విశ్లేషణ
ఈ సంవత్సరం జనవరి–మార్చి మధ్య కాలంలో క్షీణస్థాయికి చేరుకున్న సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి భారత్, మాల్దీవులు నిశ్శబ్దంగా పని చేస్తున్నాయి. ఒకరికొకరు అవసరమని ఇరుపక్షాలూ గ్రహించాయి. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు భారత ప్రాముఖ్యం ఎంతో ఉందని ఆ దేశ ఆర్థిక మంత్రి పేర్కొనడం గమనార్హం. విదేశాల్లోని ప్రభుత్వాలను ‘ఢిల్లీ మిత్రుడు’ లేదా ‘భారత వ్యతిరేకి’ అనే పరిమితార్థంలో వర్ణించడం మన అభద్రతా భావాలనే వెల్లడిస్తుంది. ఉదాహరణకు బంగ్లాదేశ్‌లో చాలా ఎక్కువగా ప్రచారమైన భారత్, షేఖ్ హసీనా ‘స్నేహం’ ప్రస్తుత భారత్, బంగ్లా ద్వైపాక్షిక సంబంధాలను రిస్కులో పడేసింది. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వ మార్పు అనివార్యం కాబట్టి, ప్రతిపక్ష పార్టీలకు కూడా దౌత్యపరంగా చేరువకావడం ముఖ్యం.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం కోసం మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ ఢిల్లీకి విచ్చేసిన రెండు నెలల తర్వాత, ఆగస్టు నెల ప్రారంభంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాలే పర్యటనకు వెళ్లివచ్చారు. మాల్దీవుల నుండి భారత్ తన సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవలసి వచ్చింది. కానీ, ఈ ద్వీపసమూహానికి చెందిన పర్యాటక, దిగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ... నిండా మునిగి పోతోంది.
గత నెలలో, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజూ ప్రభుత్వ ఖర్చుల్లో కోతలను ప్రకటించారు. దీంతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్థిక కష్టాల నుంచి బయట పడటానికి మాల్దీవులకు ఢిల్లీ అవసరం. కాగా, మాల్దీవుల వ్యూహాత్మక ప్రాముఖ్యత గురించి కేంద్ర ప్రభుత్వానికి బాగా తెలుసు. మాలే అభ్యర్థన మేరకు, 5 కోట్ల డాలర్ల ట్రెజరీ బిల్లు గడువును మరో ఏడాది పాటు ఢిల్లీ పొడిగించింది.
ఒక నెల తర్వాత మాల్దీవుల నుంచి కృతజ్ఞతా పూర్వకమైన సందేశం వచ్చింది. తన చైనా పర్యటన సమయంలో, మాల్దీవుల ఆర్థిక అభివృద్ధి, వాణిజ్య మంత్రి మహమ్మద్ సయీద్ ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు భారతదేశ ప్రాము ఖ్యత ఎంతో ఉందని పేర్కొన్నారు. దీన్ని ఈ జనవరి నెలలో బీజింగ్‌లో ముయిజూ చేసిన ‘భారతదేశం మా సార్వభౌమత్వానికి ముప్పు’ ప్రకటన నుండి 180 డిగ్రీల మలుపుగా చెప్పొచ్చు.
కానీ మాల్దీవుల నుండి మరింత ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అడిగేది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ). మాలేలో విలేఖరుల సమావేశంలో సయీద్ మాట్లాడుతూ, దీనికి సంబంధించి చర్చలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ‘వాణిజ్య సౌలభ్యం’ కోసం మాల్దీవులు ‘అన్ని దేశాలతో’ ఎఫ్‌టీఏలను కలిగి ఉండటానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. చైనాతో 2018 సంవత్సరంలోనే మాల్దీవులు ఎఫ్‌టీఏని కలిగి ఉంది.
దీనిపై అబ్దుల్లా యమీన్ ప్రభుత్వ హయాంలోనే సంతకాలు జరిగాయి. అది అమలు కాకముందే ఆయనను ప్రజలు ఓడించారు. తదనంతరం వచ్చిన ఇబు సోలిహ్ ప్రభుత్వం దానిని నిలిపివేసింది. చైనాతో ఎఫ్‌టీఏ అమలుపై ముయిజూ సెప్టెంబరు నెలలో చేయనున్న ప్రకటనకు కొన్ని రోజుల ముందు జైశంకర్ మాల్దీవులలో పర్యటించడం గమనార్హం.
విదేశాల్లోని ప్రభుత్వాలను ‘ఢిల్లీ మిత్రుడు’ లేదా ‘భారత వ్యతిరేకి’ అనే పరిమితార్థంలో వర్ణించడం భారతదేశ స్వీయ అభద్రతా భావాలను మాత్రమే వెల్లడిస్తుంది. ఇది ఆదర్శ పరిస్థితుల్లో మాత్రమే దౌత్యం విజయవంతమయ్యే పరిస్థితులను కల్పిస్తుంది. ఇతర ప్రభుత్వం నుండి ‘విధేయత’ కేంద్ర స్థానంలో ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది.
2022లో భారత్‌పై విమర్శలను చట్టవిరుద్ధం చేయాలనే ‘భారత అనుకూల’ నేత ఇబు సోలిహ్ తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ ప్రభావం ఎంత స్థాయిలో ఉందో తెలియదు. స్పష్టమైన విషయం ఏమిటంటే, మాల్దీవుల ప్రతిపక్షంతోపాటు, ‘వెళ్లిపో ఇండియా’ నిరస నల వెనుక ఉన్నవారు పై అప్రజాస్వామిక ఉత్తర్వుతో బాగా ఆడు కున్నారు.
ఇదే తరహాలో బంగ్లాదేశ్‌లో చాలా ఎక్కువగా ప్రచారమైన భారత్, షేక్ హసీనా ‘స్నేహం’ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను రిస్కులో పడేసింది. ప్రత్యేకించి తీస్తా జలాల పంపిణీ ఒప్పందం గురించిన షేక్ హసీనా పెద్ద డిమాండ్‌ను భారత ప్రభుత్వం సాకారం చేయని నేపథ్యంలో. మరో వైపున నిరంకుశత్వం వైపు హసీనా ప్రయా ణించిన క్రమంలో భారత్‌పై నిందలు రావడం మొదలైంది.
ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వ మార్పు అనివార్యం కాబట్టి, ప్రతిపక్ష పార్టీలకు కూడా దౌత్యపరంగా చేరువకావడం ముఖ్యం. శ్రీలంకలో, భారతదేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించే చరిత్ర కలిగిన జనతా విముక్తి పెరమున (జేవీపీ)కి భారత్ చేరువ కావడం కనిపించింది. జేవీపీ నాయకుడు అనురా కుమార దిసానాయకే రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో బలమైన పోటీదారుగా ఉండబోతున్నారు. ఆయనను ఇటీ వల భారతదేశానికి ఆహ్వానించటం జరిగింది.
భారతదేశంలో పాల స్వయం సమృద్ధి కేంద్రస్థానమైన ఆనంద్, కేరళ పర్యటనలకు అనూరాను ఆహ్వానించారు. సింహళ జాతీయవాదాన్ని వామపక్ష వాదంతో కలిపిన పార్టీ అయిన జేవీపీ, భారత్‌లో ఫెడరలిజం ఎలా పనిచేస్తోందో కేరళలో చూడవచ్చు. ఒక ముఖ్యమైన ఎన్నికలు జరగ డానికి ఆరు నెలల ముందు, భారత్ ఇలా చేయడం ఇంకో రకమైన సంకేతం ఇస్తుంది. ఇలాంటివి దీర్ఘకాలంగా సాగాలి. బంగ్లాదేశ్ విషయానికి వస్తే, భారత్ 2012 నుండి బంగ్లా నేషనల్ పార్టీకి దూరంగా ఉంది.
మాల్దీవులలో సోలిహ్ ప్రభుత్వం ఇండియా ఫస్ట్ విధానాన్ని కలిగి ఉన్నప్పటికీ, బీజేపీ ప్రతినిధి 2022 జూన్‌లో మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల కారణంగా ఆ దేశ ప్రతిపక్షం తీసుకొచ్చిన ఒత్తిడితో సోలిహ్ ప్రభుత్వం ఈ అంశంపై తన ‘తీవ్ర ఆందోళన’ ప్రక టనను జారీ చేయవలసి వచ్చింది. మరోవైపు, మైనారిటీలను రక్షించ మని బంగ్లాదేశ్‌ను కోరడంలో భారత్ వైఖరి సరైనదే.
కానీ స్వదేశంలో మైనారిటీల పరిరక్షణకు సంబంధించి ఉదాహరణగా నిలబడటంలో భారత్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనిస్ హిందూ దేవాలయాన్ని సందర్శించి దేశంలోని హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ భారత ప్రధాని ప్రమాదకరమైన గావుకేకలు వేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఆర్థిక అత్యవసర పరిస్థితుల నుండి వాతావరణ మార్పు, పైరసీ, సముద్రంలో ప్రమాదాలు, నీటి కొరత, సునామీలు, భూకంపాలు మొదలైన వాటిపై మొదట ప్రతిస్పందించే దేశంగా తనను తాను నిల బెట్టుకునే భారతదేశానికి, ప్రజలతో వ్యవహరించడమే కేంద్రస్థానంలో ఉండాలి. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, పౌర సమాజంతోపాటు మీడియా బలమైన పాత్రలు పోషిస్తుంటాయి.
ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో వీటన్నింటి పాత్ర తక్కువగా ఉండదు. భారతదేశం, దాని పాత్ర గురించి ప్రజలలో ఉండే అవగా హన, అభిప్రాయాలు ఈ దేశాలలో చాలా వరకు అధికార పార్టీపట్ల వ్యతిరేకతకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దోహదం చేస్తాయి.
నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకకు చెందిన మీడియా ప్రతినిధులు, పౌర సమాజ కార్యకర్తలు ఇటీవల చేసిన ప్రకటనల్లో భారతదేశం ‘దక్షిణాసియా ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు మద్దతుగా ఉండా లనీ, భవిష్యత్తుకు వారి వ్యక్తిగత మార్గాలను నిర్మించుకోనివ్వాలనీ’ కోరటం జరిగింది.
కానీ ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంలో ప్రభుత్వేతర వ్యక్తులతో వ్యవహరించడంలో తక్కువ పాత్రను కలిగివుంది. ఇది స్వదేశంలో ప్రభుత్వేతర వ్యక్తుల పట్ల మోదీ ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతుంది. భారత విదేశాంగ మంత్రి చివరి సారిగా ఈ దేశాల్లోని మీడియాకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు? దీనికి బదులుగా, ఈ దేశాల్లో ప్రజా సంస్థలను తక్కువ చేసి మాట్లాడే ధోరణి ఉంది.
ఈ ప్రాంతంలో భారతదేశాన్ని బేషరతుగా ప్రేమిస్తున్న ప్రజ లున్న ఏకైక దేశం అఫ్గానిస్తాన్. కాగా, భద్రత కోసం పాకిస్తాన్‌పై ఆధారపడిన తాలిబన్ల వల్ల ఇరుదేశాల ప్రజలమధ్య సంబంధాల నుంచి భారత్ ఉద్దేశపూర్వకంగా వైదొలిగింది. కానీ అక్కడ కూడా, అఫ్గాన్ ప్రజలు తమ ప్రాతినిధ్యాన్ని ఎన్నటికీ తిరిగి గెలవలేరని నమ్మడం ఢిల్లీ చేస్తున్న తప్పు అవుతుంది.
నిరుపమా సుబ్రమణియన్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment