News Article
-
పాతటైర్లకు కొత్త రూపం.. ఐఐటీ విద్యార్థిని ఘనత
రోడ్ల మీద నడిచే ఎలాంటి వాహనాలకైనా టైర్లే ఆధారం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 60.80 లక్షల టైర్లు తయారవుతుంటే, ప్రతిరోజూ వాటిలో 42 లక్షలకు పైగా టైర్లు రిటైరవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా తయారవుతున్న చెత్త పరిమాణం 212 కోట్ల టన్నులైతే, అందులో టైర్ల వాటా 3 కోట్ల టన్నులకు పైమాటే! టైర్లను రీసైకిల్ చేసే కర్మాగారాలు అక్కడక్కడా పనిచేస్తున్నాయి. కొందరు సృజనాత్మకమైన ఆలోచనలతో పాతబడిన టైర్లను పునర్వినియోగంలోకి తీసుకొస్తున్నారు. టైర్ల రీసైక్లింగ్, రీయూజ్ వల్ల కొంతమేరకు కాలుష్యాన్ని నివారించగలుగుతున్నారు. పాతటైర్ల రీయూజ్‌కు పూజా రాయ్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థినిగా ఉన్నప్పుడు ఒకరోజు ఒక మురికివాడ మీదుగా వెళుతుంటే కనిపించిన దృశ్యం ఆమెలోని సృజనను తట్టిలేపింది. మురికివాడలోని పిల్లలు పాత సైకిల్ టైర్లు, డ్రైనేజీ పైపులతో ఆడుకోవడం చూసిందామె. సమీపంలోని పార్కుల్లో ఖరీదైన క్రీడాసామగ్రి ఉన్నా, మురికివాడల పిల్లలకు అక్కడ ప్రవేశం లేకపోవడం గమనించి, వారికోసం తక్కువ ఖర్చుతో క్రీడాసామగ్రి తయారు చేయాలనుకుంది. అందుకోసం వాడిపడేసిన టైర్లను సేకరించి, వాటిని శుభ్రంచేసి, ఆకర్షణీయమైన రంగులతో అలంకరించి తమ కళాశాల ఆవరణలోనే క్రీడామైదానాన్ని సిద్ధం చేసింది. ఐఐటీ అధ్యాపకులు ఆమె ఆలోచనను ప్రశంసించారు. ఆ ఉత్సాహంతోనే పూజా 2017లో ‘యాంట్‌హిల్ క్రియేషన్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని పలునగరాల్లో ఇప్పటివరకు 350 క్రీడా మైదానాలు తయారయ్యాయి. వీటిలోని ఆటవస్తువులన్నీ వాడేసిన టైర్లు, పైపులు, ఇనుపకడ్డీలతో తయారైనవే! పూజా రాయ్ కృషి ఫలితంగా వెలసిన ఈ క్రీడామైదానాలు పేదపిల్లలకు ఆటవిడుపు కేంద్రాలుగా ఉంటున్నాయి. -
విచారణకు తీసుకువెళ్తే..కిడ్నాప్ అంటూ ఎల్లోమీడియా తప్పుడూ కథనాలు
సాక్షి, పుట్టపర్తి టౌన్: కేసు విచారణ నిమిత్తం ఓ నిందితు డిని పోలీసులు తీసుకెళ్తే ఆ విషయంలో తన అనుచరుల హస్తం ఉందని, ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పచ్చ పత్రికలతో కలిసి కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. శనివారం పుట్టపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాయలంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమాడ మండలానికి చెందిన చెరువు నరేంద్రరెడ్డి అనే వ్యక్తిని గుప్త నిధుల తవ్వకాల కేసులో పోలీసుల ప్రత్యేక బృందం విచారణ నిమిత్తం తీసుకెళ్లిందన్నారు. అయితే, సదరు వ్యక్తిని తన అనుచరులు కిడ్నాప్ చేశారని, ఎమ్మెల్యే హస్తం ఉందని ఓ పచ్చ పత్రికలో వచ్చిందన్నారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేసిన పత్రికపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తాము ముందుకు సాగుతుండడాన్ని చూసి మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఓర్వలేకపోతున్నారన్నారు. రూ. 6 వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, 193 చెరువులు నింపేందుకు చర్యలు తీసుకున్నామని, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో మండలానికి 200 ఇళ్లు మంజూరు చేస్తే, తాము అధికారంలోకి వచ్చాక నిరుపేదల కోసం 25 వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. అడ్డదారుల్లో రాజకీయం చేయడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడడం పల్లె రఘునాథరెడ్డికే చెల్లిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలకు అనుగణంగా పనిచేస్తూ, సత్యసాయి బాబా కలలు కన్న బంగారు పుట్టపర్తిని తీర్చిదిద్దుతున్న తమపై అభాండాలు వేయడం హేయమన్నారు. ప్రజలకన్నీ తెలుసని, వారే మళ్లీ టీడీపీ నేతలకు బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో నెడ్‌క్యాప్ డైరెక్టర్ మాధవరెడ్డి, జిల్లా అగ్రీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ రమణారెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కేశప్ప, మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, వైస్ చైర్మన్ తిప్పన్న, పట్టణ కన్వీనర్ రంగారెడ్డి, కౌన్సిలర్ చెరువుభాస్కర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ నారాయణరెడ్డి, నాయకులు సాయి, కడపరాజా తదితరులు పాల్గొన్నారు. కిడ్నాప్ వార్త వదంతే నల్లమాడ: మండలంలోని చెరువువాండ్లపల్లికి చెందిన నరేంద్రరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు వచ్చిన వార్తలన్నీ వదంతులేనని సీఐ నిరంజన్‌రెడ్డి శనివారం తెలిపారు. నరేంద్రరెడ్డితో పాటు గుప్త నిధుల తవ్వకంలో ప్రమేయం ఉందన్న అనుమానంతో అదే గ్రామానికి చెందిన శివశంకర్‌రెడ్డిని కూడా అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
గూగుల్‌పై మరో కేసు..విచారణకు సీసీఐ ఆదేశం
న్యూఢిల్లీ: న్యూస్ కంటెంట్ ఆదాయ పంపకంలో సహేతుకంగా వ్యవహరించడం లేదంటూ సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై మరో కేసు దాఖలైంది. ఈ మేరకు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్బీడీఏ) చేసిన ఫిర్యాదుపై లోతుగా విచారణ జరపాల్సిందిగా కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే గూగుల్‌పై కొనసాగుతున్న దాదాపు ఇదే తరహా రెండు కేసులతో కలిపి దీన్ని కూడా దర్యాప్తు చేయాలని పేర్కొంది. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్, ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ వేర్వేరుగా చేసిన రెండు ఫిర్యాదులపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. సీసీఐలో భాగమైన డైరెక్టర్ జనరల్ (డీజీ) ఈ కేసులను దర్యాప్తు చేసి నివేదిక సమర్పిస్తారు. సెర్చి ఇంజిన్‌లో తమ వెబ్‌లింకులు ప్రముఖంగా కనిపించాలంటే గూగుల్ కు తప్పనిసరిగా కంటెంట్ సమకూర్చాల్సి వస్తోందని, కానీ గూగుల్ మాత్రం దీనికి ప్రతిగా అరకొర ప్రతిఫలమే ఇస్తోందని ఎన్బీడీఏ ఆరోపిస్తోంది. చదవండి👉 గూగుల్‌కు భారీ షాక్! -
వాడుకున్నప్పుడు వాటా ఇవ్వాల్సిందే.. గూగుల్, ఫేస్‌బుక్‌కు ఫీజు!
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లలో వచ్చే వార్తాంశాలపై ఆ సంస్థల నుంచే ఫీజు వసూలు చేసేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలను భారత ప్రభుత్వం రూపొందిస్తోంది. ప్రస్తుతం వార్తా సంస్థల్లో తయారయ్యే వార్తాంశాలను గూగుల్, ఫేస్బుక్ తదితర సంస్థలు యథేచ్చగా వాడుకుంటూ ఎలాంటి ప్రతిఫలం ఇవ్వడం లేదు. తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆయా వార్తా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం తాజాగా.. వార్తాంశాల ద్వారా వచ్చే ఆదాయంలో వాటాను వార్తా సంస్థలకు అందజేసేందుకు, లేని పక్షంలో ఆయా కంపెనీల నుంచి జరిమానా వసూలు చేసేందుకు ఉద్దేశించిన నిబంధనలకు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. -
నిమిషాల్లోనే... రూ. 2 లక్షల కోట్లు హుష్
న్యూఢిల్లీ: ‘మా అరెస్టయ్యారు’ అంటూ వచ్చిన ఒక వార్త మంగళవారం అలీబాబా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో కంపెనీ మార్కెట్ విలువ ఉదయం సెషన్లో నిమిషాల వ్యవధిలోనే 26 బిలియన్ డాలర్ల మేర (రూ.2 లక్షల కోట్లు/ మార్కెట్ విలువలో 10%) తుడిచిపెట్టుకుపోయింది. మా అరెస్ట్‌కు సంబంధించి ఆ తర్వాత స్పష్టత రావడంతో పడిన షేరు కోలుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇన్వెస్టర్లను షాక్‌కు గురి చేసింది. మా అంటే అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా అని పొరపడ్డారు ఇన్వెస్టర్లు. ప్రముఖ వ్యాపార వేత్త అయిన జాక్‌మా గ్రూపు కంపెనీలపై చైనా సర్కారు 2020 నుంచి ఉక్కుపాదం మోపడం తెలిసిందే. ఒక వ్యక్తి శక్తిగా మారకూడదన్న విధానాన్ని అక్కడి కమ్యూనిస్ట్ సర్కారు పాటిస్తోంది. దీంతో నాటి నుంచి జాక్‌మా ఒక్కసారి కూడా ప్రజల ముందుకు వచ్చింది లేదు. ఈ క్రమంలో మా అరెస్ట్ అంటూ వార్త రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఇది వార్తా కథనం.. చైనా అధికారిక మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ మంగళవారం (మే 3) ఒక వార్తను ప్రచురించింది. జాతీయ భద్రతా ఉల్లంఘనల నేపథ్యంలో ఐటీ డైరెక్టర్ మా అనే వ్యక్తిని హాంగ్జూ పట్టణంలో అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. జాక్‌మా ఈ కామర్స్ కంపెనీ అలీబాబా ప్రధాన కేంద్రం కూడా అదే పట్టణంలో ఉండడం గమనార్హం. ఇన్వెస్టర్లు పొరపడడానికి ఇది కూడా ఒక అంశమే. ‘‘విదేశీ శక్తులతో చేతులు కలిపి, రాష్ట్రాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినట్టు అనుమానాలపై ఇంటి పేరు ‘మా’ కలిగిన వ్యక్తిని హాంగ్జూ పట్టణంలో స్టేట్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది’’అంటూ గ్లోబల్ టైమ్స్ తన కథనంలో రాసుకొచ్చింది. దీంతో నిమిషాల్లోనే అలీబాబా షేరు హాంగ్‌కాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో 9.4% పడిపోయింది. అదే రోజు గ్లోబల్ టైమ్స్ అదే అంశానికి సంబంధించి మరో కథనాన్ని ప్రచురించింది. అరెస్ట్ అయిన వ్యక్తి పేరులో 3 అక్షరాలు ఉన్నట్టు పేర్కొంది. అరెస్ట్ అయిన వ్యక్తి స్థానిక ఐటీ కంపెనీలో హార్డ్‌వేర్ పరిశోధన విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు, 1985లో జన్మించినట్టు వివరణ ఇచ్చింది. దీంతో షేరు రికవరీ అయింది. కాకపోతే పడినప్పుడు కంగారుతో అమ్ముకున్నవారే నిండా నష్టపోయారు. అలీబాబా గ్రూపు అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకడైన జాక్‌మా 2020 నవంబర్ నుంచి కనిపించింది లేదు. చైనా జాతీయ బ్యాంకులపై ఆయన విమర్శలు చేశాక సర్కారు ఆయన్ను నిర్బంధించిందన్న వార్తలూ వచ్చాయి. -
Mark Zuckerberg: ఫేస్‌బుక్‌కు జుకర్‌బర్గ్ రాజీనామా?
Mark Zuckerberg resign from Facebook Says UK Media: ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (37) రాజీనామాకు సిద్ధమయ్యాడా? బోర్డులో మెజార్టీ సభ్యులు వద్దని వారిస్తున్నా.. మొండిగా నిర్ణయం తీసుకోనున్నాడా? సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మీద ఈమధ్య కాలంలో వినిపిస్తున్న సంచలన ఆరోపణలు, జుకర్‌బర్గ్ నేతృత్వంపై వినిపిస్తున్న తీవ్ర విమర్శల నేపథ్యంలో ఇది నిజం కాబోతోందని బ్రిటన్‌కు చెందిన ఓ ప్రముఖ టాబ్లాయిడ్ సంచలన కథనం ప్రచురించింది. డిజిటల్ ప్రపంచంలో ‘మెటావర్స్’ ద్వారా అద్భుతాల్ని సృష్టించాలని ఫేస్బుక్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఈయూ వ్యాప్తంగా 10వేల మంది అధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగుల్ని వచ్చే ఐదేళ్లలో ఫేస్బుక్ నియమించుకోబోతోంది. అయితే ఈ నియామకాల కోసం జరిగిన కీలక సమావేశంలో సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో తాను వ్యవహారాల్ని పర్యవేక్షించినా.. లేకున్నా ఫేస్‌బుక్‌ను సమర్థవంతంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతీఒక్కరి మీదా ఉందంటూ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు చేశాడట. ఈ మేరకు ఫేస్బుక్ అంతర్జాతీయ వ్యవహారాలు చూసుకునే ఓ కీలక ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు కథనం ప్రచురించినట్లు సదరు టాబ్లాయిడ్ పేర్కొంది. బోర్డు వద్దన్నా.. యూజర్ల డాటా లీకేజీ గురించి ఫేస్బుక్ ఎప్పటి నుంచో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదీగాక ఇన్‌స్టాగ్రామ్‌తో మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందంటూ ఫేస్బుక్ మాజీ ఉద్యోగిణి ఫ్రాన్సెస్ హౌగెన్ సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. యూజర్ భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు పరమావధిగా మారిందని ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో ఫేస్బుక్ కంపెనీలో సంస్కరణల దిశగా అడుగువేయాలని కోరుతూనే.. కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున్న ఉద్యమం నడుస్తోంది. అంతేకాదు నవంబర్ 10న ‘క్విట్ ఫేస్బుక్’ పేరుతో ఒక్కరోజు ఫేస్బుక్, దాని అనుబంధ యాప్‌లను వాడొద్దంటూ పెద్ద ఎత్తున్న క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో యూజర్ల అసంతృప్తి బయటపడింది. ఈ వరుస పరిణామాలన్నింటితో ఫేస్బుక్ కంపెనీ బోర్డులో కొందరు సభ్యులు జుకర్‌బర్గ్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు సదరు కథనం ప్రచురించింది. ఈ క్రమంలోనే ఓటింగ్ కంటే ముందే స్వచ్చందంగా సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలని జుకర్‌బర్గ్ భావిస్తున్నట్లు, ఇందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం జుకర్‌బర్గ్ ప్రొత్సహించినట్లు ఆ కథనం సారాంశం. అయితే మెజార్టీ బోర్డు సభ్యులు మాత్రం జుకర్‌బర్గ్ నాయకత్వం వైపే మొగ్గు చూపిస్తుండడం విశేషం. భార్య ప్రిసిల్లా చాన్‌తో.. యంగ్ బిలియనీర్.. సోషల్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్‌గా మొదలైన ఫేస్బుక్ కంపెనీని 2004లో ఇంటర్నెట్ ఎంట్రప్రెన్యూర్ మార్క్‌జుకర్‌బర్గ్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. హార్వర్డ్ కాలేజీలో తన తోటి స్నేహితులు, రూమ్మేట్స్ అయిన కొంతమందితో కలిసి ఫేస్‌బుక్‌ను తీసుకొచ్చాడు. 2006 నుంచి 13 ఏళ్లు పైబడిన వాళ్లు ఎవరైనా సరే ఫేస్బుక్ వాడేలా నిబంధనను తీసుకొచ్చారు. ప్రస్తుతం గ్లోబల్ ఇంటర్నెట్ యూసేజ్‌లో ఏడో స్థానంలో ఉన్న ఫేస్‌బుక్‌కు.. నెలకు 300 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఫేస్బుక్లో జుకర్‌బర్గ్‌కు 29 శాతం వాటా ఉండగా (ఇప్పుడది 14 శాతానికి పడిపోయినట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి).. ప్రపంచ కుబేరులా జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు జుకర్‌బర్గ్. మెటావర్స్ రాజ్యం.. మెటావర్స్ అనేది డిజిటల్ వరల్డ్. త్రీడీ ఎన్విరాన్మెంట్లో కార్యకలాపాలను నడిపించొచ్చు. రాబోయే రోజుల్లో టెక్నాలజీని శాసించేది ఇదేనని నిపుణుల నమ్మకం. ఈ మేరకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ జులైలోనే ఓ ప్రకటన సైతం చేశాడు. ఇక ఫేస్బుక్ మేజర్ సక్సెస్‌లో భాగమైన యూరోపియన్ యూనియన్ నుంచే ఈ ప్రయత్నాల్ని మొదలుపెట్టబోతోంది. వ్యాప్తంగా పదివేల మంది ఉద్యోగుల్ని రానున్న ఐదేళ్లలో నియమించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోలాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్‌ను మొదలుపెట్టింది. మరోవైపు మైక్రోసాఫ్ట్, రోబ్లోక్స్, ఎపిక్ గేమ్స్ సైతం సొంత వెర్షన్ మెటావర్స్ కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. చదవండి: కాసుల కోసమే ఫేస్బుక్ కక్కర్తి.. జుకర్‌బర్గ్ రియాక్షన్ ఇది -
కట్టు దాటితే... కష్టమే!
వార్తలకూ, వ్యాఖ్యలకూ వేదికగా అభిప్రాయాలన్నిటినీ స్వేచ్ఛగా చేరవేస్తామనే సోషల్ మీడియా పక్షి మళ్ళీ వార్తగా మారింది. కొద్ది రోజుల్లోనే ఒకటికి పది సార్లు... వివాదాలకు ట్విట్టర్ కేంద్ర బిందువైంది. వరుసగా మీద పడుతున్న కేసులతో వార్తల్లో నిలుస్తోంది. భారతదేశ పటాన్ని తప్పుగా చూపడం, కేంద్ర స్థాయి రాజకీయ నేతల ఖాతాలను తాత్కాలికంగా ఆపడం, చిన్నారుల అశ్లీల చిత్రాలు వేదికలో ఉండడం – ఇలా ఈ మధ్యకాలంలో ట్విట్టర్‌పై జరిగిన రచ్చ చాలానే ఉంది. నిజానికి, భారత ప్రభుత్వం రూపొందించిన కొత్త ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి.) నిబంధనలు మే 26 నుంచి అమలులోకి వచ్చాయి. ఆ నిబంధనలకు కంపెనీలన్నీ కట్టుబడి తీరాలనే అంశంపై కేంద్రానికీ, ట్విట్టర్‌కూ మధ్య కొద్దికాలంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్విట్టర్ ఠలాయింపులు, తాజా కేసులు, వాద వివాదాలు చూస్తుంటే అవి మరింత క్షీణించాయా అనిపిస్తోంది. భారతదేశంలో స్థానిక నిబంధనలకు ఒప్పుకుంటే, ఆ పైన ఇతర దేశాల్లోనూ అక్కడి చట్టాల పాటింపు ఇబ్బంది తప్పదనేది ఈ విదేశీ ప్రైవేట్ మైక్రో బ్లాగింగ్ సంస్థ భావన. అమెరికన్ చట్టం ప్రకారం కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కేంద్ర ఐ.టి. శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ఖాతాను ఇటీవల ఆ సంస్థ కొద్దిసేపు తాత్కాలికంగా ఆపేయడం రచ్చయింది. ఆపైన లద్దాఖ్ సహా భారత భూభాగంలోని జమ్మూకశ్మీర్ ప్రాంతాన్ని భారత్‌లో అంతర్భాగం కానట్టు చూపడం ట్విట్టర్‌ను అందరిలోనూ అప్రతిష్ఠ పాలు చేసింది. భారతీయులు ఎందరో పనిచేస్తున్న ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లోని ‘ట్వీప్ లైఫ్’ సెక్షన్లో చూపిన ఆ మ్యాప్ సహజంగానే తీవ్ర విమర్శలకు దారితీసింది. చేసిన తప్పు అర్థమైన ట్విట్టర్ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టి, వివాదాస్పద మ్యాప్‌ను నిశ్శబ్దంగా తొలగించింది. ఆ మాటకొస్తే, ట్విట్టర్‌కు వివాదాలు కొత్త కావు. గతంలో లేహ్ ప్రాంతాన్ని జమ్మూకశ్మీర్‌లో భాగంగా, లద్దాఖ్‌ను చైనాలో అంతర్భాగంగా చూపి, ఇరుకున పడింది. ట్విట్టర్ కార్యకలాపాలను చైనా అనుమతించకపోయినా, భారత్ విషయంలో చైనీస్ మ్యాప్‌ను ఆ సంస్థ అనుసరిస్తోందంటూ వ్యంగ్యాస్త్రాలూ వచ్చాయి. పదుల లక్షల్లో ట్విట్టర్ వినియోగదారులు, పరిమితులు లేని కోట్ల కొద్దీ వ్యాపారం భారతదేశంలో ఉన్నప్పటికీ, ట్విట్టర్‌కు ఈ దేశ ప్రయోజనాలు, మనోభావాల మీద అక్కర లేదని బి.జె.పి. సహా వివిధ రాజకీయ పక్షాల నేతలు ఆరోపిస్తున్నది అందుకే! దానికి తగ్గట్టే వారు అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో ట్విట్టర్‌పై వరుసగా ఒకటికి మూడు కేసులూ వచ్చి పడ్డాయి. భారీ టెక్ సంస్థలు భారతీయుల సమాచారంతో వ్యాపారంలో లాభాల పంటలు పండించు కోవడం చూస్తూనే ఉన్నాం. కానీ, అవి ఏ మేరకు జవాబుదారీగా ఉంటున్నాయన్నది ప్రశ్న. ఓ మెట్టు పైకెక్కి, అనేక విదేశీ సంస్థలు, సోషల్ మీడియా వేదికల లాగానే ట్విట్టర్ కూడా ‘యాంటీ ఇండియా’, ‘యాంటీ మోదీ’ అని ముద్ర వేస్తున్నవాళ్ళూ ఉన్నారు. ఆ మాటల్లో నిష్పాక్షికత మాటెలా ఉన్నా, ఎవరైనా సరే భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎన్నటికీ సమర్థనీయం కాదు. బాధ్యత లేకుండా కేవలం హక్కులే అనుభవిస్తామనడమూ సరికాదు. నూతన ‘ఐ.టి. నిబంధనలు – 2021’ ప్రకారం మన దేశంలో 50 లక్షల మందికి పైగా వినియోగదారులున్న ప్రతి సోషల్ మీడియా వేదిక కూడా ప్రతి నెలా తమకు వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలతో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టే 59 వేల చిల్లర పోస్టులు తొలగించామంటూ, గూగుల్ తన తొలి నెలవారీ నివేదికను తాజాగా సమర్పించింది. ట్విట్టర్, వగైరా కూడా ఆ బాటలోనే తమపై వచ్చిన ఫిర్యాదులకు తీసుకున్న చర్యలను క్రమం తప్పకుండా వివరించాల్సిందే. ట్విట్టరే కాదు... ఏ సంస్థ అయినా తాను ఏ గడ్డ మీద నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోందో, ఎక్కడ వ్యాపారం చేస్తోందో ఆ దేశపు చట్టాలను గౌరవించడం విధి. అందుకు భిన్నంగా వ్యవహరించాలని అనుకోవడం సహజ వ్యాపార సూత్రాలకూ విరుద్ధమే. అలాగని నిబంధనల్లో లోటుపాట్లపై నోరుమూసుకోనక్కర లేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. నిర్ణీత మెసేజ్ ఎవరి నుంచి మొదలైందో ఆచూకీ తీయడం లాంటివాటిపై ఫేస్బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ సవాలు చేసింది అలాగే! నిజానికి, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి ఇతర విదేశీ సంస్థలు సైతం తొలుత వ్యతిరేక స్వరం వినిపించినా, చివరకు కేంద్ర నిబంధనలకు తలొగ్గాయి. తల ఊపడంలో ఆలస్యమైన ట్విట్టర్ మాత్రం ఇంకా ఠలాయిస్తున్నట్టు కనిపిస్తోంది. ఫిర్యాదుల పరిష్కరణకు స్థానికంగా భారతీయ పౌరులనే సంస్థ పక్షాన అధికారిగా నియమించాలనే నిబంధన దగ్గరే ట్విట్టర్ ఇప్పటికీ తప్పటడుగులు వేస్తోంది. ట్విట్టర్‌ను ఏకంగా నిషేధించాలంటూ వీరంగం వేస్తున్న వారి వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం అన్నిటికీ తొందరపడకుండా, చట్టం తన పని తాను చేసుకొనిపోయే «ధోరణిని అనుసరిస్తే మేలు. భావప్రకటన స్వేచ్ఛను అనుమతిస్తూనే, దేశసమైక్యత, సమగ్రత లాంటి అంశాల్లో సందర్భాన్ని బట్టి కటువుగా ఉండాలి. కానీ, దాదాపు 70 కోట్ల మంది జనాభా ఆన్లైన్లో ఉండే దేశంలో అవసరానికి మించి అత్యుత్సాహం ప్రదర్శిస్తే మాత్రం అసలు విషయం పక్కకు పోతుంది. చివరకు కక్ష సాధిస్తున్నారనో, పీడిస్తున్నారనో అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది. అందుకే, మధ్యే మార్గంతో శాంతియుత సహజీవనం చేయకుండా ఎవరు కట్టు దాటినా అది కష్టమే! -
సేల్స్‌గర్ల్‌గా మారిన నటి!: నీనా గుప్తా అసహనం..
బాలీవుడు సీనియర్ నటి నీనా గుప్తా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తన గురించి వచ్చిన ఓ ఫేక్ ఆర్టీకల్ గురించి తాజాగా గుర్తు చేసుకున్నారు. కాగా ‘సచ్ కహున్ తో’ అనే పేరుతో నినా స్వయంగా తన ఆత్మకథను రాసుకున్న సంగతి తెలిసిందే. ఈ బుక్‌ను ఇటీవల ఆమె విడుదల చేశారు. ఈ బయోగ్రఫి ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఆత్మకథకు సంబంధించిన విషయాలపై ముచ్చటించారు. ఈ నేపథ్యంలో కేరీర్ ప్రారంభంలో సేల్స్‌గర్ల్‌గా పని చేసినట్లు వచ్చిన తప్పుడు ఆర్టికల్ చదివి షాకయ్యానని చెప్పారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నా గురించి ఎన్నో సార్లు తప్పుడు వార్తలు వచ్చాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ మ్యాగజైన్లో శ్యామ్ ఆహుజా షాప్‌లో నేను సేల్స్‌గర్ల్‌గా చేరినట్లు తప్పుగా రాసినట్లు నాకు ఇప్పటికి గుర్తుంది. అయితే ఆ సమయంలో నాకు నిజంగా శ్యామ్ ఆహుజా ఎవరో తెలియదు. ఆ ఆర్టికల్ చదివాక నా స్నేహితులను అడిగాను. అప్పుడు వారు ఆయన ఓ వ్యాపారవేత్త అని ఆయనకు ఓ కార్పెట్ షాప్ ఉందని చెప్పారు. అది విని నేను షాక్ అయ్యాను. అలాంటి తప్పుడు వార్తలు ఎలా రాస్తారో అర్థం కాదు. నేను ఎందుకు ఆయన షాప్‌లో పని చేస్తాను’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. అలాగే తను సినిమాలకు ఎందుకు దూరమయ్యారో కూడా చెప్పారు. ‘నేను నా జీవితంలోకి ఓ తప్పుడు వ్యక్తిని ఆహ్వానించాను. అది నా ప్రొఫెషనల్ లైఫ్‌పై ప్రభావం చూపింది. అందుకే నటిగా సక్సెఫుల్ కెరీర్లో ఉన్నప్పటికి నటనను ఆపేశాను’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె నేటి తరం యువతులకు ఓ సందేశం కూడా ఇచ్చారు. ఎప్పుడు మీ పని మీదే దృష్టి పెట్టండని, పురుషులపై పెట్టకండి అంటూ సలహా ఇచ్చారు. ఓ ఒంటరి మహిళ తన కూతురు(మసాబా) పెంచడంతో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, సినీ పరిశ్రమలో నటిగా ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి నీనా గుప్తా తన ఆత్మకథలో వివరించారు. చదవండి: పాచిపని అయినా చేద్దామనుకున్నా: నటి -
న్యూస్ కంటెంట్ ఇస్తే..నగదు
సాక్షి, న్యూఢిల్లీ: వీడియో, ఫోటో, టెక్ట్స్ రూపంలో వార్తలు అందించేవారికి నగదు చెల్లించేలా క్రియేటివ్ క్రూసేడర్ ప్రయివేట్ లిమిటెడ్ ఇన్‌స్టాఫీడ్’ పేరుతో న్యూస్ యాప్‌ను ఆవిష్కరించింది. సంస్థ ఛైర్మన్ రాజ్భాటియా ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా ఈ యాప్ ఫేక్ న్యూస్‌ను కూడా నియంత్రిస్తుందని ఆయన వివరించారు. కంటెంట్ అందించడం ద్వారా జర్నలిస్టులు, పౌరులు నగదు పొందవచ్చని వివరించారు. -
ఆ వార్త పూర్తిగా అవాస్తవం : హరీశ్‌రావు
హైదరాబాద్ : తనపై వచ్చిన ఓ వార్తను టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్‌రావు ఖండించారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు కాళ్లు మొక్కేందుకు సిద్దమయ్యారని ఓ వార్త పత్రిక(సాక్షి కాదు) కథనాన్ని ప్రచురించింది. అయితే దానిపై ట్విటర్లో స్పందించిన హరీశ్‌రావు.. అందులో నిజం లేదని పేర్కొన్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి నేల మీద నుంచి లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తుంటే తాను సాయపడినట్టు తెలిపారు. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రచురించారని అన్నారు. ఈ వార్తను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించారు. ఇది బాధకరమని.. భవిష్యత్‌లో ఇలాంటి వార్తలు ప్రచురించేముందు నిర్ధారణ చేసుకుని ప్రచురించాలని కోరారు. ఈ వార్తపూర్తిగాఅవాస్తవం. గౌ.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగారు నేలమీది నుండి లేచినిలబడేందుకు ప్రయత్నిసుండగా సాయపడ్డాను. దీన్నితప్పుగా అర్థంచేసుకుని ప్రచురించారు. ఈవార్తను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదిబాధాకరం. భవిష్యత్ లో వార్తలు ప్రచురించేముందు నిర్ధారణచేసుకుని ప్రచురించాలని కోరుతున్నా pic.twitter.com/L6WEf4lLPn — Harish Rao Thanneeru (@trsharish) July 10, 2019 -
షాకయ్యా!
‘‘నాతో ఎవరూ మాట్లాడలేదు. ఏ ప్రశ్నలకూ నేను సమాధానాలు చెప్పలేదు. కానీ నేను చెప్పినట్లుగా ఆర్టికల్ వచ్చింది. చదివి షాకయ్యాను’’ అన్నారు బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ. అసలు విషయానికొస్తే.. అనుష్కా శర్మ చెప్పినట్లుగా ఆమె వ్యక్తిగత విషయాల గురించి న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. దీంతో ఆమె తెగ ఫీలైపోయారు. ఆ ఆర్టికల్స్ గురించి ఆమె చెబుతూ– ‘‘నా గురించి పూర్తిగా కల్పించి రాసిన వార్తలు చూసి షాకయ్యాను. నా వ్యక్తిగత విషయాల గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇలా ఒకరి పర్సనల్ లైఫ్ ఫ్రీడమ్.. ఇంకొకకరి వల్ల డిస్ట్రబ్ అవ్వడం సరికాదేమో. సెన్సేషన్ కోసం ఇవ్వని ఇంటర్వ్యూని ఇచ్చినట్లుగా రాయడం సబబు కాదు’’ అని అన్నారు. ప్రస్తుతం ‘సూయి ధాగా, సంజు, జీరో’ చిత్రాల్లో నటిస్తున్నారామె.