కట్టు దాటితే... కష్టమే! | Sakshi Editorial On Twitter In India | Sakshi
Sakshi News home page

కట్టు దాటితే... కష్టమే!

Published Fri, Jul 2 2021 12:55 AM | Last Updated on Fri, Jul 2 2021 12:55 AM

Sakshi Editorial On Twitter In India

వార్తలకూ, వ్యాఖ్యలకూ వేదికగా అభిప్రాయాలన్నిటినీ స్వేచ్ఛగా చేరవేస్తామనే సోషల్‌ మీడియా పక్షి మళ్ళీ వార్తగా మారింది. కొద్ది రోజుల్లోనే ఒకటికి పది సార్లు... వివాదాలకు ట్విట్టర్‌ కేంద్ర బిందువైంది. వరుసగా మీద పడుతున్న కేసులతో వార్తల్లో నిలుస్తోంది. భారతదేశ పటాన్ని తప్పుగా చూపడం, కేంద్ర స్థాయి రాజకీయ నేతల ఖాతాలను తాత్కాలికంగా ఆపడం, చిన్నారుల అశ్లీల చిత్రాలు వేదికలో ఉండడం – ఇలా ఈ మధ్యకాలంలో ట్విట్టర్‌పై జరిగిన రచ్చ చాలానే ఉంది. నిజానికి, భారత ప్రభుత్వం రూపొందించిన కొత్త ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐ.టి.) నిబంధనలు మే 26 నుంచి అమలులోకి వచ్చాయి. ఆ నిబంధనలకు కంపెనీలన్నీ కట్టుబడి తీరాలనే అంశంపై కేంద్రానికీ, ట్విట్టర్‌కూ మధ్య కొద్దికాలంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్విట్టర్‌ ఠలాయింపులు, తాజా కేసులు, వాద వివాదాలు చూస్తుంటే అవి మరింత క్షీణించాయా అనిపిస్తోంది. భారతదేశంలో స్థానిక నిబంధనలకు ఒప్పుకుంటే, ఆ పైన ఇతర దేశాల్లోనూ అక్కడి చట్టాల పాటింపు ఇబ్బంది తప్పదనేది ఈ విదేశీ ప్రైవేట్‌ మైక్రో బ్లాగింగ్‌ సంస్థ భావన.  

అమెరికన్‌ చట్టం ప్రకారం కాపీరైట్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కేంద్ర ఐ.టి. శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విట్టర్‌ ఖాతాను ఇటీవల ఆ సంస్థ కొద్దిసేపు తాత్కాలికంగా ఆపేయడం రచ్చయింది. ఆపైన లద్దాఖ్‌ సహా భారత భూభాగంలోని జమ్మూకశ్మీర్‌ ప్రాంతాన్ని భారత్‌లో అంతర్భాగం కానట్టు చూపడం ట్విట్టర్‌ను అందరిలోనూ అప్రతిష్ఠ పాలు చేసింది. భారతీయులు ఎందరో పనిచేస్తున్న ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లోని ‘ట్వీప్‌ లైఫ్‌’ సెక్షన్‌లో చూపిన ఆ మ్యాప్‌ సహజంగానే తీవ్ర విమర్శలకు దారితీసింది. చేసిన తప్పు అర్థమైన ట్విట్టర్‌ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టి, వివాదాస్పద మ్యాప్‌ను నిశ్శబ్దంగా తొలగించింది. ఆ మాటకొస్తే, ట్విట్టర్‌కు వివాదాలు కొత్త కావు. గతంలో లేహ్‌ ప్రాంతాన్ని జమ్మూకశ్మీర్‌లో భాగంగా, లద్దాఖ్‌ను చైనాలో అంతర్భాగంగా చూపి, ఇరుకున పడింది. ట్విట్టర్‌ కార్యకలాపాలను చైనా అనుమతించకపోయినా, భారత్‌ విషయంలో చైనీస్‌ మ్యాప్‌ను ఆ సంస్థ అనుసరిస్తోందంటూ వ్యంగ్యాస్త్రాలూ వచ్చాయి. పదుల లక్షల్లో ట్విట్టర్‌ వినియోగదారులు, పరిమితులు లేని కోట్ల కొద్దీ వ్యాపారం భారతదేశంలో ఉన్నప్పటికీ, ట్విట్టర్‌కు ఈ దేశ ప్రయోజనాలు, మనోభావాల మీద అక్కర లేదని బి.జె.పి. సహా వివిధ రాజకీయ పక్షాల నేతలు ఆరోపిస్తున్నది అందుకే! దానికి తగ్గట్టే వారు అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో ట్విట్టర్‌పై వరుసగా ఒకటికి మూడు కేసులూ వచ్చి పడ్డాయి. 

భారీ టెక్‌ సంస్థలు భారతీయుల సమాచారంతో వ్యాపారంలో లాభాల పంటలు పండించు కోవడం చూస్తూనే ఉన్నాం. కానీ, అవి ఏ మేరకు జవాబుదారీగా ఉంటున్నాయన్నది ప్రశ్న. ఓ మెట్టు పైకెక్కి, అనేక విదేశీ సంస్థలు, సోషల్‌ మీడియా వేదికల లాగానే ట్విట్టర్‌ కూడా ‘యాంటీ ఇండియా’, ‘యాంటీ మోదీ’ అని ముద్ర వేస్తున్నవాళ్ళూ ఉన్నారు. ఆ మాటల్లో నిష్పాక్షికత మాటెలా ఉన్నా, ఎవరైనా సరే భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎన్నటికీ సమర్థనీయం కాదు. బాధ్యత లేకుండా కేవలం హక్కులే అనుభవిస్తామనడమూ సరికాదు. నూతన ‘ఐ.టి. నిబంధనలు – 2021’ ప్రకారం మన దేశంలో 50 లక్షల మందికి పైగా వినియోగదారులున్న ప్రతి సోషల్‌ మీడియా వేదిక కూడా ప్రతి నెలా తమకు వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలతో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టే 59 వేల చిల్లర పోస్టులు తొలగించామంటూ, గూగుల్‌ తన తొలి నెలవారీ నివేదికను తాజాగా సమర్పించింది. ట్విట్టర్, వగైరా కూడా ఆ బాటలోనే తమపై వచ్చిన ఫిర్యాదులకు తీసుకున్న చర్యలను క్రమం తప్పకుండా వివరించాల్సిందే.

ట్విట్టరే కాదు... ఏ సంస్థ అయినా తాను ఏ గడ్డ మీద నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోందో, ఎక్కడ వ్యాపారం చేస్తోందో ఆ దేశపు చట్టాలను గౌరవించడం విధి. అందుకు భిన్నంగా వ్యవహరించాలని అనుకోవడం సహజ వ్యాపార సూత్రాలకూ విరుద్ధమే. అలాగని నిబంధనల్లో లోటుపాట్లపై నోరుమూసుకోనక్కర లేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. నిర్ణీత మెసేజ్‌ ఎవరి నుంచి మొదలైందో ఆచూకీ తీయడం లాంటివాటిపై ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని వాట్సాప్‌ సవాలు చేసింది అలాగే! నిజానికి, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ లాంటి ఇతర విదేశీ సంస్థలు సైతం తొలుత వ్యతిరేక స్వరం వినిపించినా, చివరకు కేంద్ర నిబంధనలకు తలొగ్గాయి. తల ఊపడంలో ఆలస్యమైన ట్విట్టర్‌ మాత్రం ఇంకా ఠలాయిస్తున్నట్టు కనిపిస్తోంది. ఫిర్యాదుల పరిష్కరణకు స్థానికంగా భారతీయ పౌరులనే సంస్థ పక్షాన అధికారిగా నియమించాలనే నిబంధన దగ్గరే ట్విట్టర్‌ ఇప్పటికీ తప్పటడుగులు వేస్తోంది. 

ట్విట్టర్‌ను ఏకంగా నిషేధించాలంటూ వీరంగం వేస్తున్న వారి వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం అన్నిటికీ తొందరపడకుండా, చట్టం తన పని తాను చేసుకొనిపోయే «ధోరణిని అనుసరిస్తే మేలు. భావప్రకటన స్వేచ్ఛను అనుమతిస్తూనే, దేశసమైక్యత, సమగ్రత లాంటి అంశాల్లో సందర్భాన్ని బట్టి కటువుగా ఉండాలి. కానీ, దాదాపు 70 కోట్ల మంది జనాభా ఆన్‌లైన్‌లో ఉండే దేశంలో అవసరానికి మించి అత్యుత్సాహం ప్రదర్శిస్తే మాత్రం అసలు విషయం పక్కకు పోతుంది. చివరకు కక్ష సాధిస్తున్నారనో, పీడిస్తున్నారనో అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది. అందుకే, మధ్యే మార్గంతో శాంతియుత సహజీవనం చేయకుండా ఎవరు కట్టు దాటినా అది కష్టమే!   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement