మా అమ్మమ్మ వాళ్ల ఊరు పాత మెదకర్ జిల్లా ఒక చిన్న పల్లెటూరు. ఏ సెలవులు అయినా అప్పటి తరం గడిపింది అమ్మమ్ల ఊర్లలోనే కదా!. సిద్ధిపేటలో పెరిగిన నాకు కులాల గురించి అస్సలు తెలియదు. 70 వదశకంలో అదొక పెద్ద మార్పు అని తెలియు. రోజంతా ఊర్లోని మట్టి రోడ్లమీద పొలాల గట్ల మీద ఈత బావుల్లో గడిచిపోయేది. మాదిగోళ్ల ఇళ్లు, వడ్లోళ్ల సందు, కమ్మరోళ్ల గల్లీ..ఏ తేడా తెలియకుండా ఆడుకునేది.
పశువుల మందలు కొట్లాలకి చేరుకునే సందెపొద్దుకి ఇంటికి మా అడుగులు తడపడేవి. అప్పటి వరకు లేని పట్టింపులు ఇంటి వరండాకి చేరుకునేసరికి అమ్మమ్మకు గుర్తుకొచ్చేది. ఒక బిందె నీళ్లు మా నెత్తిమీద కుమ్మరించి పొడిబట్టలు ఇచ్చేది. అలా మైల పోతుందని ఆమె అనుకునేది. మాకు ఆమె నమ్మకం వింతగా చిరాకుగా కూడా ఉండేది. అప్పట్లో అది సామాజికి మనిషి అని. ఆర్థిక అంతరాలుకు ఒక కొలమానం అని పెత్తందారుల పోకడలకు నిలువటద్దం అని తెలియదు. కానీ చాలా అసహనంగా ఉండేది మనసులో. అదొక్కటే అమ్మమ్మ వాళ్ల ఊర్లో ఉన్నన్ని రోజుల్లో గొంతులో ఏదో అడ్డపడ్డట్టుగా ఉండేది. దాదాపు అయిదు దశాబ్దాల తర్వాత కూడా గొంతులో ఏదో అడ్డంపడుతున్నట్లుగానే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన, జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తున్నప్పుడు ఓట్ల కోసం కావచ్చు అధికారం చేజారిపోకూడదన్న రాజకీయతత్వం కావచ్చు. మరేదైనా కారణం కావచ్చు. బడులు కొత్తరూపును సింగారించుకున్నాయి. పిల్లలు నోట్లోంచి నాలుగు ఇంగ్లీషు ముక్కలు రాలుతున్నాయి. చాలిచాలని విదిలించనట్లుండే స్కూలు యూనిఫాంలు అద్దంలో అందంగా కనపడుతున్నాయి. క్లాస్‌రూంలోకి అంతర్జాతీయ స్థాయి విద్య క్రమంగా అందుబాటులోకి వస్తోంది. ఆత్మనూన్యతను ఆత్మవిశ్వాసం తరిమేస్తోంది. పదిసంవత్సరాల్లో ఒక్క కొత్తతరం మరింత ధైర్యంగా, రొమ్ము విరుచుకుని తలెత్తుకుని నిలబడబోతుంది.
వంగిన నడుములు నిటారుగా నిలబడబోతున్నాయి. నేలచూపులు ప్రశ్నించేందుకు సూటిగా చూస్తున్నాయి. నేల బారు చదువులు వానాకాలపు పాఠాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఒక కొత్తతరం ఉరకలు వేసేందుకు ప్రశ్నించేందుకు తమ బతుకులు దిద్దుకునేందుకు ఆర్థిక బలవంతుల్ని తమ చదువులతో ఢీ కొట్టేందుకు అడుగులు వేయడం నేర్చుకుంటోంది. నాలుగు సంస్కృతం ముక్కలు నేర్చుకున్నందుకు నాలుక మీద వాతలు పెట్టించుకున తరం నుంచి కొండల మీద కూర్చొని వికటాట్టహాసం చేస్తున్న వర్గాల అహం మీద గట్టి దెబ్బ తగులుతోంది. దీన్ని అడ్డుకోవడానికి అహంకార వర్గాలు గత నాలుగు అయిదు సంవత్సరాలుగా చేసినా, చేస్తున్న ప్రయత్నాలు వాళ్ల పీఠాలు కదలిపోతాయోమో అన్న భయం స్పష్టంగా కనపడుతోంది. అభద్రతాభావంతో కుట్రలు కుతంత్రాలకి తెరలేపారు.
ఇంగ్లీషు చదువులు మీకెందుకురా..! అంటూ బహిరంగంగానే కూశారు. తెలుగు భాష చచ్చిపోతుందనే దొంగ ఏడుపులు..మాతృభాషకు వీరే బాధ్యులయినట్టు సమస్య భాష కాదు..సమస్య అసమానతలు తొలిగిపోతే..రేప్పొద్దున తమకు ఊడిగం చేసే వర్గాలు లేకపోతే ..అన్ని పనులు తామే చేసుకోవాల్సి వస్తే..ఇప్పటిదాక బాంచన్ దొర అన్న మాటలు వినపడకపోతే.. తమకన్నా ఉన్నత స్థానాల్లో నిలబడితే..తామే తలలు పైకెత్తి చూడాల్సి వస్తే అహంకారంతో విసురుగా ఆడిన చేతులు జోడించాల్సి వస్తే..ఇది ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలంగా ఉన్న వర్గాలకి మింగుడు పడని విషగుళిక.
అందుకే అన్ని శక్తులు ఏకమై ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న మొగ్గల్ని..సూటిగా చూస్తున్న కళ్లని నిటారుగా నిలబడుతున్న నడుముల్ని అణచడానికి చేయని ప్రయత్నాలు లేవు. అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు ఇది కాదు అని పలికి గొంతు తొక్కాలనుకుంటుంది రాజకీయ ప్రత్యర్థులను కాదు..తమకు తరతరాలుగా వంగి వంగి దండాలు పెట్టి..ఇపుడిపుడే వస్తున్న కొత్తతరాన్ని..
ఇందులో ఎవరైనా పుట్టాలనుకుంటారా..ఇంగ్లీషు చదివితే ఎటుకాకుండా పోతారని భయపెట్టి..తమ కదలిపోతున్న పునాదుల్ని మళ్లీ నిలబెట్టుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతోనే.పెట్టుబడిదారులు ఖద్దరు చొక్కా వేసుకొని ముందుకు వస్తే..ఆర్థిక, సామాజికి కారణాలు బయటకు కనిపిస్తూనే ఉంటాయి. కాశ్మీరో, కన్యాకుమారో అవసరం లేని వర్గం తమ కాళ్లమీద తాము నిలబడటానికి 75 ఏళ్ల తర్వాత ఒక ఊతం దొరికింది.
పాదాలు నరికేస్తామని భయపడితే ఒక తరం తర్వాతితరాలు నష్టపోతాయి. చనిపోయేవరకు మా అమ్మమ్మలో మార్పు రాలేదు. కులం నరాల్లో ఇంకిపోయిన కోస్తాంధ్ర పెట్టుబడిదారుల జాత్యాహంకార వర్గాల్లో కూడా మార్పు రాలేదు..రాదుకూడా నిలబటం నేర్చుకుంటున్న ఈ తరం తమ కోసమే కాదు..ముందు తరాల కోసం నడవటం, పరుగెత్తి గెలవడం కూడా నేర్చుకోవాలి. కుట్రలు ఉంటాయి. అడ్డంకులు ఉంటాయి. పడిపోతే లేచి నిలబడాలి..లేకపోతే పాక్కుంటూ అయిన గీత దాటాలి
సిరా..
(చదవండి: గ్యాంగ్ ఆఫ్ పెత్తందార్స్)
Comments
Please login to add a commentAdd a comment