త్యాగబుద్ధి | Sakshi Special Story | Sakshi
Sakshi News home page

త్యాగబుద్ధి

Published Sun, Oct 8 2017 9:44 AM | Last Updated on Sun, Oct 8 2017 9:45 AM

Sakshi Special Story

స్వార్థబుద్ధితో కోరుకునే వరాలు లోకానికే కాదు, ఆఖరుకు అలా కోరుకున్న వారికి కూడా మంచి చేయవని, నిస్వార్థంతో చేసిన స్వల్పదానమైనా పదికాలాలపాటు చెప్పుకునే విధంగా వారి పేరు స్థిరపడిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ఉదాహరణే మహాబలసంపన్నుడైన వృత్రాసురుడు, దధీచి మహాముని జీవితాలు. వృత్రాసురుడు మహాభయంకరాకారంగల, మహాశక్తిసంపన్నుడైన రాక్షసుడు. దేవతలపైన ద్వేషంతో తపస్సు చేసి, కనీవినీ ఎరుగని విధంగా తయారైన కొత్త ఆయుధం... అదీ ఏవిధమైన లోహంతోనూ తయారు చేయని ఆయుధం తప్ప మరేదీ తనను చంపడం కాదు కదా, కనీసం కొద్దిపాటి గాయం కూడా చేయని విధంగా వరం పొందాడు. ఆ వరానికి సహజసిద్ధమైన రాక్షసబలం తోడు కావడంతో వాడిని ఎదిరించగలిగేవారెవరూ లేకుండా పోయారు. వాడు మొదట ఇంద్రుడి మీద దండెత్తి, సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు.

అది చాలదన్నట్టు దేవతలందరినీ హింసించడం మొదలు పెట్టాడు. దేవేంద్రుడు ఏమీ చేయలేక దేవతలను వెంటబెట్టుకుని విష్ణుమూర్తి వద్దకెళ్లి, మొరపెట్టుకున్నారు. అత్యంత బలమైన, పొడవైన ఎముకలతో అత్యంత పదునైన ఆయుధాన్ని తయారు చేయించమని సూచించాడు. ఏనుగు, సింహం, పులి వంటి జంతువుల ఎముకలు బలిష్టంగా ఉంటాయి కాబట్టి ఆయుధ తయారీకి పనికొస్తాయనుకుంటున్న దేవతలతో విష్ణువు ఇలా అన్నాడు. ‘‘మీ ఆలోచన సరైనది కాదు. బలంతోపాటు, తపశ్శక్తి కూడా కలబోసుకున్న ఎముకలై ఉండాలి, భృగుమహర్షి కుమారుడు, మహాతపస్సంపన్నుడైన దధీచి మహర్షి వెన్నెముక అందుకు బాగా ఉపయోగపడుతుందని, దేవశిల్పి, దేవగురువులను తీసుకుని వెంటనే దధీచి మునిని ఆశ్రయించమని మార్గాంతరం చెప్పాడు విష్ణుమూర్తి.

దేవేంద్రుడు, దేవగురువైన బృహస్పతిని, దేవశిల్పి విశ్వకర్మను వెంటబెట్టుకుని దధీచి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. వారిని చూసి, సంతోషంతో అతిథిమర్యాదలు చేయబోతున్న దధీచితో తాము వచ్చిన సంగతిని ఎలా అడగాలో అర్థం కాక సతమతం అవుతుండగా, దధీచి మహర్షి వారిని గుచ్చిగుచ్చి అడగడంతో ఎట్టకేలకు చెప్పలేక చెప్పలేక విషయం చెప్పారు.దధీచి మహర్షి ఎంతో సంతోషంతో వారికి తన అనుమతిని తెల్పాడు. అంతేగాక యోగశక్తితో తన ప్రాణాలను ఊర్ధ్వోత్కటనం చేసుకున్నాడు. లోకోపకారం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన దధీచి, అవయవదానానికి ఆద్యుడయ్యాడు. అలా దధీచి మహర్షి వెన్నెముక నుంచి తయారైందే వజ్రాయుధం. ఆ వజ్రాయుధంతోనే వృత్రాసురుడితో పోరాడి, అవలీలగా విజయం సాధించాడు దేవేంద్రుడు. మంచితనానికి, త్యాగానికి మారుపేరుగా దధీచి మహర్షి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ వజ్రాయుధమే ఇంద్రుడికి ప్రధాన ఆయుధమైంది.
– డి.వి.ఆర్‌.భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement