ఊరికి దక్షిణాన వున్న మాదిగ గూడెంలో ప్రతిరోజూ సూర్యోదయం ఎర్రగానే వుంటది. కాని ఈరోజు పొడిచిన సూర్యుడు రోజువారీ కంటే కాస్త భిన్నంగా రక్తమోడుతూ పైకి ఎగబాకిండు. దానికి నిశానీగా ఊర్లోని జనమంతా గగ్గోలు పెడుతూ ఆ దిక్కుకే పోతున్నారు. జనం ఆలోచనలు ఒక్కతీర్గ లేవు, కథలు, కథలుగా చెప్పుకుంట గూడెం దారి పట్టింది ఊరు.
అది ఊరికి దక్షిణాన వున్న రైతుల చేన్లకు, గూడేనికి పోయే దారి. తెల్లవారు ఝాము నుంచి వచ్చీపోయే జనంతో రద్దీగా వుంది. గూడెంలోని జనం తెల్లారగట్టే లేచి సద్దిమూటలు కట్టుకొని రోజ్‌గార్ (పనికి ఆహార పథకం) మట్టి పనికి వెళ్ళిపోయారు. ఇళ్ళల్లో పిల్లలు, ముసలాళ్ళు మిగిలారు. గూడెం నిశబ్దంగా వుంది. ఆ నిశబ్దాన్ని ఊరి జనం ‘చేసినకాడికి చేసి, ఏమీ ఎరగనట్టే గుంబనంగా’ వుంది అనుకోసాగారు.
మాదిగ గూడెంలోని వాళ్లు రోజు లాగానే పొద్దు పొడవక ముందే నిద్రలేచి పక్షుల్లాగా బతుకుతెరువు వెతుక్కుంటూ పనుల్లోకి పోతారు. వారి శరీరాలు సగం చెమటలో తడిశాకే పొద్దు పొడుస్తది. పొద్దు పొడుపును తీరుబడిగా చూసే ఫుర్‌సత్ ఎక్కడిది వాళ్ళకి! కడుపు మంట ఆర్పుట్లో ద్యాసే వుండదు. బారెడు పొద్దు ఎక్కాక తెచ్చుకున్న సద్దిబువ్వ మూటను కాళ్ళు బార్లచాపి కూర్చుని మూట విప్పిన టైమ్‌లో పొద్దు పొడుపు అందం ఏడ కనిపిస్తది! ఆ దిక్కు చూడబోతే ఎండ చిటపటల్తో కండ్లు మూతలు పడుతయై.
మాదిగ గూడెం ఖాళీగా నిర్మానుష్యంగా వుంది. డొక్కలు పీక్కబోయి కాల్లీడ్సుకుంట తిరిగే కుక్కలు ఒకటి, రెండు కనిపిస్తున్నాయి. గూడెంలో వాకిళ్ళు ఊడ్సిన జాడ సుత కనిపిస్తలేదు. కావాలని ఇండ్ల ముంగట ఎవరు ముగ్గులు పెడతారింక! ఇళ్ళల్లో మిగిలిన ముసలీముతక, ఊళ్లో మోతుబరి ఆసాములు.. రిపేరు కోసం ఇచ్చిన వూసిపోయిన చెప్పుల గూడలు సరిచేస్తూ కనిపిస్తున్నారు. అదీ ఒక బతుకుతెరువు పనే! పొద్దు ఎర్రగ పొడిచిందో, సప్పగా పోడిచిందో వాళ్ళకేమవుసరం! కీళ్ళ నొప్పులు, కాళ్ళ పీకుడు మీదే ధ్యాస. నాలుగు అంగలు నడిచి ఊళ్ళోకి పోగలిగిన సత్తువ వుంటే చాలు అనుకునేవాళ్ళే! కుట్టిన చెప్పులు దొరల కాళ్ళ దగ్గరికి చేరిస్తే, నాలుగు డబ్బులో, కొన్ని గింజలు విదిలిస్తే చాలు అనుకునేవాళ్ళు వున్నారు. కడుపు మంటను చల్లార్చగలిగితే ఓ సముద్రం ఈదినంత సంతృప్తి. ఊళ్ళోని వార్తలతోని పనిలేని వాళ్ళే గూడెం గుడిసెల్లో మిగిలి వున్నారు.
శవం ఒంటి మీద రక్తం అట్టగట్టి నల్లబడి ఎండిపోయింది. ఈగలు జిబ్బున ముసురుతున్నాయి, శవం దొరదైనా, బిచ్చగాడిదైనా ఒకటే వాటికి.. వ్యత్యాసం చూపవు. ఈ పని జరిగి కనీసం నాలుగైదు గంటలు దాటి వుంటుంది అని జనం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మట్లాడుకుంటున్నారు. ‘ఆ అపరాత్రి ఎందుకు బైటికి వచ్చిండో పాపం’ అంటున్నారు. ‘తన పనికోసమైనా సరే.. కూలోళ్లనే ఇంటికి పిలిపించుకొని మాట్లాడుకునేటోడు.. తనే వెళ్ళాల్సిన పనేం పడిందో’.. అంటూ అనేకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
‘అహే.. నిన్నటి వరకు ఊళ్ళోనే లేడంట, పట్నం పోయిండంట. ఎప్పుడొచ్చిండో మరి.. పొద్దటికల్లా శవమై పోయిండు’, ‘ఎవరన్నా కొట్టిపడేసిన ఆనవాళ్ళు, ఒంటి మీద దెబ్బలు ఏమీ కనిపిస్తలేవు’ అంటూ పోస్ట్‌మార్టం చేయడం మొదలుపెట్టారు. తలో దిక్కు తోచింది మాట్లాడేసుకుంటున్నారు. ‘పోలీసులకు కబురు అందిందో లేదో?’ ఇంకొకళ్ళ అనుమానం.
‘నువ్వు పోయి చెప్పిరాపో’ పక్కనున్నాయన కసురుకున్నాడు.. అనుమానపడిన వ్యక్తిని. పెళ్ళాం, పిల్లలు వచ్చినట్టున్నారు. శవం చుట్టూ చేరి ఏడుస్తున్నారు. జనం వాళ్ళ చుట్టూ మూగారు. ఆయనకిద్దరు అమ్మాయిలు. వయసు çపది..పదిహేనేళ్ళలోపే వుంటుంది. ‘పాపం ఏడ్సుడు సుతొస్తలేదు.. ఎట్ల బతుకుతరో.. ఏమో..!’ విచారం వ్యక్తం చేశారెవరో.
కొద్దిసేపటికి ఎస్.ఐ, కొందరు కానిస్టేబుళ్ళతో వచ్చిండు. రావడంతోటే.. శవం చుట్టూ మూగి వున్న జనాన్ని దూరంగా తరిమారు కానిస్టేబుళ్ళు. ఇద్దరు పిల్లలు, ఆమె సన్నంగా ఏడుస్తున్నారు. ఏడుస్తూనే ‘పట్నం నుంచి రాత్రే వచ్చినం. మిర్చి తోటలో కాపలాగాల్లు వున్నరో.. లేదో చూసొస్తాని ఆగమాగం బైలెల్లిండు. వద్దని ఎంత మొత్తుకున్నా చెవినపెట్టలేదు. బయటనే ఇడిసి వున్న చెప్పులల్ల కాళ్ళుపెట్టి ఎల్లిపోయిండు’ ఎడుస్తూ చెప్పింది ఇల్లాలు. మళ్లీ తనే కొనసాగిస్తూ ‘ఇది ఆయనకు మామూలే. ఎప్పట్లాగే చేను కాడికి పోయి వస్తడుగదా అనుకొని పిల్లలు, నేను ఇంట్లనే పడుకున్నం. ఇగో తెల్లారేసరికి ఇట్ల శవమై పడున్నడు’ అని ముక్కు చీదుకుంది.
పోలీసులు తమ పనిలో మునిగిపోయారు. ఏడుస్తూనే వాళ్లకు వాంగ్మూలం ఇచ్చింది ఆమె. తనకు ఎవరి మీదా అనుమానం లేదని, ఊర్లో వాళ్ళెవరితోనూ కక్షలు, పాత పగలు లేవని చెప్పింది. తొట్రుపాటేమీ లేకుండా, నింపాదిగా.. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చింది. ఊరి సర్పంచ్ వచ్చిండు. అన్ని పార్టీల పెద్ద మనుషుల సమక్షంలో పంచనామా చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం ట్రాక్టర్‌లో గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు.
మండలస్థాయి అన్ని పార్టీల లీడర్లు, బంధుబలగం తరలి వచ్చారు. అంత్యక్రియలను సజావుగా జరిపించింది. కర్మకాండలు అన్నీ ఘనంగా ముగిశాయి. ఏ నోట విన్నా వాడి పేరే ట్రోల్ అవుతూ వుంది. ‘ఏమిటో విడ్డూరం భర్తను చంపిన వాడు ఎవరో తెల్సికూడా పేరు బయట పెట్టక పోవడం!’ అని ఊరంతా ముక్కున వేలేసుకుంది.
రాత్రి చీకటి చిక్కబడుతోంది.. చంద్రుడు లేని రాత్రి. గూడెం వీధిలోనే వున్న వేపచెట్టు అరుగు మీద శేషు ఒక్కడే కూర్చొని వున్నాడు. అదే పగటి పూటైతే ముసలీ, ముతకా పిల్లాజెల్లా గోలీలు, అష్టాచెమ్మ ఆడుకునేవాళ్ళు. చెట్టు నీడ కింద నిండుగా కూర్చునుండే వారు. రాత్రి కావడం చేత ఆ చెట్టు అరుగు మీద శేషు ఒక్కడే.. తోడుగా పైన కోటానుకోట్ల నక్షత్రాలు.. పక్కన నవ్వుతూ చీకటి ‘నేను లేనా’ అంది. ఆ రోజు పైవాళ్ళు, పక్కనే వుండే చీకటి అంతా వున్నారు.
‘ఆరోజు ఏం జరిగింది?’ పైవాళ్లే సాక్ష్యం, మరో పురుగంటూ లేదు. శేషులో రీల్ తిరగటం మొదలయింది. ఆరోజు తను గాఢ నిద్రలో వున్నాడు. ఆ నిద్రను చెడగొడుతూ పక్క గది నుండి గుసగుసల శబ్దం చెవున పడుతోంది. తరచుగా అప్పుడప్పుడు వినే శబ్దమే. తనకు వయసు పెరుగుతున్న కొద్ది ఆ శబ్దం చిరాకు పుట్టిస్తోంది. నిద్దర్లోను.. దీర్ఘంగా నిట్టూర్చి కప్పుకున్న దుప్పటిని పక్కన పడేసి, తలుపులు తెరచుకొని బైటికొస్తూ మళ్ళీ తలుపులు దగ్గరికి చేరవేసి, ఎక్కడిదాకో నడక, తెలియక పోయినా కొద్దిదూరం దాకా నడిచి చెట్ల నీడ కింద వున్న కల్వర్ట్ మీద కూర్చున్నాడు.
తను గుర్తెరిగిన దగ్గరి నుంచి ఇంట్లో నడుస్తున్న క్రమం. అమ్మని కట్టడిచేయలేని నిస్సహాయత, అమ్మ అంటే ఆమెకు పెళ్ళి కాలేదు. తనని కన్నందుకు తల్లయింది. తన పెంపకం, చదువు, బట్టలు అన్నీ చూసుకుంటోంది. డిగ్రీ వరకు ఏలోటూ రాకుండా చదివించింది. ఇకపైన కూడా చూస్తుంది.. అనుమానమే లేదు. మొన్నటివరకు తాత రూపంలో కొండంత బలం తోడుగా వుండేది. ఆయన పోయాడు.. తను ఏకాకై పోయాడు. ఇక వచ్చిన ఇబ్బంది సమాజంతోటే. తన మానాన తనని బతకనీయడం లేదు. ఎదురౌతున్న అవమానాలు, ఈసడింపులు, అదుపు చేసుకోలేని, ఓర్చుకోలేని ఉక్రోషం రోజురోజుకీ ఎక్కువైపోతోంది.
చాలాసేపు ఆ కల్వర్ట్ మీదనే కూర్చున్నాడు శేషు. ఇక లేచి ఏటో ఒక దిక్కుకు వెళ్లిపోదామని లేచే సమయానికి తను ఇంటి నుంచి నడిచి వచ్చిన దారి గుండా ఎవరిదో నీడ ఇటే వస్తూ కనిపించింది. లేచే ప్రయత్నాన్ని ఆపి మళ్ళీ అక్కడే కూర్చున్నాడు. నీడ రానురాను సమీపిస్తున్నది. నీడను పోల్చుకున్నాడు శేషు. అక్కడి నుంచి లేచి వెళదామనుకున్న వాడు అట్లానే కూర్చుండిపోయాడు.
‘ఎంత కాలమిది, ఎంత కాలమిట్లా లేచి పరిగెత్తడాలు?’ ఆలోచనల నిండా వేధించే ప్రశ్నలు. సమాధానం రాబట్టాల్సిందిప్పుడే అనుకున్నాడు శేషు.
నీడ ఎదురుగా నిలబడి ‘ఎవడ్రా, ఇక్కడ ఈ చీకట్లో కుర్చోని ఏం చేస్తున్నావ్?’ గద్దించింది.
‘నేనే’ అన్నాడు శేషు.
‘నేనే అంటే?’ అంది నీడ. ఆ వెంటనే పోల్చుకొని గుర్తుపట్టి ‘నువ్వా, చీకట్లో ఏం పని, ఇంటికి పో’ అంది.
‘ఇంకా ఎంత కాలమిలా’? శేషు నిలదీస్తున్నట్టు అడిగాడు. ఎదురుగా మౌనం. ఏం సమాధానమివ్వాలో తెలియక నిల్చుండిపోయాడు.
‘ఎన్ని.. ఎన్నిసార్లు అడగాలి? అమ్మని పెళ్లి చేసుకొని, కొడుకుగా నాకు గుర్తింపు ఇవ్వమని! ఇంకా ఎంతకాలం అవమానాలు భరించాలి?’ అని నిలదీశాడు శేషు.
‘అర్ధరాత్రివేళ ఈ మాటలొద్దు, ఇంటికి వెళ్ళిపో!’ అని గట్టిగా గదమాయించబోయాడు. శేషు వినే దశలో లేడు.
‘ఏంటి.. వెళ్ళి పోయేది? నాకు ఇప్పుడే సమాధానం చెప్పాలి’ అని నిలదీశాడు. ఇట్లా మాటా, మాటా ఇద్దరి మధ్య పెరిగిపోయింది. ఆ మాటల్లోనే అవతలి నుంచి నన్నే నిలదీస్తాడా అనే కోపంలో శేషును అనరాని మాటలెన్నో అన్నాడు. చాలా చాలా అవమానపరచే మాటలనే జారాడు.
‘నువ్వు నా కొడుకువని గ్యారంటీ ఏంటి?’ అన్నాడు.
‘నా అమ్మ’ ధీమాగా చెప్పాడు శేషు.
‘రుజువు ఏది? మీ అమ్మ ఎక్కడెక్కడ ఎవరెవరితో తిరిగిందో నీకు తెల్సా?’ అన్నాడు.
శేషులో కోపం కట్టలు తెగిన ప్రవాహంలా ఉగ్రరూపం దాల్చింది. అంతే ఎదుటి మనిషి భుజాల మీద రెండు చేతులేసి విసురుగా, బలంగా నెట్టి పడేశాడు. ఊహించని దాడిని ప్రతిఘటించి నిలబడలేక వెనక్కి విసిరేసినట్టు వెల్లకిలా పడిపోయాడు. వెనక వున్న మోరీ అంచుకు విసురుగా కొట్టుకుంది తల. వెల్లకిలా పడిపోయిన మనిషి గిలగిలా కాళ్ళు, చేతులు కొట్టుకోవడం చూశాడు శేషు. కాళ్ళు, చేతులు కొట్టుకోవడం ఆగిపోయేంత వరకు నిస్సహాయంగా చూస్తూ నిల్చున్నాడు. నిర్ఘాంతపోయి నిలుచున్నాడు. క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. తను ఏమి ఆశించాడు, తన ఆవేశం ఏ మలుపు తిప్పింది, తను ఏం కోరుకున్నాడు, చివరికి ఏమైపోయింది! దుఃఖం ముంచుకొచ్చింది. ఆ దుఃఖంలోనే ఏటో వెళ్ళి పోయాడు శేషు.
గాలి విసురుగా వీస్తోంది. ఆ గాలికి వేపచెట్టు పళ్ళు, పూత కలసి నేల రాలుతున్నాయి. జీవితం కూడా నేలరాలిన పళ్ళలా పిగిలి వగరు, చెదు, తీపి, వెగటు వాసన వేస్తోంది. ముక్కు పుటాలు అదిరి జ్ఞాపకాల నుంచి బయటపడ్డాడు శేషు. చంద్రుడు ఎప్పుడు పోడిచాడో చల్లటి తెల్లని వెన్నెల భూమంతా పరచుకొనుంది. శేషు చంద్రుడినే చూస్తున్నాడు.. లోలోన ‘చంద్రుడా అన్నీ చూస్తావ్, భలే మౌనం వహిస్తావ్. నీలోని నిబ్బరాన్ని కాస్త ఈ మనుషులకు కూడా పంచరాదు’ అనుకుంటూ విషాదాన్ని, దిగులును మోసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు.
‘పిలిపిస్తేనే రావాలా?’ అప్పుడు ఇల్లంతా స్వతంత్రంగా తిరిగేదానివి, ఇప్పుడు నా పర్మిషన్ కావాల్సి వచ్చిందా, ఏమిటి?’ నిష్ఠూరంగా అంది. తల్లీ, కొడుకు ఇద్దరూ వచ్చారు. వాకిట్లోనే నిలుచున్నారు. తల్లి, జరిగిందానికి దిగులుతో విచారంగా జీవం చచ్చిన కట్టెలా నిలబడి వుంది. కొడుకు తప్పు చేసిన భావనతో తల దించుకొని నిల్చున్నాడు. ఇంతకు తెగించిన వాడు ఇకముందు ఊరుకుంటాడా? ఆమె ఎందరినో సలహాలు అడిగింది. వారికి తోచిన పరిష్కారాలు సూచించారు. అందరూ తోడుగా వస్తామని, నిలుస్తామని ధైర్యాన్ని నూరిపొశారు. తనకు నమ్మకం కుదురట్లేదు.
మళ్ళీ పుండును కెలికినట్టు అవుతుందని అనుకుంది. బజారున పడాల్సి వస్తుంది. పంచాయతీలు, పెద్ద మనుషుల వేడుకోళ్ళు.. ఎదుర్కోగల స్థితిలో వున్నానా అని ఆలోచించింది. అంత శ్రమపడ్డా పరిష్కారం ఏ మలుపు తీసుకుంటుందో.. అనుకూలంగా రాకపోతే? ఇద్దరు పాపల భవిష్యత్తు తన చేతుల్లోవుంది. ఇద్దరినీ చదివించి.. తీర్చిదిద్దాలి. ఈ ఆస్తులన్నీ ఉన్నాయనే ధీమాతో పిల్లల భవిష్యత్తు కోసమే సిటీలో కాపురం పెట్టించాడతను. సంవత్సరం నుంచి భూములు బీళ్ళను తలపిస్తున్నాయి. ఇలా వదిలేస్తే, ఇలానే మిగిలి వుంటాయని గ్యారంటీ లేదు. తనా ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దలేదు. అందుకే రాజీ మార్గాన్ని ఎంచుకుంది. ఈ స్థిరాస్తిని, ఫిక్స్‌డ్ డిపాజిట్లలోకి మార్చుకోవాలి. అందుకే ఓ నిర్ణయానికి వచ్చి వాళ్ళని పిలిపించింది. ‘ఏమే, పలకవు?’ రెట్టించింది ఆమె. అవతల మౌనమే సమాధానం. ‘ఇట్రారా..’ అని పిలిచింది.
కొద్దిగా ముందుకు వచ్చి నిలబడ్డాడు శేషు. దగ్గరికి వచ్చిన వాడి చేతుల్లో కొన్ని కాగితాలు పెట్టింది. ‘ఐదు ఎకరాల మిర్చి చేను, ఈ ఇల్లు నీ పేరున మండల ఆఫీసులో రిజిస్ట్రీ చేయించా. మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినంక ఇందులోకి వచ్చి ఉండండి’ అంది. మళ్ళీ తనే మాట్లాడుతూ.. ‘పూర్వాపరాలు నాకు తెల్సు. ఎంతైనా నువ్వు ఆయనకు పుట్టిన బిడ్డవనే ఇదంతా! అతగాడే చేసుంటే ఇక్కడిదాకా వచ్చుండేది కాదు. ప్రతిసారి అడ్డగించి ధైర్యంగా అడుగుతున్నాడు వాడు. ఎదో ఒకటి చేయడం మంచిదని చెప్పేదాన్ని. ఆ మనిషి వినలేదు. సంబంధం పెట్టుకునేప్పుడే పరువు, ప్రతిష్ఠాని ఆలోచించాలి అని కూడా చెప్పిన. చెవినెక్కించుకోలేదు. నష్టం జరిగిపోయింది. ఇప్పుడు నీ జీవితం నాశనం చేస్తే ఏమొస్తదనిపించింది. క్షేమంగా బతుకు’ అని దీవించింది.
అంచనాకు చిక్కని పరిణామం. శేషు బుర్రకు అర్థంకాలేదు. ఇప్పట్లో అర్థంకాదు కూడా! తల్లి అయోమయానికి గురయింది. నిప్పు మీద నీళ్ళు చిలకరించిన చర్య అనుకుంది. ‘మొత్తం భూములన్నీ అమ్మేయాలని, ఈ రెండూ నీ పేరున రాయించి. నీ హక్కు కిందనే ఇచ్చిన. వాటా కింద జమకట్టుకుంటావో, మా దయగా అనుకుంటావో.. ఎట్ల లెక్కిస్తావో నీ ఇష్టం’ అని విసురుగా ఇంట్లోకి వెళ్లిపోయింది.
కొద్దిసేపు అక్కడే నిల్చున్నారు ఇద్దరూ. ఇంట్లో నుంచి ఏ స్పందన లేదు. చెల్లెళ్ళు ఏమన్నా బైటికి వస్తారేమో చూద్దామని ఆశపడ్డాడు శేషు. ‘తల్లులు వేరైనా, ముగ్గురికీ తండ్రి ఒక్కడే కదా’ తను చేసిన ఘోరానికి క్షమాపణ కోరుదామనుకున్నాడు. ఎదురుచూపు ఫలించక వెనుకకు మళ్ళాడు.. తల్లితో. గుప్పిట్లో కాగితాల్ని బిగించి పట్టుకున్నాడు. అవి బిగి గుప్పిట ఊరిన చెమటలో తడిసిపోయి, సగం వరకు నలిగిపోయాయి. తను అడిగింది నలిగిపోయే కాగితాల్లో ఆస్తి కాదు. తను, అతనికి పుట్టిన బిడ్డగా హక్కు. ఇవ్వలేక పెనుగులాటలోనే పోయాడు మహానుభావుడు. దయ అట.. దయ! భిక్షేం కాదు..! ఇది నా హక్కు. ఇప్పుడు ఈ చిరిగిపోయే కాగితాల రూపంలో నా వారసత్వ హక్కు. ఇది కూడా అవసరమే! దక్కిన హక్కే!’ అనుకున్నాడు శేషు. – హనీఫ్
Comments
Please login to add a commentAdd a comment