దుబాయ్‌లో జరిగిన కాప్ సమావేశాల్లో నరేంద్ర మోదీతో మహమ్మద్ ముయిజ్జూ
మాల్దీవుల్లోని ప్రస్తుత ప్రభుత్వం ‘ఇండియా ఔట్’ నినాదంతో గెలిచింది. భారత సైన్యాన్ని తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని కోరింది. దీనికి తోడు లక్షదీవులు వర్సెస్ మాల్దీవుల సోషల్ మీడియా వివాదం చెలరేగింది. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో భారత్ వైఖరి ఎలా ఉండాలి? సోషల్ మీడియాకు ప్రతిస్పందనగా విదేశాంగ విధానం ఉండకూడదు. అభ్యంతరకరమైన ట్వీట్‌లకు కారణమైన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయాన్ని మనం విస్మరించకూడదు. అలాగే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఇండియాకు అనుకూలం. ఈ ముఖ్యమైన వర్గాన్ని చీకాకు పెట్టేలా భారతీయ కార్యకలాపాలు ఉండకూడదు. విదేశాంగ విధానం అనేది ఎప్పటికప్పుడు ముగిసిపోయేది కాదు. అది స్థిరంగా కొనసాగాలి.
2023 నవంబర్‌లో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ ముయిజ్జూ ‘ఇండియా ఔట్’ (భారత్ వెళ్లిపో) అనే ప్రజాకర్షక నినాదంతో గెలిచినప్పుడే భారత్–మాల్దీవుల సంబంధాలు మళ్లీ దెబ్బతింటాయని అందరూ భావించారు. బాధ్యతలు స్వీక రించిన వెంటనే, తమ దేశం నుంచి భారత రక్షణ సిబ్బందిని ఉపసంహరించుకోవాలని ముయిజ్జూ భారత్‌ను కోరారు. మాల్దీవులలోని వెయ్యికి పైగా ద్వీపాలు విస్తారమైన సముద్ర ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి. అక్కడి అతిపెద్ద ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) భద్రత, దీవుల్లో విపత్తు సహాయ కార్యకలాపాలపై నిఘా కోసం భారత్ బహుమతిగా ఇచ్చిన డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లను 75 మంది భారత సైనికులు నడుపుతున్నారు.
మాల్దీవులు వ్యవస్థాపక సభ్యదేశంగా ఉన్న ‘కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్’లో భాగంగా సముద్ర భద్రతను ప్రోత్సహించడానికి ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగానే దేశంలోని అతిపెద్ద ఆర్థిక మండలిలో భూజ లాధ్యయన సర్వేను భారత్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి కూడా కొత్త ప్రభుత్వం నిరాకరించింది. దీనిమీద భారత్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు. కానీ తమ అభ్యర్థనలను భారత్ అంగీకరించిందని ముయిజ్జూ చెబుతున్నారు.
జనవరి 8న చైనాలో నాలుగు రోజుల అధికారిక పర్యటనకు ముయిజ్జూ వెళ్లారు. అదే సందర్భంలో ఆయన ప్రభుత్వంలోని ముగ్గురు ఉప మంత్రులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించీ, మొత్తంగా భారతీయుల గురించీ అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేయడంతో ఒక వికారమైన వివాదం చెలరేగింది. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ దీవులను సందర్శించిన ఫోటోలను పోస్ట్ చేశారు. లక్షద్వీప్‌కు దక్షిణంగా ఉన్న ఈ దీవులు మాల్దీవుల కంటే మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించగలవని కొందరు సోషల్ మీడియాలో వాద నలు మొదలుపెట్టారు.
వాటికి వ్యతిరేకంగానే మాల్దీవుల మంత్రులు ప్రతిస్పందించినట్లు కనబడింది. ఆ తర్వాత మాల్దీవులను బహిష్కరించాలని కొందరు భారతీయ ప్రముఖులు పిలుపునివ్వడంతో సోషల్ మీడియా యుద్ధం చెలరేగింది. కొన్ని సంవత్సరాలుగా, మాల్దీవులను సందర్శించేవారిలో భారతీయుల వాటా అత్యధికం. తాజా పరిణా మంతో మాల్దీవులను సందర్శించాలనుకున్న భారతీయులు తమ హోటల్, విమాన బుకింగ్‌లను రద్దు చేసుకున్నారు. ఇది ఆ దేశ పర్యా టక పరిశ్రమను దెబ్బతీసింది. అయితే ఒకటి మర్చిపోకూడదు. కోవిడ్ –19 మహమ్మారికి ముందు, ఈ పర్యాటకుల రాకపోకలలో చైనా మొదటి స్థానంలో ఉండేది. అన్ని ప్రయాణ ఆంక్షలను చైనా ఎత్తివేస్తే ఆ స్థానాన్ని తిరిగి ఆ దేశమే పొందే అవకాశం ఉంది.
ముయిజ్జూ చైనా పర్యటన సందర్భంగా, రెండు దేశాల మధ్య ‘సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యాన్ని’ ప్రకటించే సంయుక్త పత్రికా ప్రకటన వెలువడింది. గ్లోబల్ సివిలైజేషన్ ఇనిషియేటివ్, గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్, గ్లోబల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ (జీడీఐ) అనే మూడు కీలకమైన చైనా ప్రాజెక్టులలో పాల్గొనడానికి మాల్దీవులు సుముఖంగా ఉన్నట్లు ఈ ప్రకటన సూచిస్తోంది. ‘గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద జీడీఐ’లో మాల్దీవులు చేరింది. చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ప్రాజెక్టులను స్వాగతించింది. మాల్దీవుల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి ప్రామాణికమైన చైనా మద్దతు ఉంది. మాల్దీవుల అంతర్గత వ్యవహారాలలో ఏదైనా బాహ్య జోక్యాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో పేరు ఎత్తని గురి ఇండియానే అని చెప్పనక్కరలేదు.
అయితే చైనా, మాల్తీవుల ఉమ్మడి ప్రకటనలో రెండు ముఖ్యమైన మినహాయింపులు ఉన్నాయి. 2017లో అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ బీజింగ్‌లో పర్యటించారు. చైనాకు అత్యంత అను కూలమైన స్థానాన్ని ఇచ్చేలా, ఇరు దేశాల మధ్య కుదిరిన వివాదా స్పద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద అమలు గురించి ఉమ్మడి ప్రకటనలో ఏ ప్రస్తావనా లేదు. అప్పటినుంచి అది సుప్తచేతనలో ఉంది. దాని పునరుద్ధరణ కోసం మాలేలోని చైనా రాయబారి ఒత్తిడి చేస్తున్నారు.
హిందూ మహాసముద్రంలో సముద్ర ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి తమకు అనుకూలమైన స్థానాన్ని ఇచ్చే పరిశీలనా కేంద్ర ఏర్పాటు కోసం చైనా ప్రతిపాదించిన ప్రాజెక్ట్ గురించి కూడా ఉమ్మడి ప్రకట నలో ప్రస్తావన లేదు. ఇవి సాపేక్షంగా భారత్‌కు సానుకూలాంశాలు. ఈ పరిణామాలను భారత్ గమనించాలి. (దీవుల్లో పరిశోధన కోసం చైనా నౌక చేరుకుందన్న వార్తలు వచ్చాయి. అది ఫిబ్రవరిలో రానుందనీ, కానీ పరిశోధన కోసం మాత్రం కాదనీ మాల్దీవులు చెబుతోంది.)
2023 డిసెంబర్ 7న మారిషస్‌లో జరిగిన కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌కు మాల్దీవులు గైర్హాజరవడం ఒక ఎదురుదెబ్బ. భారత్ 2011లో శ్రీలంక, మాల్దీవులతో ఈ త్రైపాక్షిక సముద్ర భద్రతా వేదికను ప్రారంభించింది. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, మానవ అక్రమ రవాణా, సైబర్ భద్రతతో కూడిన ఎజెండాపై, ఈ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో ఈ వేదిక ముఖ్య మైన పాత్ర పోషించింది. 2020లో మారిషస్ ఈ కూటమిలో చేరింది. ఇటీవలి మారిషస్ సమావేశంలోనే, సీషెల్స్, బంగ్లాదేశ్ పరిశీలకులుగా చేరాయి. తర్వాత ఇవి పూర్తి సభ్య దేశాలు కావచ్చు. చైనా మెప్పు కోసం మాల్దీవులు ఈ సమావేశానికి హాజరుకాలేదని అనుకోవచ్చు.
ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో భారత్ వైఖరి ఎలా ఉండాలి? ఒకటి, సోషల్ మీడియాకు ప్రతిస్పందనగా విదేశాంగ విధానం ఉండకూడదు. మాల్దీవుల ప్రభుత్వం అధికారికంగా క్షమా పణ చెప్పనప్పటికీ, అభ్యంతరకరమైన ట్వీట్‌లకు కారణమైన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేయడంతోపాటు, తమ మంత్రుల చర్యలను తీవ్రంగా ఖండించిన విషయాన్ని మనం విస్మరించకూడదు.
రెండు, మాల్దీవులలోని పార్లమెంట్‌లో ఇండియాకు అనుకూలంగా ఉండే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఆధిపత్యం చలాయిస్తోంది, దీని ప్రతినిధులు మోదీ వ్యతిరేక ట్వీట్‌లను తీవ్రంగా ఖండించారు, అధికారికంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పైగా దీర్ఘకాలంగా మాల్దీవులకు భారత్ ఇస్తున్న మద్దతు, సద్భావన గురించి గొప్పగా మాట్లాడాలని డిమాండ్ చేశారు. మాలెలో ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో ఈ పార్టీ సునాయాసంగా విజయం సాధించింది. ముయిజ్జూ అధ్యక్షుడు కావడానికి ముందు రాజధాని మేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారత అను కూల రాజకీయ శక్తులు విజయం సాధించే అవకాశం ఉంది. భారత్ పట్ల సానుకూల భావాలను కలిగి ఉన్న ఈ బలమైన, ముఖ్యమైన వర్గాన్ని చికాకు పెట్టేలా మన కార్యకలాపాలు ఉండకూడదు. భారత విదేశాంగ మంత్రి ఇటీవలి ప్రకటన, రెండు దేశాల మధ్య బలమైన ప్రజా సంబంధాలను సమర్థించడంలోని ప్రాముఖ్యతను సూచిస్తోంది. అదే సమయంలో, మాల్దీవుల వ్యతిరేక సోషల్ మీడియా వ్యాఖ్యల వరదలకు ఆయన ప్రకటన ఒక ముఖ్యమైన దిద్దుబాటుగా వెలువడింది.
విదేశాంగ విధానం ఎప్పటికప్పుడు ముగిసే ఉపకథలా ఉండ కూడదు. పొరుగు దేశాలలోని రాజకీయాలు అనుకూలంగా లేన ప్పుడు కూడా స్థిరంగా, బలమైన ఒప్పుదలతో కొనసాగాలి. భారత్‌కు మాల్దీవులు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. అక్కడి పరిణామాలపై తన మాటలు, చేతలను భారత్ జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. అంతి మంగా సహనమే ఫలితాన్ని ఇస్తుందని మరచి పోకూడదు.
శ్యామ్ శరణ్
వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment