గండికోటలో నాకొక చిత్రమైన అనుభవం. 7వ తరగతి చదువుకుంటున్న రోజులు. గండికోట చూడాలని మావూరి నుంచి బయలుదేరినాం. అప్పుట్లో మావూరు నుంచి గండికోటకు పోవాలంటే ఏట్లో(చిత్రావతి నది) నడిచిపోవాల. లేదంటే జమ్మలమడుగుకు బస్సులో వెళ్లి అక్కడి నుంచయినా నడిచిపోవాల.∙మా ఫ్యామిలీ, నా ఫ్రెండ్ ప్రభాకర్ ఫ్యామిలీ చిత్రావతిలో నడిచి వెళ్లాలని బయలుదేరినాం. రెండు కిలోమీటర్ల మేర రోడ్డు పై ప్రయాణం. ఆ తర్వాత ఏటి ఇసుకలో కాలినడక. కాళ్లు ఈడ్చుకుంటూ...గవ్వలు ఏరుకుంటూ.. రెండు కొండల నడుమ(గాడ్జెస్) పాయలు పాయలుగా పారుతున్న నీటిలో నడుస్తూ ... క్లిష్టర్ క్లియర్‌గా నీటిలో అటుఇటూ బుల్లి చేపలను చేత్తో పట్టుకునేందుకు తంటాలు పడుతూలేస్తూ.. పట్టుకున్నవి మళ్లీ వదులుతూ.. మధ్యాహ్నమయింది. అలిసిపోయామేమో ఒకటే ఆకలి. పైన కరకరమంటున్న ఎండ.
‘‘ఇంగసాలు రాండ్రా బువ్వ తిందురుగాని’’ అని చిన్నక్క(ప్రభాకర్ వాళ్లమ్మను అలాగే పిలుస్తాం) పిలిచాకగాని ఈలోకంలోకి రాలేదు. ఏటి మధ్యలో వెండి, బంగారు కలబోసిన ఇసుక తళుకులు... పైన నీలాకాశం పందిరి కింద(ఇప్పుడు గండికోట ఆనకట్ట కట్టినారే అక్కడ అనుకోండి) వాహ్.. భోజనాలు. ఏమాటకామాట చెప్పుకోవాలి. ఆరోజులు మళ్లీ రావనే అనుకుంటున్నా.సరే, గండికోటకు చేరుకున్నాక చూడాలీ మా ఆనందం.. ఏకబిగిన కోటంతా తిరిగాం. రాజులు, నవాబుల యుద్ధాలు.. ఆ గాల్లో ఏదో గమ్మత్తు. గుర్రపుశాల దగ్గర లోపలికి తొంగిచూస్తే.. వాసన ఎప్పుడూ చూడంది. మసీదు,కోనేర్లు.. పెద్ద బండరాళ్లు మైమరచి పోయాం. అలానడుచుకుంటూ ఎటో వెళ్లిపోయాం. కోటంతా కలియదిరిగి చూసినవన్నీ రేపు బళ్లో గొప్పగా చెప్పుకోవాలనే ఉత్సాహంతో నేనూ ప్రభాకర్‌గాడు పరిసరాలు మరిచిపోయి నడుస్తూ ఎప్పుడో మావాళ్లని వదిలేసి దూరంగా వచ్చేశాం.
వెనక్కి చూస్తే దూరంగా మేమిద్దరమే!
అటుఇటు ఎత్తయిన కొండలు.. పెద్ద బండరాళ్లు. చెట్లు, పొదలు, నీటి దొనెలు. కోట ముఖద్వారం అనుకుంటా ఎత్తుగా దూరంగా గోపురం. విఠలాచార్య సినిమాలో దారి తప్పిన కమెడియన్‌లా అయిపోయింది మా పరిస్థితి. ఏమి చేయాలో అర్థం కాక దాదాపు ఏడ్చేసినంత పని. అయితే కోట ముఖ ద్వారం వద్ద గోపురం కనిపిస్తోందంటే కోట పరిసరాల్లోనే ఉన్నామనే కదా? «దైర్యం చెప్పుకుని గోపురాన్ని చూస్తూ సూటిగా నడిచాం. సాయంత్రం అయింది. గుంపు దొరికింది.ఎక్కడనుకుంటున్నారు? కోనేటి దగ్గర. సైనికులు యుద్ధంలో కత్తులకు అంటిన నెత్తురును కడిగిన కోనేరంట! అదెంత నిజమా తెలీదు కానీ కోనేరు చుట్టూ మావాళ్లు, గండికోట వాసులు. వాళ్ల చూపంతా కోనేటిలో నీటి వైపే ఉంది. అక్కడి పరిస్థితి చూస్తే ఏదో జరగరానిది జరిగిందనిపించింది.
గుంపు వెనకాల నిలబడి నక్కినక్కి చూస్తున్నాం. మా అమ్మ, ప్రభాకర్ వాళ్లమ్మ ఒకటే ఏడుపు. ఏదో కీడు శంకించింది. ఏం జరిగి ఉంటుందో అర్థంగాక మాకూ ఏడుపొచ్చేలా ఉంది.
ఉన్నట్టుండి.. చుట్టూ చేరిన వాళ్లు అట్నుంచి ఇట్నుంచి కోనేరులో నీళ్లను చూపిస్తూ అదిగో కాలు, అదిగో చేయి.. అదిగో నిక్కరు..చొక్కా.. ఎవరికి తోచినట్లు వాళ్లు చెపుతున్నారు. వాళ్లు చెప్పేకొద్దీ మావాళ్ల ఏడుపు మరింత ఎక్కువైంది. వాళ్లు ఎందుకేడుస్తున్నారో అర్థంకాలేదు. అక్క ఎక్కడున్నారోనని వెతికితే ఓ పక్క నిలబడి నీళ్లలోకి చూస్తూ ఏడుస్తోంది.
మెల్లిగా వెనక నుంచి మా అక్క దగ్గరికి వెళ్లి.. తనకు మాత్రమే వినబడేట్లు.. ఆపా.. అని పిలిచా. గిరక్కున వెనక్కి తిరిగి చూసిన మా అక్క.. మా నజీర్ ఆగయా.. అని పిలవడం. మా అక్కకేసి చూడటం ఒకేసారి జరిగిపోయింది. ఒక్కసారిగా అంతానిశ్శబ్దం అంతలోనే కోనేటికి అటువైపున్న మా అమ్మ పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి నన్ను దగ్గరికి తీసుకోవడం కూడా అంతేవేగంగా జరిగిపోయింది. ‘‘ఎక్కడికి పోతివిరా గాడిదా!’’ అని అంత ఏడుపులోనే నాలుగు అంటించింది. అక్కడ ప్రభాకర్ వాళ్ల ఫ్యామిలీ పరిస్థితీ అంతే. మమ్మల్ని తలోమాట అన్నారు.
వాళ్ల మాటల్ని బట్టి మాకర్థమయిందేమిటంటే మేం కోనేరులో మునిగిపోయాం. మా శరీరాలు నీటి లోపల కనిపిస్తున్నాయి.
మా బడాయి కొద్దీ గుంపును వదిలి మేందూరం పోతింగదా. ఎంత వెదికినా కనబడకపోయేసరికి కోనేరు చూడను పోయి అందులో పడిపోయినామనుకుని భయపడిపోయారు. దీనికి తోడు నీటి లోపల కనిపించీ కనిపించని నాచు, ఆకాశంలోని మేఘాల నీడ ఒక రకమైన భ్రమకు లోనుచేశాయి. వాటిని చూసి కోనేట్లో ఉండేది మా శవాలనుకుని అడుగో అంటే ఇడుగో అని.. మరింత భయపెట్టారు. దాంతో నిజంగానే మా పని అయిపోయిందనుకుని అందరూ ఏడుపు లంకించుకున్నారు. మా గండికోట పర్యటన ఆవిధంగా కొంచెం తీపి–కొంచెం చేదు టైపులో ముగిసింది. ఈ సంఘటన తలుచుకున్నప్పుడల్లా ఇప్పటికీ మా ఇంట్లో నవ్వుల పువ్వులే. నాకు తిట్లే!
– నజీర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment