న్యూఢిల్లీ: ‘మా అరెస్టయ్యారు’ అంటూ వచ్చిన ఒక వార్త మంగళవారం అలీబాబా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో కంపెనీ మార్కెట్ విలువ ఉదయం సెషన్‌లో నిమిషాల వ్యవధిలోనే 26 బిలియన్ డాలర్ల మేర (రూ.2 లక్షల కోట్లు/ మార్కెట్ విలువలో 10%) తుడిచిపెట్టుకుపోయింది. మా అరెస్ట్‌కు సంబంధించి ఆ తర్వాత స్పష్టత రావడంతో పడిన షేరు కోలుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇన్వెస్టర్లను షాక్‌కు గురి చేసింది.
మా అంటే అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా అని పొరపడ్డారు ఇన్వెస్టర్లు. ప్రముఖ వ్యాపార వేత్త అయిన జాక్‌మా గ్రూపు కంపెనీలపై చైనా సర్కారు 2020 నుంచి ఉక్కుపాదం మోపడం తెలిసిందే. ఒక వ్యక్తి శక్తిగా మారకూడదన్న విధానాన్ని అక్కడి కమ్యూనిస్ట్ సర్కారు పాటిస్తోంది. దీంతో నాటి నుంచి జాక్‌మా ఒక్కసారి కూడా ప్రజల ముందుకు వచ్చింది లేదు. ఈ క్రమంలో మా అరెస్ట్ అంటూ వార్త రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు.
ఇది వార్తా కథనం..
చైనా అధికారిక మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ మంగళవారం (మే 3) ఒక వార్తను ప్రచురించింది. జాతీయ భద్రతా ఉల్లంఘనల నేపథ్యంలో ఐటీ డైరెక్టర్ మా అనే వ్యక్తిని హాంగ్జూ పట్టణంలో అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. జాక్‌మా ఈ కామర్స్ కంపెనీ అలీబాబా ప్రధాన కేంద్రం కూడా అదే పట్టణంలో ఉండడం గమనార్హం. ఇన్వెస్టర్లు పొరపడడానికి ఇది కూడా ఒక అంశమే. ‘‘విదేశీ శక్తులతో చేతులు కలిపి, రాష్ట్రాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినట్టు అనుమానాలపై ఇంటి పేరు ‘మా’ కలిగిన వ్యక్తిని హాంగ్జూ పట్టణంలో స్టేట్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది’’అంటూ గ్లోబల్ టైమ్స్ తన కథనంలో రాసుకొచ్చింది. దీంతో నిమిషాల్లోనే అలీబాబా షేరు హాంగ్‌కాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో 9.4% పడిపోయింది.
అదే రోజు గ్లోబల్ టైమ్స్ అదే అంశానికి సంబంధించి మరో కథనాన్ని ప్రచురించింది. అరెస్ట్ అయిన వ్యక్తి పేరులో 3 అక్షరాలు ఉన్నట్టు పేర్కొంది. అరెస్ట్ అయిన వ్యక్తి స్థానిక ఐటీ కంపెనీలో హార్డ్‌వేర్ పరిశోధన విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు, 1985లో జన్మించినట్టు వివరణ ఇచ్చింది. దీంతో షేరు రికవరీ అయింది. కాకపోతే పడినప్పుడు కంగారుతో అమ్ముకున్నవారే నిండా నష్టపోయారు. అలీబాబా గ్రూపు అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకడైన జాక్‌మా 2020 నవంబర్ నుంచి కనిపించింది లేదు. చైనా జాతీయ బ్యాంకులపై ఆయన విమర్శలు చేశాక సర్కారు ఆయన్ను నిర్బంధించిందన్న వార్తలూ వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment