మన శాస్త్రాల్లో సాధకులకు ఉపయోగపడే వందల కొలది మార్గాలు ఉన్నాయి. ప్రపంచంలో వేల కొలది బోధకులు ఉన్నారు. మన సంప్రదాయాలను అనుసరించి భగవంతునికి కోట్లాది రూపాలున్నాయి. సాధకులు తమ మార్గాలను, గురువులను, వారు పూజించు దేవుళ్ళను మార్చుకోవడం చూస్తూ ఉంటాం. ఆ విధంగా చేయడం సరైనదే కావచ్చు, కాకపోనూ వచ్చు. కానీ లక్ష్యాలను చేరుకోవడానికి వారు చూపించే ఉత్సాహం మెచ్చుకోతగింది. అటువంటివారి దృష్టి అంతా ఎల్లప్పుడూ ఆదర్శమార్గం, ఆదర్శ గురువు, ఆదర్శప్రాయమైన భగవత్ స్వరూపం పైననే ఉంటుంది. వారు ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ, ప్రయాణం మాత్రం అంతరాత్మ లోనికే అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.
గురువులందనూ బోధించే సత్యం ఒకటే. భగవంతుని ఏ స్వరూపంలో పూజించినప్పటికీ, అది సర్వేశ్వరుని పూజించినట్లే. వారు ఎంచుకొనే మార్గం, అనుసరించే గురువు, ఆరాధించే భగవత్ స్వరూపం... ఇవన్నీ సాంకేతికంగా భగవంతుని సూచిస్తాయి. నీవు నీ మార్గాన్ని గంభీరంగా, భక్తిపూర్వకంగా నిశ్చిత బుద్ధితో అనుసరించడమే ముఖ్యం. ప్రపంచంలోని అన్ని మతాలవారికీ ప్రార్థన ఉంది. అయితే చేసే విధానాలు విభిన్నంగా ఉండవచ్చు. కాని ఇది అందరికీ ముఖ్యమైనది. కేవలం మానవులకు మాత్రమే ప్రార్థన అనేదాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. ప్రార్థన చాలా శక్తిమంతమైనది. మనకు ఆపదలు, దుఃఖం కలిగినప్పుడు మాత్రమే సాధారణంగా భగవంతుని ప్రార్థిస్తాం.
దీనిలో నష్టం ఏమీ లేదు. అయినప్పటికీ, అన్ని పరిస్థితుల్లో భగవంతుని ప్రార్థించడం అలవరచుకోవాలి. వ్యక్తిత్వాన్ని సరిచేసుకోవడం, ఆత్మవికాసమే ప్రార్థన ముఖ్య ఉద్దేశాలుగా ఉండాలి. భౌతిక అవసరాలను లేక కోరికలను తీర్చు కోవడానికి భగవంతుని ప్రార్థించకూడదు. కాబట్టి నీవు చేసే ప్రార్థన బంధ విముక్తి కోసం చేయాలి. ఎట్టి పరిస్థితిలో అయినా ఆ దేవదేవుని మరచిపోకుండా ఉండేట్లు ఉంచమని ఆయననే ప్రార్థించాలి. కొన్ని విషయాలు మనకు సంతోషం కలిగించవు. అందువలన బాధ కలుగుతుంది. అటువంటి విషయాలను ప్రార్థన ద్వారా దేవుని అడుగరాదు. అదే నిజమైన ప్రార్థన. నీ ప్రార్థన భగవంతుని నియమానుసారానికి లోబడి ఉండాలి. అందుకు తగినట్లు నిన్ను నీవు మలచుకోవాలి.
– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి
Comments
Please login to add a commentAdd a comment