉంటారు అనుకున్నాను. అతని కాళ్ళకు చెప్పులు లేకపోవటం నా దృష్టిని దాటలేదు. ఆ పెద్దాయన తల కాస్త కిందకు వ్రేలాడినట్లుగా ఉంచి అడుగులో అడుగు వేస్తూ వస్తున్నారు. నా కాన్వాస్ స్టాండ్‌ను కాస్త పక్కకు జరిపాను వారు వెళ్లేందుకు ఎక్కువ స్థలం ఉండేటట్లు.
‘థ్యాంక్యూ...’
‘యు ఆర్ వెల్‌కమ్...’
‘పర్యాటకులు అనుకుంటా. ఆర్టిస్ట్ అని నేను ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు.’
ఆ పెద్దాయనకు కాన్వాస్ ఆసక్తిని రేపినట్లుంది. తల అలానే ఓ కింద నుంచి ఒక వాలుగా పైకి ఎత్తి చూస్తున్నారు.
‘అవును. మీరిక్కడి వారేనా?’
‘ఈ హోటల్ పక్కనే మా ఇల్లు. నాన్నకి అనారోగ్యం. ఉదయం, సాయంత్రం ఇక్కడ వాకింగ్‌కు తీసుకువస్తుంటాను.
‘అలానా...’
‘మీ పేరేంటి...?‘మాటలు కూడబలుక్కుని పెద్దాయన అడిగారు.
నాకు అర్థం కాలేదు. నా పేరు అడుగుతున్నారని కొడుకు చెప్పారు.
‘చారుశీల...’
నా పేరును తనలోనే చెప్పుకుంటూ తల ఊపారు.
‘నాన్నా... పదండి వెళదాం...’
ఆ పెద్దాయన మాత్రం కదల్లేదు. వాలు తలతోనే కాన్వాసు వైపే చూస్తున్నారు. ఇంకా రంగులు వేయటం అవ్వలేదు కనుక ఆయనకు చిత్రంలో ఆసక్తి కాదు చిత్రం వేసే ప్రక్రియపైనే ఆసక్తి అని నేను అర్థం చేసుకున్నాను. ‘ఇక్కడ ఏ ప్రాంతాలు బాగుంటాయి చూడటానికి? మీరేం సలహా ఇస్తారు?’ సంభాషణ కొనసాగించే ప్రయత్నం నాది. ‘కశ్మీరే ఓ దృశ్య కావ్యం. ఏ దిక్కు చూసినా... మీరిలా స్ఫూర్తిని పొందుతారు పెయింటింగ్స్ వేయటానికి. కాని పరిస్థితులు అనుకూలించకపోవటమే అసలు సమస్య. మీరు ఇప్పుడు రాకుండా ఉండాల్సింది.’
‘ఏం అలా అన్నారు. వాస్తవంగా ఇక్కడకు రావాలని చాలాసార్లు అనుకున్నాను. కాని ప్రతిసారి ఏదో ఒక అన్‌రెస్ట్ ఉండనే ఉంటోంది. ఏదైతే ఏంలే అని ఈసారి వచ్చేశాను...’
‘..............’
‘మీరేం చేస్తుంటారు?’
‘నేను ఇంగ్లీష్ మీడియాలో దాదాపు 30 ఏళ్ళు జర్నలిస్ట్‌గా పని చేశాను. నాన్నకు ఆరోగ్యం దెబ్బతినటంతో చూసుకోవటం కోసం మానేశాను. ఇప్పుడు ఇంట్లోనే.’
‘నాన్నా... వెళదామా?’
‘.....’ పెద్దాయన ఏదో అడిగారు.. నాకు అర్థం కాలేదు.
‘ఏమన్నారు?’
‘ఎక్కడి నుంచి వచ్చారని నాన్న అడుగుతున్నారు.’
పెద్దాయనకు నా పట్ల ఆసక్తి రేగటం నాకు ఆనందాన్నిచ్చింది. ఆయన నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నాకులానే మనుషులతో మాట్లాడటం ఈయనకూ ఇష్టం అనుకుంటా.
‘హైదరాబాద్ నుంచి వచ్చాను’ చిరునవ్వు చెరక్కుండా చెప్పాను.
వాళ్లబ్బాయి మళ్లీ ఆయనకు చెప్పారు హైదరాబాద్ సే ఆయే.
‘కశ్మీరీగా మీ అభిప్రాయం ఏమిటి? సగటు కశ్మీరీ అయితే ఆజాదీ కావాలంటున్నారు. మీరు జర్నలిస్ట్‌గా పని చేశారు కనుక. మీకు చాలా విషయాలపై అవగాహన ఉంటుంది.’
‘ఇక్కడ ఎప్పుడూ అభ్రదత, అన్‌రెస్ట్ ఉంటాయి. భవిష్యత్తులో అయినా పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటాను.’
‘నాన్నా... ఇంక నడవాలి. ఇబ్బంది పెట్టకూడదు....’
ఈమారు ఆ పెద్దాయన సహకరించారు. నేను వాళ్ళవైపు చూస్తున్నాను.
అతను వెనక్కి తిరిగి ‘క్షమించాలి....మీకు అంతరాయం కలిగించాం. మాట్లాడినందుకు ధన్యవాదాలు...’
‘అయ్యో అంతరాయం ఏమీ లేదు. మీతో మాట్లాడటం నాకు ఆనందాన్నిచ్చింది.’
∙∙
తర్వాత రెడీ అయి దాల్ లేక్ వైపు బయలు దేరాను ఆటో మాట్లాడుకుని. చాలా చోట్ల తుపాకులు పట్టుకుని పహారా కాస్తున్న సిపాయిలు కనిపించారు. చేతిలో ఏకే–47, నెత్తి మీద హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు.. కొందరు అయితే ముఖం కనిపించకుండా నల్లటి మాస్క్‌లు, గుడ్డలు కట్టుకున్నారు. వాళ్ళను చూస్తేనే బెదురుపుట్టింది. కొన్ని చోట్ల కౌంటర్ టెర్రర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో పైన ఇద్దరు సిపాయిలు తుపాకి ఎక్కుపెట్టి ఉన్నారు... లోపల మరికొందరు ఉంటారనుకుంటా... రయ్‌మని వెళుతున్నారు. ఆర్మీ ట్రక్కులైతే ఇంకా చాలా కనిపించాయి. మన దగ్గర ఇటువంటి దృశ్యం జీవితకాలంలో ఓసారి కూడా కనిపించదు అని గట్టిగా చెప్పగలను. మీరేం అనుకున్నా సరే. నా ముప్ఫైయేళ్ళ జీవితంలో నేనైతే మన దగ్గర ఇలాగ ఎప్పుడూ చూడ్లేదు.
అంతెందుకు చిన్నప్పుడు అసలు పోలీసులు వేసుకునే ఖాకీ నీడ కనిపిస్తేనే భయం వేసేది. అన్నం తిననని మారాం చేస్తే... అదిగో పోలీస్ వస్తున్నాడు అని బెదిరించి అమ్మ అన్నం తినిపించటం నాకు ఇంకా గుర్తే. ఒక సారి నిజంగానే పోలీస్ మా ఇంటికి వచ్చాడు. అమ్మో... అమ్మ చెప్పినంత పని చేసిందని గజగజా వణికిపోయాను. ‘నువ్వు చెప్పినట్లే చేస్తా అమ్మా...’ అంటూ అమ్మను నడుం వెనక నుంచి చుట్టుకుని ఒకటే ఏడుపు. ఆ వచ్చిన పోలీసు నాకు వరుసకు మామయ్య అవుతారు... ఏదో పని మీద మా ఇంటి వైపు రావటంతో అమ్మను పలకరించి పోదామని వచ్చారు అని ఎంత చెప్పినా... నేను వింటేనా? ఆయన వెళ్లేంత వరకు ఏడుపూ ఆపలేదు, అమ్మనూ వదల్లేదు. కాని ఇక్కడ మాత్రం సిపాయిల కవాతు కశ్మీర్ జీవితంలో భాగం. అందుకే కాబోలు జనాలు మాత్రం తమ మానాన తమ పనులు చేసుకుంటున్నారు.
దాల్ సరస్సు శ్రీనగర్‌కు నడిబొడ్డున ఉంది. చుట్టూ కొండలు, మధ్యలో విశాలంగా పరుచుకున్న దాల్ సరస్సు. ఆకాశంలో కొంగల బారులాగా, ఇసుక ఎడారుల్లో ఒంటెల వరుసలాగా, పల్లెల్లో ఒకదాని వెంట ఒకటి పరుగులు పెట్టే జోడెడ్ల బండ్లలాగా... దాల్ సరస్సులో వరుస కట్టాయి రంగు రంగుల బోట్లు. హౌస్‌బోట్లు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ‘కశ్మీర్ ఓ దృశ్య కావ్యం’ పొద్దుటి జర్నలిస్ట్ మాటలు గుర్తుకు వచ్చాయి. ఆయన సరైన పదం వాడారు అనుకున్నాను. కొంత మంది జర్నలిస్టులు, రచయితలు పదాలతో భలే ఆడుకుంటారు.
నేను గీతలు గీయటమే కాని... నాలుగు ముక్కలు రాయమంటే చేతులెత్తేస్తాను. సాయంత్రం మళ్లీ లాన్‌లో ఉదయం వేసిన పెయింటింగ్‌పై పని చేయటం మొదలు పెట్టి ఆసిఫ్ కనిపిస్తాడేమో అని చూస్తున్నాను. కప్పు కాఫీ, నాలుగు మాటలు దొరుకుతాయి కదా. అసలు ఆ అబ్బాయిని చూస్తే ఈ హోటల్‌లో అటెండెంట్‌గా పని చేస్తాడని అనుకోం. వయస్సు ఇరవై ఐదేళ్ళ లోపే ఉండొచ్చు. ఎత్తయిన విగ్రహం, మరీ సన్నం అనలేం గాని ఓ మోస్తరు సన్నం. మన దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు ఈ కశ్మీర్ లోయలోనే ఉంటారు. పెద్ద కళ్లు, కోల ముఖాలు, గులాబీ రంగు శరీర ఛాయతో చూడగానే ముచ్చటేసేటట్లు ఉంటారు. ఆసిఫ్ మినహాయింపు కాదు. అసలు ఇలాంటి వారు గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఇట్టే క్లిక్ అవుతారు. మనసులో ఏవో ఆలోచనలు.
‘ఎక్స్‌క్యూజ్ మీ మేడమ్... చిత్రం చాలా బాగుంది...’ చిరునవ్వుతో ఆసిఫ్.
‘థ్యాంక్యూ. ఇంక చాలా ఉంది. ఇది రఫ్ స్కెచ్చే. కలర్ వేసిన తర్వాత చూస్తే కశ్మీర్ ప్రకృతిని నేను ఎలా చూపించానో తెలుస్తుంది.’
‘ఔట్ లైన్‌లోనే మీరు ఏం వేయనున్నారో నాకు అర్థం అయ్యింది... కాఫీ తీసుకురానా మేడమ్...?’
‘కాఫీ కోసమే ఎదురుచూస్తున్నా....’
ఐదు నిమిషాల తర్వాత కాఫీ కప్పు టేబుల్‌పై పెడుతూ–
‘మీరు కశ్మీర్ అందాలనే కాకుండా ఇక్కడి జీవితాన్ని కూడా బాగా వేయగలరు. థ్యాంక్యూ మేడమ్...’ వినయంగా చెప్పి వెనక్కి తిరిగాడు.
‘ఆసిఫ్... మీతో మాట్లాడాలి...’ ఈసారి వదలదలుచుకోలేదు.
‘ఇక్కడి జీవితం గురించి నాకు తెలియదు. మీతో మాట్లాడితే తెలుస్తాయని...’ సెకన్ గ్యాప్ ఇచ్చి
‘‘మీ గురించి చెప్పండి... ఏం చదువుకున్నారు? ఇంట్లో ఎవరెవరు ఉంటారు?’’
‘‘డిగ్రీ పూర్తయ్యింది మేడమ్. ఇంట్లో అమ్మా, నాన్న, చెల్లి ఉంటారు. అందరూ త్రాల్‌లోనే. నాన్నకు అనారోగ్యం. మంచానే ఉంటారు. చెల్లి ఇంటర్ చదువుతోంది. కాస్త పొలం, ఇంట్లో రెండు, మూడు ఆపిల్, ఆప్రికాట్ చెట్లున్నాయి. సీజన్‌లో నాలుగు డబ్బులు వస్తాయి. నేను నెలకు ఒకసారి ఇంటికి వెళ్ళి డబ్బులిచ్చి వస్తుంటాను. అందరం సంతోషంగానే ఉన్నాం.’’
‘ఉద్యోగం కోసం మీరు శ్రీనగర్ వచ్చారా?’
‘నిజం చెప్పాలంటే ఉద్యోగం కోసం ఇక్కడికి రాలేదు... ఊర్లో ఉండకుండా ఉండేందుకే ఇక్కడికి వచ్చాను.’
‘అర్థం కాలేదు..’
‘మా ఊరు సున్నితమైంది. వేర్పాటువాద భావజాలం ఎక్కువ. ఎవరైనా పట్టుబడితే ....ఇరుగు పొరుగున ఉండే మాలాంటి యువకులను కూడా అనుమానంతోనే చూస్తారు. కేసులు పెడతారు. ఒకసారి కేసు మెడకు చుట్టుకుందంటే కష్టాల్లో కూరుకుపోయినట్లే. గొడవ జరుగుతుంటే మేము చూడటానికి వెళ్లినా, యాదృచ్ఛికంగా ఆ సమయంలో అక్కడ ఉన్నా లోపలికి వెళ్లాల్సిందే. మా వాళ్లకు ఏదైనా చెబుదామని చూస్తే వాళ్ళ వైపు నుంచి మాకు భయం ఉంటుంది. ఊరంతా ఓ దారిలో వెళుతున్నప్పుడు నేను ఎదురీదలేను కదా.
అందుకే ఇలా దూరంగా వెళ్లి బతకమని అమ్మ పంపేసింది. అక్కడ ఏ గొడవ గురించి విన్నా... ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో అని ఆందోళనగా ఉంటుంది నాకు.‘చిరునవ్వు చెదరలేదు. ముఖంలో ప్రశాంతత పోలేదు. నా నోట మాట రాలేదు. అతను చెప్పిన మాటలను దృశ్యీకరించుకుంటోంది మెదడు. నేను వేయాల్సింది అందమైన పూలు, కొండలు, లోయలు కాదు... ఇక్కడి మనుషుల్ని. వారి జీవితాలని. ఆసిఫ్ నా ఆలోచనలను లోతుల్లోకి తీసుకువెళ్లాడు. ఉదయం చాలా అద్భుతంగా అనిపించిన నా స్కెచ్ ఇప్పుడు చాలా పేలవంగా అనిపించసాగింది. రాత్రి హోటల్లోని రెస్టారెంట్‌లో డిన్నర్ కోసం వెళ్లగానే టేబుల్ దగ్గరకు ఆసిఫ్పే వచ్చాడు. మెను కాసేపు అటూ ఇటూ తిప్పి ఏదీ డిసైడ్ చేసుకోలేక చపాతితో పాటు నాకు నచ్చే కూరను ఎంపిక చేసి తెచ్చే బాధ్యత ఆసిఫ్‌కే ఇచ్చా.
‘నువ్వు ఏది తెస్తే అది తింటా’ అని చెప్పాను. క్షణం ఆశ్చర్యపోయి నేను ఇచ్చిన గౌరవానికి ఆనందపడి కిచెన్‌లోకి వెళ్ళాడు. క్రష్డ్ మష్‌రూమ్ మసాలా కర్రీ తెచ్చాడు. నాకు కూర నచ్చిందో లేదో అన్న ఆత్రుత ఆసిఫ్ ముఖంలో స్పష్టంగానే కనిపించింది. తన చాయిస్ చాలా బాగుందని చెప్పేసరికి చాలా సంతోషపడ్డాడు. ఈసారి సంభాషణ కొనసాగించదలుచుకున్నాడనుకుంటా.
‘‘మీరు కశ్మీర్ రావటం ఇదే మొదటిసారా మేడమ్...?’’
‘‘అవును... చాలాసార్లు అనుకున్నాను రావాలని. ఏదో ఒక గొడవ జరుగుతుండటం, టికెట్లు క్యాన్సిల్ చేసుకోవటం కూడా జరిగింది.’’
‘‘ఒకసారి మా ఊరికి కూడా రండి మేడమ్. మా ఇంటికి తీసుకువెళతాను. మా ఇంట్లోనే ఉండండి. మేము ఎలా ఉంటామో మీరు దగ్గరగా చూడొచ్చు.’’
‘‘థ్యాంక్యూ... ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తా.’’
‘‘మీరు వేసే పెయింటింగ్స్ చూస్తే మా చెల్లెలు మిమ్మల్ని అస్సలు వదలదు. నాకు కూడా బొమ్మలు వేయటం చాలా ఇష్టం. ఒకసారి నా చిత్రం వేయించుకోవాలని కోరిక కూడా.’’
‘‘ఇక్కడ ఇంకో నాలుగు రోజులుంటా. ఆ లోపు వీలైతే వేసి ఇస్తా.’’
‘‘అయ్యో పర్వాలేదు మేడమ్. తొందర లేదు. మరోసారి వచ్చినప్పుడు వేద్దురు. మా వాళ్ళందరికీ మిమ్మల్ని పరిచయం చేస్తాను. మేము అతిథుల్ని చాలా గౌరవంగా, అభిమానంగా చూస్తాం. అది మా సంస్కృతిలో, కశ్మిరీయత్‌లో భాగం.’’
‘‘ఈసారి తప్పకుండా మీ ఊరికి వెళ్లేటట్లు షెడ్యూల్ ప్లాన్ చేసుకుని వస్తాను...’’
∙∙
రెండో రోజు బండి మాట్లాడుకుని గుల్మార్గ్ వైపు వెళ్ళాను. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. పైన్, ఫర్ చెట్ల అడవులను దాటుకుని ఇక్కడికి చేరుకోవటం ఓ అద్భుత అనుభవం. శీతాకాలంలో అయితే స్కియింగ్, స్నో బోర్డింగ్ వంటి వింటర్ గేమ్స్‌కు అడ్డాగా మారుతుందట గుల్మార్గ్. రోజంతా తిరిగి హోటల్‌కు చేరుకునేటప్పటికి రాత్రి తొమ్మిది దాటింది. అలసిపోయి తినకుండానే పడుకున్నాను. రెండోరోజు ఉదయం టీవీ పని చేయలేదు. వాట్సప్ ఓపెన్ కాలేదు. నెట్‌వర్క్ కనెక్ట్ కానందుకు అసహనంగా కాసేపు రూమ్‌లోనే అటూ ఇటు తచ్చాడి రెస్టారెంట్ తెరిచే సమయానికి బ్రేక్‌ఫాస్ట్ కోసం వెళ్ళాను.
‘‘రూమ్‌లో టీవీ పని చేయటం లేదు..’’
‘‘సారీ మేడమ్. మొన్న రాత్రి నుంచే నెట్‌వర్క్ ఆపేశారుగా.’’
‘‘ఎందుకు? ఫోన్‌లో నెట్ అందుకే రావటం లేద?’’
‘‘మొబైల్ ఫోన్లు, ఇంటర్‌నెట్, కేబుల్ నెట్ అన్నీ ప్రభుత్వం నిలిపేసింది. ఫలానా అతన్ని ఎన్‌కౌంటర్ చేశారుగా. పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. అతనికి ఇక్కడ చాలా ఫాలోయింగ్ ఉంది. చాలా మంది యువకులు అతన్ని హీరోగా చూస్తారు. అందుకే లోయ అంతా 144 సెక్షన్ విధించారు. నిన్నటి నుంచి శ్రీనగర్ అంతా మూతబడే ఉంది.’’
‘‘అవునా...?!!’’ ఒక్క క్షణం నిర్ఘాంత పోయాను.
‘‘అయితే ఇవాళ నను బయటకు వెళ్ళలేనా?’’
‘‘వెళ్లకపోవటమే మంచిది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.’’
‘‘ఎన్‌కౌంటర్ జరిగింది శ్రీనగర్‌లోనేనా?’’
‘‘కాదు మేడమ్. త్రాల్. ఆసిఫ్ వాళ్ల ఊరు. వాళ్ళ నాన్నకు మందులైపోయాయని నాలుగు రోజుల క్రితమే ఫోన్ వచ్చింది. మందులు ఇచ్చేసి వస్తానని వద్దన్నా వినకుండా వెళ్ళాడు. వాళ్ళ నాన్న పెరాలిసిస్ పేషెంట్. బెడ్ మీదే. నెలనెలా అతనికి మందులు అవీ... ఇతనే తీసుకువెళ్ళి ఇచ్చి వస్తుంటాడు. చెల్లెలు అంటే ఎంత ప్రేమో. చాలా మంచోడు పాపం. ఎవరి జోలికీ పోడు. ఇంట్లో అందరూ తన మీదే ఆధారం అని జాగ్రత్తగా ఉంటాడు. ఈపాటికి వస్తానన్నాడు. అతను వస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.’’
రూమ్‌కు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళే పని లేదు కనుక పుస్తకం అందుకున్నాను. గుగి వా థియాంగో రాసిన మాటిగొరి నవల. పుస్తకం వెనక తిప్పి నవల దేని గురించా అని చదివాను. కెన్యా దేశం వలస పాలనలో ఉన్నప్పుడు అడవుల్లో ఉండి విముక్తి పోరాటం చేసిన నవలా నాయకుడు. సొంత పాలన వచ్చిందన్న విషయం తెలుసుకుని తన ఆయుధాలను అడవిలోనే ఓ చెట్టు కింద పాతిపెట్టి తన కుటుంబాన్ని కలుసుకోవాలనే ఆకాంక్షతో వస్తాడు. తీరా ఇక్కడికి వచ్చాక పాలకులు మారారు కాని పాలితులపై దౌర్జన్యాలు, దాడులు, దోపిడీ వ్యవస్థ మారలేదన్న విషయం తెలుసుకుని మరోసారి ఆయుధం చేపట్టాల్సిందే అని నిర్ణయించుకోవటం నవల సారాంశం. అక్షరాల వెంట కళ్ళు పరుగులు పెడుతున్నా... మధ్య మధ్యలో ఆసిఫ్, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్న ఆలోచన మెదులుతూనే ఉంది.
వెళ్ళిపోయే ముందు ఆసిఫ్‌కు ఓ ఊహించని బహుమతి ఇస్తే బాగుంటుందనిపించింది. కాన్వాస్ టేబుల్ సిద్ధం చేసుకున్నాను. ఆ మరుసటి రోజు కూడా అలానే గడిచిపోయింది. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్లు. ఫోన్ మోగలేదు. ఇంటర్‌నెట్ లేదు. టీవీ లేదు. బయటకు ప్రయాణం కట్టే ఆస్కారం లేదు. సైన్యం పహారాలో నిశ్శబ్దంగా ఉన్న శ్రీనగర్ రోడ్ల పై కాలి నడకన కాసేపు తిరిగాను ఐడెంటిటీ కార్డ్ పాకెట్లో పెట్టుకుని. పుస్తకాలు, కాన్వాసుతో కాసేపు కాలక్షేపం చేశాను. ఈ మొత్తం ప్రక్రియలో ఆసిఫ్, అక్కడి కల్లోలం గురించిన ఆలోచనలు సమాంతరంగా ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. ఆ రోజు కూడా అతని రాక గురించి వాకబు చేశాను. బంద్ కదా రావటానికి వాహనాలు దొరికి ఉండకపోవచ్చు లేదా ఎలాగో ఇంటికి వచ్చాను కదా అని మరో రోజు కుటుంబ సభ్యులతో ఉండాలనుకుని ఉండొచ్చు.
తర్వాతి రోజు పదకొండు గంటల ఫ్లైట్‌కు తిరుగు ప్రయాణం. అందుకే రాత్రి కల్లా ఆసిఫ్ చిత్రాన్ని పూర్తి చేసేస్తే ఉదయం హడావిడి ఉండదు అనుకున్నా. సరిగ్గా ఒంటి గంటా ముప్ఫై నిమిషాలకు కుంచె పక్కన పెట్టి అన్ని కోణాల నుంచి చిత్రాన్ని చూసుకుంటూ నిలబడ్డాను. ఆ చిరునవ్వు, కళ్ళల్లో మెరుపు అనుకున్న దాని కంటే బాగానే వచ్చాయి. ఆసిఫ్ ఆశ్చర్యపోతాడు అనుకుని ప్రశాంతంగా నిద్ర పోయాను. తెల్లారింది. చివరి రోజు లాన్‌లో నడకను మరిచిపోలేదు. ఫోటోలు దిగాను. బ్రేక్‌ఫాస్ట్ కోసం డైనింగ్ హాల్‌లోకి వెళ్ళాను. కళ్లు ఆసిఫ్‌ను వెతికాయి. మరో అబ్బాయి ఉంటే ఆలూ పరాఠా ఆర్డర్ ఇచ్చాను. ఎప్పుడూ ఇద్దరు, ముగ్గురు ఉంటారు. ఆ వేళ ఒక అబ్బాయే ఉన్నాడు. పది నిమిషాల తర్వాత వేడి వేడి పరాఠాల ప్లేటు తెచ్చి నా ముందు పెట్టాడు.
‘‘ఆసిఫ్ ఇంకా రాలేదా?’’
‘‘నహీ ఆయా మేడమ్... ఆయేగా భీ నహీ... ఇక రాడు మేడమ్.’’
వెన్నులో సన్నటి వణుకు. కసి, కోపంతో అతను కూడా తుపాకి పట్టాడా? బలగాలు అదుపులోకి తీసుకున్నాయా? ఇక్కడ రహస్య జీవితం గడిపాడా?
‘‘ఏం..?’’ గొంతు పెగుల్చుకుని అడిగాను.
‘‘వాళ్ళ చెల్లి బయటకు వెళితే వెతుక్కుంటూ వెళ్ళాడు. అదే సమయంలో రోడ్డు మీద రాళ్ళ దాడి జరుగుతోంది. స్థానికులు రాళ్ళు రువ్వుతుంటే వాళ్లను కంట్రోల్ చేయటానికి పెల్లెట్లు పేల్చుతా ఉన్నారు. దారిన పోతున్న ఆసిఫ్‌కు పెల్లెట్లు తగిలాయి. వెంటనే వైద్యం దొరికితే బతికేవాడేమో... హాస్పటల్‌కు తీసుకెళ్ళే వరకే ...’
బాధ, పశ్చాత్తాపం నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు... నా లోతుల్లోనూ అనుమానపు ఛాయలు ఉన్నాయన్నమాట. లేక ఆసిఫ్ చనిపోతాడన్న ఊహే నాలో లేకపోవటమా? నేనలా నన్ను నేను సమర్థించుకుంటున్నానా? ఆ మెరిసే కళ్ళు, చెదరని చిరునవ్వు తెరలై కళ్ళ ముందు వేళ్ళాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment