
అమృతా అరోరా.. తెర మీద నటిగా కన్నా పేజ్ త్రీ సెలబ్రిటీగా బాగా పరిచయం. ఉస్మాన్ అఫ్జల్.. మైదానంలో క్రికెటర్‌గా కన్నా లవర్ బాయ్‌గా ఎక్కువ పాపులర్. ఈ ఇద్దరిదీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్. అతను లండన్‌లో.. ఆమె ముంబైలో. వీలైనప్పుడల్లా .. వీలు చేసుకుని మరీ కలుసుకునే ప్రయత్నం చేసినా.. ఆ బంధం నిలవలేదు. ఆ లవ్ అండ్ బ్రేకప్ స్టోరీ గురించి..
ఉస్మాన్ అఫ్జల్ లండన్‌లో పుట్టి పెరిగిన పాకిస్తానీ. అమృతా ముంబై వాసి. ఆమెకు పార్టీలు అంటే చాలా ఇష్టం. ఆ పార్టీలోనే కలిశాడు ఉస్మాన్. అమృతా చురుకుదనం, నవ్వుతూ చలాకీగా కలియతిరగడం నచ్చింది అతనికి. ఇష్టపడ్డాడు. ఇంకో రెండు మూడు పార్టీల్లోనూ అమృతాను చూశాక ఆ ఇష్టాన్ని ప్రకటించాడు. అప్పుడు ఆమె అతని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. తెలుసుకున్న వెంటనే తన పట్ల ఉన్న అతని ఇష్టాన్ని అంగీకరించింది. ప్రేమ కథ మొదలైంది. అయితే అది అకేషనల్ లవ్‌గానే ఉండింది. అతనికి క్రికెట్ నుంచి సెలవు దొరికనప్పుడో.. ఆమెకు సినిమా షెడ్యూల్ లేనప్పుడో.. కలుసుకునేవారు. అలా ఆ ప్రేమ లండన్ టు ముంబై మధ్య షటిల్ చేసింది.
ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కొన్నాళ్లు బాగానే నడిచినా.. నెమ్మదిగా పలుచబడసాగింది. ఇద్దరూ సెలబ్రిటీలవడం.. ఒకరికొకరు దగ్గరగా లేకపోవడం వల్ల.. గాసిప్స్ మొదలయ్యాయి. వీళ్ల ప్రేమ గురించి కాదు.. అమృతా వ్యక్తిత్వం, ఆమె సరదా మనస్తత్వం, పార్టీలను ఎంజాయ్ చేసే ఆమె తత్వం గురించి. పేజ్ త్రీ వేడుకల్లో అమృతా ఎక్కువగా మోడల్ సాహిల్ ష్రాఫ్ వెంటే కనపడుతోందనే వార్తలు ఫొటోలతో సహా కనిపించడం, వినిపించడం మొదలయ్యాయి. ఇవి లండన్‌లో ఉండే ఉస్మాన్ దాకా పరుగెత్తాయి. సెలెబ్రిటీల విషయంలో అవన్ని సహజమేనని కొట్టిపారేసి.. వాటిని వదంతులుగానే తీసుకున్నాడు ఉస్మాన్.
అలాంటి సమయంలోనే..
ఉస్మాన్ పుట్టినరోజు వచ్చింది. అప్పుడు అమృతా ‘గోల్‌మాల్ రిటర్న్స్ (హిందీ సినిమా)’ షూటింగ్ నిమిత్తం బాంకాక్‌లో ఉండడం వల్ల లండన్‌లో జరిగిన ఉస్మాన్ పుట్టిన రోజు వేడుకలకు హాజరుకాలేకపోయింది. ఈ గైర్హాజరును ఆ వదంతులకు ముడిపెట్టి రకరకాల కథనాలు వచ్చాయి మీడియాలో. అవి ఉస్మాన్ మనసులో స్పర్థను సృష్టించాయి. తుడిచేయడానికి అమృతా లండన్ వెళ్లింది. అయినా దూరం తగ్గలేదు.
ఆ సంఘటన తర్వాత ఉస్మాన్ నుంచీ పెద్దగా స్పందన లేదు. దాంతో అది ముందుకు వెళ్లే అనుబంధం కాదని అమృతా గ్రహించింది. ఓ రోజు ఉస్మాన్‌కు ఫోన్ చేసింది.. ‘నువ్వు లండన్‌లో.. నేను ముంబైలో.. నువ్వు క్రికెట్‌తో.. నేను సినిమాలతో క్షణం తీరికలేని బిజీ. రిలేషన్ అంటే మనిద్దరి సౌకర్యంలో ఇమిడేది కాదు.. ఒకరి కోసం ఒకరుగా మనిద్దరినీ సౌకర్యంగా ఉంచేది కదా. మన విషయంలో ఇది జరగడంలేదు. ఇంత అసౌకర్యంగా ఉండే కంటే..’ అని ఆగింది.
‘ఆ .. ఉండేకంటే..’ అని రెట్టించాడు ఉస్మాన్ అవతలి నుంచి.
‘విడిపోవడం బెటర్..’ అంది అమృతా.
‘సో..’ అంటూ ఆగాడు అతను.
‘బ్రేకప్..’ అంది ఆమె.
ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ ఫర్ ప్యూచర్ అని చెప్పేసుకొని ఫోన్ లైన్స్ డిస్కనెక్ట్ చేసుకున్నారు. బ్రేకప్ అని చెప్పనైతే చెప్పింది కానీ ఆ స్థితిని నిభాయించుకోవడం.. తనను తాను సంభాళించుకోవడం చాలా కష్టమైంది అమృతాకు. సరదాకి పర్యాయమైన ఆమె ఒక్కసారిగా మూడీ అయిపోయింది. కళ్లల్లో నీటి కుండలను మోసింది. ఆ బాధలో అమృతాకు భుజమిచ్చి.. ఊరటగా నిలిచింది ఆమె ఆప్తురాలు కరీనా కపూర్. ‘నిజమే.. ఆ టైమ్‌లో కరీనా లేకపోతే ఏమైపోయేదాన్నో. పవర్ యోగాను పరిచయం చేసింది. ఆ యోగాతోనే దిగులు, డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. ముందుకెళ్లిపోయా. విషాదాన్ని పదేపదే గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు’ అంటుంది అమృతా అరోరా.
ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment