రైభ్య మహర్షి ఒకసారి పితృతీర్థమైన గయాక్షేత్రానికి వెళ్లాడు. అక్కడ పితృదేవతలకు పిండప్రదానాలు చేసి, వారిని తృప్తిపరచాడు. ఆ తర్వాత అక్కడే ఆయన కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. రైభ్యుడు తపస్సు చేస్తుండగా, ఒకనాడు అతడి ముందు ఒక దివ్యవిమానం నిలిచింది. అందులో ఒక యోగి నలుసంత ప్రమాణంలో ఉన్నాడు. అతడు గొప్పతేజస్సుతో సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. అతడు ‘ఓ రైభ్యా! ఎందుకు ఇంత కఠోరమైన తపస్సు చేస్తున్నావు?’ అని అడిగాడు. రైభ్యుడు బదులిచ్చేలోగానే ఆ యోగి తన శరీరంతో భూమ్యాకాశాలంతటా వ్యాపించాడు. రైభ్యుడు విభ్రాంతుడయ్యాడు. ‘మహాత్మా! మీరెవరు? అని ప్రశ్నించాడు.
‘నేను బ్రహ్మమానస పుత్రుణ్ణి. నా పేరు సనత్కుమారుడు. భూలోకానికి పైనున్న ఐదో ఊర్ధ్వలోకమైన జనలోకంలో నివసిస్తుంటాను. నాయనా రైభ్యా! నువ్వు ఉత్తముడివి, వేదాభిమానివి. పవిత్రమైన ఈ గయాక్షేత్రంలో పితృదేవతలను సంతృప్తిపరచినవాడివి. నీకు నేను ఈ పితృతీర్థ మహాత్మ్యం గురించిన ఒక వృత్తాంతం చెబుతాను విను’ అని ఇలా చెప్పసాగాడు.
‘పూర్వం విశాలనగరాన్ని విశాలుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతడికి పుత్రసంతానం లేదు. ఒకనాడు విశాలుడు విప్రులను పిలిపించి, పుత్ర సంతానం కోసం ఏం చేయాలో చెప్పండని అడిగాడు. ‘రాజా! పుత్రసంతానం కావాలంటే, మీరు గయాక్షేత్రానికి వెళ్లి అక్కడ పితృదేవతలకు పిండప్రదానాలు చేసి, అన్నదానం చేయాలి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే తప్పక పుత్రసంతానం కలుగుతుంది’ అని విప్రులు సలహా ఇచ్చారు. విప్రుల సూచనతో సకల సంభారాలను తీసుకుని, పరివారాన్ని వెంటబెట్టుకుని విశాలుడు గయాక్షేత్రానికి బయలుదేరాడు. అక్కడ మఖనక్షత్రం రోజున పితృదేవతలకు తర్పణాలు విడిచి, పిండ ప్రదానాలు చేయడం మొదలుపెట్టాడు.
విశాలుడు అలా పిండప్రదానాలు చేస్తుండగా, ఆకాశంలో ముగ్గురు పురుషులు ఆయనకు కనిపించారు. వారు ముగ్గురూ మూడు రంగుల్లో– తెల్లగా, పచ్చగా, నల్లగా ఉన్నారు. వారిని చూసిన విశాలుడు ‘అయ్యా! తమరెవరు? ఎందుకు వచ్చారు? మీకేం కావాలి?’ అని అడిగాడు.
వారిలో తెల్లగా ఉన్న పురుషుడు ‘నాయనా! విశాలా! నేను నీ తండ్రిని. నన్ను పితుడు అంటారు. నా పక్కన ఉన్న వ్యక్తి నా తండ్రి. అంటే, నీకు తాత. బతికి ఉండగా, బ్రహ్మహత్య సహా అనేక పాపాలు చేశాడు. ఇతడి పేరు అధీశ్వరుడు. ఇతడి పక్కనే నల్లగా ఉన్న పురుషుడు నా తండ్రికి తండ్రి. అంటే, నీకు ముత్తాత. బతికి ఉన్నకాలంలో ఎందరో మహర్షులను చంపాడు.
నాయనా! విశాలా! నా తండ్రి, అతడి తండ్రి చేసిన పాపాల ఫలితంగా మరణానంతరం అవీచి అనే ఘోర నరకంలో భయంకరమైన శిక్షలను అనుభవించారు. నేను వారిలా పాపకార్యాలు చేయకపోవడం వల్ల, చేతనైన మేరకు పుణ్యకార్యాలు చేయడం వల్ల ఇంద్రలోకం పొందాను. ఈనాడు నువ్వు శ్రద్ధగా పితృతీర్థమైన ఈ గయాక్షేత్రంలో పితృదేవతల సంతృప్తి కోసం సంకల్పించి, పిండప్రదానాలు చేయడం వల్ల వీరిద్దరూ నన్ను కలుసుకోగలిగారు. పిండప్రదాన సమయంలో నీ సంకల్పబలం వల్లనే మేం ముగ్గురమూ ఒకేసారి ఇలా కలుసుకోగలిగాం.
ఈ తీర్థమహిమ వల్ల మేం ముగ్గురమూ ఇప్పుడు పితృలోకానికి వెళతాం. ఇక్కడ పిండప్రదానం చేయడం వల్ల ఎంతటి దుర్గతి పొందినవారైనా సద్గతులు పొందుతారు. ఇందులో సందేహం లేదు. నాయనా! నీ కారణంగా మాకు సద్గతులు కలుగుతున్నందుకు ఎంతో ఆనందిస్తూ, నిన్ను చూసి వెళ్లాలని వచ్చాం. మాకు చాలా సంతోషంగా ఉంది. నీకు సకల శుభాలు కలుగుగాక!’ అని ఆశీర్వదించి పితృదేవతలు ముగ్గురూ అక్కడి నుంచి అంతర్థానమయ్యారు. పితృదేవతల ఆశీస్సుల ఫలితంగా విశాలుడు కొంతకాలానికి పుత్రసంతానాన్ని పొందాడు.
‘రైభ్యా! నువ్వు కూడా ఈ పరమపవిత్ర గయాక్షేత్రంలో పితృదేవతలకు పిండప్రదానాలు చేశావు. వారికి ఉత్తమ గతులు కల్పించావు. అంతేకాకుండా, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని, గొప్ప తపస్సు చేస్తున్నావు. అంతకంటే భాగ్యమేముంటుంది? అందుకే నువ్వు ఉత్తముడివి, ధన్యుడివి అంటున్నాను. రైభ్యా! ఈ గయాక్షేత్రంలోనే గదాధారి అయిన శ్రీమహావిష్ణువు కొలువున్నాడు. నువ్వు ఆయనను స్తుతించి స్వామి అనుగ్రహాన్ని పొందు’ అని చెప్పి సనత్కుమారుడు అంతర్థానమయ్యాడు.
రైభ్యుడు సనత్కుమారుడి మాట ప్రకారం గదాధరుడైన శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ ఆశువుగా ‘గదాధరం విభుదజనై రభిష్టుతం ధృతక్షమం క్షుదితజనార్తి నాశనం/ శివం విశాలాసురసైన్య మర్దనం నమామ్యహం హతసకలాశుభం స్మృతౌ...’ అంటూ గదాధర స్తోత్రాన్ని పలికాడు. రైభ్యుడి స్తోత్రానికి పరమానందభరితుడైన పీతాంబరధారిగా, శంఖచక్ర గదాధారిగా శ్రీమహావిష్ణువు అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు.
‘రైభ్యా! నీ స్తోత్రానికి సంతోషించాను. నీకు ఏ వరం కావలో కోరుకో’ అన్నాడు శ్రీమహావిష్ణువు.
‘స్వామీ! నీ సాన్నిధ్యంలో సనక సనందాది మహర్షులు ఉండే స్థానాన్ని అనుగ్రహించు’ అని కోరాడు.
‘తథాస్తు’ అన్నాడు శ్రీమహావిష్ణువు.
రైభ్యుడు వెంటనే సనక సనందాది సిద్ధులు ఉండే స్థానానికి చేరుకున్నాడు. – సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment