రోడ్ల మీద నడిచే ఎలాంటి వాహనాలకైనా టైర్లే ఆధారం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 60.80 లక్షల టైర్లు తయారవుతుంటే, ప్రతిరోజూ వాటిలో 42 లక్షలకు పైగా టైర్లు రిటైరవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా తయారవుతున్న చెత్త పరిమాణం 212 కోట్ల టన్నులైతే, అందులో టైర్ల వాటా 3 కోట్ల టన్నులకు పైమాటే! టైర్లను రీసైకిల్ చేసే కర్మాగారాలు అక్కడక్కడా పనిచేస్తున్నాయి. కొందరు సృజనాత్మకమైన ఆలోచనలతో పాతబడిన టైర్లను పునర్వినియోగంలోకి తీసుకొస్తున్నారు. టైర్ల రీసైక్లింగ్, రీయూజ్ వల్ల కొంతమేరకు కాలుష్యాన్ని నివారించగలుగుతున్నారు.
పాతటైర్ల రీయూజ్‌కు పూజా రాయ్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థినిగా ఉన్నప్పుడు ఒకరోజు ఒక మురికివాడ మీదుగా వెళుతుంటే కనిపించిన దృశ్యం ఆమెలోని సృజనను తట్టిలేపింది. మురికివాడలోని పిల్లలు పాత సైకిల్ టైర్లు, డ్రైనేజీ పైపులతో ఆడుకోవడం చూసిందామె. సమీపంలోని పార్కుల్లో ఖరీదైన క్రీడాసామగ్రి ఉన్నా, మురికివాడల పిల్లలకు అక్కడ ప్రవేశం లేకపోవడం గమనించి, వారికోసం తక్కువ ఖర్చుతో క్రీడాసామగ్రి తయారు చేయాలనుకుంది. అందుకోసం వాడిపడేసిన టైర్లను సేకరించి, వాటిని శుభ్రంచేసి, ఆకర్షణీయమైన రంగులతో అలంకరించి తమ కళాశాల ఆవరణలోనే క్రీడామైదానాన్ని సిద్ధం చేసింది. ఐఐటీ అధ్యాపకులు ఆమె ఆలోచనను ప్రశంసించారు. ఆ ఉత్సాహంతోనే పూజా 2017లో ‘యాంట్‌హిల్ క్రియేషన్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని పలునగరాల్లో ఇప్పటివరకు 350 క్రీడా మైదానాలు తయారయ్యాయి. వీటిలోని ఆటవస్తువులన్నీ వాడేసిన టైర్లు, పైపులు, ఇనుపకడ్డీలతో తయారైనవే! పూజా రాయ్ కృషి ఫలితంగా వెలసిన ఈ క్రీడామైదానాలు పేదపిల్లలకు ఆటవిడుపు కేంద్రాలుగా ఉంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment