సోషల్‌ మీడియా.. మార్కెట్‌ మేనియా | Social Media: More than 42 crore users in India | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా.. మార్కెట్‌ మేనియా

Published Sun, Jul 28 2024 4:28 AM | Last Updated on Sun, Jul 28 2024 4:28 AM

Social Media: More than 42 crore users in India

ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మంది ఖాతాదారులు 

భారత్‌లో 42 కోట్లకుపైగా వినియోగదారులు

రోజుకు ఒక్కొక్కరు రెండున్నర గంటల పాటు కాలక్షేపం 

మొదటి రెండు స్థానాల్లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌  

ప్రకటనల మార్కెట్‌ విలువ రూ.10 వేల కోట్లు

ఫోర్బ్స్‌ నివేదిక వెల్లడి

విస్తృతమవుతున్న ప్రకటనల మార్కెట్‌ 
 2024 మార్చి నాటికి సోషల్‌ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్‌: రూ. 10 వేల కోట్లు. 
   2027 నాటికి సోషల్‌ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్‌ (అంచనా): రూ. 14 వేల కోట్లు. 
  ఏదో ఒక బ్రాండు, బ్రాండ్‌ అంబాసిడర్‌ను అనుసరిస్తున్న సోషల్‌ మీడియా ఖాతాదారులు: 90 శాతం  
ప్రకటనను చూసిన వెంటనే కొనుగోలు చేస్తున్న వారు: 11 శాతం 
 ప్రకటనలు చూసి అవే ఉత్పత్తులను బయట స్టోర్స్‌లో కొనుగోలు చేస్తున్న వారు: 21 శాతం  
దేశంలో సోషల్‌ మీడియాలో వ్యాపార ప్రకటనలపై ఆధారపడుతున్న పెద్ద, మధ్య తరహా వ్యాపార సంస్థలు: 77 శాతం  
 సోషల్‌ మీడియాలో చూసిన వాటిలో కనీసం ఏదో ఒక ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్న ఖాతాదారులు: 76 శాతం  
ప్రకటన చూశాక ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నవారు: 44 శాతం  

సాక్షి, అమరావతి
ప్రస్తుత స్మార్ట్‌ ఫోన్ల యుగంలో ప్రపంచం మొత్తం సోషల్‌ మీడియా చుట్టూ తిరుగుతోంది. ఇక భారత్‌లో అయితే సోషల్‌ మీడియా మేనియా అన్ని దేశాలకన్నా ముందుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియా వినియోగంలో భారత్‌ మొదటిస్థానంలో ఉండగా.. రానున్న రోజుల్లో ఇది మరింత ఉధృతమవుతుందని ఫోర్బ్స్‌ నివేదిక వెల్లడించింది. భారత్‌లో సెల్‌ ఫోన్‌ వినియోగదారులు రోజుకు సగటున రెండున్నర గంటల పాటు సోషల్‌ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఇక పెద్ద పెద్ద వ్యాపార సంస్థల నుంచి చిన్న స్థాయి సంస్థల వరకూ ప్రకటనల ద్వారా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి సోషల్‌ మీడియానే ఆశ్రయిస్తున్నారు.  

ఇన్‌ఫ్లుయన్సర్స్‌ హవా.. 
ఈ సోషల్‌ మీడియా యుగంలో ఇన్‌ఫ్లుయన్సర్స్‌ హవా కొనసాగుతోంది. కనీసం 10లక్షల మంది ఫాలోయర్లు ఉండే ఇన్‌ఫ్లుయన్సర్స్‌కు డిమాండ్‌ భారీగా ఉంటోంది. వారికి భారీ పారితోషికాన్ని చెల్లించేందుకు పారిశ్రామిక సంస్థలు, రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉంటున్నాయి. యూ ట్యూబ్‌లో 10 లక్షల వ్యూస్‌ వచ్చే వీడియోకు రూ. 3 లక్షలు చొప్పున చెల్లిస్తున్నారు.  

ఫోర్బ్స్‌ నివేదికలో ప్రధాన అంశాలు ఇవీ.. 
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 500 కోట్ల మంది సోషల్‌ మీడియా ఖాతాదారులు ఉన్నారు. 2027 నాటికి ఈ సంఖ్య 585 కోట్లకు
చేరుతుందని అంచనా.  
 సోషల్‌ మీడియా ఖాతాదారుల్లో అత్యధికంగా భారత్‌లో 42 కోట్ల మంది ఉన్నారు. దేశ జనాభాలో ఇది 40 శాతం సోషల్‌ మీడియా ఖాతాదారులు కావడం గమనార్హం. ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఉన్నవారిలో 67 శాతం మంది సగటున కనీసం ఒక సోషల్‌ మీడియా మాధ్యమాన్ని వాడుతున్నారు. 
భారత్‌లో రోజుకు సగటున 150 నిమిషాల పాటు అంటే రెండున్నర గంటల పాటు సోషల్‌ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. ఈ ప్రకారం 73 ఏళ్లు జీవించే పౌరుడు తన జీవిత కాలంలో 5.7 ఏళ్ల పాటు సోషల్‌ మీడియాలో కాలక్షేపం చేసినట్టు అవుతుందని ఫోర్బ్స్‌ సంస్థ అంచనా వేసింది. 
 దేశంలోని ఖాతాదారుల్లో 78 శాతం మంది తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారానే సోషల్‌ మీడియాను వీక్షిస్తున్నారు.  
 భారత్‌లో సోషల్‌ మీడియా వేదికల్లో మొదటి స్థానంలో ఫేస్‌బుక్, రెండో స్థానంలో ఇన్‌స్టాగ్రామ్‌ ఉన్నాయి. 18 ఏళ్లు దాటిన సోషల్‌ మీడియా ఖాతాదారుల్లో 74 శాతం మంది ఫేస్‌బుక్, 71 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్‌ మాధ్యమాన్ని అనుసరిస్తున్నారు. కాగా 49 శాతం మంది ఎక్స్‌ను ఫాలో అవుతున్నారు. ఫేస్‌బుక్‌ మరికొన్నేళ్లపాటు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని అంచనా వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement