నేనొక ప్లాన్‌ వేశాను | special on funday | Sakshi
Sakshi News home page

నేనొక ప్లాన్‌ వేశాను

Published Sun, Jan 14 2018 1:12 AM | Last Updated on Sun, Jan 14 2018 1:12 AM

special on funday - Sakshi

‘‘సుష్మా! నేను ఫోరంకి వెళ్లొస్తాను. మా నాన్నకి బాగాలేదంట. తమ్ముడు ఫోన్‌ చేశాడు. వెళ్లి చూసొస్తాను. సాయంకాలానికి వచ్చేస్తాలే. మీ నాన్నకు మందులు ఇవ్వు అన్నం తినగానే.’’ అన్నది హైమావతి.‘‘సరే! పిన్నీ’’ అన్నది సుష్మ.హైమావతి బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది. నాగభూషణం కళ్లుమూసుకొని ఉన్నాడు.‘‘ఏమండీ!’’ అని తట్టి పిలిచింది.నాగభూషణం కళ్లు తెరిచాడు.‘‘ఫోరంకి వెళ్లొస్తాను. మా నాన్నకి బాగాలేదంట’’ అన్నది.నాగభూషణం తల ఊపాడు. హైమావతి భవానీపురం నుంచి విజయవాడ బస్‌స్టేషన్‌కి వెళ్లే బస్సు ఎక్కింది. అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు వీర్రాజు. 

ఇద్దరూ ఒక హోటల్‌కెళ్లి ఫ్యామిలీరూమ్‌లో కూర్చున్నారు.‘‘అర్జెంట్‌ అన్నావు. ఏంటది?’’ అడిగాడు వీర్రాజు.‘‘ఉండవల్లిలో పొలం అమ్మడానికి బేరంపెట్టాడు మా ఆయన. ఆ డబ్బుతో కూతురి పెళ్లి చేయాలని ప్లాన్‌. అది అమ్మేస్తే నాది అథోగతే. అందుకే నేనొక ప్లాన్‌ వేశాను.’’‘ప్లానా?’’‘‘ఔను. రేపు ఉదయం పది తర్వాత నువ్వు నీ కారు తీసుకురా. కాన్సర్‌ ఆసుపత్రికని ఆయన్ని తీసుకొస్తాను. దారిలో ఎక్కడో ఒక చోట కారు ఆపి ముఖం మీద దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేద్దాం. పీడావిరగడ అవుతుంది’’ చెప్పింది హైమావతి.వీర్రాజు ఆలోచనలో పడ్డాడు.నాగభూషణం రెండో భార్య హైమావతి. రిటైర్‌మెంట్‌ దగ్గరికొచ్చాక నాగభూషణం భార్య చనిపోయింది. హైమావతిని పెళ్లి చేసుకున్నాడు. వయసులో ఇరవై ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఆమెకు వీర్రాజుతో అక్రమ సంబంధం ఉంది. వీర్రాజుకి సొంతంగా కారు ఉంది. తనే డ్రైవ్‌ చేసుకుంటూ టాక్సీలా తిప్పుతుంటాడు.

ఉండవల్లి ఊళ్లో నాగభూషణానికి ఎకరం పొలం ఉంది. అది రాజధానికి దగ్గరగా ఉండడంతో విలువ పెరిగింది. రిటైరైన తర్వాత నాగభూషణానికి క్యాన్సర్‌ జబ్బు బయట పడింది. తను పోయే లోపల కూతురు సుష్మ పెళ్లి గ్రాండ్‌గా చేసి అత్తారింటికి పంపేయాలని ఆలోచనలో ఉన్నాడు. కోటి రూపాయల కట్నమైనా ఇచ్చి మంచి ఉద్యోగస్తుడికి ఇవ్వాలని కోరిక. అందుకు హైమావతి వ్యతిరేకి. పొలం అమ్మడం ఇష్టం లేదు. బ్యాంకులో ఉన్న డబ్బుతో మామూలు సాదాసీదా సంబంధం చూసి సుష్మ పెళ్లి చేసి పంపాలని పోరుతోంది. పొలం అమ్మేస్తే ఆయన పోయాక తనకేం మిగులుతుంది? భార్యగా వచ్చే ఫ్యామిలీ పెన్షన్‌తో బతకాలి.

‘‘సరే అయితే! ఆసుపత్రికి వెళ్లేటప్పుడు వద్దు. ముందు ఆసుపత్రికి వెళ్దాం. అక్కడ టెస్టులు అవీ చేస్తారు. టైమ్‌ పడుతుంది. ఆయన్ని అక్కడ ఉంచి మనం హాయ్‌ల్యాండ్‌లో గడుపుదాం. సాయంకాలం వెళ్లి ఆయన్ని కారెక్కించుకొని తిరిగి వచ్చేటప్పుడు ఫినిష్‌ చేద్దాం. అప్పుడు ఎవరికీ అనుమానం రాదు. ఎటూ క్యాన్సర్‌తో పోయేవాడే అని అందరికీ తెలుసు.’’ అన్నాడు వీర్రాజు.హైమావతి తల ఊపింది. వీర్రాజుతో అప్పుడప్పుడు హోటళ్లలో గడపడం ఆమెకు మామూలే.  మ్యారేజ్‌ బ్యూరో నుంచి వచ్చిన ఏజెంట్‌ విక్రమ్‌ లాప్‌టాప్‌లో వధువుల కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న అబ్బాయిల ఫొటోలు, బయోడేటాలు నాగభూషణానికి చూపిస్తున్నాడు.

ఎక్కువగా అమెరికాలో జాబ్స్‌ చేస్తున్న వాళ్లవే ఉన్నాయి. నాగభూషణానికి ఫారిన్‌ సంబంధం చేయడం ఇష్టం లేదు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని భారీ ఎత్తున కట్నాలు ఇచ్చి కూతురితో పెళ్లి చేసి మోసపోయిన వార్తలు ఈమధ్య ఎక్కువగా వస్తున్నాయి. కొందరేమో అక్కడ ఆల్రెడీ ఏ తెల్లమ్మాయినో పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంటారు. తల్లిదండ్రులకు ఆ సంగతి చెప్పరు. ఇక్కడ పేరెంట్స్‌ ఒత్తిడి చేస్తే మళ్లీ పెళ్లి చేసుకుంటారు. అమ్మాయి కాపురానికి వెళ్లాక అసలు సంగతి బయటపడి లబోదిబోమంటారు. ఇంకొందరు యువకులకు అమెరికాలో ఏ ఉద్యోగం ఉండదు. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ అని చెప్పి పెళ్లి చేసుకుంటారు. తీరా కాపురానికి వెళ్లాక తెలుస్తుంది, అక్కడ ఏ పెట్రోలు బంకులోనో, సూపర్‌ మార్కెట్‌లోనో ఉద్యోగం చేస్తున్నాడని.అందుకే నాగభూషణం ఇండియాలోనే ఉద్యోగం చేస్తున్న సంబంధాలు చూడమని చెప్పాడు.

సుష్మ బీటెక్‌ చదివింది. తర్వాత అమెరికాలో ఎమ్మెస్‌ చేయాలనుకుంటోంది. ఆమె స్నేహితురాళ్లు చాలామంది అమెరికాకి వెళ్లి చదవాలని ప్లాన్‌ చేసుకుంటున్నారు. కానీ తండ్రికి క్యాన్సర్‌ అని బయటపడగానే ఆమె ఆశలు నీరు కారిపోయాయి.మ్యారేజ్‌ బ్యూరో ఏజెంట్‌ వెళ్లిపోయిన తర్వాత సుష్మ తండ్రితో చెప్పింది. ‘‘నాన్నా! నాకు ఇప్పుడే పెళ్లి వద్దు. కావాలంటే ఇక్కడే ఎంటెక్‌ చేస్తాను.’’‘‘కాదమ్మా! నువ్వు అమెరికాలో ఎమ్మెస్‌ చేసినా, ఇక్కడ ఎంటెక్‌ చేసినా తేడా ఏం లేదు. కాకపోతే నా పరిస్థితి తెలుసుగా? ఎప్పుడు పోతానో తెలీదు. నేను ఉండగానే నీ పెళ్లి చేసి అత్తారింటికి పంపేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది.’’ అన్నాడు నాగభూషణం.

తండ్రి సంగతి ఆమెకు బాగా తెలుసు. తను అనుకున్నదే చేస్తాడు. ఎవరిమాటా వినడు. తన తల్లి చనిపోయినప్పుడు చాలామంది మళ్లీ ఈ వయసులో పెళ్లెందుకు? వద్దు అన్నారు. ఇరవై ఏళ్ల చిన్నదాన్ని చేసుకోవడం ఎందుకు? అన్నారు. అయినా ఆయన వినలేదు. హైమావతి తండ్రి కూడా విధవరాలైన కూతురికి పెళ్లి చెయ్యలేక పోతున్నాడు. నాగభూషణం పోయినా సొంత ఇల్లు, పొలం ఉంది, పైగా కూతురికి జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్‌ వస్తుందని ఆలోచించి పిల్లనిచ్చి పెళ్లి చేశాడు.ఇప్పుడిక సుష్మ చదువుకి ఫుల్‌స్టాప్‌ పెట్టక తప్పని పరిస్థితిలో ఉంది. పెళ్లి చేసుకోక తప్పదని ఆమెకు అర్థమైంది.
∙∙ 
నాగభూషణం సుష్మ పెళ్లి చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుండడంతో హైమావతి పెళ్లి ఆపడానికి అన్నిరకాలుగా ఆలోచిస్తోంది. ఎలాగూ భర్త తన మాటవినడు.‘‘నువ్వు పెళ్లికి ఒప్పుకోకు. మీ నాన్న ఒత్తిడి చేస్తాడు. ఏ సంబంధం నచ్చలేదని చెప్తుండు. ఆయన ఎక్కువ రోజులు బతకడు. ఆ తర్వాత నువ్వు అమెరికా వెళ్లి చదువుకుందువు గాని’’ అని సుష్మకు ఎక్కించింది.

సవతి తల్లికి తన మీద ఎంతో ప్రేమ ఉందని సుష్మ అనుకుంది. అసలు సంగతి అది కాదనే గ్రహింపు లేదు. అందుకే తనకు పెళ్లి వద్దని తండ్రితో వాదిస్తోంది. కానీ తండ్రి తన మాటలు లెక్కచేయడని ఆమెకు తెలుసు. జరిగేది జరుగుతుందనే నిర్వేదంలో పడిపోయింది సుష్మ.అనుకున్నట్టుగానే వీర్రాజు ఉదయం పది గంటలకు భవానీపురంలోని నాగభూషణం ఇంటికి కారు తీసుకొచ్చాడు.నాగభూషణం అప్పుడు టిఫిన్‌ చేస్తున్నాడు.‘‘వీర్రాజూ! టిఫిన్‌ చేద్దువుగాని లోపలకు రా!’’ అని పిలిచింది హైమావతి.‘‘వద్దండీ! టిఫిన్‌ చేసొచ్చాను అమ్మగారూ!’’ అని వినయం ఒలకబోశాడు వీర్రాజు.తర్వాత నాగభూషణాన్ని ఎక్కించుకుని కారులో బయల్దేరారు. తాడేపల్లిలో ఉంది మణిపాల్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌. 

విజయవాడలో కృష్ణానది మీదున్న కనకదుర్గ వారధి దాటి తాడేపల్లికి చేరుకున్నారు. నాగభూషణాన్ని ఆసుపత్రిలో నర్స్‌కి అప్పగించారు. ఆమె శ్రద్ధగా చూస్తుంది నాగభూషణాన్ని.నాగభూషణం టీచర్‌గా పని చేస్తున్నప్పుడు నర్స్‌ సునీత ఆయన శిష్యురాలు. అందుకే వచ్చినప్పుడల్లా ప్రత్యేకంగా ట్రీట్‌ చేస్తుంది. మధ్యాహ్నం లంచ్‌ ఏర్పాటు చేసి టెస్ట్‌లు, ట్రీట్‌మెంట్‌ను శ్రద్ధగా చేస్తుంది.నాగభూషణం శిష్యురాలు అక్కడ ఉండడం హైమావతికి వెసులుబాటుగా ఉంది. ఆయన్ని అప్పగించి వీర్రాజుతో ఎంజాయ్‌ చేయడానికి బయలుదేరింది.
∙∙ 
సాయంకాలమైంది. చీకటిపడింది. హైమావతి తిరిగి రాలేదు. నర్స్‌ సునీత.. నాగభూషణం దగ్గరున్న సెల్‌ఫోన్‌ నుంచి హైమావతికి కాల్‌ చేసింది. రింగవుతున్నది కానీ ఆమె లిఫ్ట్‌ చేయడం లేదు.‘‘మాష్టారూ! మేడమ్‌ లిఫ్ట్‌ చెయ్యడం లేదు’’ అన్నది సునీత. ‘‘ఈ పాటికే రావాలి కదా?’’ అన్నాడు.ఎన్నిసార్లు కాల్‌ చేస్తున్నా రింగవుతుంది కానీ హైమావతి కాల్‌ లిఫ్ట్‌ చేయడం లేదు.‘‘సునీతా! మా అమ్మాయికి కాల్‌ చెయ్యి. అసలు ఇంట్లో నుంచి హైమా బయల్దేరిందో లేదో? అన్నాడు నాగభూషణం.

సుష్మ ఫోన్‌ ఎత్తగానే సునీత ఫోన్‌ను నాగభూషణానికి అందించింది.‘‘నాన్నా! ఘోరం జరిగిపోయింది.’’ అన్నది సుష్మ వణుకుతున్న గొంతుతో.
‘‘ఏం జరిగిందమ్మా?’’ అడిగాడు కూతుర్ని.‘‘నాన్నా! నందన్‌ రిసార్ట్స్‌ వెళ్లే దారిలో పిన్ని వెళ్తున్న కారును ఓ బస్సు ఢీ కొట్టిందట. పిన్ని హ్యాండ్‌బ్యాగ్‌ని, అందులోని తన ఫొటోను టీవీలో చూపిస్తున్నారు. పిన్ని స్పాట్‌లోనే చనిపోయిందట నాన్నా. శవాన్ని కూడా చూపిస్తున్నారు..!’’ అని చెప్పింది సుష్మ.ఎప్పుడూ హాయ్‌ల్యాండ్‌లో ఎంజాయ్‌ చేసే వీర్రాజు, హైమావతి ఈసారి నందన్‌ రిసార్ట్స్‌లో గడపాలనుకున్నారు. విధి చిన్నచూపు చూసింది. అందుకే అంటారు తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని. నాగభూషణం బిత్తరపోయాడు.‘‘అటువైపు ఎందుకు వెళ్లింది?’’ అడిగాడు కూతుర్ని.
 సుష్మకి మాత్రం ఏం తెలుసు?‘‘ఏమో నాన్నా!’’ అన్నది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement