ఆయన పేరు... కోటేశ్వర్రావు. పేరులోనే కాదు... బ్యాంకు బ్యాలెన్స్‌లోనూ కోట్లున్నాయి.ఆయనకు ఒక్కగానొక్క కొడుకు... పేరు: స్మైలేంద్ర. పేరుకు స్మైలేంద్రేగాని ఒకసారి తప్ప... ఎప్పుడూ నవ్విన పాపాన పోలేదు. పుట్టగానే అందరూ కేర్‌మని ఏడుస్తారు. ఇతను మాత్రం ఆస్పత్రి అదిరిపోయేలా బిగ్గరగా నవ్వాడట. దీంతో ‘స్మైలేంద్ర’ అని కొడుక్కి అక్కడికక్కడే నామకరణం చేశాడు కోటేశ్వర్రావు. కానీ...
ఆనాటి నుంచి స్మైలేంద్ర ఏనాడూ నవ్విన పాపాన పోలేదు. మరో పది నిమిషాల్లో ప్రపంచ యుద్ధం ముంచుకు వస్తున్నట్లు ఎప్పుడూ సీరియస్‌గా ముఖం పెట్టేవాడు. స్నేహితులు ఎన్ని జోకులు చెప్పినా ‘వీళ్లకేం పని లేదు’ అన్నట్లుగా చూసేవాడు తప్ప చిరునవ్వైనా నవ్వే వాడు కాదు. కొన్ని సంవత్సరాల తరువాత...స్మైలేంద్ర చదువు పూర్తయింది. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో గొప్ప ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంతో పాటు పెళ్లీడు కూడా వచ్చింది. తన కొడుక్కి పిల్లనివ్వడానికి అందరూ క్యూ కడతారు అనుకున్నాడు. కానీ అంత సీనేమీ కనిపించలేదు. ఇక ఇలా కాదనుకొని తానే రంగంలోకి దిగాడు.
‘మంచి సంబంధం... మీ ఇంటికి పిల్లనివ్వడం మా అదృష్టం’ అన్నవాళ్లు కూడా వారం తిరక్కుండానే ‘పెళ్లి క్యాన్సిల్’ అంటున్నారు.‘ఏమిటీ మిస్టరీ?’ అని తనలో తాను అనుకోవడమే కాదు... ఒక స్నేహితుడిని కూడా అడిగాడు కోటేశ్వర్రావు.‘‘మిస్టరీ కాదు. మీ వాడి హిస్టరీ... మీ వాడు ఎప్పుడూ నవ్వకపోవడం గురించి ఊళ్లో వింతగా చెప్పుకుంటున్నారు. తానే నవ్వలేని వాడు భార్యను ఎలా నవ్వించగలడు? ఆమెను ఎలా సంతోషపెట్టగలడు? అని దీర్ఘంగా ఆలోచించి అందరూ పారిపోతున్నారు’’ అని అసలు విషయం చెప్పాడు స్నేహితుడు.
‘ఎలాగైనా సరే నా కొడుకును నవ్వించాలి.... వాడి పెళ్లి ఘనంగా చేయాలి’ అని గట్టిగా అనుకొని ‘మా అబ్బాయిని నవ్వించిన వ్యక్తికి కోటి రూపాయలు బహుమానంగా ఇస్తాను’ అని ప్రకటించాడు కోటేశ్వర్రావు.దీంతో మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి, వాటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద పెద్ద కమెడియన్‌లు రంగంలోకి దిగారు. ఇప్పుడు స్మైలేంద్ర గదిలో ఏం జరుగుతుందో చూద్దాం...
‘‘హాయ్ స్మైలేంద్ర... నేనొక కామెడీ సీన్ చెబుతాను. శ్రద్ధగా విను. నవ్వు చచ్చినట్లు తన్ను కొస్తుంది’’ అని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు ఒక కమెడియన్...‘‘అనగనగా ఒక ఊళ్లో సుత్తి వీరభద్రరావు ఉంటాడు. ఆయన రచయిత. వాళ్ల ఇంట్లో బ్రహ్మానందం అద్దెకు ఉంటాడు. అద్దెకున్న పాపానికి వీరభద్రరావు ఏ చచ్చు కథ చెప్పినా చచ్చినట్లు వింటూ బుర్ర పాడుచేసుకుంటూ ఉంటాడు. ఎటూ పారిపోకుండా ఉండటం కోసం ఒకరోజు బ్రహ్మానందాన్ని మెడలోతు వరకు ఇసుకలో పాతిపెట్టి ఇలా కథ చెప్పడం మొదలు పెడతాడు వీరభద్రరావు...
‘మంగళగిరి తిరునాళ్లలో ఆరు నెలల గుంటడు తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు... ఆడి కోసం ఏఏ ఊళ్లు తిరిగారో తెలుసా? సికింద్రాబాదూ, హైదరాబాదూ, ఆదిలాబాదూ, అహ్మదాబాదూ, ఫకీరాబాదూ, అలహాబాదూ, ఔరంగాబాదూ, సిం«ద్‌బాదూ, సుల్తానాబాదూ, ముస్తాబాదూ, ఘజియాబాదు...’ ఇలా ఎన్నో బాదుల గురించి తెగ బాదిన తరువాత... బ్రహ్మానందానికి మతి చలించి ఇలా అంటాడు...
‘నా బొంద బాదూ
నా శ్రాద్ధం బాదూ
నా పిండాకూడు బాదూ
నన్ను వదిలేయ్ బాదూ
బతికితే బఠానీలు అమ్ముకుంటా బాదూ...ఈ సీన్ చెప్పిన కమెడియన్ తెగ నవ్వాడు తప్ప.... స్మైలేంద్రలో ఎలాంటి స్మైలూ లేదు. ఈ కమెడియనే కాదు... ఎంతో మంది కమెడియన్లు ఎన్నో జోకులు చెప్పినా స్మైలేంద్ర చిన్న నవ్వు కూడా నవ్వలేదు. చివరికి ఒకే ఒక్క కమెడియన్ మిగిలాడు. అతడి పేరు... జానీ లీకర్. ‘‘అయ్యా... ఇప్పటి వరకు 99 మంది కమెడియన్లు నవ్విద్దామని లోనికి వెళ్లి... నవ్వించలేక ఏడుస్తూ బయటికి వచ్చారు. జానీ లీకర్ ఒక్కడే మిగిలాడు. లోనికి పంపించమంటారా?’’ కోటేశ్వర్రావుని అడిగాడు అతని అసిస్టెంట్. ‘‘ఎవరి బుర్రలో ఏముందో... పంపించు’’ నిరుత్సాహంగానే అన్నాడు కోటేశ్వర్రావు.
జానీ లీకర్ లోపలికి వెళ్లి పది నిమిషాలైందో లేదో నాన్‌స్టాప్‌గా పెద్దగా నవ్వు వినిపించింది. అది స్మైలేంద్ర నవ్వు! స్మైలేంద్ర నవ్వు విని సంతోషం తట్టుకోలేక ఏడ్చాడు కోటేశ్వర్రావు.విక్రమార్కా... సుత్తి లేకుండా సూటిగా అడుగుతాను. జానీ లీకర్ ఏం చెప్పి స్మైలేంద్రను నవ్వించి ఉంటాడు?’’ భుజం మీద వేలాడుతున్న భేతాళుడు విక్రమార్కుడి కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు. అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు... ‘‘జానీ లీకర్ స్మైలేంద్ర గదిలోకి వెళ్లి.... ‘మిస్టర్ స్మైలేంద్ర... నేనొకటి చెబుతాను.
నువ్వు నవ్వనక్కర్లేదు. అందులో లీనమైపోతేచాలు’’ అన్నాడు. అలాగే అన్నాడు స్మైలేంద్ర. జానీ లీకర్ చెప్పడం మొదలు పెట్టాడు.‘‘ ఏదో బంపర్ డ్రా తగిలి ఎన్నో దేశాలు ఉచితంగా పర్యటించే అవకాశం మీకు వచ్చింది. ఒకరోజు... మీరు విమాన ప్రయాణంలో ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆ విమానానికి టెక్నికల్ ప్రాబ్లం ఎదురైంది. కూలడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అదృష్టవశాత్తు మీరు పారాచూట్ సహాయంతో విమానం నుంచి బయటపడ్డారు.
దురదృష్టవశాత్తు ఆ పారాచూట్‌కు టెక్నికల్ ప్రాబ్లం వచ్చి మీరు ఉన్నపళంగా ఆకాశంలో నుంచి ఒక నదిలో పడతారు. అదృష్టవశాత్తు ఆ నదిలో ఒక పడవలో పడతారు. దురదృష్టవశాత్తు ఆ పడవ ఏ క్షణమైనా మునగడానికి సిద్ధంగా ఉంటుంది. మరోవైపు నీటిలో ఉన్న మొసళ్లు మిమ్మల్ని తినడానికి ఆవురావురుమంటూ ఎదురుచూస్తుంటాయి. మీరు భయాందోళనలతో బిక్కచచ్చిపోతారు’’‘‘రాజా...హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్... ఇది జోకా!? సరే... జోకే అని అనుకుందాం.
ఇది విని స్మైలేంద్ర వణికి ఛస్తాడేగానీ బిగ్గరగా నవ్వుతాడా?’’ ఆగ్రహంగా అరిచాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు ఇలా సమాధానం ఇచ్చాడు: ‘‘పురుషుల్లో పుణ్యపురుషులు వేరయా.. లాగా నవ్వుల్లో వెరైటీ నవ్వులు వేరయా! నెర్వస్ లాఫ్టర్ అనేది అందులో ఒకటి. ఇది జోకుల వల్ల వచ్చే నవ్వు కాదు. ఎంబరాస్‌మెంట్, డిస్‌కంఫర్ట్, కన్‌ఫ్యూజ్, టెన్షన్, స్ట్రెస్... ఇలాంటి ఫీలింగ్స్ ఎదురైనప్పుడు ఫిజికల్ రియాక్షన్‌లో భాగంగా కొద్దిమంది గట్టిగా నవ్వుతారు. దీన్నే నెర్వస్ లాఫ్టర్ అంటారు. మన స్మైలేంద్ర ఈ కోవకు చెందిన వ్యక్తే. జోక్‌లకు నవ్వడని తెలుసుకున్న జానీ లీకర్ అటు నుంచి నరుక్కువచ్చాడు... నెర్వస్ లాఫ్టర్‌ని నమ్ముకొని స్మైలేంద్రను తెగ భయపెట్టించి, తెగ కన్‌ఫ్యూజ్ చేసి... ఏమైతేనేం నవ్వించాడు. అదీ విషయం!’’
– యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment