Mark Zuckerberg resign from Facebook Says UK Media: ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (37) రాజీనామాకు సిద్ధమయ్యాడా? బోర్డులో మెజార్టీ సభ్యులు వద్దని వారిస్తున్నా.. మొండిగా నిర్ణయం తీసుకోనున్నాడా? సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మీద ఈమధ్య కాలంలో వినిపిస్తున్న సంచలన ఆరోపణలు, జుకర్‌బర్గ్ నేతృత్వంపై వినిపిస్తున్న తీవ్ర విమర్శల నేపథ్యంలో ఇది నిజం కాబోతోందని బ్రిటన్‌కు చెందిన ఓ ప్రముఖ టాబ్లాయిడ్ సంచలన కథనం ప్రచురించింది.
డిజిటల్ ప్రపంచంలో ‘మెటావర్స్’ ద్వారా అద్భుతాల్ని సృష్టించాలని ఫేస్‌బుక్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఈయూ వ్యాప్తంగా 10వేల మంది అధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగుల్ని వచ్చే ఐదేళ్లలో ఫేస్‌బుక్ నియమించుకోబోతోంది. అయితే ఈ నియామకాల కోసం జరిగిన కీలక సమావేశంలో సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో తాను వ్యవహారాల్ని పర్యవేక్షించినా.. లేకున్నా ఫేస్‌బుక్‌ను సమర్థవంతంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతీఒక్కరి మీదా ఉందంటూ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు చేశాడట. ఈ మేరకు ఫేస్‌బుక్ అంతర్జాతీయ వ్యవహారాలు చూసుకునే ఓ కీలక ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు కథనం ప్రచురించినట్లు సదరు టాబ్లాయిడ్ పేర్కొంది.
బోర్డు వద్దన్నా..
యూజర్ల డాటా లీకేజీ గురించి ఫేస్‌బుక్ ఎప్పటి నుంచో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదీగాక ఇన్‌స్టాగ్రామ్‌తో మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందంటూ ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగిణి ఫ్రాన్సెస్ హౌగెన్ సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. యూజర్ భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు పరమావధిగా మారిందని ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో ఫేస్‌బుక్ కంపెనీలో సంస్కరణల దిశగా అడుగువేయాలని కోరుతూనే.. కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున్న ఉద్యమం నడుస్తోంది. అంతేకాదు నవంబర్ 10న ‘క్విట్ ఫేస్‌బుక్’ పేరుతో ఒక్కరోజు ఫేస్‌బుక్, దాని అనుబంధ యాప్‌లను వాడొద్దంటూ పెద్ద ఎత్తున్న క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో యూజర్ల అసంతృప్తి బయటపడింది. ఈ వరుస పరిణామాలన్నింటితో ఫేస్‌బుక్ కంపెనీ బోర్డులో కొందరు సభ్యులు జుకర్‌బర్గ్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు సదరు కథనం ప్రచురించింది. ఈ క్రమంలోనే ఓటింగ్ కంటే ముందే స్వచ్చందంగా సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలని జుకర్‌బర్గ్ భావిస్తున్నట్లు, ఇందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం జుకర్‌బర్గ్ ప్రొత్సహించినట్లు ఆ కథనం సారాంశం. అయితే మెజార్టీ బోర్డు సభ్యులు మాత్రం జుకర్‌బర్గ్ నాయకత్వం వైపే మొగ్గు చూపిస్తుండడం విశేషం.
భార్య ప్రిసిల్లా చాన్‌తో..
యంగ్ బిలియనీర్..
సోషల్ మీడియా, సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్‌గా మొదలైన ఫేస్‌బుక్ కంపెనీని 2004లో ఇంటర్నెట్ ఎంట్రప్రెన్యూర్ మార్క్‌జుకర్‌బర్గ్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. హార్వర్డ్ కాలేజీలో తన తోటి స్నేహితులు, రూమ్‌మేట్స్ అయిన కొంతమందితో కలిసి ఫేస్‌బుక్‌ను తీసుకొచ్చాడు. 2006 నుంచి 13 ఏళ్లు పైబడిన వాళ్లు ఎవరైనా సరే ఫేస్‌బుక్ వాడేలా నిబంధనను తీసుకొచ్చారు. ప్రస్తుతం గ్లోబల్ ఇంటర్నెట్ యూసేజ్‌లో ఏడో స్థానంలో ఉన్న ఫేస్‌బుక్‌కు.. నెలకు 300 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో జుకర్‌బర్గ్‌కు 29 శాతం వాటా ఉండగా (ఇప్పుడది 14 శాతానికి పడిపోయినట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి).. ప్రపంచ కుబేరులా జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు జుకర్‌బర్గ్.
మెటావర్స్ రాజ్యం..
మెటావర్స్ అనేది డిజిటల్ వరల్డ్. త్రీడీ ఎన్విరాన్‌మెంట్‌లో కార్యకలాపాలను నడిపించొచ్చు. రాబోయే రోజుల్లో టెక్నాలజీని శాసించేది ఇదేనని నిపుణుల నమ్మకం. ఈ మేరకు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ జులైలోనే ఓ ప్రకటన సైతం చేశాడు. ఇక ఫేస్‌బుక్ మేజర్ సక్సెస్‌లో భాగమైన యూరోపియన్ యూనియన్ నుంచే ఈ ప్రయత్నాల్ని మొదలుపెట్టబోతోంది. వ్యాప్తంగా పదివేల మంది ఉద్యోగుల్ని రానున్న ఐదేళ్లలో నియమించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోలాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ నుంచి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను మొదలుపెట్టింది. మరోవైపు మైక్రోసాఫ్ట్, రోబ్లోక్స్, ఎపిక్ గేమ్స్ సైతం సొంత వెర్షన్ మెటావర్స్ కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
చదవండి: కాసుల కోసమే ఫేస్‌బుక్ కక్కర్తి.. జుకర్‌బర్గ్ రియాక్షన్ ఇది
Comments
Please login to add a commentAdd a comment