నీటిలోని జీవులకు, గాలిలోని పక్షులకు, భూగోళపు కొన్ని జీవరాసులకు ఆహారం నువ్వు. భూమిమీది నీరు కాస్తో కూస్తో శుభ్రపడుతున్నది నీవల్లే. మొక్కల్లో పరపరాగ సంపర్కం జరుగుతున్నది నీతోనే. కొత్తకొత్త రసాయనాలు కనిపెట్టబడుతున్నది నీకోసమే. జీవవైవిధ్యం, జీవపరిణామ సిద్ధాంతంలో నీపాత్ర ఎనలేనిది. జీవా వరణానికి ఇన్ని మేళ్లుచేస్తున్న నీవు ఎందుకు మానవాళిమీద కక్షగట్టావు? ఎంతో కష్టపడి తయారుచేసుకొనే మా రక్తాన్ని ప్రతిరోజు 3 రోజులకొకసారి త్రాగుతావు. పోనీలే రక్తదానమేకదా అనుకొంటే ‘రిటర్న్ గిఫ్ట్’గా అనేక వ్యాధికారక క్రిములను అంటిస్తావు. సంవత్సరానికి పదిలక్షల పైచిలుకు మానవాళి మరణాలతో మా చుట్టూ ఉన్న ఇతర జీవరాశుల్లో నీదే ప్రథమస్థానం. అందుకే నిన్ను ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువుగానూ, మానవాళి వినాశనానికి మూలంగానూ శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్నారు.
1987 ఆగస్టు 20న సర్ రోనాల్డ్ రాస్ మలేరియా క్రిముల్ని నీలో చూసే వరకూ మాకు తెలియదు మలేరియా వ్యాధికారకం వ్యాప్తికి కారణం నువ్వే అని. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ‘ప్రపంచ దోమ దినం’ జరుపుతున్నా నువ్వు మాత్రం శాంతించడంలేదు. ఇప్పుడు మా దేశంలో మలేరియాతోబాటు ఫైలేరియా, మెదడు వాపు, డెంగీ, చికున్ గన్యా, జికా లాంటి అనేక ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి కారణం నువ్వే. నీ నియంత్రణకు మేము చేస్తున్న ప్రతి ప్రయత్నంలో నువ్వే విజయంసాధిస్తున్నావు. కొత్త కొత్త రసాయనాలు కనిపెట్టి వాడుతుంటే వాటిని తట్టుకునే శక్తిని పెంపొందించుకొంటున్నావు. జీవిత చక్రంలోని 4 దశల్లో 3 దశలు గుడ్డు, లార్వా, ప్యూపా నీటిలోనే ఉంటావు. పెద్దయ్యాక మాత్రమే గాలిలోకి వస్తావు. నువ్వు పుట్టకుండా, కుట్టకుండా అనేక పద్ధతులు పాటిస్తున్న మా మేధాశక్తిని అధిగమించి కొత్త కొత్తప్రాంతాలకు విస్తరిస్తున్నావు.
పెద్దా–చిన్నా, ఆడ–మగ తేడా లేకుండా అందరినీ కుడతావు. శాకాహారులైన మీ మగజాతి, చెట్లు చేమలపై ఆధారపడి 10 రోజులు మాత్రమే జీవిస్తే, రక్తాహారులైన ఆడజాతి నెలరోజులకు మించి జీవిస్తూ, మా రక్తాన్ని ఫణంగా పెట్టి మీ సంతానాన్ని అభివృద్ధి చేసుకొంటున్నాయి. భూగోళం మీద 112 జాతులు, 3541 తెగలతో
ప్రపంచీకరణ చెంది, భారతదేశంలో 50 జాతులు 404 తెగలతో ‘జాతీయ ఆరోగ్య మిషన్’కు అడ్డంకిగా మారావు. మమ్మల్ని ప్రతినిత్యం భయభ్రాంతులకు గురిచేసి, నువ్వుమాత్రం సంగీత కచేరీలు చేసుకుంటూ ఆనందిస్తున్న దోమా! 2024 ‘ప్రపంచ దోమ దినం’ సందర్భంగా నీకో నమస్కారం!!. – తలతోటి రత్న జోసఫ్, ఆరోVýæ్య కుటుంబ సంక్షేమ శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ (ఏపీ )
Comments
Please login to add a commentAdd a comment