Alibaba Jack ma
-
నిమిషాల్లోనే... రూ. 2 లక్షల కోట్లు హుష్
న్యూఢిల్లీ: ‘మా అరెస్టయ్యారు’ అంటూ వచ్చిన ఒక వార్త మంగళవారం అలీబాబా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో కంపెనీ మార్కెట్ విలువ ఉదయం సెషన్లో నిమిషాల వ్యవధిలోనే 26 బిలియన్ డాలర్ల మేర (రూ.2 లక్షల కోట్లు/ మార్కెట్ విలువలో 10%) తుడిచిపెట్టుకుపోయింది. మా అరెస్ట్‌కు సంబంధించి ఆ తర్వాత స్పష్టత రావడంతో పడిన షేరు కోలుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇన్వెస్టర్లను షాక్‌కు గురి చేసింది. మా అంటే అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా అని పొరపడ్డారు ఇన్వెస్టర్లు. ప్రముఖ వ్యాపార వేత్త అయిన జాక్‌మా గ్రూపు కంపెనీలపై చైనా సర్కారు 2020 నుంచి ఉక్కుపాదం మోపడం తెలిసిందే. ఒక వ్యక్తి శక్తిగా మారకూడదన్న విధానాన్ని అక్కడి కమ్యూనిస్ట్ సర్కారు పాటిస్తోంది. దీంతో నాటి నుంచి జాక్‌మా ఒక్కసారి కూడా ప్రజల ముందుకు వచ్చింది లేదు. ఈ క్రమంలో మా అరెస్ట్ అంటూ వార్త రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఇది వార్తా కథనం.. చైనా అధికారిక మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ మంగళవారం (మే 3) ఒక వార్తను ప్రచురించింది. జాతీయ భద్రతా ఉల్లంఘనల నేపథ్యంలో ఐటీ డైరెక్టర్ మా అనే వ్యక్తిని హాంగ్జూ పట్టణంలో అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. జాక్‌మా ఈ కామర్స్ కంపెనీ అలీబాబా ప్రధాన కేంద్రం కూడా అదే పట్టణంలో ఉండడం గమనార్హం. ఇన్వెస్టర్లు పొరపడడానికి ఇది కూడా ఒక అంశమే. ‘‘విదేశీ శక్తులతో చేతులు కలిపి, రాష్ట్రాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినట్టు అనుమానాలపై ఇంటి పేరు ‘మా’ కలిగిన వ్యక్తిని హాంగ్జూ పట్టణంలో స్టేట్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది’’అంటూ గ్లోబల్ టైమ్స్ తన కథనంలో రాసుకొచ్చింది. దీంతో నిమిషాల్లోనే అలీబాబా షేరు హాంగ్‌కాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో 9.4% పడిపోయింది. అదే రోజు గ్లోబల్ టైమ్స్ అదే అంశానికి సంబంధించి మరో కథనాన్ని ప్రచురించింది. అరెస్ట్ అయిన వ్యక్తి పేరులో 3 అక్షరాలు ఉన్నట్టు పేర్కొంది. అరెస్ట్ అయిన వ్యక్తి స్థానిక ఐటీ కంపెనీలో హార్డ్‌వేర్ పరిశోధన విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు, 1985లో జన్మించినట్టు వివరణ ఇచ్చింది. దీంతో షేరు రికవరీ అయింది. కాకపోతే పడినప్పుడు కంగారుతో అమ్ముకున్నవారే నిండా నష్టపోయారు. అలీబాబా గ్రూపు అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకడైన జాక్‌మా 2020 నవంబర్ నుంచి కనిపించింది లేదు. చైనా జాతీయ బ్యాంకులపై ఆయన విమర్శలు చేశాక సర్కారు ఆయన్ను నిర్బంధించిందన్న వార్తలూ వచ్చాయి. -
పేటీఎమ్ భారీ ఐపీవో..
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎమ్ భారీ ఐపీవోకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 16,600 కోట్లు సమకూర్చుకునేందుకు వీలుగా వాటాదారుల అనుమతి కోరనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా కంపెనీ విలువ రూ. 1.78 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. పేటీఎమ్ ఈ నెల 12న అసాధారణ వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 12,000 కోట్లు సమీకరించాలని ప్రతిపాదిస్తోంది. దీనికి అదనంగా కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు వాటాలు విక్రయించడం ద్వారా రూ. 4,600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి రూ. 16,600 కోట్ల ఐపీవోకు వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా కంపెనీ విలువ రూ. 1.78–2.2 లక్షల కోట్లస్థాయికి చేరవచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. తద్వారా దేశీయంగా లిస్టయిన ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీలలో మార్కెట్ విలువరీత్యా టాప్–10లో ఒకటిగా నిలవనుంది. పేటీఎమ్ ప్రధాన వాటాదారుల్లో చైనీస్ దిగ్గజం యాంట్ గ్రూప్(29.71% వాటా), సైఫ్ పార్టనర్స్(18.56 శాతం), విజయ్ శేఖర్ శర్మ(14.67 శాతం)తోపాటు.. ఏజీహెచ్ హోల్డింగ్, టీ రోవే ప్రైస్, డిస్కవరీ క్యాపిటల్ బెర్కషైర్ హాథవే ఉన్నాయి. -
జుకర్‌బర్గ్‌కు అలీబాబా ఛాలెంజ్
బీజింగ్ : ఫేస్బుక్ డేటా చోరిపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా, ఫేస్బుక్ సీఈఓ, వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు ఓ గట్టి సవాల్ విసిరారు. ఈ వివాదంపై స్పందించిన ఆయన, జుకర్‌బర్గ్‌కు చేతనైతే ఫేస్బుక్లో ఉన్న సమస్యను పరిష్కరించాలని సవాల్ చేశారు. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. చైనాలో అత్యంత ధనికవంతుడు అయిన జాక్ మా, అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్‌కు చైర్మన్. బావో ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఫేస్బుక్ తన యూజర్ల డేటాను ఎటువంటి అనుమతి లేకుండానే కేంబ్రిడ్జ్ అనలిటికాతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ స్కాండల్ ఒక్కసారిగా బయటికి పొక్కడంతో, ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కాండల్‌పై దిగ్గజ సీఈవోలందరూ స్పందిస్తున్నారు. ఫేస్బుక్ తన డేటా దొంగతనం కాకుండా చూసుకునే వీలు లేదని అభిప్రాయపడ్డ జాక్‌మా, సోషల్ మీడియాలోని వివరాలు బయటకు పొక్కకుండా సమస్యను పరిష్కరించి చూపించగలరా? అని జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించారు. ఫేస్బుక్ సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న విమర్శలను తొలగించే దిశగా తాము ఎటువంటి సహాయం చేయమని చెప్పారు. మార్చిలో కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ బయటపడినప్పటి నుంచి ఫేస్బుక్ షేర్లు భారీగా కిందకి పడిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే #deletefacebook అనే క్యాంపెయిన్ కూడా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెగ్యులేటర్లు కూడా ఫేస్బుక్ డేటా చోరిపై విచారణ జరుపుతున్నారు. ‘సమస్యను పరిష్కరించే సమయం వచ్చింది. ఈ విషయాన్ని సీఈవో సీరియస్‌గా తీసుకోవాలి. దీంతో సమస్యలను పరిష్కరించవచ్చని భావిస్తున్నా’ అని జాక్‌మా అన్నారు. మరోవైపు ఈ విషయంపై అమెరికన్ కాంగ్రెస్‌కు సమాధానం చెప్పేందుకు మార్క్ జుకర్‌బర్గ్ సిద్ధమవుతున్నారు. -
ఆసియా అత్యంత ధనికుడిగా ఆలీబాబా జాక్‌మా
బీజింగ్: ఆసియాలోనే అత్యంత ధనికుడైన వ్యక్తిగా ఆలీబాబా ఈ-కామర్స్ అధినేత జాక్ మా నిలిచారని బ్లూమ్‌బర్గ్ సర్వే వెల్లడించింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 50 ఏళ్ల జాక్ మా ఆసియా వాసుల సంపన్నుల్లో అగ్రస్థానంలో నిలిచారని ఈ సర్వే పేర్కొంది. 2012 ఏడాది నుంచి అత్యంత సంపన్న ఆసియావాసిగా ఉన్న హాంగ్‌కాంగ్ రియల్టీ, పోర్ట్స్ టైకూన్ లి క-షింగ్ ను తోసిరాజని జాక్ మా 2,860 కోట్లడాలర్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఈ ఒక్క ఏడాదిలోనే జాక్ మా సంపద 2,500 కోట్ల డాలర్లు పెరగడం విశేషం. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 8,540 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రిలయన్స్ ముకేశ్ అంబానీ అత్యంత సంపన్న భారతీయుడిగా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన సంపద 2,180 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ముకేశ్ 32వ స్థానంలో నిలిచారు.