గురువుని సాక్షాత్తు త్రిమూర్తుల రూపంగా భావించి పూజించే సంస్కృతి భారతీయులది. తల్లిదండ్రులు జన్మనిస్తారు. కానీ ఈ జన్మకి సార్థకత, సాఫల్యం అందించే వ్యక్తి గురువు. మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే తల్లితండ్రుల తర్వాత గురువుకి ప్రముఖ స్థానమిచ్చింది మన సంస్కృతి. మనిషిని మనిషిగా తీర్చిదిద్దే శిల్పి గురువు. అందుకే మన విద్యాలయాల్లో, మన మందిరాలలో గురువుని స్మరిస్తూ ఈ శ్లోకాన్ని నిత్యమూ పఠిస్తున్నాము:
"గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః!
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమః!!"
మనకు విజ్ఞానశాస్త్రం ఎంత తెలిసినా, జీవన విలువలు అందించేది గురువు మాత్రమే. అయితే నేర్చుకోవాలనే జిజ్ఞాస శిష్యునికి ఉండాలి. గురువు జ్ఞానాన్ని ఒసగినప్పుడు దానిని గ్రహించి ప్రయోజకుడు కావాల్సిన బాధ్యత ప్రధానంగా శిష్యునిదే. భారతీయ గురుపరంపర సమస్తం త్యాగం ద్వారానే నిర్మాణం అయ్యింది. త్యాగం, సమర్పణ అనే ఉన్నత భావాలతో సమాజాన్ని నిర్మించే పనిని భారతీయ ఋషులు చేశారు.
వ్యాస, వాల్మీకి, వశిష్ఠ వంటివారు మొదలుకొని ఆది శంకరాచార్య, సమర్థ రామదాసు, రామకృష్ణ పరమహంస వరుసలో అబ్దుల్ కలాం వరకు సేవ, త్యాగం అనేవే ఆదర్శాలుగా జీవించారు. నేడు ఆ ఆదర్శలాతో కోట్లాది మంది జీవిస్తున్నారు. ‘నేను మాత్రమే బాగుండాలి’ అని కాకుండా ‘నాతో పాటు సమాజం బాగుండాలి’, అవసరం అయితే సమాజం కొరకు కష్టపడాలి అనే జీవనవిలువ మన సమాజాన్ని నేటికీ రక్షిస్తోంది. ఇదే ఈ దేశ సహజ గుణం. ఈ జీవన విలువను అందించేది గురువు.
ఆహారం, నిద్ర, భయం, సంతానోత్పత్తి విషయాల్లో మనుషులకు, పశువులకు తేడా లేదు. ధర్మం మాత్రమే మానవులకు అధికమైన విశేషణం. ధర్మంగా బతకాలి అనే జీవన విలువను కూడా మన గురువులు అందించారు. ఈ ధర్మం అనేది భారతీయ సమాజంలో మాత్రమే కనపడేది. ప్రకృతిలోని పంచభూతాలు వాటి సహజగుణాన్ని వదిలిపెట్టవు. కానీ మనిషి తన స్వభావాన్ని వదిలిపెడుతున్నాడు. జంతువు జంతువులాగానే, పక్షి పక్షిలాగానే జీవిస్తుంది. కానీ మనిషి మనిషిలా బతకడం లేదు. మనిషికి మాత్రమే మనిషిలా జీవించు అని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అలా చెప్పి సన్మార్గంలో నడిపే వ్యక్తి గురువు మాత్రమే. – సాకి
Comments
Please login to add a commentAdd a comment